ఎందరో మహానుభావులు - అవే వేళ్ళు అటు సొగసైన మృదంగం
ఇటు నాజూకు శిల్పం - కోలంకి వెంకటరాజు

                                                             - తనికెళ్ళ భరణి

     
  సొగసుగా మృదంగ తాళమూ...
జతగూర్చి నిన్ను సొక్కజేయు ధీరుడెవడో!
అన్నారు త్యాగరాజ స్వామివారు!
అదిగో!!
కశింకోట కచేరీలో ముక్కుపచ్చలారని ఐదేళ్ళ బాలుడు మృదంగాన్ని పట్టుకుని ఎడాపెడా వాయించేస్తున్నాడు..

ఆ మృదంగనాదం..

ఓ సారి గుండెలమీద ఇనపగుళ్ళేసి కొట్టినట్టూ ధన్ ధన్ మంటోంటే.. మరోసారి స్వారీ చేస్తున్న గుర్రాల డెక్కలు మనపక్కనించే వెళ్తున్నట్టూ..
ఇంకోమాటు..వడగళ్ళ వాన పడ్డట్టుంటే..మరో మాటు వర్షం వెలిసాక పారిజాతాలు జలజరా రాలినట్టూ..ఓ పర్యాయం ప్రియుడి నెత్తిమీద ప్రేయసి సున్నితంగా మొట్టినట్టుంటే.. మరొకప్పుడు..ప్రేయసి బుగ్గమిద ప్రియుడు చిటికేసినట్టూ..ఔను! ఈ శబ్ద సౌందర్యమంగా మృదంగం మీదే..!
అలా వాయిస్తున్న కుర్రాడిపేరే...కోలంక వెంకటరాజు!!

వహ్వ...వహ్వ...మాషా అల్లా..మాషా అల్లా...
అంటూ పులకించి పోయాడొక సామాన్య హకీం(హకీం..అంటే వైద్యుడు) మహమ్మద్ మొహినుద్దీన్ అనే ముస్లిం..!! ఎంత బావుంది మృదంగనాదం అనుకుని అమాంతం ఆ కుర్రాణ్ణి కావలించుకుని ముద్దెట్టుకున్నాడు గడ్డం గుచ్చుకునేలా!!

వెంటనే నువ్వుండాల్సింది ఇక్కడ కాదు బేటా... నాతోరా... అని ఆ కుర్రాణ్ణి తుని దగ్గర్నుంచి కాకినాడకి తీసుకెళ్ళి ప్రముఖ మార్దంగికులు శ్రీ మురమళ్ళ గోపాలస్వామి దగ్గర శిష్యుడిగా చేర్చారు. మరో విశేషమైన విషయం ఏమిటంటే.. 1918 లో తునిలో త్యాగరజ స్వామివారి ఆరాధనోత్సవాల్ని ప్రారంభించింది...
ఈ మహమ్మద్ మొహినుద్దీనే!!

(ఈ సందర్భంగా నేనొక విషయం ప్రస్తావిస్తున్నా.. రెండేళ్ళ క్రితం ఓ సారి రేపల్లెలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన నాటక పోటీలకి ముఖ్య అతిథిగా వెళ్ళాను...నేను స్టేజి ఎక్కగానే.. గత పాతిక సంవత్సరాలుగా శ్రీరామనవమిని ఇంత ఘనంగా జరుపుతున్నది ఈయనే అని నాకో ముస్లిం ని పరిచయం చేశారు! నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ సభలో నేనో మాట అన్నాను. మతం కోసమ్ కొట్టుకు చచ్చిపోతున్న ఈ రోజుల్లో.. ఒక ముస్లిం శ్రీరామనవమి ఉత్సవాల్ని..పాతికేళ్ళ నుంచి నిర్వహించడం..ఒక చారిత్రక అద్భుతం.. అందుకేనేమో రామదాసు ఎన్నికీర్తనలు రాసినా శ్రీరాముడు దర్శనం ఇచ్చింది మాత్రం ముందు తానీషాకే.. అనీ..దీనినే యోగం అంటారు..ఇలాంటి మహానుభావుల్ని చూస్తే.. సంకుచిత మతాలు కుచించుకుపోతాయి.)

సరే పన్నెండేళ్ళు వచ్చేవరకూ శ్రీ మురముళ్ళ గోపాలస్వామి గారి దగ్గర మృదంగంలోని మెళుకువలన్నీ నేర్చుకుని.. ఆ తర్వాత శ్రీ తుమరాడ సంగమేశ్వర శాస్త్రిగారి దగ్గరకొచ్చారు.

తుమరాడ వారి వీణ
కోలంక కుర్రాడి మృదంగం!!

శాస్త్రిగారి గోటితో వీణ మీటితే... రాగం తేనె బొట్టులాగా తీగల మీద నుండి జారుతూ.. ఈయన మృదంగం మీద పడీ..గగనం నుంచి శివుడి శిరస్సు మీద పడ్డా గంగల్లే కాస్సేపు నర్తనం చేసి...ప్రేక్షకుల హృదయాల మీద జల్లుకొట్టేది! రాత్రిపూట భోజనం అయ్యాక.. సంగమేశ్వర శాస్త్రిగారు తంబుర బిగించి...‘అబ్బాయ్ లేవరా’ అనేవారట.. అక్కణ్ణుంచి దేవతలంతా తాళాలేసేలాగ అర్ధరాత్రి వరకూ సాధన!!
ఇదిగో ఆ సాధన వల్లే...
వీణ పక్కన
మృదంగం ఎంత లబ్జుగా వాయించాలీ
వాయులీనం పక్కన ఎంత లలితంగా వాయించాలీ..
ఈ చిట్కాలన్నీ నేర్చుకున్నారు..
అక్కణ్ణుంచి..ద్వారం వెంకటస్వామి నాయుడిగారి దగ్గర శిష్యరికం! అక్కడ చేరడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు రాజుగారు... ఎంచేతంటే సంగీతానికి సంబంధించిన సర్వ విషయాల్ని అంటే.. వర్ణాలకి ఎలాగ, పదాలకి ఎలాగ..కీర్తనలకి ఎలాగా.. జావళీలకి ఏవిధంగా..దేనికి ఏ దరువేస్తే.. రసగంగ పొంగుతుందో ఔపోసన పట్టేశారు!! అందుకే ద్వారం వారి చివరి వరకూ సహకారం మాత్రం కోలంక వారే!!

అప్పటిదాక కేవలం సహకార వాయిద్యంగా ఇన్న మృదంగాన్ని ‘సోలో’ వాయిద్యంగా మార్చి కేవలం ‘మృదంగం’ కచ్చేరీలిచ్చిన ఘనత కూడా రాజుగారిదే!!
అలాగే కోలంక వెంకటరాజుగారు సంగీత సమ్రాట్టులైన సర్వశీ...అరియకుడి రామానుజయ్యర్, చెంబై వైద్యనాథ భాగవతార్, చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళే... ఈమని శంకరశాస్త్రి పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు వంటి ఎందరో మహానుభావులకి మృదంగ సహకారం అందించారు.

విజయనగరం సంగీత కళాశాలలో పదకొండేళ్ళపాటు మృదంగం ప్రొఫెసర్ గా పనిచేసి..ఆంధ్రదేశంలోనే కాకుండా మైసూర్... జైపూర్ సంస్థానాల్లో ఎన్నో ఘనసన్మానాలు పొందారు.
మరో విశేషం! వెంకటరాజు గారి మృదంగంలో వాయించే వేళ్ళకి మరో విద్య కూడా వొచ్చు.. అదే శిల్పం... మృదంగం ఎంత సొగసుగా వాయిస్తారో సిమెంట్ తో శిల్పాలూ అంత నాజూకుగా చేస్తారు. రెండు అద్భుతమైన కళలు ఒక్కర్లోనే ఉండడం నటరాజు లీల..
ఆయన జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటన సాక్షాత్తు ఆయన మాటల్లోనే..

‘త్యాగరాజు స్వామి వారి విగ్రహాన్ని తయారు చేయాలని ఎప్పటినుంచో కోరిక..రిటైరై పోయాను. ఆర్ధికంగా ఏదో ఓ మాదిరిగా ఉందీ... ఇంక బావుంటుంది కదాని మనసులో పుట్టి..ధనం సంపాయించాలనుకున్నాను... ఆ దుర్బుద్ధి త్యాగరాజు స్వామి వారికి ఇష్టం లేదు..ఆయన త్యాగమూర్తి. తనకున్నదంతా రాముడికే కైంకర్యం చేశాడు. భిక్షాటన చేసి బతికాడు. మహారాజులిచ్చినా తిరస్కరించాడు. అటువంటి త్యాగరాజస్వామి వారి విగ్రహాన్ని ధనాశతో చేసే నా భావన ఆయనకు నచ్చలేదో ఏమో .. వెంటనే పెద్ద జబ్బు చేసింది..గుండె జబ్బు! తర్వాత కొన్ని రోజులకి రక్తపుపోటు వచ్చింది. ఆ జబ్బుతో చాలా రోజులు విశాఖపట్టణం ఆస్పత్రిలో ఉన్నాను. నాకు కలిగిన ధనాశే ఈ జబ్బుకి కారణం అని నా అంతరాత్మ ఘోషించింది.! అప్పట్నుంచీ డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో విగ్రహాలు చెయ్యనని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను..

మొత్తానికి ఒక త్యాగరాజస్వామి విగ్రహాన్ని తయారు చేసి హైదరాబాద్ త్యాగరాయ గానసభకి ఇవ్వాలనుకున్నాను. నా ఆరోగ్యం కుదుటపడింది.!!!
స్నేహితుడూ, శిష్యుడూ.. అయిన నరసింహం గారికి కబురుచేసా.. పింగాణి కప్పులు తయారు చేసే మట్టి ఉంటుంది.. ఆ మట్టి ఒక టన్ను తెప్పించా.. అది మెత్తగానూ ఉంటుంది. నిలవ ఉంటుంది.. ఆరితే గట్టిపడుతుంది. ఆ తర్వాత దాన్ని చెక్కాను.

రైల్వే వారి సహాయంతో స్వయంగా... హైదరాబాద్ తీసుకెళ్ళి త్యాగరాయ గానసభ ప్రాంగణంలో ప్రతిష్టించా..
ఈ జన్మకి ఈ తృప్తి చాలు!!
నిధి చాలా సుఖమా... రాముని సన్నిధి చాల సుఖమా అన్నారు త్యాగరాజస్వామి...
రాముని సన్నిధే సుఖమని ‘మృదంగం మీద’ దెబ్బకొట్టి మరీ చెప్పారు కోలంక వెంకటరాజు గారు....

 
 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech