పుస్తక పరిచయం  

ఆవేదనతో నిండిన అక్షర నీరాజనం.... జ్వాలాముఖి "భస్మ సింహాసనం"
- శైలజా మిత్ర

         
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రముఖ దిగంబరకవి  జ్వాలాముఖి (ఆకారం రాఘవాచారి) మనమధ్య లేకున్నా వారి తాలుకు ఒక అంతులేని భావమేదో మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది..సమాజం పట్ల వారి ఆవేదన, ఏదో మానసిక వేదన కలిపినట్టి ఒక అద్భుత చిత్రం వీరి మనో భాష్యం.. చూడడానికి గంభీరమయినా, మనసు ఒక అందమయిన మల్లెల మాల. " 1938 సంవత్సరంలో ఏప్రిల్ 12 న హైదరాబాద్ లో సీతారం భఘ్ దేవాలయంలో వెంకట లక్ష్మి నరసమ్మ, వీరవెల్లి నరసింహా చార్యులు గారికి జన్మించారు. వీరు " మనిషీ" కావ్యంతో సాహిత్య జీవితం ఆరంభించి, దిగంబరకవిగా, విప్లవ కవిగా, ప్రసిద్దికెక్కి, మహా వక్తగా పేరుగాంచిన వీరు సాంస్కృతిక రంగంలో ఐఖ్య సంఘటన అవసరమని నమ్మిన వ్యక్తి .. సామ్రాజ్య వాదాన్ని ప్రసంగాలలో ఎండగడుతూ, భూస్వామ్య సంస్కృతిని ఎదిరించిన ఒక శక్తి  
నేడు నా చేతిలో ఉన్న ఈ అక్షర నీరాజనం " భస్మ సింహాసనం"మూడు  దీర్ఘ కవితల సంకలనం..మొదటిది "మనిషీ" అనే కావ్యం.. ఇది వీరు తమ 1957 లో రాసిన మొదటి కావ్యం.  రెండవది "మదరిండియా-92 " మూడవది - "భస్మ సింహాసనం".ఇది ఆయన 2002 లో రాసిన ఆఖరి దీర్ఘ కావ్యం.  ఇవన్నీ కూడా కవిలోని కవితావేసానికి, అభినివేశానికి అద్దం పట్టడమే కాకుండా మతం పేరిట జరుగుతున్న మారణహోమాన్ని విశ్లేషిస్తూ, రాసోద్వేగభరితంగా సాగుతూ, మనలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించేదిగా  ఉంది. జ్వాలాముఖి గారు తీవ్రంగా స్పందించిన విషయాలలో మత కలహాలు ఒక ముఖ్యమయిన అంశం. వీరు మతకల్లోలాలను నిరసిస్తూ అనేక కవితలుగా స్పందించడమే కాక, ఆయా సందర్భాలలో ఆయన నిజనిర్ధారణ కమిటీలు, శాంతి కమిటీల ద్వారా విశేషంగా కృషి చేసేరు. పలుచోట్ల ప్రసంగాలలో పాల్గొన్నారు. భాధితులకు ఓదార్పుగా, సమర శీలంగా వెన్నంటి నిలిచేరు.
కల్మషం లేని కలలతో, ఒక నిర్దిష్టమయిన ఆశయాల వెలుగులతో మనిషి ని కరుణా రస మూర్తిగా, సంస్కారవంతునిగా ఎదగమని, అవస్థల స్థితిగతులను మానవీయంగా మలచుకోమని రచించిన గొప్ప కావ్యకంఠం- "మనిషీ" కావ్యం. మతం స్థానంలో మానవతని, దేవుని స్థానంలో మంచి మనిషినీ ఉంచి వారిలో ఒక చక్కనైన మార్పును ఆహ్వానిస్తూ కవి పాడిన ప్రభాత గీతం "మనిషీ" 
"ఓ మనిషీ!/ మానీషివిగా/ మహిలో /సత్యాన్వేషణ కై/ నిరంతరం జిగీషివిగా/కరుణ నిండిన/ మహా ఋషిగా.."
"నీతియే/ నీలోని పవిత్రత/ నిర్మల హృదయమే నిజమయిన దేవత/ అహమనుటే నీకు వినాశము/ దాన్ని మరచిన నీ కిహము/వశము"  అంటారు ఆవేశంగా మనిషీ లో..
తర్వాత ప్రఖ్యాత నగరాలు హైదరాబాద్, మొరాదాబాద్, అహమదాబాద్, ముంబై, గుజరాత్, ఏక్కడైతేనేమి ? మత విద్వేషంతో  పీడించ బడుతున్న ప్రతి కల్లోల సందర్బంలోను కవిగా జ్వాలాముఖి గారు స్పందించి, అలా స్పందించిన కరుణ రస వాహినిని, ఒక వీరోచిత చిత్రంగా అక్షరా విష్క్రుతి చేసేరు. పీడితుల పక్షాన ధర్మగ్రహంతో కవితాలను అలంకరించేరు. ముంబైలో రేగిన మత కల్లోలానికి నిరసనగా ఎత్తిన  కవితా వెలుగు మదరిండియా-92 ! ఇదొక కనిపించని విచలిత దుఃఖ రూపం!
"మహా నగరం మొహందకారం / మహా నాగరికత మాంసల వ్యాపారం/ శరీరాల సంత ఆత్మల భాహిష్కారం/ యవ్వనాల సమాధి జీవితాల నిషేధం"
"చీకటి ధ్రువాల శిధిల సమాజంలో / 'అరుణ తారగా' వెలుగులూ విరజిమ్మిన రెడ్ లైట్ ఏరియా' /'విముక్తి పోరాటం' ముందుకు తెచ్చిన 'మదరిండియా' /'తవ శుభ నామే జాగే గాహే తవ జయ గాధా" అంటారు ఆవేదనగా..
ఇక "భస్మ సింహాసనం" గురించి తెలుసుకోవాలంటే గుజరాత్ లో మతం పేరుతో సాగిన మారణ కాండకు, భీభత్స మయిన నరమేధానికి, వేదనపడి, క్రుంగి, కృశించి, అక్కడ రెండు పర్యాయాలు అనేక సార్లు పర్యటించి, అక్కడి బాధితులతో గడిపి రచించిన వాస్తవ చిత్ర రూపం. అక్కడ అమానుషత్వాన్ని చూసి, మానసికంగా అలసిపోయి, రోదించి, రచించిన ఆవేదనా అక్షర రూపం. అక్కడితో ఆగదు. పాలక వర్గ రాజకీయాల చేతుల్లో కీలుబోమ్మలై కొందరు మతోన్మాదంతో సాటిమనిషిని " కేవలం మన మతం కాదనే ఒక్క మాటతో తలలు తెగ నరుకుతుంటే ఈ సుకవి రుద్రుడి, వీర రాసోస్పోరకంగా మనిషిని తిరగబడండి అనే నినాదాన్ని అందించారు. మానవతా విలువలని కాపాడుకొమ్మని సందేశం ఇచ్చిన ఉద్యమ గీతం "భస్మ సింహాసనం".
అయితే ఈ పరిస్తితులు ఎలా మారుతాయి? వీటికి ప్రధాన కారణాలయిన  విధానాలకు ప్రాణం పోసి పెంచుతున్న  భూస్వామ్య వ్యవస్థను, దానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సామ్రాజ్యవాద, బడా పెట్టుబడి దారీ వ్యవస్థను, రద్దుచేసి, నిజమయిన ప్రజాస్వామ్యాన్ని సాధించుకోవడమే ఇందుకు సరైన మార్గమని, ఇదొక్కటే విలువైన పరిష్కారమని తెలిపిన మహా కవి జ్వాలాముఖి..
"శమశ్రీలను దోచిన రత్నగర్భ / జన స్త్రీలను చేర్చిన పుణ్యభూమి/ జాతుల అణచివేతలో ఆర్యవిజేత / మత విద్వేషంలో మధ్యయుగాల మన్వంతరం"..
"బూడిదలో బుద్ది పద్మాసనం ఫలితం భస్మ సింహాసనం/ ఎన్నికల బరిలో రౌడీల ఏకచత్రాదిపత్యం/ కండగల వాడిదే రాజ్యమన్న రాక్షస రామదండు / తిండిలేని వారి ముల్గులు పీల్చిన వివేకానందం "
ఈ ఆదర్శాలకు, ఆశయాలకు అనుగుణంగా, ఈ భయాలకు వ్యతిరేకంగా, భీతవహానికి వ్యతిరేకంగా, మానవతా ఆరాటాన్ని ప్రజలు సంఘటితం కావాల్సిన అవసరాన్ని, సాయుధులై, తిరగాబదవలసిన ఆవశ్యకతని, ఎంతో ఆవేశంగా రచించారు. ప్రతి పక్షం, అధికార పక్షం ఆవశ్యకతని, స్వార్థ రాజకీయ నినాదాలకు బలి కాకుండా నేటి భూస్వామ్య, బడా పెట్టుబడి దారుల ప్రజాస్వామ్యానికి విరుగుడుగా అందరూ కలిసి రావాలని, మనిషిని మనిషిగా నిలబెట్టాలని లేకుంటే మిగిలేది "భస్మ సింహాసనమే అని ఆవేదనతో, సమాజం పట్ల ఒక బాధ్యతతో తెలిపారు. 
సమాజంలో పీడితులున్నారు. భాదితులున్నారు. అందరూ ఒకే బరిలో నిలుచున్నారు. వీరందరినీ చూస్తూనే సింహాసనాల కోసం వీధిలో చేసుకుంటున్న పోరాటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించే అద్భుత కావ్యం ఈ "భస్మ సింహాసనం"

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech