అర్థరాత్రితోనే రోజు ఎందుకు మొదలవుతుంది?
 

- రావు తల్లాప్రగడ

 
ప్రధాన సంపాదకులు:
రావు తల్లాప్రగడ 

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
సి. కృష్ణ
తాటిపాముల మృత్యుంజయుడు

వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ, హైదరాబాద్.

ఖరకరునికరుణ యరుణలు
ఖరఖరువులను తెగనరక కరువులె కరుగన్!
ఖరనామవత్సరము శే
ఖరునివరములు కురిపించు కరణిన విచ్చన్!
ముందుగా సుజనరంజని పాఠకులందరికీ ఖరనామ సంవత్సర శుభాకాంక్షలు!
 

 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అర్థరాత్రి స్వాతంత్రం, అర్థరాత్రి నూతనసంవత్సరం, అర్థరాత్రి జన్మదినోత్సవాలు, ఇలా అర్థరాత్రితోనే మనరోజు ఎందుకు ప్రారంభమవుతుందీ అని ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? అదేమిటి పిచ్చి ప్రశ్న అని కొట్టెయ్యకుండా, అది ఇంగ్లీషువారి పద్ధతిలే అని దాటెయ్యకుండా ఆలోచిస్తే ఒక కొత్త విషయం బయటకు వస్తుంది!


నిజానికి ఏ తెల్లవాడికైనా అర్థరాత్రి తోనే రోజు మొదలు పెట్టాలని ఎందుకు అనిపించివుంటుంది? విద్యుత్తు దీపాలు కూడా లేని నాడు, కనీసం గడియారాలు కూడా లేని నాడు, అర్థరాత్రికి ఎవడూ మేలుకుని వుండని నాడు, దానితో రోజు మొదలు పెట్టాలని ఎందుకు అనిపించివుంటుంది? అన్ని పశ్చిమ దేశాలలో సూర్యోదయం కొంచెం ముందైతేనే డే లైట్ సేవింగ్ అని గడియారాలు ముందుకూ వెనకకూ తిప్పుకుంటూ వుంటారే? అలా తెల్లవారడాన్ని బట్టే దినారంభాన్ని నిర్ణయించే తెల్లవాడు - అర్థరాత్రితో రోజును ప్రారంభిస్తాడా? ఆశ్చర్యంగా లేదూ? అటువంటి వాడు ఉదయంతోనే రోజు మొదలవుతుంది అని అనుకునివుండాలి కదా! అది కామన్‌సెన్సులా అనిపించడం లేదూ! ? కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.

నిఘంటువుల అర్థం: అన్ని ఆంగ్ల నిఘంటువులలో "morning" అన్న పదానికి అర్థం Daybreak అంటే దినారంభం అయ్యే కాలం.


హిబ్రూ మతస్తుల నమ్మిక:  బైబిల్,The: Old Testament (Authorized Version, 1611)Genesis ప్రకారం ఇలా ఉంటుంది. In the beginning God created the heaven and the earth. And the earth was without form, and void; and darkness was upon the face of the deep. And the Spirit of God moved upon the face of the waters.

And God said, Let there be light: and there was light. Genesis ch. 1, v. 1
And the evening and the morning were the first day. Genesis ch. 1, v. 5


క్రైస్తవుల నమ్మిక : బైబిల్ జెనెసిస్ -1 లో దేవుడు ఇలా అన్నాడని వుంటుంది "And God said, “Let there be light,” and there was light. 4 God saw that the light was good, and he separated the light from the darkness. 5 God called the light “day,” and the darkness he called “night.” And there was evening, and there was morning—the first day" దీనికి క్రైస్తవులు ఉదయంతోనే రోజుమొదలయ్యింది అని భాష్యం చెప్పారు. అంటే ఏది ఏమైనా అది అర్థరాత్రితో మాత్రం కాదు అని గమనించడం తేలికే.

ఇస్లాం నమ్మిక: ఇస్లాంలో కూడా హిందువుల పంచాంగలోలాగే నెల/తిథి ఎప్పుడైనా మొదలవ్వవచ్చు. కానీ దినము అన్నది సూర్యోదయంతోనే మొదలవుతుంది. ఉదాహరణకి ప్రార్థన రోజుకి 5 సార్లు చెయ్యమని వారి మతం బోధించింది. అవి తెల్లవారుఝామున సూర్యోదయానికి ముందు "ఫజిర్" తో మొదలు పెట్టి, ధుహుర్ (మిట్ట మద్యాహ్నం), ఆసిర్ (మద్యాహ్నం), మఘ్రిబ్ (సూర్యాస్తమయం), ఈష (రాత్రి) అని ఐదు ప్రార్థనలు. వీటిలో హిందూమతంలో లాగా ఉభయ సంధ్యలు వుండటం గమనార్హం. వెరసి సూర్యోదయం తోటే దినారంభం చేస్తారు అని తెలుస్తోంది. అలాగే మరొక చోట ఇంకొక ప్రస్తావన ఇలా దొరికింది. Surah Al-Qadr -Verse 97:5: "(The night is) Peace until the rising of the dawn." దీనికి భాష్యంగా పలువురు రోజు సూర్యోదయంతోనే రోజు మొదలవుతుంది అని చెబుతారు.
 


హిందువుల (లేక భారతీయ) పంచాగాలు: మనకి అనేక పంచాంగాలు వున్నాయి. కానీ అన్నిటిలోనూ తిథి అన్నది వేరు దినం (లేక వారం) అన్నది వేరు. దినంలో ఏ సమయంలోనైనా తిది మొదలవ్వచ్చు. కానీ దినారంభం మాత్రం సూర్యోదయంతోటే జరుగుతుంది. భారతీయ పంచాంగాలలో తిధిప్రవేశం ఎన్నింటికి, ఏ సమయంలో లేక ఏ పూట జరిగినా కూడా, సూర్యోదయమైతే తప్ప రోజు మొదలు పెట్టరు!

పశ్చిమదేశ సాంప్రదాయాలు: పశ్చిమ దేశస్తులంతా సూర్యోదయాన్ని బట్టి డే లైట్ సేవింగ్సు టైముని నిర్ణయించుకుంటారు. అంటే సూర్యుడు కొంచెం ముందువస్తే ఆ ఋతువులో కొంచెం ముందే దినారంభమైందని గడియారాలు మార్చుకుంటారు. అలా సూర్యోదయమే దినారంభానికి ఆధారం అవుతుంది.

మిగితా నమ్మికలు:
· ఈజిటియన్లు బాబిలోనియన్లు నమ్మిక ప్రకారం రోజు ఉదయంతోటే మొదలవుతుంది.
· అంబ్రియన్లు (ఉత్తర ఇటలీ ప్రాంత వాసులు) మిట్టమద్యాహ్నం దినారంభం అవుతుందని భావించేవారట.
· జులియన్‌కాలమానం ప్రకారం దినం మిట్టమద్యాన్నం సూర్యుడు నడినెత్తిమీదకి వచ్చినప్పుడు రోజు మొదలవుతుంది.
· ఖగోళశాస్త్రాజ్ఞులు కూడా ఈ జులియన్‌డేట్ ప్రకారమే 19వ శతాబ్దంవరకు తమ కాల నిర్ణయాన్ని చేసేవారట.
· ఆధికారిక " ఇటాలియన్ గంటలు" లేక "పురాతన చెక్ గంటలు " ప్రకారం సూర్యాస్తమయం అయ్యాక 30 నిమిషాల తరువాత దినారంభం  అయ్యేదట.
· భారత దేశంతో పాటూ, సుమేరియ, చైనా దేశాలలో కూడా సూర్యోదయంతోనే దినారంభం కావాలని నమ్మేవారట.
మరి అర్థరాత్రి దినారంభం అవుతుందని రెండు బైబిలు టెస్టిమెంటులూ చెప్పలేదు, ఖురాను చెప్పలేదు, పశ్చిమదేశ సాంప్రదాయాలు చెప్పలేదు, హిందువులు చెప్పలేదు.. ఇంకెవ్వరు కూడా చెప్పలేదు... . అందరూ సూర్యోదయాన్ని, లేక సూర్యాస్తమయాన్ని, లేక సూర్య గమనాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొనే దినారంభాన్ని చేసుకొమ్మని చెబుతూవుంటే, మరి ఈ అర్థరాత్రికి రోజు మొదలు పెట్టే సాంప్రదాయం ఎలా మొదలయ్యింది? ఏదో కారణం వుండే వుంటుంది. పరిశీలిద్దాం. దీనికి మతం అన్న మాటకూడా పుట్టని కాలానికి, అంటే ఇంకా బాగా చాలా వెనక్కి వెళ్ళి చూడాలి .

వైదీకకాలంలో అంటే బౌద్ధమతానికి కూడా పూర్వకాలంలో ప్రపంచంలో మతం అన్న మాట కూడా లేని కాలంలో, ఒకే ఒక ధర్మం వుండేదట. అదే భారతీయ లేక వైదీక సనాతనధర్మం. అది భారత దేశానికే పరిమితం కాకుండా ప్రపంచమంతటా వ్యాపించి వుండేదిట. భారతదేశం ఈ వైదీకసంస్కృతికి ఒక రకంగా నాయకత్వం వహించేది అని చెప్పుకోవచ్చు. తర్వాత బౌద్ధ, జైన మతాలవంటివి పుట్టి అమిత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆదిశంకరుడు మళ్ళీ మన మతాలను ఉద్ధరించి సనాతనధర్మాన్ని పునఃస్థాపితం చేసాడు. ఆ తరువాత ఇంకా అనేక మతాలు విడివిడిగా జన్మించి, అలా ఒక్కొక్కరికి ఒక మతం వచ్చేసాక, ఇక ఈ వైదిక ధర్మాన్ని ఏమని పిలవాలి అని సతమతమవుతూ ఉన్నప్పుడు, అదే కాలంలో భారతీయులని హిందూ దేశస్తులని పర్షియన్లు పిలవడం మొదలు పెడితే, అదే పేరుని పెట్టి మన మతాన్ని కూడా పిలవడం మొదలు పెట్టారు. అలా మనకు హిందూమతస్తులని పేరు పడిపోయింది కానీ, వైదీక సనాతనధర్మానికి నిజంగా పేరు లేదు అని అందరికీ తెలిసిన విషయమే.

అలా హిందువులమని మనలను మనం పిలుచుకోవడం మొదలు పెట్టాము. నిజానికి పర్షియన్లు, యూరోపియన్లే కాదు, వైదీకకాలంలో ప్రపంచం మొత్తం ఒకే దేవతలను పూజించేవారు. ముఖ్యంగా ప్రకృతిని ఆరాధించేవారు. వరుణుడు, వాయువు, అగ్ని వంటి దేవలే పర్షియన్ సంస్కృతిలోగానీ, హిందువులలోగానీ, గ్రీకులలోగానీ, మాయన్లలోగానీ, మరే సంస్కృతిలోగానీ, ఎక్కడ చూసినా వీరే వుండే వారు. దాదాపుగా అన్ని సంస్కృతులలోనూ లింగార్చన వుండేది. ఆ లింగానికి పేర్లు వేరువేరేమో గానీ, అందరూ పెద్దపెద్ద శివలింగ రూపంలో వున్న రాళ్ళనూ, లేక కొండలనూ పూజించేవారు. వెరసి హిందూమతమే (లేక వైదీక సనాతనధర్మమే) వేరు వేరు పేర్లతో, రూపాలతో ప్రపంచమంతటా వుండేది. ఈ సనాతనధర్మం వల్ల భారతదేశం ప్రపంచానికి ఒక సాంస్కృతికరాజధానిగా వుండేది. అలా ఆ కాలంలో అందరూ వైదీకకాలమానాన్ని అనుసరించేవారు. భారతీయ సంస్కృతిని గౌరవించి పాటించేవారు అని చెప్పుకోవచ్చు.

ఉదాహరణకి సంస్కృతంలో గంటకి వ్యవహారనామం "హోరా" అన్న పదం అని మనకు తెలుసు. అదే పదాన్ని గ్రీకులు తమ భాషలోకి తీసుకుని "హోరై" గా వ్యవహరించేవారు. ఇదే ఇంగ్లీషులో hour గా ఇప్పుడు అందరికీ తెలుసు. రోజుకి 24 గంటలుండటం (4 ప్రహరుల పగలు, 4 ప్రహరుల రాత్రి, ప్రహరుకి 3 గంటలు) వైదీక కాలమానం నుంచీ వచ్చినదే. అదే అన్ని ప్రాంతాల వారు స్వీకరించారని ఎవరూ చెప్పకనే తెలిసే విషయం. ఆలాగే మన 7 రోజుల వారం weekగా అన్ని ప్రపంచ దేశలలోనూ అవే పేర్లతో కనిపించడం కాకతాళీయం కాదు. ఉదాహరణకి వారానికి 7 రోజులు అనీ రోమన్ల కాలండర్లలోకి క్రీ.శ. 321 దాకా రాలేదు. తరువాత కాలంలో వారు వారానికి 7 రోజులుగా స్వీకరించారు. చివరికి వారాల పేర్లను కూడా అందరు తమ తమ భాషలలోకి తర్జుమా చేసుకున్నారు. ఉదాహరణకి ఆదివారం SunDay అయ్యింది; సోమవారం Monday అయ్యింది. అలాగే మిగితా వారాలన్నీ కూడా అవే గ్రహాల పేరతో అదే క్రమంలో వస్తాయి. ఇది కేవలం ఇంగ్లీషులోనే కాదు, దాదాపు అన్ని భాషలలోనూ, సంస్కృతులలోనూ ఇంతే. అలాగే 12 నెలల సంవత్సరమూ కూడా కాకతాళీయము కాదు. పది నెలలే అని ఎందుకు అనుకోలేదు? అందరూ ప్రపంచవ్యాప్తంగా ఒకే వైదీకసిద్ధాంతానికి కట్టుబడి నడుచుకోవడం అలవరుచుకున్నారని మాత్రమే దీనిలో నుంచీ గ్రహించవలసిన విషయం. అలాగే గంటకి 60 సెకన్లే ఎందుకుండాలి, 100 ఎందుకు వుండకూడదు? ఘడియకి (ఇక్కడ ఘడియ గంటకి సమానం కాకపోయినా) 60 విఘడియలుండటం ఈ గణన పద్ధతికి సాపేక్షతను చూపిస్తుంది.


ఇలా వైదీక పద్ధతిని అనుసరించడానికి ప్రపంచం కట్టుబడి వుండేదన్న విషయం అంగీకరిస్తే, దినారంభం గురించి ఆలోచించడానికి పునాది సిద్ధమైందన్నమాట. -- ఇందాక చెప్పుకున్నట్లు సూర్యోదయమైతేగానీ, భారత పంచాంగం ప్రకారం రోజు మొదలవ్వదు. సామాన్యంగా భారతదేశంలో ఉదయం 6 గంటలకు సూర్యోదయం అవుతుంది. అంటే యూరప్ దేశవాసులు మంచి నిద్రలలో ఉంటారన్నమాట. అంటే గడియారాలు గట్రా లేని కాలంలో ... " ఎప్పుడో అర్థరాత్రికి వైదీకదినం మొదలవుతుందిలే" ... అని అనుకునేవారు. అంటే మన పంచాంగ పట్ల, లేక భారతీయ సంస్కృతిపట్ల వున్న అభిమానంతో, భారత దేశంలో రోజు ఎప్పుడు మొదలు అయితే, అప్పుడే యూరోపియన్లు కూడా తమ రోజును అదే సమయానికి, …. అంటే అది అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా, …. … అదే సమయానికి తమతమ రోజులను మొదలు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారన్న మాట. ఈ విధంగా ఇలా అర్థరాత్రికి వారి దినం మొదలు పెట్టుకునే సాంప్రదాయాన్ని అలవరుచుకున్నట్లుగా కనపడుతున్నది. మనపంచాంగం ప్రకారం స్థానికకాలమానంతో సంబంధంలేకుండా ఎక్కడైనా తిథులను ఇలాగే ఒకే సమయంలో అమలు పరుచుకోవడం కూడా సాంప్రదాయమే. దానినే వీరు దినారంభానికి కూడా వర్తించినట్ట్లు తెలుస్తోంది.

కాలక్రమేణా అనేక మతాలు పుట్టి, సాంప్రదాయాలు పెరిగి, వారి జ్ఞాపకం కృశించి, వైదీకపంచాంగ జ్ఞానం నశించి, అసలు విషయం మర్చి పోయి, అర్థరాత్రితోనే రోజు మొదల వ్వాలి అని మాత్రం గుర్తు మిగిలిపొయివుండవచ్చు - అని కనీసతర్కం ద్వారా గ్రహించవచ్చు. ఈ మద్యలో ఎన్ని మతాలు పుట్టి ఎన్ని ఆచారాలు మారినా, అవి కొత్తకొత్త దినారంభ పద్ధతులను నిర్దేశించినా ..... ఆ అర్థరాత్రికి రోజు మొదలుపెట్టే ఆ పాత ఆచారం ఎలాగో అలా మిగిలి, ఇప్పటికీ సజీవంగావుండి, ఇంకాఇంకా బలపడుతూ, మనముందు ఒక సజీవనిదర్శనంలా దర్శనమిస్తోంది. వైదీక కాలమానమే ప్రపంచవ్యాప్తంగా అనుసరించి వుండేవారు అనడానికి ఇలా ఆధారాలు వున్నాయి. ఈ విషయంపై ఇంకా పరిశోధనలు జరిపితే అదే విషయాన్ని మరింత సాక్ష్యసమేతంగా నిరూపించవచ్చు.

అలా యూరోపియన్లు కూడా మన సమయాన్ని అనుసరించచడం వల్ల అర్థరాత్రిపూట రోజు మొదలయ్యేటట్లుగా ఏర్పరచుకున్నారు. ఇలా హైందవ సంస్కృతి అన్ని దేశాలలోకీ వ్యాపించడమే కాకుండా, మనం కూడా మిగితా దేశాల నుంచీ కొన్ని విషయాలను దిగుమతి చేసుకుని వుండవచ్చు. కానీ సంస్కృతికపరంగా సనాతనధర్మమే సర్వవ్యాప్తమై వుండేది. వైదీక సిద్ధాంతాలను అనేకులు అనేక రకాలుగా అన్వయించుకొని, గౌరవించి, వాటిని అనుకరించి, అనుసరించి వ్యాప్తి చెందించారు.

ఈ నేపధ్యంలో ఆలోచించి చూస్తే పశ్చిమ దేశస్తులు ఊరికే అడ్డకోలుగా అర్థరాత్రికి రోజు మొదలు పెట్టలేదని గుర్తించవచ్చును. నిజానికి వారు భారత కాలమానాన్ని అనుసరించేవారని, అదే సమయానికి వారి దినాన్ని కూడా ప్రారంభించుకునేవారనీ తేటతెల్లమవుతుంది. కానీ, అది తెలిసిన తరువాత కూడా, ఇంకా మనం పాశ్చాత్యులననుకరించి అర్థరాత్రితో దినారంభం చెయ్యడం సబబేనా? ఈ విషయలో ఆలోచన చెయ్యవలసిన అవసరం లేదా?

ఈ ఉగాది సందర్భంగా మన ప్రాచీనతను, మన సాంస్కృతిక ఔన్నత్యాన్నీ గుర్తుచేసు కోవలసిన ఆవశ్యకత వుంది. గుర్తుండో లేకో వారు ఎన్నో వేలాదిసంవత్సరాలుగా మన కాలెండర్‌ని (పంచాంగాన్ని) అనుసరించుకుంటూ వస్తూ వుంటే…. ఇప్పుడు మనం వారిని reverse లో అనుకరించి మనకి కూడా మళ్ళీ అర్థరాత్రికి రోజు అవుతుంది, అని నమ్మడం మొదలు పెట్టాము. అది వివేకమేనా? ఆలోచించండి! ఆలోచింపజేయండి!!!

మన పండగలని, మన జన్మదినోత్సవాలనీ ఆంగ్ల కాలండర్ ప్రకారం చేసుకోనవసరంలేదు. ఐనా ఒకవేళ చేసుకోవాలని అనిపిస్తే, సరిగ్గా ఆంగ్ల తేథీలకు మ్యాపింగు చేసుకోవడం నేర్చుకోండి. అప్పడు రెండూ అనుసరించిన వారవుతారు. అలా సరిగా మ్యాపింగు చెయ్యకుండా ఇండియాలో పండగ ఏప్రిల్ 1 కాబట్టి అమెరికాలో ఏప్రిల్ 1 వచ్చేదాకా వైట్ చెయ్యాలి అనడం అజ్ఞానమే కాదు, వితండ వాదన అవుతుంది. అలాగే ఈ అర్థరాత్రి పండుగలూనూ!!!!

సరే!!! ఎప్పుడైనా ఇష్టం వచ్చినట్లు పండుగలు జరుపుకోండి. ఆనందంగా వుండటానికి ఏ సమయమైనా మంచిదే. అభ్యంతరం లేదు! -- కాని ఎందుకు ఏ పని చేస్తున్నామో తెలుసుకుని చేస్తే మరీ బాగుంటుంది! మన పంచాంగాన్ని వివిధదేశకాలమానాలలో తయారుచేసుకోవడం మనకు తెలుసు. ఉదాహరణకి శ్రీమారేపల్లి వేంకటశాస్త్రిగారు పశ్చిమ అమెరికా కాలమానం ప్రకారం తయారు చేసిన పంచాంగాన్ని ఆంగ్లతేథీలకు మ్యాప్ చేసి, మీ కోసం ప్రతినేలా సుజనరంజనిలో ప్రచురిస్తున్నాము. ఆంగ్లకాలమానం పాటించడం తప్పుకాదు, కానీ మన సంస్కృతీసాంప్రదాయాలకున్న విశిష్ఠతను మర్చిపోకూడదు. వాటిని పరిరక్షించుకుని భావితరాలకు యధావిధంగా, సక్రమ మార్గంలో అందించండి. అదే మన కనీసధర్మం !

మళ్ళీ అందరికీ ఖరనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
 

మీ
రావు తల్లాప్రగడ

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech