అతిరహస్యం బట్టబయలు
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

జడ్జిగారు అసాధ్యుడు. దిమ్మ తిరిగే తీర్పుతో సర్కారువారికి మా చెడ్డ చిక్కు తెచ్చిపెట్టాడు.
శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో దాచిపెట్టిన ఫలానా అధ్యాయాన్ని బయటపెట్టించాలంటూ తన ముందుకు వచ్చిన రిట్టుపై ఇరుపక్షాల వాదనలూ విన్నాక - సరే అనో, వద్దు అనో ఆయన మామూలు పద్ధతిలో ముక్తసరి నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే ఏలినవారు సంతోషించేవారు. బయట పెట్టాల్సిందేనని కోర్టు చెప్పినా దానికి అడ్డంకొట్టటానికి దారులు వెతికేవాళ్లు. బయటపెడితే కొంపలు మునుగుతాయంటూ పై కోర్టులకు అపీలుమీద అపీలుచేసి, సాధ్యమైనంత తాత్సారంచేసి, ముసుగు తీయకుండా కాలం వెళ్లదీసేవాళ్లు. వెర్రి జనాన్ని మాయమాటలతో ఎంచక్కా మభ్యపెడుతుండేవాళ్లు.
జస్టిస్ నరసింహారెడ్డి గారు వారికా చాన్సు ఇవ్వలేదు. బహిరంగ పరచమన్న తీర్పులోనే ఆయన అతిరహస్యాన్ని బట్టబయలు చేశాడు. ‘సీక్రెట్ నోటు’లోని గుట్టుమట్లన్నీ ఆయనే రట్టు చేశాక... ఇక దాచిపెట్టటానికి గవర్నమెంటుకు ఏమీ మిగలలేదు. కమిటీ పేరిట సాగిన కపటనాటకాన్ని ఆయన చీల్చిచెండాడాక నీతిమాలిన నిర్వాకాన్ని కప్పిపుచ్చుకునేందుకు సిగ్గుబిళ్ల కూడా నిలవలేదు.
శ్రీకృష్ణ కమిటీకి చట్ట ప్రతిపత్తి లేదు. ఏ అధికారం లేదు. అది చెప్పేది గవర్నమెంటు విని తీరాలన్న రూలు లేదు. ఒక్కమాటలో - అది పనికిమాలిన కమిటీ. ఆ సంగతి మొన్నటి కేసులో ప్రభుత్వ పక్షం హైకోర్టుకు చెప్పుకున్నదానిబట్టే అమాయకులకు కూడా అర్థమైంది. అయినా - దాని పెద్దాయన సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి కాబట్టి, ఇలాంటి విచారణల్లో ఆయనకు బోలెడు పేరుంది కాబట్టి, మిగతా మెంబర్లూ ఈ రాష్ట్రానికి చెందని వాళ్లు, తమతమ రంగాల్లో ఆరితేరిన వాళ్లు కాబట్టి - రాష్ట్రానికి వచ్చిన గడ్డు సమస్యనుంచి గట్టెక్కడానికి కనీసం మంచి సలహా అయినా చెబుతారేమోనని తెలుగువాళ్లు ఎదురు చూశారు.
పెద్ద మనుషులన్న వారు పెద్ద మనుషుల్లా మెలగాలి. మనిషన్న వాడికి కొంచెం నిజాయతీ ఉండాలి. శ్రీకృష్ణ కమిటీని వేసింది తెలంగాణ డిమాండు నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితిని అధ్యయనం చేసి, అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల వారినీ సంప్రదించి, ఏమిచేస్తే బాగుంటుందో సూచించడానికి! ఆ ప్రకారమే కమిటీ వచ్చింది. నెలలతరబడి తిష్ఠవేసింది. అందరితో మాట్లాడింది. కోట్లు ఖర్చుపెట్టి నానా తిరుగుళ్లు తిరిగి, నానా గడ్డీ కరిచి, నానా పరీక్షలు చేసింది. చివరికి తన అపారానుభవాన్నీ, అద్భుత మేధస్సునూ రంగరించి ఆరు ఉపాయాలు చెప్పింది. వాటిలో నాలుగు పనికిరావని తానే తేల్చింది. చివరికి - తగిన కట్టుబాట్లతో రాష్ట్రాన్ని ఇప్పటిలాగే ఉంచితే బెస్టు. తప్పదనుకుంటే తెలంగాణను విడగొట్టటం సెకండ్ బెస్టు అని నిర్ధారణ చేసింది. ఉన్నంతలో ఈ రెండే ప్రత్యామ్నాయాలని చెప్పాక వాటిలో ఏది ఎంచుకోవాలన్న నిర్ణయం ప్రభుత్వానికీ, పార్టీలకూ, ప్రజల విజ్ఞతకూ వదిలెయ్యాలి. ఒకవేళ తెలంగాణను వేరుచేస్తే కొంపలు మునుగుతాయని కమిటీ భయపడితే ఆ సంగతే ధైర్యంగా చెప్పాలి. మునిగే కొంపలు ఏమిటో, అవి ఏ రీతిన మునుగుతాయో అందరికీ అర్థమయేట్టు వివరించి, పొరపాటున కూడా దానికి ఆస్కారం ఇవ్వవద్దని నిస్సంకోచంగా హెచ్చరించాలి.
మహా ఘనత వహించిన శ్రీకృష్ణ కమిటీ అదీ చేయలేదు. ఇదీ చేయలేదు. తెలంగాణ ఇచ్చినా మంచిదేననేమో నలుగురూ వినేలా బహిరంగ నివేదికలో అన్నది. ఇస్తే మహాప్రమాదం; మావోయిస్టులు చెలరేగుతారు; జిహాదీలు జడలు విప్పుతారు; తెలంగాణ అన్యాయమైపోతుంది అనేమో సీక్రెట్ నోటులో సర్కారుకు నూరిపోశారు. పాముకు లాగే ఈ కమిటీకీ నాలుకలు రెండు.
తెలంగాణ కావాలని అక్కడి జనం ఆవురావురుమంటున్న సమయంలో వద్దని కరాఖండిగా చెబితే ప్రజలు నొచ్చుకోవచ్చు. అలాగని ‘సరే’నంటే - ఉత్తరోత్తరా తీవ్ర అనర్థాలు రావచ్చు. అలాంటి గుంజాటన కమిటీ వారికి ఎదురైతే... ఆ అనర్థాలేమిటో ప్రభుత్వానికి మాత్రమే చెవిన వేయవచ్చు. ఆ సంగతి బయటపెట్టవద్దన్న షరానూ పెట్టవచ్చు. తప్పులేదు.
అంతర్గత భద్రత, శాంతిభద్రతలకు సంబంధించి 8వ అధ్యాయంలో ఏదోరాసి, దాన్ని రహస్యంగా ఉంచమని గవర్నమెంటుకు కమిటీవాళ్లు చెప్పారంటే - మనమూ అలాగే అనుకున్నాం. కమిటీ మహాజ్ఞానులు మాత్రమే పసిగట్టగలిగిన, పాలకులు మాత్రమే వినదగిన దేవరహస్యాలేవో అందులో ఉన్నాయి కాబోలని భ్రమపడ్డాం.
జడ్జిగారి పుణ్యమా అని తీరా చూస్తే ఏముంది? పదిహేడు జిల్లాల్లో పోలీసువాళ్లు చెప్పిన పోచుకోలు కబుర్లను పోగేసి, అకారణ భయాలను, అర్థంలేని అనుమానాలను భూతద్దంలో చూపెట్టి అల్లిన కల్లబొల్లి కథనాలే సదరు రహస్య నివేదిక నిండా! ఇంటెలిజెన్సు బొత్తిగా లేని వాళ్లు ఇచ్చే పోలీసు ఇంటెలిజెన్స్ రిపోర్టు లాంటిదే ఇదీనూ! గాలికబుర్లను మూటకట్టి సీక్రెట్ నోటుతో రవాణా చేసింది మెంబర్ సెక్రటరీయే అయితేనేమి? కమిటీ పంచకమంతా ఆమోదముద్రవేసింది కాబట్టి కమిటీ పెద్దలందరి అమూల్యాభిప్రాయంగానే దాన్ని పరిగణించాలి.
సకారణమో, అకారణమో కమిటీ వాళ్లకి తెలంగాణ దడుపు పట్టుకుందనే అనుకుందాం. ‘మాకు ఇలా అనిపిస్తున్నది; ఆనక మీ ఇష్టం’ అని గవర్నమెంటుకు చెబితే సరిపోదా? అలాంటి అనర్థాలేవీ రాకుండా అడ్డుకునేందుకు ఏమేమి తప్పుడు పనులు చేయవచ్చో కూడా మాననీయ కమిటీ వారే చెప్పాలా?
అవి కూడా ఎంత లక్షణమైన సలహాలు?! రాజకీయంగా మేనేజ్ చెయ్యాలట! ముఖ్యమంత్రిగానో, ఉపముఖ్యమంత్రిగానో తెలంగాణ వాడిని వెయ్యాలట. కాంగ్రెసు ఎమ్మెల్యేలని, ఎంపీలని తెలంగాణ ఉద్యమం నుంచి వెనక్కి లాగాలట. తెరాసను సవరదీయాలట. తెలంగాణ యూనివర్సిటీల విద్యార్థుల నోళ్లు కుట్టెయ్యాలట. దారికి రాకపోతే ఫలానా స్థాయిలో బలగాలను మోహరించి, ఫలానా రకమైన ఆయుధాలను ప్రయోగించి అలజడిని అణచెయ్యాలట. తెలంగాణ నోట మన్ను కొట్టటానికి మీడియాను ఒడుపుగా వాడుకోవాలట. అడ్వర్టయిజ్‌మెంట్ల ఎరలతో పత్రికలకు గాలంవేసి, కలిసిరాకపోతే సర్కారీ అడ్వర్టయిజ్‌మెంట్లను బిగదీసి, పత్రికలూ, చానళ్ల మేనేజిమెంట్లను తెలివిగా బుట్టలోవేసి సమైక్యవాదాన్ని విరివిగా ప్రచారం చేయించి ప్రజల మనసులు మార్చాలట...!
దుర్యోధనుడికి శకుని, హిట్లరుకు గోబెల్సు కూడా ఇలాంటి పిచ్చి సలహాలు ఇచ్చి ఉండరు. కాంగ్రెసు హైకమాండు ఏమి చెయ్యాలో, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కలిసి జనంకంట్లో ఎలా కారం కొట్టాలో, ఏ పార్టీని, ఏ మీడియాను ఎలా లోబరుచుకోవాలో చెప్పమని తిండిదండుగ కమిటీని ఎవడు అడిగాడు? కాగితం మీద పెట్టటానికి పార్టీల వాళ్లే భయపడే ఇలాంటి తప్పుడు ఆలోచనలను రాజ్యమేలేవారికి దాఖలు చేసుకోవలసిన ఖర్మం సుప్రీంకోర్టు మాజీజడ్జి పెద్దరికంలోని హైలెవెల్ కమిటీకి ఏమి పట్టింది? ఒక్కటి మినహా రాష్ట్రంలోని దినపత్రికల సంపాదకులు అందరూ తెలంగాణ వ్యతిరేకులని బుర్రలేని కమిటీకి ఏ కర్ణపిశాచి చెప్పింది? అట్టడుగు స్థాయలో బీటు రిపోర్టర్లు మాత్రమే తెలంగాణ అభిమానులని, పై వాళ్లను మేనేజిచేస్తే పత్రికల్లో తెలంగాణ అనుకూలపు రాతలు ఆగుతాయని ఏ పోలీసు పుచ్చు బుర్రకు తట్టింది?
ఒక న్యాయమూర్తి చొరవ, ధర్మనిబద్ధతల పుణ్యమా అని బయటపడ్డ రహస్య నివేదిక బండారంతో తెలంగాణ వాదులు సహజంగానే శ్రీకృష్ణ కమిటీపై నిప్పులు చెరుగుతున్నారు. అలాగని - వారిని వ్యతిరేకించే సమైక్యవాదులకూ ఈ కమిటీ దుర్బోధ సంతోషదాయకం కాదు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని, కలిసి ఉంటేనే తెలంగాణకూ మేలు అని నిజాయతీగా చెప్పటానికి బలమైన కారణాలు కావలసినన్ని ఉన్నాయ. తెలంగాణలో విద్యాసంస్థలు, పరిశ్రమలు సీమాంధ్రుల చేతిలో ఉన్నాయనీ... వాళ్లు విడిచిపోతే తెలంగాణకు ఇబ్బంది అనీ, కాబట్టి రాష్ట్రం సమైక్యంగానే ఉండాలనీ కమిటీ వాళ్లు చెప్పింది తలాతోకా లేని వెర్రి వాదన. మహాజ్ఞానులైన కమిటీ పెద్దలకు తెలంగాణ వాదమూ అర్థం కాలేదు; సమైక్యవాదమూ అంతుబట్టలేదు అనడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు. ఇలాంటి పిచ్చికూతల, పిచ్చిరాతల మూర్ఖబృందాన్ని మహాధర్మవేత్తల కింద పరిగణించి, సంవత్సరంపాటు వారి చుట్టూ తిరిగి, తగని ప్రాముఖ్యమిచ్చి నెత్తిన పెట్టుకున్నందుకే మతి ఉన్న ప్రతివాడూ ఇప్పుడు సిగ్గుపడాల్సిందల్లా.
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech