తెలుగు ‘బుడుగు’ ముళ్ళపూడి వెంకటరమణ

 

                                                                                                 - తణికెళ్ళ విశ్వనాథం
 

   

ముళ్ళపూడి వారి పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ఆయన సృష్టించిన చిచ్చర పిడుగు, రెండు జడల సీత, జ్ఞానప్రసూనాంబ, కోతికొమ్మచ్చి, రాంబాబు, అమ్యామ్యాం మరియు మూగమనసులు, పెళ్ళిపుస్తకం, సాక్షి, ఇలా ఎన్నో సినిమాలు, అందులోని విలక్షణ పాత్రలు, అచ్చ తెలుగుదనం, హాస్యంతో కూడిన వ్యంగ్యాస్త్రాలు, తెలుగు ప్రజల మదిని దోచి అందరి హృదయాల్లో విశిష్టస్థానం సంపాదించిన మహోన్నత వ్యక్తి ముళ్ళపూడి వెంకటరమణ గారు. అందరికీ పరిచయ పదం ‘బాపు రమణ’. అది ముళ్ళపూతెలుగువారి ముద్దుపేర్లు. అత్యంత ఆత్మీయ స్నేహానికి నిర్వచనం ‘బాపు రమణ’ల ద్వయం. బాపూ అంటే ‘సత్తిరాజు లక్ష్మీనారాయణ’ రమణ అంటే ‘ముళ్ళపూడి వెంకట్రావ్’. తదుపరి స్కూల్ రిజిస్టర్ లో వెంకటరమణ అయ్యింది. ఒకరు తన కలంతో స్వఛ్ఛమైన పదహారణాల తెలుగు పాత్రలను సృష్టిస్తే, మరొకరు తన బంగారు కుంచెలో ఆ పాత్రలకు జీవం పోశారు. వారి ద్వయం విడదీయరానిది. ఆ అనుబంధంతోనే ఇద్దరూ ఒకే ఇంట్లో కలసి ఉన్నారు. కాని విధి విచిత్రమైనది. తెలుగు భాషకు కొత్త వరవడి నేర్పిన ముళ్ళపూడి ఇక మనకు లేరు. 23 ఫిబ్రవరి, 2011 న రాత్రి ఆప్త మిత్రుడు బాపూని, అభిమానుల్ని అందరినీ వదలి స్వర్గథామం చేరారు.

డి వెంకటరమణ 28 జూన్ 1931 న తూర్పుగోదావరి జిల్లా గోదావరి వడ్డున ఉన్న ధవళేశ్వరంలో జన్మించారు. ఒడుదుడుకులు లేకుండా సాగిపోతున్న ఆ చిన్న కుటుంబంలో తండ్రి హఠాన్మరణంతో ఇబ్బందులు మొదలయ్యాయి. తల్లి ఆదిలక్ష్మమ్మ తమ మకామును మద్రాస్ (చెన్నై)కు మార్చి తన కష్టంతో పిల్లలను పెంచి పెద్దవారిని చేసారు. 1945లో రమణ తొలిరచన ‘అమ్మ మాట వినకపోతే’ అప్పటి పిల్లల పత్రిక ‘బాల’లో ప్రచురితమైనది. తదుపరి రేడియో అన్నయ్య ఏడిద నాగేశ్వరరావు గారు కూడా మెచ్చుకుని ప్రోత్సహించారు. అప్పటికే తన సహ విద్యార్ధి, స్నేహితుడు, ఆప్తుడు అయిన బాపూ గారు తన కవితకు బొమ్మలు వేసేవారు. ఇది ఆ మిత్ర ద్వయానికి నాంది. ఆపై సాగినదంతా ఇద్దరూ కలిసే.

1953 సం||వెంకట రమణ ఆంధ్ర పత్రికలో చేరి సినిమా వార్తలకు రిపోర్టరుగా పనిచేశారు. ఆ సమయంలో తెలుగు భాషకు సేవలందించిన నండూరి రామమోహన రావు గారు, పిలక గణపతి శాస్త్రిగారు, సూరంపూడి సీతారాంగారు కూడా అదే పత్రికలో పనిచేయడం, వారితో సన్నిహిత సంబంధాలు పెంపొంది, ముళ్ళపూడిలో ఉన్న సహజ కవిత్వం బయటకొచ్చింది. ఇక వెనుతిరగలేదు. ఆయన సినీ వార్తలకు పనిచేస్తున్నందున, ప్రముఖ సినీ తారలతోనూ, నిర్మాతలతోను పరిచయాలు ఏర్పడ్డాయి. జర్నలిస్ట్ గా మొదలైన జీవితం, సినీ రంగంలో ‘దాగుడుమూతలు’ తొలుత సినిమాకు కథ రాయడం ద్వారా తెలుగు ప్రేక్షకులు మన్ననలందుకున్నారు. అన్నిటికీ బాపూగారు లేకుండా, ఏదీ జరగలేదు. వారిద్దరూ కలసి వ్యాపార దృష్టితోకాక, సామాజిక దృక్పథంతోనే సినిమాలు తీసారు. రమణ ‘మాటగా’ బాపూ ‘గీతగా’ తీసిన సినిమాలు తెలుగు ప్రజలకు తాయిలాలయ్యాయి. రమణ కలం, బాపూ కుంచె కలసి తీసిన సినిమాలు ముత్యాల ముగ్గు, పెళ్ళిపుస్తకం, మూగ మనసులు, రాథాగోపాళం, మిస్టర్ పెళ్ళాం, సంపూర్ణ రామాయణం..ఇలా ఎన్నో వారివురిలో ఉన్న ప్రజ్ఞా పాటవాలకు మచ్చు తునకలు ఇవే కాక రక్తసంబంధం, బుద్ధిమంతుడు, అందాలరాముడు, సాక్షి మొదలగు ప్రాచుర్యం పొందిన సినిమాలలో, తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్రలను సృ
ష్టించి, అచ్చమైన తెలుగు కవిగా ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసారు.

అన్ని రసాలలోకి హాస్యరసానందాన్ని పండించి, పంచడం అంత సులభతరంకాదు. అది జన్మతః రావాలి. దానిని వర ప్రసాదంగా పొందిన కవి ముళ్ళపూడి వెంకటరమణ గారు. వారి అల్లరి చిచ్చర పిడుగు ‘బుడుగు’, ముత్యాలముగ్గులో‘కంట్రాక్టర్’, మిస్టర్ పెళ్ళాంలో ‘తుత్తి’, అందాలరాముడు లో ‘తీసేసిన తహసీల్దారు - తీ.తా’ ..ఇలా ఎన్నో ఎన్నెన్నో విలక్షణ పాత్రలు సృష్టించి గిలిగింతలు పెట్టి అందరినీ ఆకట్టుకున్న అపర బ్రహ్మ ముళ్ళపూడి వెంకటరమణ. వినోద భరితమైన వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో ఆయన కాయనే సాటి. తెలుగు వారు గర్వపడేలా రచనలు సాగించిన ఆయనకు, బాపూగారికి ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారం’, రాజ్యలక్ష్మి సాహిత్య ఫౌండేషన్ వారు అవార్డిచ్చి గౌరవించారు. అయినా ఆ మిత్ర ద్వయానికి పద్మశ్రీ రాలేదని నొచ్చుకున్న అభిమానులు ఎందరో. తాజాగా ఆయన కలం నుండి వెలువడి బాపు దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణతో ‘శ్రీరామరాజ్యం’ సినిమా రూపుదిద్దుకుంటున్న తరుణంలో ఆయన పరమపదించటం. ఎంతో బాధాకరమైన విషయం. ఆ ప్రజ్ఞాశాలికి, సినీరంగమేగాక, ఎందరో పెద్దలు అభిమానులంతా జోహారు పలుకుతూ అశ్రుతర్పణం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech