ఇప్పుడిటు కలగంటి
 

ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు
నప్పడగు తిరు వేంకటాద్రీశు గంటి||

అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి
చతురాస్యు పొడగంటి చయ్యన మేలుకొంటి||

కనకరత్న కవాటకాంతు లిరుగడ గంటి
ఘనమైన దీపసంఘటములు గంటి
అనిపమ మణిమయమగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గక్కన మేలుకొంటి

అరుదైన శంఖచక్రాదు లిరుగడ గంటి
సరిలేని అభయహస్తము గంటిని
తిరు వేంకటాచలాధిపుని జూడగ గంటి
హరి గంటి గురు గంటి నంతట మేలుకొంటి||

అన్నమయ్య తలపు తరంగాలలో, కనులలో, కలలలో కొలువై యున్నది ఆ కొండలరాయుడే! లోకజనకుడైన తిరువేంకటప్పను, ఆ స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని తిరుగులేని ఆ దివ్య సౌందర్యాన్ని, శేషాచల శిఖరాల మణిమయకాంతులను స్వప్నంలో సాక్షాత్కరింప చేసుకున్న ధన్యుడు అన్నమయ్య! ఆ స్వప్నంలో తాను గాంచిన స్వామి వారి అతిశయ సౌందర్యాన్ని కన్నులకు కట్టినట్టు చూపిస్తున్నాడన్నమయ్య.

విశేషాంశములు : అన్నమయ్యకు పదారుయేండ్లకు తిరువేంగళనాథుండు ప్రత్యక్షమైతేను, అను తొలి గాగిరేకు మీది వ్రాతను బట్టి తెలియుచున్నది. అది మొదలు ఆయన భగవంతునిపై అంకితంగా సంకీర్తనములు పాడినట్లు గూడ ఆ రేకు మీదనే వ్రాయబడింది. తనకు స్వామి బాల్యమున దర్శనమిచ్చుటనే ప్రస్తుత సంకీర్తనములో ఆయన చెప్పుకున్నాడని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వ్రాసిరి.

శ్రీ వేంకటేశ్వర విగ్రహము చెంత మనకిపుడు చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్న కానరాదు. అయినను ఇది అన్నమయ్యకు కలలో దోచిన రూపుకనుక ఇట్టి విశేషములాయనకు కనిపించుట వింతగాదు.

అప్పడు = తండ్రి;
అతిశయము = ఆశ్చర్యము
ప్రతిలేని = తిరుగులేని
చతురాస్యుడు = నాలుగు ముఖాలవాడు(బ్ర్హహ్మ)
కవాటము = తలుపు,
అనుపమ = ఉపమానం(పోలిక) లేని;
కనకాంబరము = కాంచన వస్త్రము

 
ఇరవగు వారికి
 
ఇరవగు వారికి యిహ పర మిదియే
హరి సేవే సర్వాత్మలకు

దురిత మోచనము దుఖఃపరిహరము
హరినామమే పో ఆత్మలకు
పరమ పదంబును భవనిరుహరణము
పరమాత్ము చింతే ప్రసన్నులకు

సారము ధనములు సంతోషకరములు
శౌరి కథలు సంసారులకు
కోరిన కోర్కెయు కొంగు బంగరువు
సారె విష్ణుదాస్యము లోకులకు

యిచ్చయగు సుఖము యిరవగు పట్టము
అచ్చుతుకృప మోక్షార్ధులకు
అచ్చపు శ్రీ వెంకటాధిపు శరణము
రచ్చల మాపాలి రాజ్యపు సుగతి

శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యమ్, ఆత్మ నివేదనం అంటూ తొమ్మిది రకాల భక్తి సిద్ధాంతాలను భాగవతం ప్రస్తావిమ్చింది. వీటిని నవవిధ భక్తులు అంటారు. భక్తులు వీటిలో ఏ పద్ధతిఅనా అవలంబించి శ్రీహరిని (కైవల్యం లేదం మోక్షం) చేరుకోవచ్చు. ఈ భక్తి పద్ధతులన్నీ హరి సేవకు ప్రతిరూపాలు మరియు ప్రత్యక్ష రూపాలు కాబట్టి అన్నమయ్య ఈ పాటలో ఇలా అంటున్నాడు ఇహపరలోకాలలో భగవంతుని ఆశ్రయం పొందదలచిన వారికి హరిసేవ అనునది మార్గము. కాబట్టి ఆ మార్గాన్ని అనుసరించండి. మొదటి చరణంలో కీర్తనాన్ని (హరినామము), స్మరణాన్ని (పరమాత్మ చింత), రెండవ చరణంలో శ్రవణాన్ని (శౌరి కథలు వినడం), దాస్యాన్ని మూడవ చరణంలో ఆత్మనివేదనాన్ని (శరణాగతి) అన్నమాచార్యుల వారు ప్రస్తావిస్తున్నారు.

ఇరవగు వారికి = (స్థానం) ఆశ్రయించిన లేదా కోరిన వారికి;
భవనిరుహరనము = జన్మలను నివారించునది;
పరమాత్మ చింత = పరమాత్మునిపై ఆలోచన (ధ్యాస)
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech