గగనతలము-19          

జ్యోతిషంలో గ్రహణము

 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రపంచమునకు సంఖ్యలు భారతదేశమునుండి వ్యాపించాయని మనము చాలా గర్వముగా చెప్పుకుంటాము.  మొదట ఈ సంఖ్యలు అరేబియా నుండి వచ్చినట్లు చరిత్రకారులు భావించినా తరువాతికాలములో వారు ఈ సంఖ్యలు భారతదేశమునుండి మిగిలిన ప్రపంచమునకు అందినవని నిర్థారించినారు. డిస్మల్ పద్ధతి (ఉదాహరణకు 2.1, 2.5) ఆర్యభటుడు ప్రపంచానికి ఇచ్చిన కానుక అని కూడా వారు అంగీకరించారు. దీనిని మనము దశమలవపద్ధతి అంటాము. ఈ దశమలవ నుండే డిసమల్ పుట్టింది. π ఈ గుర్తును మనము పై అంటాము. ఇది ఒక వృత్తములో పరిధికి మరియు వ్యాసమునకు గల సంబంధమును సూచిస్తుంది అన్నమాట. దీని మానమును ఆధునిక మానముతో సమానముగా 5 వ శతాబ్దములో చెప్పినవాడు ఆర్యభటుడు. ఆ ఆర్యభటునికి జ్యోతిషంద్వారా సాధించినగ్రహములతో మనుషుల జాతకాలు చెప్పడము మాత్రము అసలు కిట్టదు. దాని పేరు ఎత్తకుండానే ఆయన దానిని తన గ్రంధములో వ్యతిరేకించారు.

          ఆ ఆర్యభటుడు జ్యోతిషగ్రంధమును రచించినవాడు. ఆయనను మొదటి పౌరుష జ్యోతిష గ్రంధకారునిగా గుర్తించారు జ్యోతిష చరిత్రకారులు.  ఆయన భారతదేశానికి తెచ్చిన గొప్ప పేరుకు గుర్తుగా 1975 సంవత్సరములో భారతదేశము మొట్ట మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహమునకు ఆయన పేరు పెట్టింది.

          మిగిలిన జ్యోతిషగ్రంధకర్తలవలె ఆర్యభటుడు కూడ గ్రహణముగురించి వివరించారు తన గ్రంధములో.  సొంతముగా నిర్మించుకున్న యంత్రముల ద్వారా నీడను బట్టి మరియు ఆకాశములో గ్రహములు కనబడే స్థానమును బట్టి మన పూర్వీకులు కాలమును లెక్కపెట్టేవారు. ఇప్పుడు మనము గడియారము ఎలా ఉపయోగిస్తున్నామో అప్పుడు వారు ఘటీయంత్రము మరియు జల యంత్రము మొదలగు వానితో ఆ సమయమును చూసుకునేవారు. మనము ఏ విధముగా కాలమును కేలండరు రూపములో నేడు అందుబాటులో ఉంచుకుంచున్నామో అదేవిధముగా వారు కాలమును తెలుసుకోడానికి ఒక విధానాన్ని కనిపెట్టుకున్నారు. ఆ విధానమునకే పంచాంగము అని పేరు. అనగ వారు ఒక సంవత్సరమునకు గాను లెక్క పెట్టిన కాలమును పంచాంగమనే పేరుతో పొందుపరచుకునేవారన్నమాట. కానీ ఆ పంచాంగమును మరియు దాని విశేషతను చర్చించుకోవాలంటే మనము దాని గూర్చి విడిగా చర్చించుకోవాలి. ప్రస్తుతము మనము ఇక్కడ గ్రహణము గురించే విశేషముగా తెలుసుకుందాము.

          ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సిద్ధాంత జ్యోతిషగ్రంధములలో ఎక్కడా గ్రహణము రాహువు వలన ఏర్పడుతుంది అని చెప్పలేదు. సిద్ధాంత జ్యోతిషము జ్యోతిషశాస్త్రములో కాలమును లెక్కపెట్టువిధానమును చెప్పు భాగము. అమావాస్యనాడు సూర్యునికి చందృనికి మధ్య ఎడము ఉండదు. అందువలన చందృడు సూర్యుని కిందకు చేరతాడు. అలా చేరిన చందృడు సూర్యుని మేఘము ఏ విధముగా కప్పుతుందో అదే విధముగా కప్పుతాడు. అందువలన సూర్యుడు మనకు కనిపించడు. దీనినే మనము గ్రహణము ఆంటాము. అనగా ఇక్కడ చందృడు సూర్యుని గ్రహిస్తున్నాడు, పట్టుకుంటున్నాడు అని అర్థము. ప్రతి నెలలో అమావాస్య  వచ్చినా ప్రతీ నెలలో గ్రహణమురాదు. దానికి కారణము చందృడు తన మార్గములో పోవుచూ దక్షిణమునకు లేక ఉత్తరభాగమునందు కొంత ఎడముగా వెళ్లడమే. అంటే ఈ ఎడములేని అమావాస్యనాడు మాత్రమే సూర్యగ్రహణము ఏర్పడుతుందన్నమాట.

          మరి ఆ ఎడము ఎప్పుడు ఉండదు?  చందృడు తన పాత వద్ద ఉన్నప్పుడు ఆ ఎడము ఉండదు. పాత అంటే భూ భ్రమణమార్గము (ఒకవిధముగా సూర్యభ్రమణమార్గము) మరియు చంద్ర భ్రమణమార్గము రెండు కలియు స్థానము. ఈ స్థానమునకే జ్యోతిషములో రాహువు అని పేరు. అందువలన సాధారణముగా అర్థమవుతుంది కాబట్టి గ్రహణము ఏర్పడాలంటే ఈ రాహువనే పాత కూడ చందృనితో ఉండాలి కాబట్టి మనవారు రాహువు వలన గ్రహణము ఏర్పడుతుంది అనేవారు. పండితులు పామరులు అందరికి సమానముగా అర్థమయ్యేలా విజ్ఞానమును పంచి ఇవ్వగలిగే శక్తి సామర్థ్యములు ఉన్న మనవారు ఈ విధముగా ఆకాశములో ఎక్కడో దూరముగా ఏర్పడే ఈ ఖగోళీయ దృగ్విషయమును మనము చాలా సులభముగా గ్రహించే ఏర్పాటు చేశారు కానీ వారికి విషయము తెలియక కాదు.

          అదే విధముగా పూర్ణిమ అంతమున (చివరన) చందృడు సూర్యునినుండి 180డిగ్రీల(అంశల) దూరములో ఉంటాడు. అనగ చక్రములో వారిరివురూ ఎదురుబొదురుగా ఉంటారని అర్ధము. ఆ సమయములో సూర్యకాంతి వలన ఏర్పడిన భూమియొక్క నీడ కూడా చందృడున్న స్థానములోనే ఉంటుంది. ఈ నీడకు జ్యోతిషములో భూభా అని పేరు. భూ అంటే భూమి మరియు భా అంటే నీడ(ఛాయ) అని సంస్కృతములో అర్థము. చందృడు ఈ నీడలో ప్రవేశించినపుడు మనకు కనిపించడు. దీనినే మనము చంద్రగ్రహణము అంటాము. ఈ సమయములో కూడా పాత అనబడే రాహువు చందృనితో ఉండాలి. లేకపోతే ఉత్తరంగా లేక దక్షిణముగా నీడనుండి చందృనకు ఎడము(దూరము) ఏర్పడడము వలన ఆ చందృడు నీడలోకి వెళ్లకుండా పక్కనుండి వెళ్లిపోతాడు. అందువలన చంద్రగ్రహణములోకూడా కారణము పాత అనబడే ఆ రాహువే.

          సూర్యుని కిరణముల  పరావర్తనము చెందడము ద్వారా మిగిలిన గ్రహములు వెలుగుతో కనబడుతాయి కానీ వానిలో స్వయముగా ప్రకాశము ఉండదు. నీటిలో పడి వెనకకు వచ్చే కిరణములలో ఏ ప్రభావముంటుందో ఆ ప్రభావము అద్దము మీద పడి వెనుకకు వచ్చే కిరణములకు ఉండదు. ఇదే విధముగా ప్రతి వస్తువు మీద పడిన కిరణములకు ఆ వస్తువులను బట్టి ప్రభావము ఉంటుంది. ఆ ప్రభావకారణముగా గ్రహములన్ని భూమిమీద ప్రతివస్తువునీ వేరు వేరుగా ప్రభావితము చేస్తాయి. జ్యోతిషములో ఇటువంటి వైజ్ఞానిక విషయములను చర్చించే భాగమునకు సంహిత అనిపేరు. మనకు బాగా తెలిసిన వరాహమిహిరుడు కూడా ఈ భాగములో ఒక అద్భుతమైన గ్రంధమును రచించాడు. ఈ వైజ్ఞానిక కారణముల అన్వేషణాఫలితముగానే మనవారు గ్రహణములు చూడరాదని, ఆ సమయములో స్నానాదులు చెయ్యాలని చెప్పినారు.  ప్రపంచము నిద్రావస్థలో ఉన్న సమయములో అనగ 5 వ శతాబ్దమునందు భారతదేశములో వెలిగిన కిరణములే ఆర్యభటుడు మరియు వరాహమిహిరుడు.

          భారతదేశములో వీరితోనే ఇటువంటి అన్వేషణలు ప్రారంభమయ్యాయని మనము చెప్పడానికి లేదు. ఎందువలనంటే వీరు చెప్పిన ప్రతివిషయమునకూ ఆధారము వేదములో చెప్పబడిన విషయములే. రూఢార్థమును కాకుండా గూఢార్థమును పరిశీలిస్తే వేదము విజ్ఞానగని. అది ఎవరో చెప్పడముద్వారా మనము తెలుసుకోవక్కరలేదు. మనంత మనమే తెలుసుకోవచ్చు. కానీ మనము ప్రయత్నించాలి గదా! ఆ వేదము శాశ్వతము అని మనమంటాము. చరిత్రకారులు అది ఎపుడు పుట్టింది అన్నది నిర్ధారించలేకపోయారు. కానీ అదే అత్యంత ప్రాచీనమైనదని వారు కూడా ఒప్పకున్నారు. అందువలన మానవసృష్టిలో వేల సంవత్సరములనుండి విడనిది ఈ చిక్కుముడి. ఆ వేదములు అందరి హితమును కోరుకుంటున్నాయని మన పూర్వీకులు చెప్పకొచ్చారు. ఈ అన్వేషణ అనంతము.

          అనగ గ్రహణములపై మన వారికి అనాదిగా వైజ్ఞానిక అవగాహన ఉందని స్పష్టమవుతుంది. అదే విధముగా దాని ఫలితములపై వారు చెప్పిన మాటలు మూఢనమ్మకములని కొట్టి పారవేయలేము. వైజ్ఞానికముగా ఆ మాటలలో నిజము లేదని నిరూపించిననాడు మాత్రమే మనము ప్రాచీన కాలమునుండి వస్తున్న ఈ నమ్మకములను కొట్టగలము. కావున దిన దిన ప్రవర్థమానమవుతున్న విజ్ఞానమును ఆధారముగా చేసుకొని మనము ఈ విషయములను అన్వేషించాలి. ఆ అన్వేషణలో భాగమే 15 జనవరి నాడు గ్రహణసమయములో ఇస్రో చేసిన ప్రయోగము. గ్రహణసమయమునందు ప్రభావములను అధ్యయనము చేయడానికి ఇస్రో ఉపగ్రహమును పంపింది. అదే విధముగా పూర్వీకుల కధనానుసారము వైజ్ఞానికమైన సత్యములను మనము నిర్థారించుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని వేల సంవత్సరముల గత చరిత్రను సరియైన ఆధారములేకుండా మనము కొట్టి పారవేయలేము. రహస్యాన్ని ఛేదించగ ప్రాప్తించినది కూడ రహస్యేగానే మనకు ప్రస్తుతానికి కనిపిస్తోంది. తరాలుగా తెగిన బంధమే దానికి కారణము కావచ్చు

సశేషము.....

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech