సమయానికి తగుమాట

                                                                            - వెంపటి హేమ

   ఈ వేళ  లేచిన వేళా విశేషం చాలా గొప్పది. ఇది ఆమెకు డబుల్ ప్రమోషన్ వచ్చిన రోజు ! ఉద్యోగంలోనే కాదు, జీవితంలో కూడా! ఆ ఉదయమే, కొంచెం సేపటికి ముందు ఫోన్ చేసి, ఆమె పనిచేస్తున్న ప్రోజక్టు మేనేజర్ శ్రీహర్ష, "విల్ యూ మేరీ మీ" అని అడిగాడు. "ఎదురుగా అడగడానికి భయం వేసి ఫోన్‌లో అడుగుతున్నా"  అన్నాడు. అది తలుచుకుని హాయిగా నవ్వుకుంది హారతి.
              "ఈ పొగరుబోతు నల్ల పిల్లకు ఇక ఈ జన్మలో పెళ్లి కాదు" అని తీర్మానించిన బంధుకోటి ఇప్పుడు ఏమంటారో చూడాలి.... అనుకుంది హారతి మనసులో. హర్ష అమెరికాలో కంప్యూటర్ సైన్సులో ఎం. ఎస్. చేసి, మాతృభూమి మీదా, తల్లితండ్రుల మీదా ఉన్న ప్రేమతో ఇండియాలో, హైదరాబాదులోనే ఉద్యోగంలో చేరిన వాడు. హర్ష తండ్రి కోనసీమలో ఉన్న గొప్ప భూకామందుల్లో ఒకడు. తల్లి తండ్రులు తన నిర్ణయాన్ని కాదనరని కూడా చెప్పాడు శ్రీహర్ష.
               హారతికి చంద్రశేఖరం మాస్టారు గుర్తుకి వచ్చారు. చల్లని వేళల్లో తలుచుకోవలసిన వ్యక్తుల్లో అమెకు ఆయనే మొదటి వాడు. సమయానికి తగిన మాట చెప్పి ఆయన తనకు సరైన దారి చూపించి ఉండకపోతే, ఈ వేళ తను ఇలా ఉండేదే కాదు. మనసు చెడి, పిచ్చిదై, ఏ పిచ్చాసుపత్రిలోనో పడి మగ్గుతూ ఉండేదేమో కదా....అన్నది  తలపుకి రాగానే హారతికి ఒళ్లు గగుర్పొడిచింది.
              "సారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో" అని, చంద్ర శేఖరం మాస్టార్‌ని తలుచుకుని మనసు నిండిన భక్తితో ఆయనకు నమస్కరించింది హారతి.

                               *                                   *                                      *                                       *

                     ఏం పాపం చేసుకుందో గాని, దేవుడు హారతిని నల్ల పిల్లగా పుట్టించి తన కసి తీర్చుకున్నాడు - అనిపిస్తుంది ఎవరికైనా. ఆమెకు ఇద్దరక్కలూ, ఇద్దరన్నలూ ఉన్నారు. వాళ్లందరూ ఫెయిర్‌గానే ఉంటారు. తల్లీ, తండ్రీ, ఆఖరికి బామ్మ కూడా పెయిరే, ఒక్క హారతి తప్ప. ఏ జంపింగ్ జీన్సు ప్రభావంతోనో పుట్టడం వల్ల, ఆమె మాత్రం వేరుగా ఉంటుంది. అదేదో తప్పైనట్లుగా అందరూ వేలెత్తి చూపించి హారతిని ఎద్దేవా చేసేవారు. కొత్తగా చూసిన వాళ్లు మరీను!
                       "ఈ పిల్లా మీ పిల్లేనా" అనో, "ఎవరీ పిల్ల" అనో అడిగి  ఆమె వైపు విస్తుపోయి చూసి ఆమెను కించపరచేవారు. మరీ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆమెకు వాళ్లూ వీళ్లూ అంటున్న మాటలు అర్ధం అవ్వకపోయినా, వయసు పెరిగినకొద్దీ ఆ మాటల అర్ధం తెలిసి బాధపడేది. ఆమె విశాలమైన కళ్లల్లో కనిపిస్తున్న బాధను గుర్తించిన ఆమె తండ్రి, కూతుర్ని చేరదీసుకుని, ఓదార్పు మాటలు చెప్పి ఆమెను శాంతపరచాలని చూసేవాడు.
                         " వీళ్లందరికీ ఇదొక దొబ్బుడాయి, ముందు వెనుకలు చూడకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. నీకున్న కనుముక్కు తీరు వీళ్లలో ఎవరి కుందమ్మా, చెప్పు! వాళ్ల వన్నీ పిడత మొహాలూ, చట్టిముక్కులే కదమ్మా" అంటూ గాయపడిన ఆ పిల్ల మనసును మురిపించి, మరిపించాలని చూసేవాడు ఆయన కాని ఎదుటి వాళ్ల అనాలోచితమైన మాటల్ని ఆయన ఎలా ఆపగలడు!
                  అది ఓ మాదిరి పల్లెటూరు - అనే చెప్పవచ్చు. పట్నంలో ఉండేవీ పల్లెల్లో ఉండేవీ ఐన మంచి చెడ్డలన్నీ గుదిగుచ్చినట్లుగా కనిపించేవి అక్కడ. భాస్కరంగారిది ఆ ఊరిలో, మంచి పేరున్న కుటుంబాల్లో ఒకటి.  ఆ ఇంట్లో వాళ్లకి ఊరిలో వాళ్లతో సత్సంబంధాలు ఉండేవి. తరచూ, ఏ సలహాకో, సహాయంకో, సంప్రదింపుకో ఆ ఇంటికి ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండేవారు. ఎప్పుడూ జనంతో సందడిగా ఉండేది ఆ ఇల్లు. భాస్కరం గారికి ఒక కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన ముసలి తల్లి ఇంకా బాగున్నారు. సిరిసంపదలున్న కుటుంబం అది. ఆ ఇంట్లో కడసారపుబిడ్డ హారతి.
                    ఒక రోజు, భాస్కరం గారి చిన్ననాటి స్నేహితుడు సుందరం చాలా సంవత్సరాల తరవాత, చూచిపోదామని వాళ్ల ఇంటికి వచ్చాడు. ఆయనని ఆహ్వానించి, మర్యాదలు చేసి తన పిల్లల్ని వరసగా పిలిచి ఆయనకు పరిచయం చేశారు భాస్కరం గారు. చివరిగా హారతి వచ్చి తండ్రి నానుకుని నిలబడింది.
                "ఇది ఎవరు" అంటూ ఆశ్చర్యంగా అడిగాడు సుందరం.
                " ఇది మా ఆఖరు సంతానం, హారతి, వయసు తొమ్మిదేళ్లు, ఐదవ తరగతి చదువుతోంది. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్టు, తెలుసా?"
                  సుందరం అదేమీ పట్టించుకోకుండా, "ఏమిటి, ఈ పిల్ల మీపిల్లేనా" అంటూ అశ్చర్యపోయాడు.
                  ఆయన ఇంకా ఏం మాట్లాడేవాడో గాని, కూతురు ముఖంలో రంగులు మారడం చూసిన భాస్కరం వెంటనే అడ్డుపడి, "అదేమిటిరా సుందూ! నీకు మా అక్క వర్ధనం గుర్తులేదా? చిన్న వయసులోనే పోయింది, అక్కకి నేనంటే ప్రాణం. అందుకే మళ్లీ మా ఇంట్లో నాకు కూతురై పుట్టింది" అన్నాడు ఆయన హారతిని చేర దీసుకుంటూ.
                   కాని, ఆ మిత్ర శిఖామణి తలెత్తి భాస్కరం వైపు చూడనైనా చూడకుండా మాట్లాడుకు పోయాడు. "కూతుళ్ల పెళ్లిళ్లకోసం ఏపాటి కూడబెట్టావేమిటి? పెద్దపిల్ల ఫరవా లేదు, ఈ పిల్లకి మాత్రం బరువు చాలానే పెట్టాలి, లేపోతే తూగదు, గారంటీ" అంటూ అదేదో పెద్ద జోకైనట్లు పక పకా నవ్వ సాగాడు.
            ఆ మాటలు వినగానే హారతి మనసు గాయపడింది. ఇంక అక్కడ ఉండలేక హారతి గదిలోకి వెళ్లి మంచం మీద బోర్లా పడి ఏడవ సాగింది. భాస్కరం గారికి కూడా మిత్రుని మాటలు కోపం తెప్పించాయి. కాని, అతిధిని అవమానించ కూడదని ఏమీ మాట్లాడలేదు. కొoచెం సేపు ఆగి లేచి హారతి దగ్గరకు వెళ్లారు ఆయన.
          హారతి పక్కన కూర్చుని, ఆమెను దగ్గరగా తీసుకుని, తలపైన చెయ్యి వేసి నిమురుతూ, " క్షమించమ్మా, వాడి తరఫున నేను అడుగుతున్నా. మనిషి మంచివాడేగాని, మాటతీరు బాగుండదు. ఒట్టి వాచాలుడు! మనింటికి వచ్చాడు కదమ్మా, వాడిని ఏమన్నా బాగుండదు. మనమే ఓర్చుకోవాలి. నా తల్లివి కదూ" అంటూ ఓదార్పుగా మాట్లాడారు ఆయన.
             "నాన్నా! రాయుడుగారి సరళ, సరయు నాకంటే నలుపు. ఐనా వాళ్లని ఎవరూ నల్లపిల్లలని అనరు. అందరికీ నేనే లోకువ, ఎందుకనో" అంది హారతి దుఖంతో.
            దానికి ఆ తండ్రి ఏం జవాబు చెప్పగలడు! ఇంట్లో అంతా నలుపే ఐతే ఇంక ప్రత్యేకంగా ఎవరూ ఏమీ అనడానికి లేదు. హారతి కేవలం రంగువల్లనే కాదు, ఇంట్లో అందరిమధ్య వేరేగా కనిపించడం వల్ల కూడా లోకుల దృష్టి ఆమె మీద పడుతోంది. చిన్న పిల్ల హారతికి ఈ ధర్మ సూక్ష్మాలన్నీ ఏం తెలుస్తాయి..... అనుకుంటూ ఆయన బాధపడి మాట మార్చడానికి ప్రయత్నించాడు. "ఇటు చూడు తల్లీ! నేను సిటీ వెళ్లి నప్పుడు నీకోసం తెస్తా, ఇప్పుడు మార్కెట్లోకి రకరకాల క్రీములు వస్తున్నాయిట! అవి రాసుకుంటే నువ్వు తెల్లగా ఔతావు. అప్పుడు ఇంకెవ్వరికీ నిన్ను అనడానికి వంక దొరకదు. అందరికంటే నువ్వే అందంగా ఉంటావు తెలుసా" అంటూ ఆయన కూతుర్ని సమాధాన పరచాలని చూశాడు.
              లోకులు పలుగాకులు - అంటారు! అలాగే, హారతిని చూసి ఎవరో ఒకరు ఏదో ఒక కూత కుయ్యకుండా ఉండేవారు కారు. క్రమంగా ఆమెలో ఆత్మన్యూనతాభావం పుట్టి, పెరగడం మొదలేట్టింది. దాన్ని కూడా జనం సరిగా అర్ధం చేసుకోలేదు. ఉడుకుమోతనీ, ఏడుపుకొట్టుదనీ ... ఇంకా ఇంకా ఎద్దేవా చెయ్యడానికి చూసేవారు.
తమ వాచాలత వల్ల చిన్న పిల్ల హారతి మనసు గాయ పడుతుందన్నది ఎవరూ పట్టించుకునీవారు కాదు. దానితో వచ్చిన విపరీత పరిణామాల వల్ల ఆమె బ్రతుకు అస్తవ్యస్తంగా తయారౌతుందన్నది అసలు ఎవరూ ఊహించని విషయమయ్యింది ! ఎద్దు పుండు కాకికి నొప్పా !
                    వయసు పెరుగుతున్న కొద్దీ నెమ్మదిగా హారతి అందర్నీ తప్పించుకుని తిరగ సాగింది. అందుకని ఆమెను "ఒంటెత్తు రాకాసి" - అంటూ గుసగుసలు పోయీవారు. ఒక్క తండ్రి దగ్గర మాత్రమే ఆమెకు రవంత శాంతి దొరికేది. ఆయన ఎలాగైనా ఆమెకు ఊరట కల్గించాలని ఎన్నెన్నో మంచి మాటలు చెప్పి ఓదార్చీవారు. ఆ సంవత్సరం హారతిని హైస్కూల్లో చేర్పించారు. అక్కలతోపాటుగా వెళ్లి చదువుకోసాగింది హారతి కూడా.
                      ఏ దేవుడికి కళ్లు కుట్టాయోగాని, ఆ సంవత్సరం సంక్రాంతి పండుగ వెళ్లిన వారం రోజులకి, అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో భాస్కరం గారు కాలంచేశారు. చిన్న వయసులోనే, హారతి తల్లి జానకమ్మకి వైధవ్యం సంప్రాప్తమవ్వడమేకాక, ముక్కుపచ్చ లారని ఐదుగురు పిల్లల పాలన పోషణలు చూస్తూ, వాళ్ల భవిష్యత్తుని తీర్చి దిద్దవలసిన బాధ్యత కూడా ఆమె మీద పడింది. భాస్కరం గారు ఆస్తి పాస్తుల వివరాలు ఎవరికీ చెప్పిఉందకపోడంతో, ఆయన అకాల మరణం వల్ల ఆస్తి విషయంలో చాలా చిక్కులు ఎదురయ్యాయి. దుఃఖాన్ని దిగమింగి, వ్యవహారాలను చూసుకోక తప్పలేదు జానకమ్మకి.
                 చెట్టంత కొడుకుని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నా, కోడలు పడుతున్న అవస్థను అర్ధం చేసుకుంది భాస్కరంగారి ముసలి తల్లి. కోడలు తలమునకలుగా ఉన్న వ్యవహారాలతో సతమత మౌతూoడగా, ఆమె ఒక చేత్తో కళ్లు తుడుచుకుంటూ, మరొక చేత్తో మనుమల్ని బాధ్యతగా పెంచుకొచ్చింది.
                   పిల్లలకు పెద్ద పరీక్షలు దగ్గరకు వచ్చాయి. కాని ఆ పిల్లల్ని చదువుకోమని ప్రోత్సహించినవారు లేకపోయారు. ఎవరిదారిన వాళ్లు ఏదో కాస్త చదివి పరీక్షలు రాశారు ఆ సంవత్సరం, ఏడ్చుకుంటూనే. తండ్రి లేని వెలితి పిల్లలందరూ అనుభవించినా, అందరిలోకీ ఎక్కువగా బాధపడింది హారతి. అపురూపమైన ఆయన ప్రేమాభిమానాలు లోపించడంతో, ఆమెకు బ్రతుకు నిస్సారంగా తోచింది. ఆమె మనసులో ఏదో తెలియని కసి, కోపం ఏర్పడ్డాయి. ఏదో ఒక పాడుపని చేసి ఆ కసిని తీర్చుకోవాలనే ఆత్రం బయలుదేరింది ఆమెలో. తోడబుట్టిన వాళ్లతో కలిసి పరీక్షలు వ్రాయడానికి వెళ్లిందన్నమాటేగాని ఆమె, ఏ ఒక్క ప్రశ్నకూ జవాబు వ్రాసిన పాపాన పోలేదు. పేపరు మీద తన పేరును మాత్రం వ్రాసి పేపరు ఇచ్చేసింది. దాని వల్ల ఆ సంవత్సరం ఆమె ఫెయిల్ అయ్యింది. తక్కిన వాళ్లు ఓ మాదిరి మంచి మార్కులతోనే పాసయ్యి పై క్లాసుల్లో చేరారు.
                  మనసుకైన గాయాలను కాలమే మానుపుతుంది అంటారు కదా!  అలాగే రోజులు గడిచినకొద్దీ ఆ కుటుంబం, భాస్కరం గారు లేని లోటును భరిస్తూనే బ్రతకడం నేర్చుకుంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా ఇట్టిట్టే మారిపోతూ వాటంతట అవే కదలిపోయాయి. కాలమూ, కెరటమూ ఒకరు ఆగమంటే ఆగేవి కావు కదా!.
                    పెద్ద కూతురు డిగ్రీ పరీక్షలు రాయగానే జానకమ్మ పెళ్లిళ్ల పేరయ్యకు కబురుపంపి ఇంటికి పిలిపించింది. ఆయన రాగానే కూర్చోబెట్టి మర్యాదలుచేసి, పెద్ద పిల్ల బయోడేటా, ఫొటో చేతికిచ్చి, ఒక మంచి వరుణ్ణి వెతికి పెట్టమని అడిగింది.
                 ఆయన వాటిని అందుకుని చేతిసంచీలో పెట్టుకుంటూ, "అమ్మా, మీకు తెలియంది కాదుకదా! వరకట్ననిషేధచట్టం అమలులోకి వచ్చింది అంటారు గాని,  దాన్ని గౌరవిస్తున్న వాళ్ల సంఖ్య చాలా తక్కువ. చట్టాన్ని ఎలా బురిడీ కొట్టించి తమ పబ్బం గడుపుకోవాలా అని ఆలోచించే వాళ్లే ఎక్కువ. ఇదివరకు దర్జాగా, బాహాటంగా చేసేపనిని ఇప్పుడు చాటుగా, రహస్యంగా చేస్తున్నారు. ఇచ్చీ వాళ్లకు ఇవ్వకా తప్పటంలేదు, పుచ్చుకుంటున్నవాళ్లు పుచ్చుకోడమూ  మానడంలేదు. ఇంతకీ, అంతా గప్చుప్ సాంబారు బుడ్డీ! సాక్ష్యాధారాలు ఉండవు, అంతే! చట్టం వళ్ల వచ్చిన మార్పు అదమ్మా!
               ఇంతకీ చెప్పేది ఏమిటంటే, పిల్ల బాగుంటే సరిపోదమ్మా, తమరు ఎంతలో తూగగలరో చెపితే, పిండిగొద్దీ రొట్టె  - అన్నట్లుగా, నేను అంతలో ఉన్న సంబంధాలే మీకు చూపిస్తా" అంటూ నిష్కర్షగా చెప్పేశాడు ఆయన.
                    ఆయన అడిగిన వాటికన్నింటికీ జవాబులు చెప్పి, మర్యాదగా అయనను సాగనంపింది జానకమ్మ.
                   త్వరలోనే హారతి అక్కకి అందరికీ నచ్చిన, ఒక మంచి సంబంధం కుదిరింది. కూతురి పెళ్లి ముహూర్తానికి రెండు రోజులు ముందుగా, పెద్ద కొడుకు పెళ్లికి కూడా ముహూర్తం దొరకడంతో, మేనకోడలే కోడలుగా కొడుకు పెళ్లి జరిపించేసి, ఆ నవదంపతుల్నే కన్యాదాతల్నిచేసి కూతురు పెళ్లి అంగరంగ వైభోగంగా జరుపించి గొప్ప వ్యవహార్త - అనిపించుకుంది జానకమ్మ.
                  
                   ఈ పెళ్లిళ్లకైన ఖర్చులకోసం ఆస్తి చాలా వరకు అమ్మెయ్యవలసి వచ్చింది. మైనర్ ఆస్తులైనా, ఆ కుటుంబానికి ఉన్న "మాట తప్పరు" అన్న మంచి పేరువల్ల ఆస్తి చక్కగా అమ్ముడుపోయింది. ధర తక్కువని బాధపడ్డాడు హారతి పెద్దన్నయ్య. "అమ్మబోతే అడీవి, కొనబోతే కొరివి ! అసలు మైనర్ ఆస్తి అమ్ముడైనందుకే సంతోషించాలి" అంది జానకమ్మ.
                    అక్క పెళ్లై అత్తారింటికి వెళ్ళిపోయింది. ఉద్యోగం వచ్చాకగాని కాపురానికి తీసుకురానని పెద్దన్నగారు భీష్మించుకుని కూర్చుని, భార్యను ఇంటికి తీసుకు రాలేదు. దాంతో, అసలే స్నేహితులెవరూ లేని హారతి ఏకాకి అయ్యింది. తన ఒంటరితనమే తనకు నేస్తంగా, ఆమె కాలేజికి వెళ్లి వస్తోంది.
                    ఒకరోజు హారతి కాలేజి నుండి ఇంటికి వచ్చేసరికి, సావిట్లో కూర్చుని తన తల్లితో కబుర్లు చెపుతూ ఫలహారం సేవిస్తున్న పెళ్లిళ్ల పేరయ్యగారు కనిపించారు. ఆయనని చూడగానే ఆమె గుండెల్లో బండ పడిండి.
                    పేరయ్య గారికి చెపుతోంది జానకమ్మ. "పెద్దామె మంచమెక్కారు. ఆమె చూస్తూండగా ఈ పిల్లకి కూడా పెళ్లి చేసేస్తినా, నా తలమీది బరువు దిగిపోయినట్లే! మీదే భారం. ఈ పెళ్లి కూడా మీ చేతులమీదుగా జరిపించి పుణ్యం కట్టుకోండి" అంటూ హారతి పెళ్లి బాధ్యత ఆయనకు అప్పగించింది.
                మొదట్లో హారతికి అప్పుడే పెళ్లి చేసుకోడం ఇష్టం లేకపోయినా, తల్లి పట్టుదలా, బామ్మ జాలిచూపులూ, మొత్తానికి ఆమెను ఒప్పించ  గలిగాయి. పెళ్లి చూపుల కార్యక్రమం మొదలయ్యింది.
                 బయోడేటాని, ఫొటోని చూసి పెళ్లి చూపులకని వచ్చిన వాళ్లు, హారతిని ఎదురుగా చూసి, "ఇంటికి వెళ్లి ఉత్తరం రాస్తా" మంటూ వెళ్లిపోయి మళ్లీ పతా లేకుండాపోవడం జరుగుతోంది. అలా నాలుగైదు జరిగే సరికి అందరికీ నీర్సం వచ్చింది. అందరూ తలోమాటా అనుకోసాగారు.
                "కారణం ఏమిటో తెలియకపోతే కదా" అనుకుని బాధపడింది జానకమ్మ. "కోడలు నలుపైతే కులమంతా నలుపౌతుందన్న భయం ఉంటుంది ఎవరికైనా" అనుకుంటూ భారంగా నిట్టూర్చింది ఆమె.
                 మంచం మీద ఉన్న బామ్మ కూడా, " కనుముక్కు తీరు ఎంత బాగుంటేనేం, నలుపు నాల్గు వంకర్లు తెస్తుంది! అదే ఎరుపైతే ఏడు వంకర్లని దాస్తుంది కదా" అంటూ మూలిగింది.
                 చివరకు పేరయ్యగారి సలహా మేరకు కట్నం పెంచింది జానకమ్మ. అంతేకాదు, పెళ్లి బాగా జరిపించి, లాంఛనాలు కూడా బాగా ముట్టజెబుతా నంటూ, లోపాయికారీగా చెప్పించింది. హారతి ప్రతిఘటించింది. ఆడపిల్లల పెళ్లికోసమే ఉన్న ఆస్తంతా అమ్మేస్తే, నడి వయసులోవున్న తన తల్లి భవిష్యత్తుకి ఆసరాగా ఏమీ ఉండదని బాధపదింది.  ఐనా, ఉన్నదంతా కూతుళ్ల కోసమే ఖర్చుపెట్టేస్తే ఇక మాకేం మిగులుతుంది - అని కొడుకులు మనసులోనైనా బాధ పడరా ... అంటూ తల్లిని నిలదీసి అడిగింది.
                  "మరి నన్నేం చెయ్యమంటావే! నల్లగా కర్రిమొద్దులా ఉన్న వాడైనా తన పెళ్లాం కుందనపు బొమ్మలా ఉండాలని కోరుకుంటాడు. నువ్వు చూస్తే, ఛాయ తక్కువ పిల్లవి, డబ్బు కోసమనైనా ఎవరైనా నిన్ను ఇష్టపడి, పెళ్లిచేసుకునేందుకు ముందుకి రాకపోతారా - అని నా ఆశ. నీక్కూడా పెళ్లి చెయ్యాలి కదా!" చిరాకులో ఉందేమో, మనసులోమాట పైకి అనేసింది జానకమ్మ.
                   తల్లి మాటలకు హారతి మనసు చివుక్కుమంది. సంఘమనీ, సంస్కృతనీ, సంప్రదాయమనీ... ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పి తన పెళ్లి చెయ్యాలని తాపత్రయ పడుతున్నారేగాని, తన కసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు కదా.... అనుకుని బాధపడింది.
                   పేరయ్యగారు మళ్లీ మరో సంబంధం తీసుకొచ్చారు. ఆ అబ్బాయికి తండ్రి లేడు. తల్లీ, చెల్లీ ఉన్నారు. చెప్పుకోదగిన ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. ఒక లా ఫరంలో జూనియర్ లాయర్‌గా పనిచేస్తున్నాడు. అతన్ని, "మంచివాడు" అనే కితాబు తగిలించి మరీ పరిచయం చేశారు పేరయ్య గారు. అతడు ఒక మిత్రుణ్ణి వెంట తీసుకుని వచ్చాడు పెళ్లిచూపులకి.
                      పెళ్లికొడుకుని చూడగానే జానకమ్మ మనసు, ముల్లు గుచ్చుకున్నట్లుగా కలుక్కుమంది. అంతలోనే మళ్లీ, పరిస్థితులతో రాజీపడి, "మగవాడికి ప్రయోజకత్వమే కదా అందం" అనుకుని మనసు సరిపెట్టుకుంది ఆమె. సమయానికి పుట్టింట్లోనేవున్న పెద్దకూతురు చెల్లెల్ని నడిపించుకువచ్చి పెళ్లికొడుక్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి, చెల్లి వెనక నిలబడింది. వాళ్లకు కాస్త ఎడంగా, దివాన్ మీద కూర్చున్న పేరయ్యగారు, తీరుబడిగా నశ్యం సేవించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
                        పెళ్లికొడుకు ఫ్రెండు, స్నేహితుని మీదికంతా వంగి, " పిల్లని బాగా చూడు, నలుపు" అంటూ గుసగుసలాడాడు.
                  " ఆ సంగతి నాకు ముందే తెలుసు. అలాంటి లోపమేదో ఉంది కనుకే గాని, లేపోతే నాలాంటి వాడికి అంత కట్నం ఎవరిస్తారు చెప్పు" అన్నాడు గుసగుసగా పెళ్లికొడుకు కూడా.
                   కొండమీది కోలాహలం ఏమిటీ - అంటే, కొంతమంది చేరి రహస్యాలు  మాట్లాడుకొంటున్నరు.....అన్న సామెత గుర్తువచ్చి, తనలో తానే నవ్వుకుంది హారతి. వాళ్ల సంభాషణ అంతా వినిపించింది ఆమెకు.
                   పెళ్లికొడుకే ఊరుకోక మళ్లీ మొదలుపెట్టాడు, ఫ్రెండ్ కి నచ్చజెప్పే ధోరణిలో, "ఒక మంచి సంబంధం తెచ్చి చెల్లాయికి పెళ్లి చేసి, మానాన్న నాకు వదిలి వెళ్లిన బాధ్యత తీర్చుకోవాలంటే నాకున్న దారి ఇది ఒక్కటే! త్యాగం చెయ్యక తప్పదు మరి" అన్నాడు అతడు, మళ్లీ అలాగే గుసగుసగా.
                    వాళ్ల మాటలు హారతికి కోపం తెప్పించాయి. నిజం చెప్పాలంటే ఆ పెళ్లికొడుకు తనకంటే నలుపు! పైగా ఎత్తుపళ్లు, చీకిరికళ్లూ కూడా. మగ మహారాజు కనుక అవేం లెక్కలోకి రావు, అదృష్టవంతుడు...... అనుకుంది ఆమె. ఆమెలో పుట్టిన అసహనం నెమ్మదిగా పెరగ సాగింది.
                  ఇంతలో జానకమ్మ కొడుకు చేతికిచ్చి పలహారాలు పంపించింది. అందరూ సద్దుకు కూర్చున్నారు. పేరయ్యగారు కూడా నశ్యం పక్కనపెట్టి పలహారం అందుకున్నారు. తింటూ మధ్యలో ఆగి, "బాబూ నీకు పిల్ల నచ్చిందా " అని అడిగారు పెళ్లికొడుకు వైపు చూసి అలవాటుగా.
                 తిందామని నోటిదాకా ఎత్తిపట్టుకున్న మైసూరుపాకపు ముక్క అలాగే పట్టుకుని భావగర్భితంగా మిత్రుని వైపు చూశాడు అతడు. అతని మనసులోని మాటని గుర్తించిన మిత్రుడు వెంటనే జవాబు చెప్పాడు, " అమ్మాయికేం! శ్రీ మహాలక్ష్మిలా ఉంది. మా వాడికి నచ్చినట్లే. కాని ఒక్కమాట.... పేరయ్యగారు ఒక సంఖ్య చెప్పారు. కాని అది మాకంత నచ్చుబాటు కాదు. మరొక్క మాట చెప్పండి, సరే నని తాంబూలాలు పుచ్చేసుకుంటాం" అన్నాడు అతడు, కట్నాన్ని పెంచమని గుంభనంగా చెప్పాడు.
               అసలే సెగలూ పొగలూ కక్కుతూ, విస్ఫోటనానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా రగులుతున్న హారతి హృదయం ఒక్కసారిగా నిప్పులు కక్కింది. హారతి లేచి నిలబడింది. పెల్లుబికిన కోపంతో, కళ్లను విశాలంగా చేసుకుని, "మీకు మరో మాట కావాలా? అది నేను చెపుతున్నా వినండి." అంది గర్జిస్తున్న ఆడ సింహంలా రౌద్రంగా.
               అందరూ ఒక్కసారిగా చేష్ఠలు దక్కి కొయ్యబారిపోయారు. హారతి మాట్లాడడం మొదలుపెట్టింది. "ఇలా కట్నాలూ కానుకలూ అంటూ పుచ్చొంకాయల్లా గీసి గీసి బేరాలాడి, అవతలి వాళ్ల నుండి డబ్బు గుంజి, మీ అవసరాలు తీర్చుకుంటూ, దానికి త్యాగమని పేరుపెట్టి, అదేదో పెద్ద ఘనకార్యంలా భావిస్తూ, జీవితాంతం మీకు నచ్చని మనిషితో కలిసి బ్రతకాలంటే మీకు సిగ్గనిపించటం లేదా!  మీరందుకు సిద్ధంగా ఉన్నా నేనుమాత్రం సిద్ధంగా లేను. ఇలాంటి త్యాగాలను ఈ రోజుల్లో ఏ ఆడపిల్లా సహించదు. మాకు మాత్రం ఉండవా ఇష్టానిష్టాలు" అనేసింది.
               ఆ మాటలు విని షాకైనవాళ్లు కోలుకోడానికి కొంత టైము పట్టింది. అలా బిగిసిపోయి, కూర్చుండిపోయిన జనాన్ని చూసి తెల్లబోయింది హారతి. అందరిలోకీ ముందుగా తెలివి తెచ్చుకున్న జానకమ్మ ఒక్క అదటున కూతురికి ఎదురుగా వచ్చి  చేతికొద్దీ హారతి చెంపమీద ఈడ్చి కొట్టింది. ఈ రసాభాసానికి ఖిన్నులై లేచి వెళ్లిపోయారు పెళ్లికొడుకూ అతని మిత్రుడూను. ఏడుస్తూ గదిలోకి పరుగెత్తింది హారతి.
                  " అమ్మా! ఇలాగైతే ఇక నేను పెళ్లిళ్లు చేయించినట్లే ! దయుంచండమ్మా" అని, తనలో తాను సణుక్కుంటూ, పై పంచె దులుపి బుజాన వేసుకుని లేచి వెళ్లిపోయాడు పెళ్ళిళ్ల పేరయ్య కూడా. పైట కొంగు ముఖాన కప్పుకుని, నట్టింట చతికిలపడి ఏడవసాగింది జానకమ్మ. ఏడుస్తూనే మాట్లాడడం మొదలుపెత్తింది......
                 "ఆయన వదిలి వెళ్లిన బాధ్యతలన్నీ సరిగా పూర్తిచెయ్యాలనీ, పెద్దావిడ బాగుండగానే దీని నెత్తిన కూడా నాలు గక్షింతలు వేయించేస్తే బాగుంటుందనీ శతవిధాలా తాపత్రయపడ్డా. ఇక నా వల్లనేం అయ్యేలా లేదు. ఉన్న ఇబ్బందులు చాలవన్నట్లు దీనికి "పొగరుబోతు" అన్న పేరు కూడా వచ్చాక, ఇక ఈ జన్మలో దీని పెళ్లి చెయ్యాలంటే నావల్ల నౌతుందా" అంటూ బాధపడింది ఆమె.
                 తల్లి ఏడుపు వినగానే హారతి కోపమంతా నీళ్లుగారిపోయింది. తన బాధ తనకు ఉన్నా, తను తల్లి వైపు నుండి కూడా ఆలోచించి ఉంటే బాగుండేది కదా...  అనుకుని మరింత మధనపడింది. రకరకాలుగా ఆత్మ విచారణ చేసుకుని చివరకు, తను చేసింది తప్పేననే నిర్ధారణకు వచ్చింది. అలా ఉగ్రంగా నలుగురి ముందూ బయట పడిపోకుండా, తన అయిష్టాన్ని వేరే రకంగా, సాత్విక ధోరణిలో చెప్పి ఉండవలసింది - అనుకుని బాధ పడింది.వెంటనే లేచి వెళ్లి తల్లిని కౌగిలించుకుని "అమ్మా నన్ను క్షమించమ్మా" అంటూ ఆమె ఒడిలోపడి భోరున ఏడ్చింది హారతి.
                అది ఒక మాదిరి పల్లెటూరు కావడంతో, ఊళ్లో ఏంజరిగినా అందరూ పట్టించుకుంటారు. దాంతో, "బరితెగించిన ఆడపిల్ల"గా హారతి పేరు ఆ ఊళ్లోవాళ్ల నోళ్లలో నాన సాగింది. తల వంచుకుని బుద్ధిగా కూర్చోవలసిన పెళ్లికూతురు లేచి నిలబడి తన మనసులోని మాటను అలా కుండ పగలేసినట్లు చెప్పెయ్యడం ఎవరికీ నచ్చినట్లు లేదు.
                   ఈ ఉత్పాతాన్ని సహించలేని దానిలా, రెండు రోజుల వ్యవధిలో ముసలామె మరణించింది. ఎలా పొక్కిందోగాని, అపరకర్మలకు వచ్చిన బంధువులు హారతి పేరు చెప్పి ఒకళ్ల చెవులు ఒకళ్లు కొరుక్కున్నారు. "ఏమి చూసుకునో దీనికింత పొగరు" అంటూ గుస గుసలు పోయారు. "చలిచీమలా ఉంటుందిగాని, మరదలుపిల్ల గడుసుదే" అంటూ మేలమాడాడు బావ. చాటున చివాట్లు పెట్టింది అక్క.
                 అందరిలోనూ అన్నగారు ఒక్కడే కొంచెం ఓదార్పుగా మాట్లాడాడు.."పిచ్చిపిల్లా! నాతోచెపితే అంతా నేను సద్దుబాటు చేసే వాణ్ణి కదా. నువ్వు మాట్లాడి అనవసరంగా వెలితి పడ్డావు" అన్నాడు.
               నలుగురూ నాల్గు రకాలుగా దుయ్యబట్టడంతో, హారతి డిప్రెషన్లో పడిపోయింది. రోజులు చాలా భారంగా గడుస్తున్నట్లుగా అనిపించ సాగింది ఆమెకు. .
                            *                                           *                                         *                                     *
                 తెలుగు చెప్పే పండితులవారు రెటైర్ అయ్యాక, హారతీ వాళ్లకి తెలుగు క్లాసులు సరిగా జరగడం లేదు. మరొకరిని నియమించడంలో ఆలస్యం జరిగింది.  చాలా రోజులకు గాని  ఆ సమస్య పరిష్కరించ బడలేదు. ఈ రోజు కొత్త లెక్చరర్ వచ్చి క్లాసు తీసుకుంటారు అని అనౌన్సు చేశారు. హారతికి తెలుగు భాష మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది కూడానేమో, కొత్త లెక్చరర్‌ని చూడబోతున్నందుకు ఎంతో సంతోషంతో కాలేజికి బయలుదేరింది. పుస్తకాలు సద్దుకుని, తల్లికి వెడుతున్నట్లు చెప్పడం కోసం ఆమె దొడ్డివైపుకి వెళ్లింది.
              పక్కింటావిడ వస్తే, తులసికోట దగ్గర నిలబడి ఆమెతో మాట లాడుతోంది జానకమ్మ. " ఏం చెప్ప మంటారు నన్ను! తండ్రే వల్లమాలిన గారాబం చేసి దాన్నలా తయారు చేశారు. అసలే దీని పెళ్లి ఎలా చెయ్యాలిరా భగవంతుడా అని నేనేడుస్తూంటే, అందుబాటులోకి వచ్చిన ఒక్క సంబంధాన్నీ ఇది చేజేతులా చెడగొట్టుకుంది. ఇక నేనీ జన్మలో దీనికి పెళ్లి చెయ్యగల నంటావా వదినా?"
                  అప్రయత్నంగా ఆ మాటలు హారతి చెవిని పడ్డాయి. వెంటనే, పుండు రేగినట్లయ్యింది. అసలే గాయపది వున్న మనసేమో, ఆమెను మరింతగా బాధపెట్టింది. గిరుక్కున వెను దిరిగి, తళ్లికి చెప్పకండానే కాలేజీకి వెళ్లిపోయింది హారతి.  
                    కాలేజీకి వచ్చాక కూడా హారతి పరిపరి విధాలుగా గతాన్ని తలపోసి బాధ పడుతూనేఉంది. వెనక బెంచీలో ఒక మూలగా ఒదిగి కూర్చుని, పుస్తకం తెరిచి డెస్కుమీద ఉంచుకుని దానివైపే చూస్తూ తనలో తాను మధన పడుతూ ఉండిపోయింది. హారతి ఒంటెత్తు తనానికి అలవాటు పడివున్న తక్కిన అమ్మాయి లెవరూ ఆమెను పట్టించుకోలేదు. చూస్తూండగా రెండు పీరియడ్లు గడిచిపోయాయి.
                    మూడవ పీరియడ్ మొదలవ్వగానే, ప్రిన్సిపాలుగారు కొత్త లెక్చరర్ గారిని వెంట తీసుకుని వచ్చారు.అమ్మాయిలందరూ లేచి నిలబడ్డారు. ప్రిన్సిపాల్ గారు కొత్త లెక్చరర్‌ని క్లాసుకి పరిచయం చేశారు....
                      "డియర్ స్టూడెంట్సు! ఈయన మన  కొత్త తెలుగు లెక్చరర్. పేరు చంద్రశేఖర శాస్త్రి గారు. ఈయన సంస్కృతాంధ్రాల్లోనే కాదు, ఇంగ్లీషు భాషలో కూడా దిట్ట. మీరు ఈయన దగ్గర చదివుకుని వృద్ధిలోకి రాగలరని నా పరిపూర్ణ విశ్వాసం" అని చెప్పి శలవు తీసుకుని వెళ్లిపోయారు.
                     క్లాసులో గుస గుసలు మొదలయ్యాయి. శాస్త్రిగారు తలెత్తి చూడ గానే అందరూ సద్దు మణిగారు. గంభీరమైన కంఠ స్వరంతో ఆయన క్లాసునుద్దేశించి మాట్లాడ సాగారు.....
                      జేబు లోంచి పెన్ను పేపరూ తీసి,"డియర్ స్టూడెంట్సు! ప్రిన్సుపాల్‌గారు నన్ను మీకు పరిచయం చేశారు, బాగుంది. మరి, నాకు మీ పరిచయం కూడా కావాలి కదా! మీరు వరుసలో వచ్చి మీ పేరూ, రోల్ నంబరూ చెప్పి నిశ్శబ్దంగా వెళ్లిపొండి. నేనవి నోట్ చేసుకుంటా. రేపటినుండి పాఠాలు మొదలుపెడదాము" అన్నారు.
                      ఒకరొకరూ వచ్చి పేరు, రోల్ నంబరూ చెప్పి వెళ్లిపోసాగారు. క్రమంగా క్లాసు ఖాళీ ఐపోయింది. చివరకు హారతి ఒక్కర్తీ మిగిలింది. ఆమె తన ధోరణిలో తానుండి, రూం ఖాళీ అయ్యిందే గమనించలేదు. స్తబ్దంగా, బాహ్య స్మృతి లేనట్లుగా కూర్చుండిపోయిన ఆమెను చూసి ఆశ్చర్యపోయి లేచి దగ్గరగా వచ్చారు ఆయన. 
                   అంతా వెళ్లిపోయినా ఆమె ఒక్కర్తీ అల్లా తవంచుకుని కూర్చుండిపోడం వింతగా తోచింది ఆయనకు. దగ్గరగా వెళ్లి, "నీ పేరేమిటమ్మా" అని అడిగారు అనునయంగా.
                పరాకుగా ఉండడంతో ఉలికిపడింది హారతి. ఖంగారుగా, "న-న-న- నల్లపిల్ల సార్" అంది తడబడుతూ.
                  "అలాగామ్మా! అది అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి పేరమ్మా! హిమగిరి తనయ శ్యామలే కదమ్మా! నిన్ను చూస్తూంటే నాకు కాళిదాసు కమార సంభవంలో వర్ణించిన పార్వతి రూపం కళ్లకు కట్టింది తల్లీ" అన్నారు ఆయన.
                   హారతికి తన తండ్రి గుర్తు వచ్చాడు. ఎడతెగని దుఃఖంతో ఎర్రబదిన కళ్లతో, కళ్ల నిండా ఉన్న కన్నీటితో, నెమ్మదిగా తల పైకెత్తి ఆయన వైపు ఆశ్చర్యంతో చూసి తల వంచుకుంది ఆమె.
                    మాస్టారి వయసు ఏభైకి పైనే ఉండవచ్చు. ప్రసన్నమైన ముఖ వర్చస్సుతో చూడగానే ఎవరికైనా గౌరవం కలిగించగల మంచి పర్సనాలిటీ ఆయనది. హారతికి ఆయనమీద ఆత్మీయతతో కూడిన భక్తి భావం కలిగింది.
                  "సారీ సార్! నాకు మావాళ్లు పెట్టిన పేరు హారతి" అంది వంచిన తల ఎత్తకుండానే. కాని ఆమె కంఠం వణికింది. ఆమె కళ్లల్లో పుట్టిన కన్నీరు చెంపలమీదుగా జారి పడి మాష్టర్ గారి కాళ్లను తడిపాయి.
                    మాష్టారి మనసు ఆర్ద్రమయ్యింది. అనునయంగా ఆమె తలపై చెయ్యి వేసి నిమురుతూ, "ఏందుకు తల్లీ, అంత బాధ పడుతున్నావు? నాతో చెప్పమ్మా. మన కడుపులోని బాధ ఎవరికైనా చెప్పగల్గితే మన మనసు తేలికౌతుందంటారు.  సందేహించక చెప్పమ్మా" అన్నారు.
                   ఆయన చూపించిన సానుభూతి ఆమెను కదిలించింది. టూకీగా తనలో సెలవేసివున్న బాధను ఆయనకు చెప్పేసింది హారతి. అంతా విని ఆయన చాలా నొచ్చుకున్నారు. ఏవైనా నాలుగు మంచి మాటలు చెప్పి, ఆమె కోల్పోయిన ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యాన్ని తిరిగి ఆమెలో ఏర్పడేలా చేస్తే చాలు సమస్య దానంతటదే పరిష్కారమైపోతుంది అనుకున్నారు. ఆప్యాయమైన కంఠ స్వరంతో మాట్లాడసాగారు....
                  "దిగులు వద్దు తల్లీ, ధైర్యంగా ముందుకి సాగు. నువ్వు చెయ్యని తప్పుకు నువ్వెందు కమ్మా శిక్ష అనుభవించాలి!  "నిన్నెవ్వరైనా అన్యాయంగా అపహాస్యం చేస్తే, నువ్వు దాన్ని అందుకోకు. అప్పు డది వెళ్లి అన్నవాళ్లనే ఢీకొంటుంది" అన్నాడమ్మా వివేకానందుడు. ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధ పడడం మాని, నీ చుట్టూ నువ్వే ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుచుకుని, ఉజ్వల భవిష్యత్తు కోసం దీక్షగా కృషి చెయ్యి. ఎంత మార్పు వస్తుందో చూడు. ఆకు చిలుక సీతాకోక చిలుకగా మారడం మనం చూస్తూనే ఉన్నాం కదా! ఎగిరే పువ్వులా గాలిలో తేలుతున్న సీతాకోకచిలుకను చూసి మచ్చట పడని వారు ఉంటారా?
                     జీవితానికి పెళ్లి ఒకటే పరమావధి కాదు. నువ్వు దిగులు పెంచుకుని మనసు పాడుచేసుకోక, నీ ప్రజ్ఞను పెంచుకుంటే నీకు అందమైన భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు గేలి చేసిన వాళ్లే అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు. వసంత వనాల శోభను పెంచే కోయిల పాటకు ఆనందించని వాళ్లు చాలా అరుదు కదమ్మా! త్వరలోనే నీకూ మంచిరోజులు వస్తాయి, నా మాట నమ్ము" అన్నారు అయన.
                         *                                             *                                                            *                                         

                  అలసిన వారిని సేదతీర్చగల పిల్లతెమ్మెర వీచింది. అశీర్వాదం లాంటి ఆయన మాటలు ఫలించాయి. "మాష్టారు ఎక్కడ ఉన్నారో వెతికి తెలుసుకుని, హర్షతో కలిసి వెళ్లి మనసారా ఆయనకు నమస్కరించాలి. అయన "సమయానికి తగిన మాట"  చెప్పి , నన్ను ఓదార్చి మనిషిని చేసి ఉందకపోతే నేనేమైపోయి ఉండేదాన్నో కదా!" అనుకుంది కృతజ్ఞతతో హారతి.
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech