సత్యమేవ జయతే - అమెరికాలమ్ - 4

బ్రహ్మ పప్పులో కాలేశాడు

                                                         - సత్యం మందపాటి

  రోజూలాగానే బ్రహ్మ దేవుడు దీక్షగా, తర్వాత నెల రోజుల్లో పుట్టబోయే వారి భవిష్యత్తుని గబగబా చిన్న చిన్న కాగితాల మీద వ్రాసేస్తున్నాడు.
ఆయన ఆంతరంగిక శిష్యుడు బ్రహ్మానందం బ్రహ్మ రాతల్ని, నొసటి రాతలుగా మార్చి పిల్లల నుదుటి మీద ముద్రలు వేస్తున్నాడు.
ఇద్దరూ ఊపిరి ఆడకుండా పని చేస్తుంటే సరస్వతీదేవికి విసుగుపుట్టి, వీణ మీద హంసధ్వని రాగంలో వాతాపి గణపతిం భజే కీర్తనని మధురంగా ఆలాపించటం మొదలుపెట్టింది.
బ్రహ్మ ముందు వున్న తలతో దీక్షగా చూస్తూ, పక్కన వున్న రెండు తలలతో ఆలోచిస్తూ, భావితరాల జీవన నిర్మాణం చేస్తుంటే, వెనక తల ఇక చేసేదేమీ లేక కునికిపాట్లు పడుతున్నది.
అప్పుడే నారదుడు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ‘నారాయణ నారాయణ’ అంటూ వచ్చాడు. ఆయన మాటలకి నాలుగో తల కునికిపాట్లు పడటం ఆపి, తన ఏడో కన్నూ ఎనిమిదో కన్ను తెరిచింది. కానీ ఆ తల, వెనకాల వుండటం వల్ల నారదుడు కనపడలేదు.
బ్రహ్మ వ్రాయటం ఆపి, నెమలి పింఛం క్రిందపెట్టి చేతి వేళ్ళు విరుచున్నాడు. ‘రా నారదా రా! ఏమిటి విశేషాలు’ అన్నాడు.
బ్రహ్మానందం కూడా కొద్ది క్షణాలు విరామం తీసుకుందామని, అలా బయలు ప్రదేశానికి వెళ్ళాడు.
నారదడు అన్నాడు ‘మీరేదో చక్కటి సృష్టి కారకులు అనుకున్నాను కానీ, పప్పులో కాలేశారు బ్రహ్మదేవా!’ అన్నాడు.
ఆ మాటలకి బ్రహ్మ దేవుడు ఉలిక్కిపడి ‘అదేమిటి’ అన్నాడు నొసలు ముడిచి.
వీణాపాణి వారి మాటలు వినపడేటట్టుగా ‘ఇన్ని రాశుల ఉనికి’ అనే అన్నమాచార్య కీర్తనని సన్నగా వీణ మీద వాయించటం మొదలు పెట్టింది.
‘ఏమని చెప్పమంటావు దేవాధిదేవా! నువ్వు ఎంతో మందిని ఎంతో చక్కగా తయారుచేశావు కానీ తెలుగు వాళ్ళని సృష్టించటంలో పప్పులో కాలేశావని అనిపిస్తున్నది. ఎక్కడో ఏదో కొన్ని పాళ్ళు తక్కువో, ఎక్కువో వేసి వండావని అనిపిస్తున్నది. ఈమధ్య నీ సృష్టి లో లోపాల పాళ్ళు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా ముఖమాట పడకుండా నీ నాలుగు ముఖాల మీద చెబుతున్నాని ఆవేశపడకు. చెప్పక తప్పటంలేదు’ అన్నాడు నారదుడు.
'నువ్వలా అనుకోటానికి కారణమేదో చెప్పరాదూ, అలా నిందించకపోతే' అన్నాడు బ్రహ్మ.
'ముళ్ళపూడి వెంకటరమణగారని ఒహ మహా గొప్ప రచయిత వుండేవారు. లక్షలకొద్దీ అభిమానుల్ని వదిలి పెట్టి ఈ మధ్యనే స్వర్గానికి వెళ్ళారాయన. ఇద్దరు తెలుగువాళ్ళు ఒక చోట వుంటే రెండు పార్టీలు వుంటాయన్నారాయన. అదే బ్రహ్మరాత అనుకుని, తెలుగు వాళ్ళు అమెరికాలో వున్న ఒక్క తెలుగు సంఘాన్ని రెండు ముక్కలు చేసుకుని తమ తెలుగుతనం కాపాడుకున్నారు. పోనీలే ఇంతటితో ఆగారు కదా అనుకుంటే, మీరు వ్రాసిన రాతని తప్పు అని తేలుస్తూ మొదటి సంఘం రెండు ముక్కలయింది. మేమేం తక్కువ తినలేదని రెండో సంఘం వాళ్ళు, కొంచెం ఎక్కువ తిని వాళ్ళు కూడా రెండు ముక్కలయారు. అంటే ఇప్పుడు మొత్తం నాలుగు సంఘాలున్నాయన్న మాట’
బ్రహ్మ దేవుడు తన మొదటి ముక్కు మీద రెండో చేతి చూపుడు వేలు వేసుకుని, 'హన్నా' అనుకుని నాలుగు సంఘాల గురించీ, తన నాలుగు తలలతోనూ ఆలోచించటం మొదలు పెట్టాడు.
భారతీదేవి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అభేరి రాగంలో 'నగుమోము గనలేని’ అనే త్యాగరాజ కృతి వీణ మీద తీయగా ఆలాపిస్తున్నది.
'అంతే కాదు భారతదేశంలో బెంగాలీ బాబులు, గుజరాతీ వాళ్ళు, అరవ్వాళ్ళు, మలయాళీలు చాల వరకూ కలిసి మెలిసి వుంటారు. మరి తెలుగు వాళ్ళకి ఎక్కడా లేని, ఎక్కడలేని తెగులుతనం ఎక్కడినుంచో వచ్చేసింది. కుల దురభిమానాలు తెలుగువాళ్ళల్లో వున్నంతగా, ఇంకెవరిలోనూ కనపడవు. ఒకవేళ ఇద్దరిదీ ఒకటే కులమయితే, ప్రతి కులంలోనూ మళ్ళీ రెండో మూడో విభాగాల పాకులాటలు. పాత రోజుల్లో కులాలు వున్నా ఇంతగా వ్యాకులం ఇచ్చేవి కావు. ఇప్పుడు తెలుగు జనానికి కావలసింది విభజనలు. లేదా ప్రాంతీయ విభేధాలు. ఒక మనిషికీ ఇంకొక మనిషికీ మధ్య ఇలా గీతలు గీసుకోమని, మీ రాతల నొసటి గీత కానీ, కృష్ణుడిగారి భగవద్గీత కానీ చెప్పటం లేదే’ ఒక్క క్షణం ఆగాడు నారదుడు.
వీణాపాణి తన సన్నటి వేళ్ళతో వీణ తీగలు సుతారంగా సవరించి శ్రీరాగంలో 'ఎందరో మహానుభావులు’ అనే త్యాగరాజ కీర్తన ప్రారంభించింది.
బ్రహ్మ తన మూడో ముక్కు తుమ్ముతుంటే, మూడో చేయి అడ్డం పెట్టుకుని తుమ్మాడు.
నారదుడు 'చిరంజీవ చిరంజీవ చిరంజీవ’ అని మూడుసార్లు అని, మళ్ళీ తెలుగోడి గోడు చెప్పటం మొదలుపెట్టాడు.
'అంతే కాదు. ఒక హిందీవాడూ, ఇంకో హిందీవాడూ కలిస్తే హిందీలోనే మాట్లాడతారు. ఒక తెలుగు వాడూ ఇంకో తెలుగువాడు కలిస్తే, ఒక్క తెలుగు పదం కూడా రాకుండా జాగ్రత్తగా ఇంగ్లీషులోనో, ఉర్దూ కలిసిన హిందీలోనో మాట్లాడతారు. తెలుగువాళ్ళు తెలుగు మర్చిపోతున్నారు. ఒకవేళ అదృష్టవశాత్తూ తెలుగు మాట్లాడితే, ఒక కుర్రాడు ఈమధ్యనే పెల్లి చేసుకొచ్చానంటాడు. ఇంకొకయన 'నా కాలు తొక్కావ్. నీకు కల్లు కనపట్టం లేదా' అంటాడు. మరి కల్లు తాగి మాట్లాడుతున్నాడేమో తెలీదు. ఒత్తులు వత్తుల పెట్టెలో పెట్టేశారు. అదీకాక, తెలుగువాళ్ళు నాలుగు చేతులతోనూ అక్రమంగా డబ్బులు సంపాదించటంలో ఆరితేరిపోయారు’
నారదుడి మాటలకి బ్రహ్మదేవుడు నాలుగో చేత్తో రెండో తల మీద కిరీటం తీసి, మూడో చేత్తో బుర్ర గోక్కునాడు.
నారదుడు కొంచెం తడబడి 'మీలాగా వాళ్ళకి నాలుగు చేతులు లేవనుకోండి. తెలుగులో మాటవరసకి అలా అంటారు. అంతే!' అన్నాడు.
వీణ మీద ఇంకొక పాట ఆరంబించే ముందు, భారతీదేవి 'ఇంకా నయం. తెలుగు వాళ్ళకి వున్న ఇంకొక లక్షణం చెప్పాడు కాదు నారదుడు. ఏకాభిప్రాయం వున్న విషయాల్లో కూడా, పెద్దగా వాదనలు చేసుకుంటూ అరవటం తెలుగువాళ్ళు తప్ప ఇంకెవరూ చేయరు కదా!' అనుకున్నది.
అనుకోవటం పూర్తయాక, 'మా తెలుగు తల్లికీ మల్లె పూదండ’ పాటని వీణ మీద శ్రావ్యంగా వాయిస్తూ, బ్రహ్మ దేవుడి మూడో తల వేపు గోముగా చూసి చిరునవ్వింది సరస్వతి.
 
 
 

సత్యం మందపాటి

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

 
 

 

 

నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech