ఆకుపచ్చని చరిత్ర ఇది

                                                                 - శైలజామిత్ర

  గాలి లేక, వెలుతురు లేక 
తట్టుకోలేక గడ్డకట్టిపోయావా 
ఓ. ఆకుపచ్చని ఉగాదీ?
ధైర్యం చేసి బయటకు రా!
ఎన్నో ఘోరాలు దిగమింగిన మదితో 
మంచుబోమ్మలా ఉండిపోయావా?
బతుకులు చిరుగులు పట్టిన బొంతల్లా ఉన్నాయని 
రంగులన్నీ ఎరుపునే నమ్ముకున్నాయని..
కఠిన శిలా పర్వతాల్ని సైతం సముద్రం మింగజూస్తోందని 
కుబేర పట్టణంలో కుచేల సంతానం పెరిగిపోతోందని 
పాతపడిన గదిలోనే కూర్చొని గడచిపోయిన 
నీ వైభావాల్ని తలుచుకుంటున్నావా?
పర్వాలేదు బయటకు రా! 
పంచే శక్తికే వంగుతుంది విల్లు.. 
ఆదరించే తత్వానికే ఆదమరుస్తుంది ప్రతి ఇల్లు..
ఏ రూప౦ లో అయినా పర్లేదు..
చీకటీ, దారిద్ర్యం ఒకవైపు, 
అజ్ఞానం, ఇరుకుతనం మరో వైపు ఎన్ని ఉన్నా 
వసంత సూర్యుని తోడు తెచ్చుకుని 
నీ కాళ్ళపై నీవు నిలబడు! 
నీకున్న ఆలోచనా రెక్కలపై నీవెగురు..!
ప్రకృతి చల్లపడితే చాలు.. కుహూ కుహూ అంటూ 
పాడుతున్న కోయిల పాట నుండి 
మొదలయిన శాంతి స్వరం ఎగసి ఎగసి 
ఏకంగా ఆధునికంపైనే ఆత్మశిఖరమై నిలిచే 
శక్తి ఉన్న నీవు స్వప్న జగత్తును చెరిపేసి 
వర్తమాన చందనమై మెరిసి ముందుకు కదులు..
కనబడుతున్నవన్నీ శూన్య నయనాలని అనుకోకు 
కాలగతిని మార్చే వసంతరాగ జీవధుని 
మొదట మౌనంగానే ఉంటుందని మరచిపోకు. !
అందుకే ఆర్ద్రమై రా! సుజన బింబమై నడిచి దరికి చేరు!
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా 
ఎన్నిమార్లు పుట్టాడో, ఎన్నిసార్లు పోయాడో  జ్ఞాపకం ఉండదు. 
ఎన్నిసార్లు మనిషిగా బతికున్నాడో  అసలే గుర్తు ఉండదు. 
మనిషికి ఉన్న  ఏకైక నవనవోన్మేష శక్తివి నీవే 
చెట్టు చెట్టుకు మధ్య ఆకుపచ్చని నీ ఉనికి చేరిందని అందరికి తెలుసు 
ఇక మనిషి మనిషికి  మధ్య  ఉగాది ఉదార స్వభావం ఉందని
సమాజానికి తెలియాలంతే....!
అశాంతికి, ఆవేదనకీ మధ్య 
నువ్వు రాలేక పోతున్నవని ఎవ్వరికి తెలియదు? 
బతుకు మందు పాత్రల్లో మృత్యు హేలే కాదు 
ముందు ముందు జీవన పాత్రల్లో  మూల బిందువు కూడా
నీకు ప్రకృతితో ఉన్న సంభంధం ఆత్మ అవతరించినప్పటిది..
మాటలో కొత్త చివురు, గుండెలో కొత్త రసంతో 
ఉగాది రావాల్సిందే సంవత్సరానికి ఒక్కసారైనా!
కొమ్మ కొమ్మకు పూచే వేప చిగురులా  
జీవిత పుట పుటకు, ఈ "ఖరనామం"
భీకరం సృస్టించకుండా  వత్సరమంతా "సుఖీభవ" నినాదంతో 
సెకన్లు, నిముషాలు, గంటలు గడచిపోవాలని 
చేదును, వగరును  సూచిస్తున్న 
సూర్య చంద్రుల ఆలోచనల కిపుడు 
ఉగాది ఒక జ్వాలా చిత్రంలా  కాకుండా  
చిరునవ్వుల సద్రుస్యమై నిరంతరం నిలిచి పోవాలని 
జీవన క్షణాల కొసల అంచుల సాక్షిగా  కోరుకుందాం!
ఎద ఎదకు తీగలా అల్లుకునే 
మానవతా సంకల్పమై ముందుకు సాగిపోదాం..!
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech