aaa

పాపిష్టిసొమ్మా?
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రభ చదువుతున్నాను. ప్రభ అంటే నాకెంతో అభిమానం. కౌన్సిలింగ్ కబుర్లు చదివాక నా సమస్యను కూడా మీరేమైనా పరిష్కరించగలరేమోనని వచ్చాను. అంటూ కూర్చున్నాడు ఒక పెద్దాయన, బహుశా 75 ఏళ్ళుంటాయి.
ఈ వయసులో మీకు సమస్యా? అదేమిటి? అని అడిగాను.
ఈ వయసులో రాకూడదనిదే వచ్చింది. ఒక్కోసారి ఎక్కడికైనా పారిపోదామనీ, లేదా ఆత్మహత్య చేసుకోవాలనీ అనిపిస్తుంది. అన్నాడు.
మీ తాత్కాలిక సమస్యకు ఆత్మహత్య లాంటి శాశ్వత పరిష్కారం అవసరం లేదు, మీ సమస్యేమిటో చెప్పండి.

నాకిద్దరు కొడుకులు. నేను గవర్నమెంటు సర్వీసులో ఉండి ఏదో బాగానే సంపాదించాను. కానీ క్యాంపుల్లో తిరగడం, లంచాల బాపతు కలెక్షన్లు చేసి, పై నుంచి కింద దాకా అందరినీ పలకరించడం లాంటి పనుల్లో మునిగి ఉండి, ఇంటి సంగతి పట్టించుకోలేదు. నా భార్య ఏదో తంటాలుపడేది. ఆమె తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేసేది. పిల్లలు ఆమె మాట వినేవారు కాదు.బాగా అల్లరి చేసేవారు. ఆఫీసులో మాత్రం కలెక్షన్ కింగ్ అనే పేరున్నా ఇంట్లో పరిస్థితి అంత బాగుండె కాదు.

మరి మీరెప్పుడూ మందలించలేదా? మీరంటే భయంలేదా?
ఉంది కానీ...ఎప్పుడో వారానికి ఒకటి రెండు రోజులు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళను తిడుతూ కూర్చుంటే, నన్ను ద్వేషిస్తారేమోననే భయంతో ఏమీ అనే వాడిని కాదు. కానీ వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుని సరిగ్గా చదవలేదు. పెద్దాడు ఇంటర్ తోనూ, చిన్నాడు బి.కామ్. రెండో ఏటితోనూ చదువు ఆపేశారు. సినిమాల్లో వేస్తానని వెళ్ళి లక్ష రూపాయలు తగలెట్టివచ్చాడు.

పోనీ పెద్దాడైనా కుదురుగా ఉన్నాడా? వాడు మహామేథావిలాగా గాలిలో లెక్కలు కట్టి షేర్ బిజినెస్ చేశాడు. మూడు లక్షలకు మునిగాను. ఈ బాథలన్నీ చూసి పాపం, మా ఆవిడ ఎంతో కుమిలిపోయేది. ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకింది. చికిత్సకు ముంబయి తీసుకెళ్ళడానిక్కూడా ఆ రోజుల్లో కుదరక, పాపం, పోయింది.

అయామ్ సారీ! ఇది ఎన్నాళ్ళ క్రితం జరిగింది.
ఇరవై ఏళ్ళయింది. నన్ను మళ్ళీ పెళ్ళీ చేసుకోమని బలవంతం చేసి, మా దగ్గరే పని చేస్తున్న ఓ నలభై ఏళ్ళ ఆవిడతో పెళ్ళి జరిపించారు. ఇక నా రెండో భార్యకూ, పిల్లలకూ అసలు పడేది కాదు. ఎప్పుడూ గొడవలే. తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేసి చెరి పదిలక్షలిచ్చాను. నా రెండో భార్యకు 18 ఏళ్ళ కొడుకున్నాడు. వాడూ, ఆవిడా కలసి ఆస్తంతా వాళ్ళీద్దరి పేరిటా రాయమని పీక్కుతింటున్నారు.

వాడోరోజు నన్ను తన్నడానికి కూడా వచ్చాడు. మీరు వారితోనే ఉంటున్నారు కనుక, అస్తంతా మీ అనంతరం వారికే చెందుతుంది కదా!
కాదు..నా మొదటి భార్య కొడుకులక్కూడా ఆస్తిలో చట్టప్రకారం వాటాలు కావాలట. ఈ లోగా వీళ్ళు నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పెద్దకొడుక్కు ఫోన్ చేస్తే ఆస్తి తన పేరిట రాస్తే నన్ను పువ్వుల్లో పెట్తి చూసుకుంటానన్నాడు. నేనటు వెళ్తానని తెలిస్తే వీళ్ళు నన్నే అర్ధరాత్రో పీకపిసికి చంపినా చంపుతారు. నా దగ్గరున్న డబ్బునంతటినీ బ్యాంకు లాకర్లలో దాచాను. నాకున్న నాలుగిళ్ళనూ, మిగిలిన డబ్బునూ ఏ అనాథశరణాలయానికో రాసేసి ఛస్తే బావుంటుంది.

అంత డీలా పడిపోకండి. ఓ మంచి లాయర్ ని కలిసి వీలునామా రాయించండి. మీ సొమ్మును మూడు భాగాలు చేసి, ఒక భాగం మొదటి భార్యా పిల్లలకు, ఒక భాగం రెండో భార్య పిల్లలకు అని చెప్పండి. మూడో భాగం మీ దగ్గరే ఉంచుకుని మిమ్మల్ని చివరి క్షణం వరకు ప్రేమగా చూసుకునే వారికి అది చెందుతుందని ప్రకటించండి. ఈ సమయంలో మీకు కావలసింది అదే! అన్నాను.

నిజమే! ఈ ఆలోచన బాగుంది. ఇక్కడి నుంచి లాయరు దగ్గరకి వెళతాను. ఏమిటో ఈ వయసులో ఇంత నరకం అనుభవిస్తానని తెలిస్తే ఆ రోజుల్లో అంత కక్కుర్తి పడేవాడిని కాదు. అంటూ వెళ్ళాడాయన.

ఆ మధ్య ఉగాది రోజున ఆయన దగ్గరి నుంచి ఫోను వచ్చింది.
ఏం సార్, ఎలా ఉన్నారు అని అడిగా.
బ్రహ్మాండంగా ఉన్నాను. మీరిచ్చిన పథకం అద్భుతంగా పనిచేసింది. నేనెంతో హుషారుగా ఉన్నాను. చాలా థాంక్స్ అన్నాడు.
ఇంతకూ ‘ఏ ఇంట్లో ఉంటున్నారు అని ఉత్కంఠతో అడిగా.
ఏదీ నిర్ణయించుకోలేదు. ప్రస్తుతానికి రెండు పార్టీలు బ్రహ్మరథం పడుతున్నాయి. నా కాలు కింద పెట్టనివ్వడం లేదు. మహదానందంగా ఉంది.
ఇది ఇలాగే సాగిస్తూ మీ వాటను చివరికి చెరిసగం ఇచ్చెయ్యండి. అన్నాను. నా మనసులో కూడా అదే ఉంది. అన్నాడాయన హుషారుగా.

   
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech