మా నాన్నగారు మాకందరికీ ఆదర్శం

                                                 - కలపటపు రమేష్, డల్లాస్, అమెరికా
 

నిర్వహణ : దుర్గ డింగరి

 

ప్రియమైన సుజనరంజని పాఠకుల్లారా,

'అమ్మకు, బ్రహ్మకు నిచ్చెన నాన్న అంటారు. నాన్నలు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో, ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారు. చిన్నప్పటి నుండి నాన్న వీపు పై ఎక్కి ఆడుకున్న రోజుల నుండి మీరు చిన్నారి పాపలను ఎత్తుకునే వరకు ఎన్నెన్నో ఙ్ఞాపకాల దొంతరలు. అవన్నీ మా అందరితో పంచుకోవడానికి సుజనరంజని ' మా నాన్నకు జేజేలు,' శీర్షిక ద్వారా మీకు మంచి అవకాశమిస్తుంది.

నెం.వన్ తెలుగు వెబ్ మాస పత్రికలో మీ నాన్నగారి గురించి ప్రచురిస్తే ఎంత మంది చదువుతారో, స్ఫూర్తిని పొందుతారో ఆలోచించండి.

ఇంకా ఆలస్యమెందుకు? కలం, కాగితం తీసుకుని రాసి కానీ లేదా లాప్ టాప్, కంప్యూటర్లు వున్న వారు టక టకా టైపు చేసి కానీ సుజనరంజనికి పంపించేయండి ఇక!

దుర్గ డింగరి!

 
  మా నాన్నగారి పేరు కలపటపు కృష్ణారావుగారు, 1924 సం.లో, 28 జులైన, కృష్ణాష్టమి నాడు మచిలీపట్నంలో జన్మించారు. ఆయన చదువుకుంటూ పెరిగింది కూడా మచిలీపట్నంలోనే. మా అమ్మగారి పేరు సీతామహాలక్ష్మి, 1930 సం.లో నవంబర్ 2 న జన్మించారు.


మా నాన్నగారు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళలో పెద్ద అన్నయ్యగా జన్మించారు. 18 ఏళ్ళ వయసుకే వుద్యోగం చెయ్యాల్సి వచ్చింది. ఇద్దరు తమ్ముళ్ళ, ఇద్దరు చెళ్ళెళ్ళ చదువు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా మా నాన్నగారి చెతుల మీదుగానే జరిగాయి. ఆయనే పెద్దవారు కావటంతో మా బంధువులు అందరూ కూడా మా నాన్నగారంటే గౌరవంగా ఉండేవారు.

మేము నలుగురు అన్నదమ్ములం, నలుగురు అక్క చెళ్ళెళ్ళు మొత్తం ఎనమండుగురం. నేను ఏడవ సంతానంగా జన్మించాను మా కుటుంబంలో. మా నాన్నగారు ప్రతీ పండుగకీ అందరు పిల్లలకీ బట్టలు తప్పనిసరిగా కొనేవారు. మమ్మల్ని ఇంట్లో చాలా క్రమశిక్షణతో పెంచారు.

ఉదయం 6:30 కల్లా అందరి స్నానాలు అయిపోవాలి. ఇక సాయంత్రము 6:30 కల్లా అందరు పిల్లలూ ఇంటికి వచ్చెయ్యాలి. అందరూ కలిసే భోజనం చేయాలి. ఏడు గంటల తరవాత వంటగది తలుపులు మూత పడిపోవాల్సిందే. ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకూ అందరూ చదువుకుని తప్పని సరిగా చదువుకుని పడుకోవాలి. తొమ్మిది గంటలకు ఆయన ఆలిండియా రేడియోలో ఇంగ్లీషు వార్తలు వినేవారు. ఆ వార్తలు అయిపోయే వరకల్లా ఇంట్లో లైట్లు ఆర్పేసి పడుకోవాల్సిందే. పిల్లల ఎవరికైనా పరీక్షలు వుంటే పొద్దున్నే లేచి చదువుకోవాల్సిందే కాని రాత్రి పూట ఎక్కువ సేపు మేలుకోనిచ్చేవారు కాదు.

వినాయక చవితికి అయితే అందరం కలిసి పూజ చేయవలసిందే. శివరాత్రి నాడు అయితే అందరం వుపవాసం వుండి రాత్రంతా శివుని భజన చేస్తూ జాగారం చేసేవాళ్ళం. ఈవిధంగా మాకు క్రమశిక్షణ, దైవ భక్తి నేర్పించారు. ఎండాకాలం సెలవులు వస్తే పిల్లలందరి చేతా రామాయణం అన్ని కాండలు చదివించేవారు. తప్పని సరిగా ఇంట్లో అందరూ క్యారంస్, తొమ్మిది గళ్ళాట, పులి-మేక, దాడి, పచ్చీసు, చదరంగం ఆటలు ఆడించేవారు.
ఇంక పిల్లలందరికీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలు తను ప్రత్యేకంగా ఇంట్లో పేపరు తయారు చేసి రాయించే వారు.

నా ఎరుకలో ఇద్దరు అక్కయ్యల పెళ్ళిళ్ళు చూశాను. ఎంత పకడ్బందీగా ప్లాన్ చెసే వాళ్ళంటే, ఒక్క వస్తువు కూడా అరువు తేచ్చేవాళ్ళు కాదు. ప్రతీ ఖర్చుకీ ఆయన డబ్బులు చెల్లించి మాత్రమే వస్తువులు తెప్పించేవారు. ఆయన వేసుకున్న బడ్జెట్ కి మించి పైసా కూడా ఖర్చు అయ్యేది కాదు. మాకు తెలిసి ఆయన అప్పు చేసేవాళ్ళు కాదు. అరువు సొమ్ము బరువు చేటు అనేవారు. మా నాన్నగారు ఆధ్యాత్మిక పుస్తకాలు బాగా చదెవేవారు. ప్రతీ సంవత్సరం తప్పని సరిగా తిరుపతి వెళ్ళేవారు. పిల్లల స్నేహితుల విషయంలో కూడా చాలా స్ట్రిక్టుగా వుండేవారు.

నేను మా నాన్నగారు ఉన్నప్పుడే ఉద్యోగంలో జాయినయ్యాను. నా మొదటి జీతం మా నాన్నగారికే ఇచ్చాను. తను మాత్రం తీసుకోకపోగా జాగ్రత్తగా దాచుకోమని చెప్పారు. డబ్బు పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. అందుకేనేమో మమ్మల్ని ఆరో తరగతి నుండే బ్యాంకుకు పంపించి కొన్ని పనులు మాచేత చేయించేవారు. ఆయన వెళ్ళలేక కాదు, మాకు డబ్బు విషయాలు తెలియాలి అని.


 

మా నాన్నగారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో, డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ గా ఉద్యోగం చేసారు. వృత్తిరిత్యా ప్రతీ రెండు సంవత్సరాలకీ ట్రాన్స్ఫర్ అవుతూ వుండేది. అప్పుడు కూడా పిల్లల అందరి స్కూళ్ళకి వెళ్ళి ట్రాన్స్ఫెర్ సర్టిఫికెట్ (టి.సి) ఆయనే స్వయంగా తీసుకుని మళ్ళీ కొత్త వూర్లో మమ్మల్ని జేర్పించేవారు.ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకడం నేర్చుకోవాలి అనేవారు. వృత్తిరీత్యా వివిధ ప్రదేశాలు తిరిగినా తరవాత మా కుటుంబంతో గుంటూర్లోనే సెటిల్ అయ్యాము.

మా నాన్నగారికి డైరీ వ్రాసే అలవాటు వుండేది. అలా ప్రతీ సంవత్సరం వాటిని కాపాడుతూ వచ్చారు. అదీకాక ఆయన డైరీలలో ఒక చోట మా కుటుంబమంతటి పుట్టు పూర్వోత్తరాలు అన్నీ వ్రాసి వుండటం వలన దాదాపు మూడు తరాల వాళ్ళ పేర్లు, గోత్రనామాలు మాకు తెలిశాయి. మాకిచ్చిన స్ఫూర్తితో, మమ్మల్ని పెంచిన తీరులోనే మా పిల్లలను పెంచుతున్నాము నాన్నగారు మాకు నేర్పించిన జీవిత పాఠాలనే మా పిల్లలకు నేర్పిస్తున్నాము. మా నాన్నగారు మా అందరికీ తప్పకుండా ఒక రోల్ మోడల్ అని ఘంటాపధంగా చెప్పగలను.

ఆయనకి పిల్లలుగా పుట్టటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక ఆదర్శవంతమైన తండ్రిగా ఆయన జీవించారు. మా అక్కయ్యలు అన్నయ్యలు మా అందరి సంతానం కలిపి మా అమ్మా, నాన్నలకు 10 మంది మనవలు, 9 మంది మనవరాళ్ళు.


మా నాన్నగారు 1982 సం.లో ఏప్రిల్, 21 న, 58 ఏళ్ళకే మమ్మల్నీ, ఈ లోకాన్నివదిలేసి వెళ్ళిపోయారు. ఆయన బౌతిక శరీరాన్ని విడిచి ఇప్పటికి 28 సంవత్సరాలు అయింది కానీ ఆయనతో గడిపిన మధురమైన ఙ్ఞాపకాలు, ఆయన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మా హృదయాల్లో జీవించే వుంటాయి. మా అమ్మగారు 2002 సం.లో ఏప్రిల్, 27 న స్వర్గస్థులయ్యారు. మా నాన్నగారు పోయిన ఏప్రిల్ నెలలోనే అమ్మగారు కూడా పోయారు.
మాకు మా నాన్నగారిని ఈ పత్రికా ముఖంగా గుర్తు చేసుకోవటానికి అవకాశం ఇచ్చిన సుజనరంజని పత్రిక యాజమాన్యానికి ధన్యవాదములు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech