కథా విహారం -  డా||విశ్వనాథరెడ్డి చూపు ‘బతుకు వెతల’ వైపు

                                           - విహారి

  తన సృష్టి తనదిగా గోచరింప జేయలేని ఏ రచయిత కూడా కావ్యనిర్మాత కాలేడు. అన్నారు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం. కథా నిర్మాతకూ అన్వయిస్తుందీ వాక్యం.

‘వానకురిస్తే’ కథ ద్వారా డా||కేతు విశ్వనాథ రెడ్డి రచయితగా తన సృష్టి తనదిగా నిరూపించుకున్నారు. సమకాలీన సామాజిక సమస్యని వస్తువుగా స్వీకరించి, అద్భుతమైన నిరాడంబరమైన శిల్పంతో గొప్ప కథని సృష్టించి పలువురి ప్రశంసల్ని పొందారు. రాయలసీమ ఆకాశంలో తిరిగే గొడ్డుమోతు మేఘాలు రైతునరాల్ని ఎంతగా పిండి గుండెని ఎంతగా మండించగలవో తొలిసారి తెలుగు కథలో గాఢంగా చూపించారు. సంవేదనాత్మకతనీ, ఆలోచనీయతని నింపి కథకొక పుష్టినీ, పరిపూర్ణ ప్రతిపత్తినీ సంతరింపచేశారు. ఈనాడు సీమ నుంచి ఎందరెందరో కథకులు కరువు తీవ్రతనీ, అనావృష్టి వెతల్నీ, సేద్యపు అవస్థల్నీ ఎంతో వాస్తవికతతో, ఆర్తితో, తమ ప్రాంతం పట్ల ఆరాధనాభావంతో రాస్తున్నారు. ఈ పరిణామానికి మూలం - సామాజిక వాస్తవికత అయినా, సాహిత్యమూలం మాత్రం ‘వానకురిస్తే’, కథగా బావిస్తాను నేను. కారణం - వస్తుగతంగానూ, శిల్పగతంగానూ ఆ కథలో ద్యోతకమైన రచనా నైపుణ్యం. ఒక తరహా కథలకి వొరవడి పెట్టిన కథగా ‘వానకురిస్తే’ కి ఆ ప్రత్యేకత ఉంది. సీమ కథకుల్లో అంతకుముందే సభా, మధురాంతకం, పులికంటి వంటి వారు తమదైన ముద్రతో తెలుగు సాహితీలోకానికి సుపరిచితులే..

క్రమేపీ కథకుడుగా డా||కేతు ఎన్నో కీర్తి శిఖరాల్ని అధిరోహించారు. ఈనాడు కథానిక మీద సాధికారికమైన ఏ అభిప్రాయానికైనా ఎందరో విమర్శకులు కూడా వారివైపు చూస్తున్నారు.

సాహిత్యానికే కేంద్ర బిందువైన ‘మనిషి’ డా||కేతు కథలకీ కేంద్రబిందువే. అయితే, అతడు సమాజపు పళ్ళచక్రంలో ఇరుక్కున్న సగటు మనిషి. సాధారణ మనిషి. అన్యాయాల్నీ, అక్రమాల్నీ మోస్తున్న మనిషి. బహిరంగంగా, అంతరంగంలో స్పందించే గుణం కలిగిన మనిషి. సమాజంలోని ఉత్థానపతనాల సంక్షోభాన్నీ, సంకటాన్నీ అనుభవిస్తున్న మనిషి. ‘జనం’ లోని మనిషి.

కథకుడుగా డా||కేతు లక్ష్యం - వారు 1975 లోనే రాసిన ‘మార్పు’ అనే కథలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

‘న్యాయం హరిజనులది. నిప్పు పెట్టించింది పెద్దరెడ్లు. నోట్లో మట్టికొట్టేది వాళ్ళే. ఈ అన్యాయం కథలో చెప్పాలి. రాయండి.. మీరు రాయగలరు.. అంటాడు ఒక పాత్ర రచయితతో.. రచయిత ఈ ప్రేరణతో, స్ఫూర్తితో, ఈ చోదకశక్తితో జనం ప్రదర్శనలో తానూ ఒక్కడై కలసిపోతాడు.

నిబద్ధత గురించి వేల పేజీల విమర్శ ఉంది మన సాహిత్యంలో.. కథా రచనపట్ల - ఇదిగో ఇది డా|| విశ్వనాథరెడ్డి గారి నిబద్ధత. రచయితలు జనంతో మమేకమై క్రియాశీలురు కాలేరా? అని ఇవాళ వొక ప్రశ్న తెరమీదకి వచ్చింది. ముఫ్ఫై ఏళ్ళ క్రితమే ఈ ఆవశ్యకతని పారదర్శకంగా చూపారు డా||కేతు.

డా||విశ్వనాథరెడ్డి కథల్లో - ‘జనం’ లోని మనుషులు మనలాగే ఉంటారు. వాళ్ళందరికీ మనలాగే చాలీచాలని ఆదాయాలుంటాయి. ఆర్ధిక బాధలుంటాయి. ఫలసాయం చేతికందని సేద్యపు కన్నీళ్ళుంటాయి. మిథ్యా గౌరవాలూ, అతిశయాలూ, డాంబికాలూ, భేషజాలూ వుంటాయి. అంతఃకరణలూ, అనురాగాలూ ఉంటాయి. ఆశనిరాశలుంటాయి. ఆనందవిషాదాలూ, అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి. సంఘటనలకీ, సంభవాలకీ స్పందించే హృదయాలుంటాయి. వాళ్ళ చర్యల్లో కృత్రిమత్వం ఉండదు.

ఈ మనుషుల కథలు నిఖార్సయిన మానవ చిత్తవృత్తి సంభావ్యత ఆధారంగా లేచి నేలమీద నిలబడతాయి. ఆయా మనుషుల ఆత్మఘోష వెనుక సమాజపు ‘రొద’ స్ఫుటంగా ధ్వనిస్తూ ఉంటుంది. ఆ కారణాన, కథాంశం సాధరణీకరణం చెంది సార్వజనీనతను సంతరించుకుంటుంది. పఠిత హృదయం మీద తన ముద్రని వేస్తుంది. కథానికా లక్షణమైన సమగ్రత చైతన్యవంతంగా భాసిస్తుంది. గతిశీలకమైన జీవితం యొక్క ఒక పార్వ్శం చదువరిలో ఆలోచనల్ని రేకెత్తింపజేస్తుంది.

పైన చెప్పిన అంశాలన్నీ ‘రెక్కలు’, ‘తేడా’, ‘కూలిన బురుజు’ వంటి కథల్లో ద్యోతకమవుతాయి. ‘రెక్కలు’ కథలో - తన కూతుళ్ళను ఇన్నాళ్ళూ కాపాడుతున్నవనుకుంటున్న తమ రెక్కలు ఎంత బలహీనమైనవో - మహిళా హోంగార్డు పంకజం పరిస్థితిలో తెలుసుకున్న ‘మనిషి’ ఉన్నాడు. భూమిచరిత్రా, భూమిపుత్రుల చరిత్రా పుర్తిగా అర్ధం చేసుకున్న దివాకర్ ‘తేడా’ కథలో కనిపిస్తాడు. శ్రమఖరీదు తెలుసుకుని సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీలతో కలిసిపోయిన వేరేమనిషి - అతడు. తండ్రికంటే, అన్నలకంటే భిన్నమైన మనిషి అతడు. ఫ్యాక్షన్ కలహాలు నేపథ్యంగా కల ‘కూలిన బురుజు’ కథలో సవాలక్ష సంకోచాలు, వింత భయాలూ, నిర్వేదం ముప్పిరిగొన్న మనుషులతో దినదినగండంగా బతికే పల్లెమనుషులు, అల్లుణ్ణీ కోల్పోయిన పెద్దనాన్నలు - మూర్తీభవత్ ధైన్యంగా - మనముందు నిల్చుంటారు.

ఒక మనిషి అంతఃకరణ, అంతస్తత్వం, మానవ నైజం యొక్క ధ్వని తరంగాలు, హ్యూమన్ ఫ్రెయిలిటీస్ చేసే సహజమైన గొణుగుడు, సణుగుడు...ఇవన్నీ ఆయాపాత్రల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయు. ఆయా దృశ్యాల్లో కథాపరిధి మీద తారాడుతూ ఉంటాయి.

కాగా, డా||విశ్వనాథరెడ్డిగారి కథల్లో ‘దూరం’ అని ఒక గొప్ప కథ ఉంది. గంటకు ఆరు రూపాయలు గిట్టుబాటయ్యే ప్రైవేట్ కాలేజీలో టెంపరరీ లెక్చరర్ కథ ఇది. ఇతడు హైదరాబాద్ లో ఉన్నాడు. కాళహస్తిలో - మిత్రుడు రామచంద్ర చావు బతుకుల్లో ఉన్నాడనే వార్త. శివారెడ్డి - మిత్రుడు - టెలిగ్రాం ఇచ్చాడు. వెళ్ళాలి. డబ్బు ఇబ్బంది. ‘అతి దగ్గరైన గుండెల మధ్య - కాలంలో, స్థలంలో దూరం’ అని ఒక వాక్యం తగులుతుందిక్కడ. చదువరి ఆలోచనని కుదుపుతుంది. ‘నామీద, నా ఉద్యోగం మీద నాకు మంట పుట్టింది. వఠ్ఠి మంట వల్ల సమస్యలు తీరవని నాకు తెలుసు. అయినా మండింది’ అంటాడు. ఇదీ పాత్ర చిత్రణ. నిస్సహాయతలో నుంచి వెలువడిన కసిత్వం, మనస్థితిని చెప్పటంలో రచయిత క్వాలిటీ ఇది. చివరికి కాళహస్తి వెళ్ళాడు. అప్పటికే అంతా అయిపోయింది. సానుభూతి వాక్యాలే మిగిలాయి. రామచంద్ర మామ - శివారెడ్డి సహాయాన్ని పొగుడుతూ ‘మనిషంటే శివారెడ్డే నయ్యా’ అని చాలా చెప్తాడు. ఇతడు - రామచంద్ర భార్యతో ‘ప్రేమలు ప్రకటించడానికి కూడా స్తోమతా, తెలివీ ఉండాలమ్మా ’ అంటూ వచ్చేస్తాడు.
‘దూరం’ కథాంశం మనిషి సున్నితమైన మనస్తత్వం మిద తీగెలా లాగిన వస్తువు. ఇందులో వాక్యాలు చదువుతుంటే దృశ్యం చదువరి కళ్ళముందు బొమ్మకడుతుంది. దాన్ని గ్రహిస్తుంటే కొత్తకుండలో నీరు కలిగించే ‘చెమ్మ’దనానికీ, కమ్మదనానికీ లోనవుతుంది - పఠితగుండె..ఒక ఆర్ద్రతా, అనుభూతీ - మిగులుతాయి. కథా ప్రయోజనం ఇదేకదా మరి!

కథా రచనలో డా||విశ్వనాథరెడ్డి గారికి కొ.కు. ఆదర్శం అనిపిస్తుంది. కథా వస్తువునీ, శిల్పాన్నీ పరిశీలించి చూస్తే ఇలా అర్ధమవుతుంది. అయితే, శైలి - ఎవరిది వారిదే! స్టైల్ ఈజ్ ఇండివిడ్యువల్ అంటారు కదా! ‘కథ చెప్పడం’ మీద ఇద్దరికీ పట్టు ఎక్కువ. దీనివలన కథకొక చిక్కని ‘స్పెసిఫిక్ గ్రావిటీ’ లభిస్తుంది. అంతో ఇంతీఓ చిత్త సంస్కారం కలిగిన చదువరి కథాత్మకతకి ప్రభావితుడవుతాడు.

డా||కేతు విశ్వనాథరెడ్డి కథా సంపుటి ముందుబాటలో ప్రచురణ కర్తల వాక్యం ఒకటి ఉంది. ‘బహుముఖ వ్యక్తిత్వం కలిగిన కేతు విశ్వనాథరెడ్డి రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు. విద్వైకజీవి అని. ఇది అక్షరసత్యం. ఎన్నెన్నో ఉత్తమ ప్రతిభా పురస్కారాలు, ఉన్నత పదవులు లభించినా, కథకుడుగా డా||కేతు సంపాదించుకున్న ఫలసాయం అనితర సాధ్యం! ఆయన కథల్లో ప్రతికథా ఒక అద్భుతమైన తేజోరేఖ!!!
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech