శ్రీకరమై, శుభకరమై

                                                                 - రమాకాంతరావు చాకలకొండ

 

పల్లవి.  శ్రీకరమై, శుభకరమై, శ్రీ ఖర వత్సరము,

సుఖ, సౌఖ్య, సంపదలు సమకూర్చుగాక!        ||శ్రీకరమై||

అనుపల్లవి.     శ్రీకరుడు, శ్రీధరుడు, శ్రీవేంకటేశ్వరుడు,

సకల సౌభాగ్యములు అందించు గాక!      ||శ్రీకరమై||

1.       ఇల్లిల్లు రంగు ముగ్గు, తోరణములతో,

కళలతో నిండి వాసిల్లు గాక!

ఉల్లముల చల్లగ సంతసము నిండి,

తెలుగు వారి దీప్తి భాసిల్లు గాక!               ||శ్రీకరమై||

 2.       ఆంధ్రావని నిండ  ఆనందము నిండి,

అందరు కలసి ఉండి పోదురు గాక!

అంధ భావముల కాల మేఘము తొలగి, ఫూర్ణ

చంద్రుడు ఎదల ఉదయించు గాక!              ||శ్రీకరమై||

 3.       కొందరికై అందరు, అందరికై కొందరు,

కొంతైన త్యాగము చేతురు గాక!

చింతలు తీరి, శాంతము పెరిగి,

అంతటా సౌఖ్యము వర్ధిల్లు గాక!                ||శ్రీకరమై||

 4.       నల్ల వాని భార్య, నలువ అర్ధాంగి,

వెల్లువగ సిరి, విద్య లిత్తుర గాక!

పిల్లల, పెద్దల - తల్లుల, తండ్రుల,

ఉల్లముల ఆశలు యీడేరు గాక!               ||శ్రీకరమై||

                     5.       నల్లని మబ్బులు ౘల్లగ కురిసి,

కొల్లలుగ పంటలు అందించు గాక!

నల్లని కన్నయ్య చల్లని చూపులు,

ఎల్ల లోకములకు ౘలువిచ్చు గాక!        ||శ్రీకరమై||

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech