ఓ బ్రహ్మచారి

                                                            - తరిమిశ జానకి

  గదికి తాళం వేసి దివాకర్ వెనక్కి తిరిగేసరికి ఎదురింటి వరండాలో ఎప్పటిలా దర్శనమిచ్చారు రంగారావు గారు. రోజులాగే ఆయన ముఖంలో పలకరింపుగా చిన్న చిరునవ్వు. నల్లగా, లావుగా ఉంటాడు. బడిపంతులుగా ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు.

కొత్తగా ఈ వీధిలో తెల్ల డాబా ఇంట్లో ఓ గది అద్దెకి తీసుకున్నాడు దివాకర్.
నిజం చెప్పాలంటే అతను ఉద్యోగంలో చేరిందీ కొత్తే. ఆ డాబా ఇంట్లో ఓ గదిలో ఇతనుంటే, పక్కనున్న మూడు గదుల పోర్షన్ లో ఓ దంపతులున్నారు.
ఇక ఎదురిల్లు రంగారావుది.
ఎలాగైనా సరే పరిచయం పెంచుకోవాలని ఆయన పడే తాపత్రయం విసుగు పుట్టిస్తూ ఉంటుంది దివాకర్ కి. లేకపోతే ఏమిటి,? అనుకుంటూ ఉంటాడు రోజుకి ఓసారయినా.
ఆయన గారికో కూతురుంది. పెళ్ళి కావాల్సిన పిల్ల. తనేమో బ్రహ్మచారి. చిన్న వయసువాడు, ఉద్యోగస్తుడు. అది చూసేగా తనని ఎలాగైనా సరే బుట్టలో వేసుకుని కూతురి పెళ్ళి చేసేయ్యాలని చూస్తున్నాడు. అందుకే ఈ ఆలోచనతోనే పరమ విసుగు ఆయనంటే.
ఎక్కడ లేని చిన్న చూపు ఆయనమీద. ఒక రోజు కాఫీ, టిఫిన్ కి పిలిచాడు వాళ్ళింటికి.
ఏదో చెప్పి తప్పించుకున్నాడు. వెళ్ళవేదు.
మరొక రోజు...
ఆ రోజు...
తలుపు మీద చిన్నగా వేళ్ళతో కొట్టిన శబ్దమై తీశాడు తలుపు.
ఎదురుగా చిరునవ్వుతో ఈ మహానుభావుడు.. ‘చచ్చాం’ అనుకున్నాడు మనసులో.
‘ఏం కావాలండీ? అన్నాడు పైకి. లోపలికి రమ్మనలేదు. కూర్చోమనలేదు.
‘లోపలికి రావచ్చునా? అంటూనే ఓ అడుగు గదిలో వేశాడాయన.
‘రమ్మనకపోయినా వచ్చేశావుగా’ తిట్టుకున్నాడు లోలోపల.
‘రేపు ఆదివారం, పండగా రెండూ కలిసొచ్చాయి...ఒకవేళ ఈ పండక్కి మీకు సెలవు ఇవ్వరని నువ్వు అన్నా ఆదివారం నాడు ఎలాగూ సెలవే కదా! అందుకని రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. ఈ మాట చెప్పాలని వచ్చాను. ఎంతో నెమ్మదిగా మృదువుగా పలికింది రంగారావు కంఠం.

ఎలాగైనా సరే మీ ఇంట్లో టిఫిన్లకీ, భోజనాలకీ నన్ను ఒప్పించి, కాకా పట్టి ఇరకాటంలో పెట్టి చివరికి బుట్టలో వేసుకుని కూతుర్ని పెళ్ళి చేసుకోమని అడగాలని పెద్ద ప్లానే వేశావులే ముసలాడే. .. ఆ మాత్రం అర్ధం చేసుకోలేని పసివాడిని కాను. . ఓ ..సారీ....పసివాడినైతే నీ కూతుర్ని కట్టబెట్టాలని ఎందుకు చూస్తావు? మందమతిని కాను..ఈ విషయం తమరు తొందరగా అర్ధం చేసుకుని జిడ్డులా నన్ను పట్టుకోవడం మానేస్తే మంచిది.
బి.ఏ పాసయ్యాను. గవర్నమెంటు ఉద్యోగం, అందగాడిని, నాకు నీ అనాకారి కూతుర్ని అంటకట్టేసి గుండెల మీంచి బరువు దింపేసుకుని నిశ్చింతగా నిద్రపోదామనుకుంటున్నావా? నేనంత తేలిగ్గా నీకు లొంగే ఘటాన్ని కాను. అందమైన పిల్లనే చేసుకుంటాను. ముప్పయ్ వేలు నా మినిమమ్ రేటు అంతకి ఎక్కువే తప్ప ఒక్క పైసా తగ్గినా అటువంటి సంబంధం వంక కన్నెత్తయినా చూడను. అఫ్ కోర్స్ ... కాలేజీలో చదివే రోజుల్లో కట్నాలెవరూ పుచ్చుకోకూడదనీ, కట్నాలు తీసుకున్న వాళ్ళని శిక్షించాలనీ డిబేట్స్ లో మాట్లాడి ప్రైజులు కొట్టుకోలేదు నేనూ.. అవన్నీ డిబేట్స్ వరకే పరిమితం. ఆచరించి చూపిస్తానని కంకణం కట్టుకోలేదు నేను. మహా మహా నాయకులే వాళ్ళు చేసిన వాగ్దానాలు వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు. ఆఫ్టరాల్ నా బోటి వాడోలెక్కా? నువ్వేమాత్రం తాహతులో ఉన్నావోనేనూహించు కోగలను. పైగా నీ కూతురు అందగత్తె కాదు. అటువంటప్పుడు నాలాంటి బి.ఏ. వాడు కాదు కదా - ఇంటర్మీడియట్ వాడు కూడా అల్లుడుగా దొరకడు నీకు...’
ఏవిటి...ఆహా...దొరికావు కాదయ్య...మెల్లిమెల్లిగా ఇలాగే భోజనాల దగ్గర మా తాహతకు తగ్గట్టు అంటూ మొదలు పెట్టి...రేపొద్దున్న...ఏదో మా తాహతుకి తగ్గట్టు సింపుల్ గా పెళ్ళి చేస్తాను. కట్నం ఏమీ ఇచ్చుకోలేను. నా కూతుర్ని కట్టుకో బాబూ! అంటావు... అంతేలే...అర్ధమైపోయింది నీ ట్రిక్కు.
‘మీ ఇంటికి రాలేను’ అన్న మాట కొంచెం కటువుగానే వచ్చింది.
అయినా అదేమీ గమనించినట్టు లేదు రంగారావు. ఆయనటు వెళ్ళగానే ‘అమ్మయ్య...ఇవ్వాల్టికి వదిలాడు బాబూ’ అనుకుంటూ ఓ దండం పెట్టుకున్నాడు దివాకర్.

* * *
వరండాలో కూర్చునున్న రంగారావుకు ఆశ్చర్యంగా ఉంది.
ఎనిమిదిన్నరయింది - తొమ్మిదయింది - తొమ్మిదిన్నర కూడా అవుతోంది...ఇంతవరకూ దివాకర్ వీధి తలుపు తియ్యకపోవడం...ఆఫీసుకి బయల్దేరకపోవడం ఆశ్చర్యమే మరి! రోజూ ఎనిమిదిన్నరకల్లా ఇంట్లోంచి బయల్దేరి పోతాడు. తిన్నగా ముందు హోటల్ కి వెళ్ళి కావలసింది తిని అప్పుడు అటునుంచి ఆఫీసుకి వెళ్ళిపోతాడు. అసలు నిద్ర లేవగానే వీధి తలుపు తీస్తాడు. అటువంటిది తొమ్మిదిన్నర అవుతున్నా తలుపే తియ్యలేదు. ఇవాళ ఆఫీసుకి సెలవు రోజేం కాదు..ఒకవేళ..ఒంట్లో బాగులేక అసలు లేవలేదేమో! అంతే అయి ఉంటుంది.
ఈ అలోచనతో ఉలిక్కిపడ్డాడు రంగారావు..దివాకర్ పక్క పోర్షన్లో ఉండే సత్యానందం భార్య అనసూయక్కూడా తెల్లారి లేచినప్పటినుంచి సందేహంగానే ఉంది. ఇంత పొద్దెక్కినా అతనింతా నిద్ర లేవకపోవడం ఏమిటా అని.

రోజూ ఆరింటికల్లా లేస్తాడు. లేచాక పళ్ళు తోముకోవడం దగ్గర్నించి అన్ని పనులకీ అతను పెరట్లోకి రావల్సిందే. ఇవాళింత వరకూ పెరట్లోకే రాలేదు.
ఉండబట్టలేక భర్తతో అంది ఆ మాట.
సత్యానందం అసలే అనుమానమ్మనిషి. గయ్యిమంటూ లేచాడు ఇంతెత్తున.
‘ఏం? అత నెంతసేపు నిద్రపోతే నీకేం? బయటికి రాకపోతే నీకేం? తెల్లారి లేచాక అతగాడి మొహం కనపడకపోతే ఏ పని మీదకి నీ మనసు పోవట్లేదా?
ఛ...ఛ...ఛ...తన భర్త అనుమానప్పక్షి అని తెలిసి కూడా ఆయన గారితో ఈ మాట అనడం ఎందుకూ? బుద్ధిగడ్డి తినడం అంటే ఇదే కాబోలు...
పాపం ఒంటరి వాడు...బుద్ధిమంతుడు...అతని వాళ్ళన్న వాళ్ళు ఎక్కడో దూరాభారాన ఉన్నారు. తన తమ్ముడి ఈడు వాడు..ఒంట్లో బాగులేదో ఏమిటో? కాస్త కనుక్కుంటారేమో గట్టిగా చెంపలేసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది.

* * *
మరి ఒక్క క్షణం ఆగలేకపోయాడు రంగారావు. గబగబా చెప్పులేసుకుని ఎదురింటికి నడిచాడు...దివాకర్ గది తలుపు మీద చిన్నగా కొట్టాడు.
జవాబు లేదు.
మరోసారి కొట్టాడు..ఏ అలికిడీ లేదు..
మూడోసారి కొట్టాక..‘ఊ’ అంటూ చిన్నగా మూలుగులా వినబడింది.
అప్పుడిక వెయిట్ చేశాడు కాసేపు.
అడుగుల చప్పుడయ్యింది. మెల్లిగా తెరుచుకుంది తలుపు.
తలుపు తీసిన దివాకర్ని చూస్తూనే రంగారావు మొహంలో జాలి కదలాడింది.
ఆయన్ని చూస్తూనే అతని కళ్ళల్లో విసుగు తొంగి చూసింది.
‘ఏవిటి బాబూ? ఒంట్లో బాగులేనట్టుందే? ఇంత పొద్దెక్కినా తలుపే తియ్యలేదు...
ఇవతలికే రాలేదేమిటా అని..ఉండబట్టలేక చూద్దామని వచ్చాను.
‘ఆ...రాత్రి నుంచీ హఠాత్తుగా జ్వరం...బాగా ఎక్కువగా వచ్చేసింది...అసలు లేచే ఓపిక లేదు..’ మాట పూర్తి చేస్తునే వెళ్ళి మంచం మీద అడ్డంగా పడ్డాడు.
పాపం అనిపించింది ఆయనకి.
జాలితో మనసు నిండిపోయింది.
గబగబా ఇంటికి వెళ్ళి భార్య చేత కాఫీ కలిపించి తీసుకువచ్చి తాగించాడు దివాకర్ చేత. అయిష్టంగానే తాగాడు..తప్పనిసరిగా, ఆ అయిష్టం...తాగాలని లేక కాదు..రంగారావు తీసుకొచ్చినందువల్ల కలిగిన అయిష్టం అది జ్వరం కంటే ఎక్కువగా బాధిస్తున్న విషయం ఇది.
‘మీ డాక్టర్ ఎవరు బాబూ? చెపితే వెళ్ళి తీసుకు వస్తాను కూడా ఉండి..’
అక్కర్లేదు..మీరు తీసుకురావక్కర్లేదు. నేను వెళ్ళగలను రిక్షాలో..పుల్ల విరిచినట్టే జవాబిచ్చాడు టక్కున.
సరే అయితే..సాయంగా నేను కూడా వస్తాను హాస్పిటల్ కి..ఎంతో మృదువుగా, ఈ మాత్రం సహాయం కూడా చేసుకోకపోతే ఎందుకూ అన్నంత మామూలుగా ఉంది ఆయన మాట.
ఇక రెట్టించే ఓపిక లేక ఊరుకున్నాడు కానీ, లేకపోతే ఆయన్ని తనతో హాస్పిటల్ కి రానిచ్చేవాడు కాదు దివాకర్.

* * *
ఆ రోజు ఆదివారం. స్నేహితుడొకడిని కలుసుకోవాలని బయటకి బయల్దేరాడు దివాకర్. వీధిలోకి వచ్చేసరికి ఎదురింటి గేటు దగ్గర ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు రంగారావు. నవ్వుతూ పలకరించారు దివాకర్ని. రాబాబూ.. మా శేఖర్ని పరిచయం చేస్తాను.
ఆ శేఖర్ అన్న వ్యక్తి వైపు పరీక్షగా చూస్తూ తప్పనిసరిగా మొక్కుబడి కోసం అన్నట్లు వాళ్ళవైపు నడిచాడు దివాకర్.

చూడడానికి అందంగా ఉన్నాడు. చదువుకున్న వాడిలానే ఉన్నాడు. మొహంలో నమ్రత, కళ్ళల్లో స్నేహభావం ఉట్టిపడుతున్నాయి. అతను నిలబడి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే పెద్దలంటే భక్తి గౌరవాలు ఉన్నట్టే ఉన్నాయి.
ఇదీ శేఖర్ గురించి ఆ కొద్ది క్షణాల్లో దివాకర్ కి కలిగిన అభిప్రాయం.
ఇతను నా మేనల్లుడు. కాబోయే అల్లుడు కూడా. మా అమ్మాయినే చేసుకుంటానని ఏనాడో చెప్పాడు. ఎమ్.డి. చేస్తున్నాడు. అది పూర్తయ్యే దాకా ఆగాలని ఆగాము. పై నెల్లో ముహూర్తం పెట్టించేస్తాను. పైసా కట్నం పుచ్చుకోనని కూడా ముందే చెప్పేశాడు. మేనరికం కదా అని తప్పనిసరిగా చేసుకోమని పెద్దవాళ్ళం మేము ఎవరం అడగలేదు. అమ్మాయీ, అబ్బాయీ మనస్ఫూర్తిగా ఒకరికొకరు ఇష్టపడ్డారు.
శేఖర్ని పరిచయం చేస్తూ రంగారావు గారు చెప్పుకుపోతున్న మాటలు వింటుంటే కత్తివాటుకి నెత్తురు చుక్కలేనట్టు తెల్లగా పాలిపోయింది దివాకర్ మొహం.
బొమ్మల్లే.. మనిషిలో కదలికే లేకుండా నిలబడి పోయాడు..
నమస్కారమండీ...వినయంగా, స్నేహపూర్వకంగా చేతులు జోడించాడు శేఖర్.
అప్రయత్నంగానే ప్రతి నమస్కారం చేశాడు దివాకర్.
మీ గురించిన పరిచయ వాక్యాలు ఇదివరకే ఉత్తరంలో నాకు రాశాడు మావయ్య.
చిరునవ్వు తొణికిసలాడింది శేఖర్ పెదవుల మీద.
తన గురించి ఉత్తరంలో రాశారా ఈయన? ఆశ్చర్యమే అనిపించింది దివాకర్ కి.
కొత్తగా ఉద్యోగంలో చేరిన కుర్రాడొకడు..బుద్దిమంతుడు..ఎదురింట్లో అద్దెకి దిగాడు. వాళ్ళ వాళ్ళెక్కడో పాపం దూరానున్నారు అంటూ మావయ్య మీ గురించి ఉత్తరంలో రాశాడొకసారి.
తన మనసు తననే హేళన చేస్తూ నవ్వినట్టనిపించింది దివాకర్ కి. నేలకి అంటుకుపోయాయి చూపులు.
మావయ్యకి కూతురొక్కత్తే కాదు..ఓ కొడుకు కూడా ఉండేవాడు. ఎక్కడో దూరపు ఊళ్ళో ఉద్యోగం రావడం..ఉద్యోగంలో చేరిన కొత్తలోనే పోవడం జరిగిపోయింది...
శేఖర్ గొంతులో జీర గమనించాడు దివాకర్. చటుక్కున తలెత్తి రంగారావు గారి మొహంలోకి చూశాడు.
ఔను బాబూ! చేతికి అందివచ్చిన కొడుకుని విధి నాకు దూరం చేసింది. బ్రహ్మచారి అయిన ప్రతీవాడూ కోతి వెధవ, రౌడీ అనుకుంటే ఎలా బాబూ? బ్రహ్మచారి కదా అని ఇరుగు పొరుగు వాళ్ళూ మా వాడిని కాస్త దూరంగానే ఉంచేవారట.
ఓసారి హఠాత్తుగా విషజ్వర మేదో ముంచుకొచ్చి..ఒక రోజంతా వాడు గది తలుపు తియ్యకపోయినా ఇరుగు, పొరుగూ ఎవ్వరూ పట్టించుకోలేదట..ఎవరికి వాళ్ళే మాకెందుకు లెమ్మని..నాకు కబురు తెలిసేసరికి ఆలస్యమైపోయింది. .. నేను వెళ్ళేసరికి కొనప్రాణంతో ఉన్నాడు. వైద్యానికి వెంటనే తీసుకురావాలి గానీ లాస్ట్ మినిట్ లోనా రావడం అని డాక్టర్లు కేకలేశారు. వైద్యం ఆలస్యం అవడం వల్ల పోయాడు.. రంగారావు గారి కళ్ళల్లో మెరిసిన తడి దివాకర్ మనసు లోపలి పొరల్ని వెచ్చగా తాకింది.
తాను పాతాళంలో ఉన్నట్టూ, తన ఎదురుగా ఉన్న ఇద్దరూ తనకంటే ఎంతో ఎత్తున ఉన్నట్టూ భావన కలిగింది.
తనలోని అహాన్ని కడిగేందుకు హృదయం చిమ్మిన కన్నీటిని దాచుకునే ప్రయత్నం చెయ్యలేదు దివాకర్.
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech