"సమస్యాపూరణం:
క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com) ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు ఏప్రిల్ 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు
ఈ మాసం సమస్యలు
ఆ.వె.|| బ్రహ్మ సృష్టి కూడ బ్రష్టు పట్టె!
కం.|| ఎండకు తడిసిన ముద్దై
 

క్రితమాసం సమస్యలు
ఆ.వె.|| వెన్ను చూప కుండ రన్ను తీసె
కం.|| బంట్రోతుభార్య యోగము


ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.
మొదటి పూరణ - - గండికోట విశ్వనాధం, హైదరాబాద్ ,

   ఆ.వె.|| విజయమంద చివరి విన్నింగు రన్నుకై
                  బేటు సాగ దీసి షాటు కొట్టి
                  బంతి పట్టి స్టంపు పడగొట్టు నంతలో
                  వెన్ను జూపకుండ రన్ను దీసె.
     
కం||  బంట్రోతు భార్య యోగమ
                  దేంట్రా? యన, " రాజకీయ తెంపరి యదియే,
                   కంట్రీ బ్రూటుగ భ్రమనిడి
                  సెంట్రల్ మంత్రుల సరసన చిత్రాంగి యగున్   
         
రెండవ పూరణ - వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం
ఆ.వె.|| షార్జ క్రికెటు నందు సచిను తెండుల్కరు
కప్పు గెలుచుకొనెడి కాంక్షతోడ
స్థిరముగాను ఆడి సెంచరీ చేయంగ
వెన్ను చూప కుండ రన్ను తీసె
కం.|| బంట్రోతు భార్య యోగము
కాంట్రొవెరిషియల్‌గ మారి కలవర పరచెన్
ఎంట్రన్సు టెస్టు పాసయి
సెంట్రలు విద్యాలయమున చేరగలగునా

మూడవ పూరణ - జగన్నాథ  రావ్  కె.  ఎల్., బెంగళూరు
ఆ.వె|| ఎలుక వెనుక పిల్లి ఏనిమేషను ‘టాము
    జెర్రి’ చిత్రమందు జెర్రి అంద
కుండ, కుండలోన ఉండదనుచు టాము
    వెన్ను చూప, కుండ రన్ను తీసె

ఆ.వె|| గడిచి పోయినట్టి కాలంబు పరుగులో
    నన్ను వీడి సాగినాడు వాడు
    తిరిగి చూడలేని తీరాల చెంతకు
    వెన్ను చూపకుండ రన్ను తీసె

కం|| యోగాభ్యాసము చేయగ
    యోగా గురువను ఒకని నయోగ్యుని చేరన్
    భోగానురక్తుడగు నా
    యోగికి బంట్రోతు భార్య యోగము నేర్పెన్

నాలుగవ పూరణ- గోలి హనుమఛ్ఛాస్త్రి గుంటూరు
క్రికెట్టు మ్యాచ్ లొ చివరి బంతికి ఒక ఆట గాని పరిస్థితి.  
ఆ.వె|| గెలుపు ఓటములకు మలుపు ఈ బంతియే!
పరుగు ఒకటి వలయు బంతి ఒకటె!
ఫాస్టు బాలు వేయ, భయము లేదని! కొట్టి
వెన్ను చూప కుండ రన్ను దీసె.

కం.|| బంట్రోతు భార్య యోగము
     కంట్రీ ఎన్నికలలోన ఘనముగ మారెన్,
     సెంట్రల్ ఎంపీ అవగా
     ఎంట్రీ లో మంత్రి పదవి ఎదురై రాగా.

ఐదవ పూరణ- రఘునాథ్ దెందుకూరి, శాన్ హోసే.,
కం.|| కంట్రోల్లో ఫ్యాంలీ యన
స్యాంట్రోకారులును ఇంట్లొ యా ఏసీలే
బంట్రోతు భార్య యోగము
కాంట్రోవెర్సీలు లేని ఘాటౌ లైఫే !!

ఆరవ పూరణ- యం.వి.సి. రావు, బెంగళూరు
కం.|| కంట్రోలుండెడి రోజుల
పెట్రోలమ్ముచును మిగుల పెన్నిధి కూడన్
బంట్రోతు భార్య యోగము
కుట్రను పెంపొంద చేసె కొందరి మదిలో!

ఆ.వె|| భరత ఖండమందు బహు కీర్తి కెక్కిన
సవ్యసాచి ఒహొ! సచిను డనగ
ఆట ఆట యందు అతినేర్పు జూపుచు
వెన్ను చూప కుండ రన్ను తీసె

ఏడవ పూరణ- రాజేశ్వరి నేదునూరి
ఆ.వె.|| కన్న మేయగోరి గజ దొంగ గంగన్న
కటిక కాళ రాత్రి కలిగి నింట
గేటు లోన మెన్ను గన్నుచూపి నంత
వెన్ను చూప కుండ రన్ను తీసే !

కవిత.|| బంట్రోతు భార్య యోగము
కంట్రోలు దప్పె గనుక కలకల మెరయన్ !
ఇంట్లో అందరి ముంగిట వా
కిట్లో వశము దప్పి కులికి కౌగిట చేర్చేన్ !

ఎనిమిదవ పూరణ- రావు తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియా
ఒక మామగారి (బంట్రోతు తండ్రి ) వ్యధ ఇలా ఉందిట
కం.|| ఓంట్రింపు యని తలపకు కో
డంట్రికమునకొచ్చి నీవు! డబ్బది యెంతే?
బంట్రోతుభార్య యోగమ
నింట్రపడుట యేల? మగడె ఎక్కువ పడతీ!

(దుష్కరప్రాస కాబట్టి దుష్కరమైన పదాలు వాడవలసి వచ్చింది
ఓంట్రింపు = అసహాయుడైన (ఒంటరి) బంటు
కోడంట్రికము= కోడలు+రికము=కోడరికము
ఇంట్రపడు= సంకటపడు)

ఆ.వె.|| దయ్యములకు పాదద్వయము వెనుతిరుగి
యుండ, వెన్ను ముందునుండు రన్ను
తీయునపుడు! యటుల తెక్కలినందున
వెన్నుచూపకుండ రన్నుతీసె!

తొమ్మిదవ పూరణ- జె.బి. వి .లక్ష్మి
కవిత: అమ్మ నాన్న లేమో ఉద్యోగస్తు లైరి 
వారి మధ్యకు  ఓ బుజ్జి పాపాయి  వచ్చె
వాని రక్షణ ప్రశ్నార్ధక  మాయే 
అమ్మమ్మ నానమ్మ వంతులు  ముగిసి పోయే 
క్రచ్ లు, బేబి సిట్టింగ్ లు 
సమస్యని తీర్చగ లేవు 
ఉద్యోగానికి ఉద్వాసన పలుకుద మన్న
తెలియని రేపు ఎదను  కలవర పరిచే   
ఏమి చేతురా లింగా యని 
వగచు చున్న సమయాన
స్నేహితుని లేఖ వాన జల్లైకురిసే 
 డాలర్ల మహత్యమో,
అమెరికాఆకర్షణయో 
తెలియదు గాని 
ఆఫీసు బంట్రోతు అనుమతి తెలిపే
పాసుపోర్టు ప్రాబ్లెమ్స్ తో  ఆ
బంట్రోతు భార్య యోగము మా రి 
యెన్ .ఆర్. ఐ. అత్త అయ్యే    
  
వెన్ను చూపక రన్ను తీసే
------------------------------------
వలచి వచ్చెన్ శూర్పణఖ
ముక్కు ,చెవులు కోసి వేసె సౌమిత్రి
రక్స్త సిక్త మైన ముఖముతో
అన్నా యని రంకెలు వేయుచు
లంకేశ్వరుని చెంతకు
వెన్ను చూప కుండ రన్ను తీసే  

పాఠకులనుంచీ మరిన్ని పద్యాలు

గండికోట విశ్వనాధం, హైదరాబాద్
   ఉ.||  శ్రీకరమై, సుభాషిత విశిష్ట జనావళి ప్రీతి పాత్రమై
          వేకరణిన్ ధరన్  సరస విస్తృత చిత్ర విచిత్ర శీర్షికా
          నేక అలంకృతా కృతిని యీ ' ఖర 'వత్సర ఉత్సవ ద్యుతిన్
          ప్రాకట స్ఫూర్తియౌ ' సుజన రంజని ' నిత్య నవీన దీప్తులన్.
 
   శా.||  ఏ దేశంబు నివాసమైన , యెచటన్ యే భాష సంభాషణల్
           నాదంబై  ప్రతి నిత్యమున్ వినిన జన్మంబైన మాతృ స్ధలిన్
           ఆ దేశంబును, సంస్కృతిన్, మధురమౌ ఆ భాష సాహిత్యమున్
            ఏదైనన్ మది గౌరవించెదరు, తెల్విన్ తెల్గు వారెల్లడన్     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech