"తెలంగాణ” వైకుంఠ పాళి"

- వనం జ్వాలా నరసింహారావు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

     చిన్నతనంలో వైకుంఠపాళి ఆట ఆడనివారు అరుదుగా వుంటారు. ఆ ఆటనే "పరమపద సోపాన పటం" అని కూడా కొందరనేవారు. ఇక ఇప్పటి ఆంగ్ల మాధ్యం పిల్లలు "పాముల-నిచ్చెనల" ఆట అంటున్నారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా అది ఆడడానికి అందరికీ ముఖ్యంగా కావాల్సింది, ఒక అట్టపై కాని, లేదా చిన్నగా ఉండే బోర్డుపై కాని, రంగు రంగుల గళ్ళతోనన్నా-నలుపు, తెలుపు రంగులలో నన్నాతయారు చేసిన పటం. ఆ పటం పెట్టడానికి పావులు-ఆడడానికి గవ్వలు. ఈ ఆటలో 1 నుంచీ 100 వరకూ అంకెలు, అడ్డు వరుసకు 10 గళ్ళ చొప్పున, నిలువుగా పది వరుసలు వుంటాయి. ఈ పటంలో అక్కడక్కడా పాములూ, నిచ్చెనలూ వ్యాపించి ఉంటాయి. పావు చేరుకున్న గడిలో పాము తల ఉంటే, దాని నోట బడి మింగడంతో, ఆ గడి నుంచి పాము తోక ఉన్న కింది గడి దాకా పావు దిగుతుంది. పావు పడిన గడిలో నిచ్చెన కింది చివర ఉంటే, అది నిచ్చెన ఎక్కి, పై చివర వరకూ చేరుకోవచ్చు. పాము నోట్లో పడకుండా-దాటుకుంటూ, నిచ్చెనలు ఎక్కు కొంటూ, 100వ గడికి ముందుగా చేరుకున్నవారు ఆటలో విజేత. నూరవ గడికి చేరుకునే ముందు కూడా, చిట్ట చివరి గడి వరకూ వ్యాపించి ఉండే అతి పెద్ద పాముండే ఏర్పాటు వైకుంఠపాళి ఆట ప్రత్యేకత. ఈ ఆట ఆడడం తెలిసిన ప్రతి వారికీ, అందునా చిన్నా-పెద్దా పాముల బారిన పడి ఓడిన వారికి, చాకచక్యంగా ఆడి నిచ్చెనలను అధిరోహించుకుంటూ పైకెదిగి, గెలవబోతున్నామనుకున్న సమయంలో, "అతి పెద్ద పాము" నోట బడి, మళ్ళీ ఆట మొదలెట్టిన వారికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎప్పుడొస్తుందో ఊహించడం అంత కష్టం కాదు. బహుశా గత కొద్ది రోజుల పరిణామాలు నిశితంగా గమనించినవారికి, చిన్ననాటి పరమపద సోపాన పటం ఆట జ్ఞప్తికి వస్తుండవచ్చు.
డిసెంబర్ 9, 2009 న కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లే అని భావించారందరూ. 1971 సార్వత్రిక ఎన్నికల్లో, అలనాటి తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులుగా పోటీచేసిన వారిలో, దాదాపు అందరూ గెలిచినా, కించిత్తైన చెక్కు చెదరని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, "తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రసక్తే లేదు" అని ఎంత స్పష్టంగా ప్రకటించిందో, అదే స్పష్టతతో, "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ" ను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు చిదంబరం. ఇందిరా గాంధి ప్రకటన, వైకుంఠపాళి ఆటలో గెలిచేవారి తరహాలో గవ్వలు విసిరి-పావులు కదిపి, పాము నోట్లో పడకుండా నిచ్చెనలెక్కి, పెద్ద పామును కూడా తప్పించుకుని విజేతగా నూరవ గడికి చేరుకున్న రీతిలో వుంటే దానికి పూర్తి భిన్నంగా వుంది చిదంబరం ప్రకటన. ఒక ఔచిత్యం లేకుండా చిదంబరం చేసిన ప్రకటన, గవ్వలు విసరడం చేతకాని-పావులు కదపడం రాని ఆటగాళ్లు పరమపద సోపాన పటంలో పాము నోట్లో తలదూర్చిన వారి రీతిలో వుంది. చిదంబరం నిర్ణయం దరిమిలా చోటు చేసుకున్న సంఘటనలు, ఒక వైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాల్సిందే అని ఆందోళన చేసిన వారికి కాని, సమైక్యాంధ్రే వుండాలని కోరుకుంటున్న వారికి కాని అనుకూలంగా లేవు.
తాను ఆడుతున్నది రాజకీయ వైకుంఠపాళి అని, జాగ్రత్తగా పావులు కదపకపోతే, పరిణామాలు తీవ్రంగా వుంటాయని చిదంబరం గ్రహించకపోవడం దురదృష్టం. ఇక ఆ తర్వాత, శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడంతో, తానేదో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నానన్న భ్రమలో పడ్డారాయన. మరో ఏడాదిపాటు తెలుగు వారితో తన ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చని భావించాడు. ఆయన భావనకు అనుగుణంగానే, రాష్ట్రంలో, కమిటీ నివేదిక వచ్చేంతవరకు, చిదంబరం పావులు పరమపద సోపాన పటంపైన నిచ్చెనలెక్కుకుంటూ పోయాయి. డిసెంబర్ 31, 2010 వరకు-ఆ తర్వాత బహుశా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసే దాకా, నిచ్చెనలను అధిరోహించిన పావు "పెద్ద పాము నోట్లో పడింది". మళ్లీ కధ మొదటికొచ్చింది. ఇందిరా గాంధీ తన రాజకీయ చతురతతో, తెలంగాణ ప్రజా సమితి టికెట్ పై పోటీ చేసి గెలిచిన వారందరినీ, దాని నాయకుడు మర్రి చెన్నారెడ్డితో సహా, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాగలిగితే, చిదంబరం వ్యూహం-ఆయనకు అండగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ వ్యూహం, వారి అధినాయకురాలు సోనియా గాంధీ వ్యూహం దానికి పూర్తి భిన్నంగా, కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది. సొంత పార్టీ వాళ్లే, పార్లమెంటును స్థంబింప చేసే దాకా పోయింది. చివరకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి, పరమపద సోపాన పటంలో, చిట్ట చివరి గడికి పావు చేరుకున్న చందాన తయారయింది.
కేంద్రంలో వ్యవహారం అలా వుంటే, రాష్ట్రంలో సంగతులు కూడా అలానే వున్నాయి. శాసన సభ సమావేశాలు ఆరంభం కావడానికి ముందు వరకు, అటు ప్రభుత్వం, ఇటు తెలంగాణ వాదులు, తమ తమ పావులను జాగ్రత్తగా కదుపుకుంటూ, (మాటల తూటాలనే) గవ్వలు ఆచితూచి విసురుకుంటూ, నిచ్చెనలు ఎక్కుకుంటూ-పాము నోట్లో పడుకుంటూ, పై గడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ చేరుకోలేక పోయారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు, హఠాత్తుగా (కాంగ్రెస్, తెరాస, తెలుగు దేశం) తెలంగాణ వాదులందరూ, విడి విడిగా గవ్వలు విసురుకుంటూ-పావులు కదుపుకుంటూ, నూరవ గడి దరిదాపుల్లోకి వచ్చే దిశగా చకచకా కదిలారు. వీరందరి కంటే ముందే, ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ కోదండ రామ్, నూరవ గడికి అతి సమీపంలోకి చేరుకున్నారు. విద్యార్థుల ఆందోళనలు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సహాయ నిరాకరణ, శాసన సభలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల జై తెలంగాణ నినాదాలు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, బడ్జెట్ ప్రసంగాన్ని సాగనీయక పోవడం, కాంగ్రెస్ శాసన సభ సభ్యులు-మంత్రులు ఢిల్లీకి మకాం మార్చి పార్లమెంటు సభ్యులతో కలిసి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నాలు, పట్టాల పైకి పల్లెలు లాంటి చర్యలు, ఎవరి పరిధిలో వారి గవ్వలు సక్రమంగా విసిరిన రీతిలో-పావులు కదిపిన తరహాలో, పరిష్కారాన్ని చివరి అంకానికి వచ్చేలా చేయగలిగాయి. ఇంతలో తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర రావు-సహచర లోక్ సభ సభ్యురాలు విజయ శాంతి వ్యూహాత్మకంగా గవ్వలు విసిరి, పావులు కదిపి, లోక్ సభను స్థంబింప చేశారు. మరో మారు తెలంగాణ ఇచ్చినట్లే-వచ్చినట్లే కనిపించింది అందరికీ. అందరూ, ఫిబ్రవరి చివరి వారంలో అతి పెద్ద పాము నోటికి అతి చేరువలో, నూరవ గడికి, అతి సమీపంలో చేరుకున్నారు. మార్చ్ మొదటి వారంలో-ఆరంభంలో, గవ్వలు సరిగ్గా పడకుండా, అందరి పావులను పాము నోటికి చేర్చాయి. హఠాత్తుగా పరిస్థితిలో ఊహించని పరిణామం, అందరికి దాదాపు అర్థమయ్యేలా, చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేది లేదు అన్న సంకేతం స్పష్టంగా వెలువడింది.
మళ్ళీ ఆట మొదటి కొచ్చింది. పార్లమెంటును తెరాస సభ్యులు స్థంబింప చేసే ప్రక్రియలో, తెలుగు దేశం తెలంగాణ లోక్ సభ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, "జై తెలంగాణ" నినాదాలతో అండగా నిలిచారు. ఎన్డీయే సారధి భారతీయ జనతా పార్టీ తన సంపూర్ణ మద్దతును తెలంగాణకు అనుకూలంగా ప్రకటించింది. పరిస్థితి చేజారి పోతున్న తరుణంలో, ప్రణబ్ ముఖర్జీ, తన మంత్ర దండాన్ని ఉపయోగించారు. గవ్వలు విసిరారు. తన పావులను కదిలించారు. కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సభ్యులు అవాక్కయ్యారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకున్నారు. చేతిలో గవ్వలు జారి పోయాయి. తాత్కాలికంగా ఆట గెల్చారు ప్రణబ్. ఆట గెలుపు ధీమాతో, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ-ఆ మాటకొస్తే దానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చే ప్రక్రియ, ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యేవరకు వాయిదా వేశారు. మే నెల చివరి వరకూ, కాంగ్రెస్ సభ్యులను సరాసరి-నేరుగా కట్టడి చేస్తూనే, పరోక్షంగా తెరాసకు సంకేతం పంపారు. మూడు నెలలు ఆగాల్సిందే-ఆగి తీరాల్సిందే అని స్పష్టం చేసారు ప్రణబ్ ముఖర్జీ.
ఢిల్లీ సంకేతాలు, సహాయ నిరాకరణ చేస్తున్న నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగుల పైన ప్రభావం చూపాయి. ఇంటర్ పరీక్షల సమస్య కూడా వారికి తల నొప్పైంది. మూడు నెలలు సహాయ నిరాకరణ కొనసాగించడం కష్టమైన పని అని భావించి, వ్యూహాత్మకంగా విరమించారు. ఆటలో మళ్లీ నిచ్చెనలు ఎక్కడం మొదలెట్టారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు-మంత్రులు-ఎమ్మెల్సీలతో సహా, ఢిల్లీకి పోయి సోనియాను కలిసే ప్రయత్నంలో పడ్డారు. వారి ఆటలో వారూ కొంత ముందుకు సాగుతున్నారు. పనిలో పనిగా చంద్రబాబు నాయుడు తన వర్గంలోని బలీయమైన తెలంగాణ వాది-నాగం జనార్ధన రెడ్డి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నంలో పడ్డారు. తెలుగు దేశం వారు ప్రత్యేక నినాదం వైకుంఠపాళి ఆటలో చేరడానికి మరికొంత సమయం పట్టొచ్చునేమో. ఎలాగూ, మూడు నెలల సమయం వుందికదా! ఇక ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు, తెరాస నాయకులు తేల్చుకోలేక పోయారు ఏం చేయాలనేది. మిలియన్ మార్చ్ మినీ మార్చ్ చేశారు. వాయిదా వేసినా బాగుండేదేమో! అనుకోని బాధాకరమైన సంఘటన. తెలుగు జాతి గౌరవాన్ని దేశ దేశాల చాటి చెప్పిన మహనీయుల విగ్రహాలు "తెలంగాణ రాష్ట్రం ఇంకా రాలేదు కదా" అని బాధ పడుతున్న మిలిటెంటు ఉద్యమకారుల చేతుల్లో విధ్వంసానికి గురయ్యాయి. తప్పొప్పులు ఎత్తి చూపే సమయం దాటిపోతోంది. తరతమ భేదం చూపకుండా, ఇష్టం లేనివారిపై, నాయకులని కూడా చూడకుండా రాళ్లు వేశారు ఉద్యమకారులు కొందరు. మళ్లీ మాటల తూటాలు. విగ్రహాల విధ్వంసాన్ని ఖండించిన వారు...ఖండిస్తున్న వారు, తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలకు పాల్పడిన ఆరొందల మంది అమాయకుల విషయంలో ఎందుకు నోరు విప్పలేదని తెలంగాణ వాదులు విమర్శలకు దిగారు. భౌగోళిక విభజన కంటే ముందే...సాంస్కృతిక విభజన జరిగే సూచనలు పొడసూపడం తెలుగు జాతికి దురదృష్టకరమైన అంశం.
పరమపద సోపాన పటంలో నూరవ గడికి ఎవరు ముందుగా చేరుకుంటారో ఊహించడం కష్టమైనా, మూడు నెలల వరకూ, నిచ్చెనలెక్కుతూ-పాము నోట్లో పడి కిందకు జారుతూ, వుండడం మాత్రం తధ్యం.
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech