సారస్వతం  

     అన్నమయ్య కీర్తనలు

రచన : జి.బి.శంకర్ రావు

 

ఎంత పుణ్యమో


ఎంత పుణ్యమో యిటు మాకు కలిగె
చెంతనె నీకృప సిద్ధించ బోలు

శ్రీపతి నీకథ చెవులను వింటిమి
పాపములణగెను భయముడిగె
తీపుగ తులసి తీర్ధము గొంటిమి
శాపము దీరెను సఫలంబాయ

గోవిందా మిము కనుగొంటి మిప్పుడే
పావన మైతిమి బ్రతికితిమి
తావుల మీ పాదములకు మొక్కితి
వేవేలు కలిగెను వేడుకలాయ

శ్రీ వేంకటేశ్వర సేవించితి మిము
ధావతి తీరెను తనిసితిమి
వావిరి ముమ్మారు వలగొని వచ్చితి
నీవారమైతిమి నిలిచితి మిపుడు

జీవులు భక్తులుగా జన్మించటానికి లేదా మారటానికి కూడా భగవంతుని అనుగ్రహం కావాలి! గీతలో శ్రీకృష్ణ భగవానుడు ‘బహూనాం జన్మనామన్తే మాం జ్ఞానవాన్ ప్రపద్యన్తే’ అంటాడు. (అనేక జన్మల సాధన తర్వాత నేను జీవునికి జ్ఞానాన్ని ప్రసాదిస్త్రాను). అందుకే లోకంలో అందరూ భక్తులు కాలేరు! ఇక్కడ అన్నమయ్య మనమెంత పుణ్యం చేసుకున్నామో కదా! ఆ శ్రీపతి కృప సిద్ధించింది అంటున్నాడు. ఆ శ్రీ మహా విష్ణువు యొక్క కథలను వినడం వల్ల పాపాలు పరిహారమై భయం తొలగిపోయింది. తులసీ తీర్దం సేవించి మన శాపాలన్నీ తొలగిపోయాయి. గోవిందుని దర్శన భాగ్యం చేత జివనం పావనమైనది. స్వామి వారి పాదార్చనతో నూతనోత్సాహం సిద్ధించినది! శ్రీ వేంకటేశ్వరుని సేవించుట ద్వారా ప్రయాసలు, ఆపదలు తొలగి తన్మయత్వాన్ని పొందుతున్నారు! అంటూ శరణాగతి సిద్దాంతాన్ని ఈ పాటలో ప్రతిపాదించాడు అన్నమయ్య!

ఉడిగె = తొలగె;
తావుల = స్థానము;
ధావతి = ప్రయాస, పరుగులు పెట్టుట;
వావిరి = మిక్కిలి, పట్టుదల


ఎంత విభవము గలిగె


ఎంత విభవము గలిగె నంతయును నాపదని
చింతించినది గదా చెడని జీవనము

చలము కోపంబు తను చంపేటి పగతులని
తెలిసినది యది గదా తెలివి
తలకొన్న పరనింద తనపాలి మృత్యువని
తొలగినది యది గదా తుదగన్న ఫలము

మెఱయు విషయములే తన మెడ నున్న పురులుగా
యెఱిగినది యది గదా యెరుక
పఱివోనియాస్ తను బట్టుకొను భూతమని
వెఱచినది యది గదా విజ్ఞానమహిమ

యనలేని తిరువేంకటేశుడే దైవమని
వినగలిగినది గదా వినికి
అనయంబు నతని సేవానందపరులయి
మనగలిగినది గదా మనుగ్జులకు మనికి

లోకంలో సర్వసాధారణంగా మానవులు సంపదలపై మోహం పెంచుకుని, అవి వృద్ధి చెందుతున్నప్పుడు వాటిని చూసి గర్వపడతారు; మరియు అహంకారంతో విర్రవీగుతారు. కాని ఇక్కడ అన్నమయ్య ఆ మాయాసిరులన్నీ మన మెడలకు తగులుకొన్న ఉరిత్రాళ్ళుగా వర్ణిస్తున్నారు. మనకు లభించే భౌతిక భోగాలన్నీ అశాశ్వతాలనీ, ఆపదలకు మూలాలనీ తెలుసుకొనటమే నిజమైన జీవితం, అనీ, సత్యదృష్టి అనీ ఈ పాటలో చక్కగా తెలియజేస్తున్నాడు! అరిషడ్వర్గాలను విడిచిపెట్టాలని, పరనింద చేయరాదని, విషయ వాంఛలను విడనాడాలని, ఆశలను ఆమడదూరంలో పెట్టాలని బోధిస్తున్నాడు! వీటన్నిటి యదార్ధ స్వరుపం తెలుసుకున్నవాడు విజ్ఞాని అని, నొక్కి వక్కాణిస్తున్నాడు! తిరుగులేని తిరువేంకటేశ్వరుడు శాశ్వత సత్యమని, దైవమని తెలుసుకొని నిరంతరం ఆ స్వామి సేవలో తరించాలని ఉద్భోధిస్తున్నాడుు మన గురువు అన్నమయ్య!

విభవము = సంపద;
చలము = మాత్సర్యము;
పగతులు = శత్రువులు
తలకొన్న = కలిగిన;
తుదగన్న ఫలము = పరమావధి నొందిన ఫలము;
విషయములు = శబ్ద స్పర్శ రూపాదులు;
పఱివోని = చీలిపోని, తగ్గని
ఎనలేని = సాటిలేని;
అనయంబు = అత్యంతము, సతతము


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech