పగటి కల - పగిలిన తల

                               - గవాస్కర్  

  ముక్కుపుటాలదిరే డెట్టాల్ వాసనకు భరించలేని తలనొప్పితో మెల్లగా కళ్ళు తెరచి చూస్తే పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాక నాకు తెలిసిందేమిటయ్యా అంటే నేను మా ఊరి హాస్పిటల్లో ఒక మంచం మీదున్నాను. అక్కడున్న మంచాలన్నింటి మీద ఉన్నవాళ్ళందరూ శరీరం లో ఏదో ఒక అవయవం మీద బ్యాండేజి కట్లతో దర్శనమిచ్చారు. నాకేమైతే ఇక్కడ చేర్చబడ్డానో కదా అని క్షణకాలం కంపించిన నా మనసును ఓదార్చుతూ కళ్ళతోనే శరీర భాగాలన్నింటినీ ఒకసారి చూసుకున్నా, అంతా ఓకే. అయితే నేనిక్కడ ఎందుకు, ఎలా అని ఆలోచిస్తూ ఈ తలనెప్పేంట్రా బాబూ అనుకుంటూ తలపై చెయ్యేస్తూనే రాజ్యభారం మోయలేని రారాజు నెత్తిన కిరీటంలా బెత్తెడెత్తు మందాన బ్యాండేజి మెల్లగా తగిలింది.

నా ఎదురుగా ఉన్నవాళ్ళందరికీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళెవరో పక్కనే నిలబడి మందలిస్తూనో, సపర్యలు చేస్తూనే కనిపిస్తున్నారు. నేనిక్కడికి వచ్చిన కారణమేంటో తెలుసుకుందామంటే నా పక్కన ఎవ్వరూ కనిపించలేదు మరి కర్తవ్యమేంటీ అని ఆలోచిస్తున్న నాకు మా పక్కింట్లో ఉండే నా స్నేహితుడు అంజి గాడనే శెట్టిగారి ఆంజనేయులు కనిపించాడు. మా స్నేహానికి పాతికేళ్ళ వయసు.

అంతవరకూ కేరళ నర్స్ సిస్టర్ స్టెల్లాకు సీరియస్ గా లైనేస్తూ అందులో వర్కౌట్ కాకపోయేసరికి వెనకెటికెవరో ‘కసి పోక మసి పూసుకున్నట్టు’ ఏం చూసుకుని దీనికింత టెక్కో అనుకుంటూ నా వైపు వస్తూ కనిపించాడు. నాకేమైందో తెలుసుకుందామని నోరు విప్పబోయేంతలో వాడే, ఏరా బావా లేచావా నేనింకా లేచిపోయావనుకున్నానే అంటుంటే ‘శుభం పలకరా పెళ్ళికొడుకా అంటె పెళ్ళికూతురు ముండేది’ అని అడిగిన సామెత గుర్తొచ్చి మనసు బాధగా మూల్గింది.

ఇచ్చోటికి నా ప్రస్థానం వెనకునున్న కారణంబేదో తెలుసుకొనుటయే నా ప్రథమ కర్తవ్యమ్ముగాని వీడి వ్యర్ధ ప్రశ్నలతో నాకేమని, మళ్ళీ వాడిని అడగబోయేయంతలో మెల్లగా బంధువుల, స్నేహితుల, పరిచయస్తుల రాక మొదలైంది.

ఆ వచ్చిన వాళ్ళలో మా చిన్ననాటి తెలుగు మేస్టారు మా నాన్నగారి సహోపాధ్యాయులు క్రిష్ణయ్య గారు కూడా ఉన్నారు. ఎందుకో ఆయన్ను చూస్తూనే నా తలపై గాయానికి ఆయనకు ఏదో లింకున్నట్టనిపించింది. ఉరుము లేని వానలా వచ్చినాయన వచ్చీరావడం తోనే, ఏంట్రా గవాస్కర్ తలపై అంత పెద్ద దెబ్బ ఎలా తగిలిందిరా భడవా, అయినా ఈ వయస్సులో కూడా క్రికెట్ ఆడటమేంట్రా అంట్ల వెధవా, నీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళౌతున్నారు కనీసం నీ వయస్సుకన్నా గౌరవమియ్యలేకపోయావుట్రా మూర్ఖుడా అని తిట్ల వర్షంతో తడిపి ముద్దచేసిపారేశారు. అసలే తెలుగు మాస్టారు ఆపై వారి మాటలు కూడా రాగయుక్తంగా ఉండటం వల్ల ఆయన తిట్లతో తూట్లు పొడిచినా ఎవరూ ఆట్టే పట్టించుకోరు.


ఆయన ప్రశ్నలకు సమాధానంగా, మా అంజి గాడు మరేంలేదండోయ్ మేస్టారు గారు, మా బావగాడు బాత్ రూంలో ఉండగా షర్ట్ కిందపడ్డదండి అంతే తలకు దెబ్బతగిలింది అని అంటూ ఉండగానే, షర్ట్ కిందపడటానికి తలకు దెబ్బ తగలటానికి సంబంధమేంట్రా అక్కుపక్షి అని అనడం ఆ షర్ట్ లోనే కదండీ వీడుంటా అని అంజిగాడనడం ఒకేసారి జరిగిపోయాయి. ఇదే సమాధానం నేనెప్పుడెప్పుడో మా ఆవిడకి చెప్పినట్టు లీలగా జ్ఞాపకముంది.

మెల్లగా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక మా అంజిగాడు సీరియస్ గా, ఒరే బావా నిజం చెప్పు. ఇది మా చెల్లాయి టెంకిజెల్ల ఎఫెక్టయితే కానే కాదు, మరే ముచ్చుకొని కొడితే ఇంత భారీ ఎఫెక్టయింది అనడిగాడు. ముందుగా సీరియస్ మాటర్ అడుగుతుంటే ఆ నవ్వేంట్రా నా కుక్క చింతకాయ అంటూ నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.

అంతసేపూ అసలు విషయాన్ని మరచిపోయిన నేను కూడా జరిగింది గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించాను.

చివరాఖరుకుగా నాకు గుర్తున్నది, శనివారం పని తొందరగా అయిపోవడంతో ఒంటిగంటకు ఇంటికొచ్చి భోజనం చేసి కాసేపు నిద్రపోవడం ఆ నిద్రలో ఒక కలగనడం, దాని ప్రభావం నిద్రలో ఏదో వాగడం వంటింట్లో ఏదో పనిలో ఉన్న మా ఆవిడ రావడం ఒక భారీ విస్ఫోటనం శబ్దం రావడం తర్వాత నేనిక్కడ స్పృహలోకి రావడం ఒకదాని వెంట ఒకటి నా మనోఫలకంపై రీలు తిరిగింది.

కానీ ఆ కల ఏంటో జ్ఞప్తికి రాలేదు. అసలే మెదడంతా వేడెక్కి ఉందా..అందుకే ఇంకా దాని మీద ఒత్తిడి పెంచలేకపోయాను. కొంచెం విరామం తర్వాత మళ్ళీ జ్ఞాపకాల దొంతరను లాగడం మొదలుపెట్టాను. ఆ కలలో...

ఒక విశాలమైన పూదోట మధ్యలో ఒక అద్భుతమైన భవంతి కనిపించింది. నన్ను చూడగానే అక్కడున్న గేట్ కీపర్, రండి మీకు స్వాగతం అన్నాడు. వీడు నిజంగా నన్నే పిలుస్తున్నాడా లేక వేరెవరినా అనుకుంటూ పరిసరాలను గమనించాను. మళ్ళీ అతనే, మిమ్మల్నే సార్, లోపలికి దయచేయండి అనడంతో ముందడుగేస్తూ ఇదేంటోయ్ అనడిగాను. ఇది స్వర్గమండీ. అని సమాధానమిచ్చాడు.

నా అదృష్టానికి లోలోనే పొంగిపోతూ అందులో అడుగెట్టాను. ఆహా ఏమా భవన సోయగం గోడలు పైకప్పు అంతా బంగారం మరియు వెండితో మెరిసిపోతున్నాయి. కానీ నాకెందుకో అక్కడెవరూ కనిపించలేదు. ఉన్నట్టుండి మనసులో దేవకన్యలెవరైనా కనిపిస్తే బాగుండు, లేకపోతే కనీసం నూనూగు మీసాల నూతన యవ్వనమందు నేను ప్రేమించిన రమాప్రియ అయినా కనిపిస్తే బాగుండుననిపించింది. ఊహూ లాభం లేదు. నలుపక్కలా కళ్ళు చికిలించుకుని చూసినా లాభం లేకపోయింది. కళ్ళకు సులోచనాలు లేకపోవడం వల్ల దూరంగా ఉన్నవేవీ అట్టే స్పష్టంగా కనిపించడంలేదు. ఏదైతే అదౌతుందనుకుని ముందడుగేసాను.

కొద్ది దూరంలో ఒక ఆకారం లీలగా నాకు చెయ్యూపుతూ కనిపించింది, ఆహా ఏమి నా అదృష్టం ఒక దేవకన్య నన్ను పిలుచుచున్నది కదా సంతోషంతో ముందుకు నడవసాగాను. ఆ ఆకారాన్ని దగ్గరగా చూసేటప్పటికీ ఈ ముఖారవిందాన్ని ఎక్కడో చూసినట్టు జ్ఞాపకముందే అనుకున్నాను. ఆమె పదే పదే నా పేరు పెట్టి నన్ను పిలుస్తుండడంతో వెంటనే ఆమెను పోల్చుకుని పండుగనాడూ పాత మొగుడేనా? నాకు కొత్తదనం కావాలి అంటూ పరుగు లంకించుకున్నాను. ఆవిడా నా వెనుకే వస్తోంది. ఎక్కడ దొరికి పోతానే అన్న భయంతో చిన్నగా కేకలేసుకుంటూ ద్వారబంధం తెరుచుకుని బయటపడ్డాను. అక్కడ నేను చూసినావిడ మరెవరో కాదు ఆవిడా మా ఆవిడే.

నిద్రలో నా కేకలకు భయపడి వంటింట్లో నుండి మా ఆవిడ రావడం నన్ను గట్టిగా తట్టి లేపడంతో ఆ పగటి కల నుండి బయటికొచ్చాను. ఏం జరిగిందని మా ఆవిడ అడుగుతూనే, గుండమ్మ కథలో ఎన్.టి.ఆర్. లా నిజం చెప్పమన్నావా, అబద్ధం చెప్పమన్నావా అని అందామనుకుని ఏమౌతుందిలే అనుకుని నిజాన్ని నిర్భయంగా చెప్పటం, కోపంతో ఊగిపోతూ చేతిలో ఉన్నదాంతోనే మా ఆవిడ నా నెత్తిన మోదటం నాకు స్పృహ తప్పటం అన్నీ ఒకదాని వెనుక ఒకటి జరిగిపోయాయి.

మామూలుగానే నా తలకు కొంచెం గట్టిదనమెక్కువ అలాంటిది మా ఆవిడ దెబ్బకు తల ఆకారమే మారిపోయినాదేమబ్బా అని ఆలోచిస్తూంటే నాకొక విచిత్రమైన రీజనింగ్ తట్టింది.

హైస్కూల్ లో ఎనిమిదో తరగతిలో అనుకుంటా కృష్ణయ్య గారి తెలుగు పిరియడ్లో వెరైటీగా ఉంటుందని అమావాస్యను అమావేశ్య అనటం, ఆయన కోపంతో ఊగిపోతూ నా తలను గోడకేసి బాదడం వల్ల, అంతరిక్షానికెల్లే వ్యోమనౌకకు టేకాఫ్ సమయంలో ధర్మల్ షీట్ ఊడిపోయినట్లు నా తల గోడపై కూడా ఎక్కడైనా సన్నపాటి బొక్కడిపోయిందేమో!

అంతా విన్న అంజిగాడు గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం లో గిరీశంలా, బావా నీ పగటికల ఇతరులకో గుణపాఠం లాంటిదోయ్, నీ అనుభవాల్ని ఇతరులకు కూడా తెలియపర్చితే కనీసం కొంతమందైనా నిద్రలో ఎక్కువగా మరీ ముఖ్యంగా పగటినిద్రలో వాక్కుండా ఉంటారు అని సలహా ఇచ్చాడు.
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech