అమెరికా ఇల్లాలి ముచ్చట్లు -  యాంకరింగు

                                                                శ్యామలాదేవి దశిక, North Bruswick, NJ

 

ఏమిటీ ? ఎవరిమీద అలా విసుక్కుటున్నావు అంటారా ?

విసుగు కాదు ఒళ్ళు మండిపోతోంది! రోజు ఏదోలే అని సరిపెట్టుకున్నా ఒక్కొక్క రోజు వీళ్ళ మాటలు వింటుంటే కోపంతో పాటు దుఖం తన్నుకొస్తుంది.

మీకు తెలుసో లేదో !

ముల్లపూడి ఇక మనకు లేరు.

అన్ని రంగాల వారు వచ్చి  రమనకు నివాలి అర్పించారు.

తన కలంతో సినీ కలారంగానికి ఎంతో కలాపోసన చేసిన ముల్లపూడి మన అందరినీ వదిలి వెల్లిపోయారు.

ఆయన దవలేస్వరoలో పుట్టారు.

 రమన, బాపు ల మద్య వున్న బందం మన అందరికీ తెలిసిందే.

ఏమిటీ అలా తెల్లబోయి చూస్తారు ?!

ఇవి నా మాటలు కావు. ఆ మహానుభావుడి గురించి  సో కాల్డ్ యాంకరు గారు చెప్పిన మాటలు.

లక్షలాది ప్రజలు చూసే బుల్లి తెరలో యాంకరు అవ్వాలంటే అక్షర జ్ఞానం అక్కర్లేదు. కాస్తంత అందంగా (మిగతాది మేకప్పుతో ఎలాను మేకప్ అయిపోతుంది ) వుండి టింగురంగ అని వుంటే చాలు !     

వెనకటికి  ఓ నా మా లు  రాని వాడు  భాష  మీద గ్రంధం రాసాను చదవమన్నాడుట,  

అలా వుంటుంది వీళ్ళ వ్యవహారం !

మొన్న శివరాత్రి మహత్యం గురించి అంటే ఆసక్తిగా టీవీ ముందు కూర్చున్నా. తీరా చూస్తే  

 ఈ పండగ సందర్భంగా టీవీ ప్రేక్షకులకు షివరాత్రి షుబాకాంక్షలు అంటూ షివుడి మీద సినిమా పాటలు వేసారు !

నెలరోజులనాడు ఓ పేరున్న గాయని గురించి మాట్లాడుతూ

 శ్రీమతి మంగల గారి గలం నుంచి జాలు వారిన పాటలు .......................అంటూ మొదలెట్టింది!

బహుశ టీవీ లో యాంకరు గా చేరాలంటే పదిహేను నుంచి ఇరవై లోపు మాత్రమే వుండాలని రూలు ఏదో వుండి వుంటుంది. లేకపోతే వార్తలు చదివే వాళ్ళ దగ్గర నుంచి వారఫలాలు చెప్పే వాళ్ళ వరకు చిన్న వాళ్ళే ఎందుకుటా ?

పైనుంచి వీళ్ళందరూ అంత పెద్ద వాళ్ళను పట్టుకుని రమణ, బాపు, సుందరామ్మూర్తి అంటూ ఏక వచన ప్రయోగాలు.

యాంకరింగు ఎటువంటి కార్యక్రమానికి చేస్తున్నారో ఆ సబ్జెక్ట్  లో వీళ్ళకు ఏమాత్రం ప్రవేశం వుండదనుకుంటా. వీళ్ళకు తెలిసిందల్లా షోగ్గా తయారై ఒక చేత్తో మైకు పుచ్చుకుని మరో చేత్తో చీర కొంగు కనిపించేటట్లు పట్టుకుని కళ్ళు

తిప్పుతూ మాట్లాడ్డం .

మినపప్పు తో గారెలు చెయ్యచ్చని ఇప్పుడే వింటున్నాను చెఫ్ గారు  అనే వాళ్ళు,

కూర ముక్కలు ఉడక పెట్టేటప్పుడు పసుపు వేస్తారా ? అని ఆశ్చర్య పడేవాళ్ళు  వంటల ప్రోగ్రాం లో యాంకర్లు !

టిప్పు టాపుగానో లేక వెస్ట్రన్ స్టైల్ లో బిగుతుగానో  బట్టలేసుకుని మైకు పెట్టుకున్నంత మాత్రాన యాంకర్లు అయిపోరు. తెలుగు ఛానల్ లో తెలుగు ప్రోగ్రాములో యాంకర్ అయినా తెలుగులో మాట్లాడితే ఎక్కడ  తేలికై పోతామో అని  భయం ! ఇక వాళ్ళు అడిగే సిల్లీ ప్రశ్నలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియదు.

మా పెళ్లి అయి నలభయి సంవత్సరాలైంది  అని సంతోషంగా చెప్తున్న దంపతులను .. మారీడ్ లైఫ్ ఎలా వుందీ ? మారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారా ?  అంటూ కొత్త దంపతులను అడిగినట్టు అడుగుతారు.

మూడు తరాలు కలిసి వుంటున్న వాళ్ళను  ఉమ్మడి కుటుంబం మీద మీ అభిప్రాయం ఏమిటీ?  అని ప్రశ్నిస్తారు.

అవతలి వ్యక్తి ఏం చెప్పారో వినకుండా, చెప్పింది అర్ధం చేసుకోకుండా  బట్టీ పెట్టిన ప్రశ్నలు వేసి జర్నలిస్టులం అనుకుంటారు.

తన జీవితం అంతా నాటక రంగానికే అంకితం చేసిన ఓ రంగస్థల కళాకారుని ఇంటర్వూ చేసింది ఓ పిల్ల యాంకరు !

ఆయనకు నాటకాలంటే ఎంత మక్కువో చెపుతూ ఈ చుట్టు పక్కల ఎక్కడ నాటకం వేసినా ప్రదర్శన తర్వాత నాకూ, మా  బృందానికీ ఏ వేళ అయినా సరే నా భార్య వేడి వేడి భోజనం వడ్డిస్తుంది అని చెప్పారు.

ఈ యాంకరు ముద్దుగుమ్మ  చివరి ప్రశ్న, రంగస్థల నటుడిగా మీకు మీ భార్య సహకారం ఎంతవరకు వుందీ? అని అడుగుతుంది !

పెద్దవారిని, విశిష్టమైన వ్యక్తుల్ని ఇంటర్వూ చేసేవాళ్ళకు ఒక  అర్హత, సమర్ధత  వుంటేనే ఆ కార్యక్రమానికి  ఓ అందం, నిండుతనం లేదంటే రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందీ  అన్నట్టు వుంటుంది.  గాంధీ గారి జయంతి నాడు ప్రత్యేకంగా పెట్టిన ప్రోగ్రాం చూసాను. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న, తండ్రీ పిన తండ్రుల ప్రభావంతో చాలా చిన్నవయసులోనే  గాంధీ గారి సూత్రాలను అర్ధం చేసుకుని ఇప్పటికీ పాటిస్తున్న వ్యక్తి ఆయన.  నిరాడంబరంగా ఖద్దరు బట్టల్లో వున్న ఆ పెద్ద మనిషి తన అనుభవాలు, అభిప్రాయాలూ చక్కగా చెప్పారు.  పై నుంచీ కింద వరకు నగలు పెట్టుకున్న ఈ యాంకరు గారు బండి చక్రాలంత చెవి రింగులు వూపుకుంటూ

 మీ మీద  గాంధీ గారి ప్రభావం ఎంత వరకు వుందీ?  అని అడుగుతుంది !

వీళ్ళ మాటలు, ప్రశ్నలు, ఆడంబరాలు చూస్తుంటే నాకు  ఓ పిట్ట కధ గుర్తొస్తుంది !

నాలుగు రోజుల కిందట పుట్టిన ఓ చిట్టెలుక చెంగుచెంగున వెళ్లి,  ఏనుగు ముందు నుంచోని  ఈ అరణ్యంలో నా కంటే పెద్ద జంతువులు వున్నాయంటారు దీనిపై నీ అభిప్రాయం ఏమిటి ?  అని అడిగిందిట !

బుల్లి తెర మీద అన్ని వయసుల వారు వుంటేనే అందం. ప్రేక్షకుల మనసులు దోచుకోవటానికి అంతః సౌందర్యం ముఖ్యం కాని పైపై మెరుగులు కాదు.  కొన్ని సమయాల్లో, కొంతమంది గురించి, కొన్ని విషయాలు మాట్లాడ్డానికి జీవితంలో ఎంతో అనుభవం గడించిన  పెద్ద  వాళ్ళే అర్హులు.

ఏమిటీ ఇలా నేను ఎంత సేపు గింజుకున్నా ఏం లాభం లేదంటారా ? మనం  చేయగలిగింది ఏమీ లేదంటారా?

నిజమేలెండి ఈ యాంకర్లనని ఏం లాభం. యాజమాన్యాన్ని అనాలి.  భాషకు  వయసుకు గౌరవం ఇవ్వాలని వాళ్ళు గుర్తించాలి.  

కానీ  నవ్వుల పళ్ళతో విరగ కాసిన తెలుగుతనంచెట్టు చిటారు కొమ్మన చిద్విలాసంగా కూర్చుని కోతి కొమ్మచ్చి ఆడించిన ఆ ఆత్మీయుడి గురించి అలా చెప్తుంటే నా మనసు తట్టుకోలేక పోయిందండీ.                        

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech