జ్యోతిష్యులు - డా. పిడపర్తి సుబ్రహ్మణ్యం.

బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో ఆచార్య(MA) మరియు చక్రవర్తి(Ph.D) పట్టాలను పొంది రాష్ట్రీయ సంస్కృత సంస్థానంలో జ్యోతిష్య శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.               జ్యొతిష్య శాస్త్ర సంబంధిత అధ్యయనంలో విశేషమైన కృషిని, సేవలను అందిస్తున్న డా. పిడపర్తి సుబ్రహ్మణ్యంగారిని సుజనరంజని పాఠకులకు పరిచయం చేయడానికి గర్విస్తున్నాము..

  

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

తాపము, సంతాపము, అనర్థవ్యయము మరియు నేత్రపీడ మేషరాశివారికి ఈ మాసపు పూర్వార్థములో సుఖలేమిని సూచిస్తున్నవి. కార్యములు పూర్తి అయ్యే అవకాశములు తక్కువ. కార్యస్థానమునందు అస్థిరత మరియు అధికారులతో వివాదములు ఇబ్బందులకు కారణములు కాగలవు. ఉత్తరార్థములో పెద్ద మార్పులు లేవు.  ఉద్వేగములకు, పరువునష్టమునకు మరియు మోసగింపబడుటకు ఉత్తరార్థము అనుకూలమైన మాసము కావున ఈ సమయములో అతి జాగ్రత్తగా వ్వవహరించవలసిన అవసరమున్నది.

 

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

పూర్వార్థము ఈ రాశివారికి పూర్తిగా అనుకూలముగ కనబడుతున్నది. వివిధమార్గములయందు లేక వివిధప్రయత్నములద్వారా ధనము ప్రాప్తించు అవకాశమున్నది. అధికారుల అనుకూలత అధికముగా కనబడుతున్నది. కార్యములు అనుకూలముగ పూర్తవగలవు. ఈ సమయమును కార్యసంపాదనయందు మరియు ఆధికారిక లావాదేవీలను నెరవేర్చుకొనుటకు ఉపయోగించుకున్న శ్రేయస్కరము. ఉత్తరార్థమునందు అనుకూలత కొంతవరకు తగ్గగలదు. కావున ఆధికారికములు మరియు ప్రభుత్వజోక్యమున్న కార్యములను పూర్వార్థములో పూర్తి చేసుకోవాలి.

 

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు)

 

 

ఈ రాశివారికి ఈ మాసమంతయూ అనుకూలముగా ఉండగలదు. గత కొద్దికాలముగ మానసికముగ మరియు శారీరకముగ నడచుచున్న ప్రతికూలత ఈ మాసమునందునూ కనిపించుచున్ననూ పూర్వార్థములో ప్రత్యేకించి రవి కుజుల అనుకూలత కారణముగ వీరు అనుకూల ఫలితములను పొందగలరు. ఆరోగ్యపరముగ కూడ పూర్వార్థము మెరుగైన సమయము. ఉత్తరార్థము కార్యసాధనకు మరియు ధనసంగ్రహమునకు అనువైన కాలము కావున ఈ రాశివారు ఈ మాసమునందున్న అనుకూలతను పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నించుకోవాలి.
 

ర్కాటక రాశి

పునర్వసు (4 పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు)

 

 

          ధనసంబంధమైన వ్యవహారములు అర్థాంతరముగ ఆగిపోవు అవకాశములు ఎక్కువ. ఉత్సాహము తగ్గి దీనత్వము పెరుగగలదు. పరాభవములకు కూడ అవకాశము ఎక్కువగా ఉండుటచే ఉద్రేకమునకు లోనుకారాదు. కానీ ఉత్తరార్థమునందు పరిస్థితులయందు పూర్తిగా కాకపోయిననూ కొంతవరకూ అనుకూలత ఏర్పడగలదు. ఉత్తరార్థములో ఆగిన పనులను తిరిగి ప్రారంభించుకోగలరు. నిర్ణయాధికారము కన్న నిర్ణయములను అమలు చేసే  పెసులుబాటు మరియు శక్తి ఈ సమయములో పూర్తిగా  పెరుగగలవు. ఇది ఈ రాశివారికి ఊరట కలిగించే విషయము.

 

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1 పాదం)

 

ఈ మాసమంతయూ ఈ రాశివారికి పూర్తి ప్రతికూలముగా ఉండు అవకాశములు ఎక్కువగా ఉన్నవి. ఏ విధముగ చూసిననూ అనుకూలతకు అవకాశములు కనిపించుట లేదు. ఆరోగ్యపరములైన ఇబ్బందులు మరియు భయము వీరిని అస్థిరులను చేయు అవకాశము కనిపిస్తున్నది. భయము వీరిని ఆవహించుటచే కార్యమునందు మనోబలము క్షీణించుట మరియు పనులను ప్రారంభించుటయందు జంకుట చాలా సహజముగ కనిపిస్తున్నది. ఈ రాశివారు అనుకూలమైన సమయముకై వేచిచూడవలెను.

 

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

 

భార్యావిరోధము మరియు ఉదరసంబంధమైన రోగము ఈ రాశివారిని పూర్వార్థములో ఇబ్బంది పెట్టు అవకాశములు ఉన్నవి. కావున ఈ రాశివారు ఈ మాసమునందు భార్యతో వాగ్యుద్ధమునకు దిగరాదు. అదే విధముగ ఈ రాశికి చెందిన ఆడువారు జీవితభాగస్వామితో కలహములకు దిగరాదు. ఈ సమయములో సంయమనము పాటించుట వలన ఈ రాశివారు దీర్ఘకాలిక నష్టములను నివారించుకొనగలరు. ఉత్తరార్థములో ఉదరసంబంధములైన ఇబ్బందులు సమసిననూ అనారోగ్యము వీరిని ప్రస్తుతమునకు వీడు అవకాశములేదు.

 

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు)

 

      

ఈ రాశివారికి ఈ మాసము పూర్తిగా అనుకూలముగా ఉన్నది. కావున ఈ రాశివారు ఈ సమయమునందు అన్ని విధములైన కార్యములను చక్కబెట్టుకొనుటకు, వివిధరంగములయందు నూతన ప్రయత్నములు చేయుటకు, కోర్టు వాజ్యములు మరియు వివాదములను అనుకూలముగా మార్చుకొనుటకు ప్రయత్నించుకోవాలి. ఉత్తరార్థములో ఉదరసంబంధమైన ఇబ్బందులు పనులకు అడ్డంకులు కాగలవు కావున భోజనాది విషయములందు జాగ్రత్త అవసరము.

 

వృశ్చికరాశి

విశాఖ (4 పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

 

మానసికముగ ఒత్తిడులను ఎదుర్కొనే సమయమిది. శారీరకముగ మరియ మానసికముగ వీరికి విశ్రాంతి చాలా అవసరము. ఉద్వేగము, నిర్ణయములను తీసుకొనలేకపోవడము వీరికి ఇబ్బందికరముగా మారు అంశము. ఈ సమయములో కొత్తనిర్ణయములను తీసుకోవడము మంచిది కాదు. సుఖమును పొందుటకు, సరియైన నిర్ణయములను తీసుకొనుటకు ఈ రాశివారు ఉత్తరార్ధమువరకూ వేచి ఉండాలి. ఉత్తరార్థము పూర్తిగా  అనుకూలముగా లేకపోయిననూ పూర్వార్థముకన్నా పరిస్థితులు మెరుగుగా ఉండగలవు.

 

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1 పాదం)

       

          ఈ రాశివారు ఈ మాసమునందు కాలానుగుణముగ వ్యవహరించుకోవాలి. వీరికి ఏ విధములయిన అనుకూలపరిస్థితులు కనిపించుటలేదు. కావున ఏ విషయమునందున పరిస్థితులకు వ్యతిరేకముగ వ్యవహరించుట వీరికి శ్రేయస్కరము కాదు. మంచి సమయము కొరకు వేచి చూడాలి. లావాదేవీలు మరియు కొత్త నిర్ణయములు నష్టములను ప్రసాదించగలవు.

 

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

 

          ఈ రాశివారికి ఈ మాసము నందు ప్రతికూలత చాలా తక్కువ. వీరు ఈ సమయమునందు కార్యములను పూర్తిచేసుకొను స్థితిలో ఉన్నారు. వీరికి ఏ రంగమునందున అడ్డుపడువారు ఈ సమయములో లేరు. కావున వీరు అనుకూలములు మరియు ఉపయోగములు అయిన కార్యములను ఈ సమయములో నెరవేర్చుకోడానికి ప్రయత్నించాలి. అన్నిరంగములు అనుకూలముగా ఉండుటచే సమయమునకు తగు నిర్ణయములు తీసుకుని వానిని అమలు చేయడానికి ప్రయత్నించాలి.

 

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

 

          ఈ రాశివారికి ఈ సమయము మిశ్రమముగా ఉన్నది. ఈ సమయములో ప్రభుత్వపరమైన ఇబ్బందులు, కలహములకారణముగ ఇబ్బందులు, శతృత్వమువలన మరియు అనారోగ్యకారణముగ ఇబ్బందులు వీరిని ఇరకాటములో పెట్టగలవు. మౌనము ఉత్తమమైన పరిష్కారమార్గము. అధికముగ మౌనమును వహించడము మరియు సాధ్యమయినంతవరకు సొంతముగ ఏ వ్యవహారమునందునా జోక్యము చేసుకొనకుండుట వీరికి శుభఫలములను ఇవ్వగలవు.

 

 

మీనరాశి

పూర్వాభాద్ర (4 పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

 

ఉపద్రవములు ఈ రాశివారిని వీడటం లేదు.  ఆ కారణముగ పరిస్థితులు చాలా వరకు ఉద్రిక్తముగను మరియు అసంతృప్తికరముగను సాగుతున్నవి. పలుకుబడి తగ్గు అవకాశమున్నది. వీరి చేష్టలకారణముగ ఆప్తులు కూడ ఈ సమయములో దూరముగ మసలుకును అవకాశములున్నవి. సాధ్యమయినంతవరకు ఏకాంతమును కోరుకోవాలి. కానీ ఏకాంతములోకూడ అదుపులేని ఆలోచనలు వీరిని మానసికముగ ఇబ్బందిపెట్టగలవు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech