చదరంగంలో చచ్చేది

- యండమూరి వీరేంద్రనాథ్

  రోగం ముదరగానే, ముందు ఎర్రబడిన చర్మం తర్వాత తెల్లబడ్డట్టూ , పదిన్నర అవుతూన్న సమయానికి ఎర్రటి సూర్యుడు తెల్లబడి తీక్షణతని పుంజుకున్నాడు.
నగరం నడిబొడ్డులోవున్న పెద్ద భవనపు పన్నెండు అంతస్థుల్లోనూ హడావుడి మొదలైంది. ఆ భవనపు క్రింద ఆరంతస్తులూ బ్యాంక్ ఆఫ్ ఉటోపియావి. ఆ తర్వాత మూడంతస్థులూ ఓ చిట్ ఫండ్ కంపెనీవి. ఆ పైవి కథకి అప్రస్తుతం.
బ్యాంక్ ముందుగేటు, పన్నెండు అడుగుల ఎత్తుగా, హుందాగా రాజభవనపు సింహద్వారంలా వుంది. దాని ముందు నిలబడ్డ సెంట్రీ కర్తవ్య నిర్వహణకు కంకణం కట్టుకున్న రాజభటుడిలా శిలలా నిలబడి, కేవలం కనుగుడ్లు తిప్పుతూ దారినపోయే ఆడవాళ్ళను చూస్తోన్నాడు.
దూరం నుంచి ’డబడబా’ శబ్దం వినిపించింది.
అంటే చతుర్వేది డబ్బా కారు వస్తోందన్న మాట.
మరునిముషంలో అదొచ్చి ఫుట్ పాత్ ఎక్కి భారంగా మూలిగి ఆగిపోయింది. అందులోంచి క్రిందికి దిగేడు చతుర్వేది. కారుడోరు తాళం వేసేడు. తాళం చేతులు కోటు జేబులో వేసుకుని పర్సుతీసి, పదిపైసల బిళ్ళని గోడకానుకొని కూర్చొనివున్న ముసుగు మనిషివైపు విసిరేడు.
బిళ్ల తగలగానే మనిషి కొద్దిగా కదిలేడు. ముసుగు పక్కకి తొలగించి ఒంటికన్నుతో చతుర్వేదిని చూసి ఆ కన్నుతోనే నవ్వి "దండాల్దొరా" అన్నాడు.
చతుర్వేది మాట్లాడలేదు.
ఇండియన్ కాంట్రాక్ట్ ఆక్ట్ ప్రకారం, కాంట్రాక్ట్ ని ప్రతిరోజూ పునర్ చర్చించాల్సిన పనిలేదు. అందుకే అతడు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. కుష్టువాడు ముసుగు కప్పుకొన్నాడు మళ్ళీ.
కాంట్రాక్ట్ ప్రకారం చతుర్వేది వాడికి రోజుకి పది పైసలివ్వాలి. అయితే నెలకి మూడు రూపయలు అప్పనంగా వదులుకొనేటంత మూర్ఖుడుకాడు చతుర్వేది. కానీ తప్పదు. గ్యారేజీలు ఖాళీలేని కారణంగా, అతడికన్నా సీనియర్లు వున్నవాటిని ఉపయోగించుకొంటున్న కారణంగా అతడు తన కారుని రోడ్డుపక్కగా పెట్టుకోవాల్సి వస్తూంది. ఈ విషయమై అతడు మానేజిమెంట్ ని తెగతిట్టుకొన్నాడు. తన స్టేటస్ సింబల్ అయిన ’కారు’ ఎండకి ఎండి, వర్షానికి తడవటం అతడికి బాధాకరంగా వుంది. అందులోనూ అది బ్యాంకులో అప్పు తీసుకుని కొన్న కారు.....
....ఒక ’లెవెల్’ దాటిన ఆఫీసర్లకి బ్యాంకే కారునిస్తుంది. అయితే చతుర్వేది ఆ లెవెల్ కి సరిగ్గా ఒక మెట్టు కిందున్నాడు. అతడిపైన ఇంకా అయిదుగురు సీనియర్లూ, అతనికన్నా బాగా పని చెయ్యగలవాళ్ళూ వుండడంవల్ల అతడికి ఆ పదవి యిప్పుడే లభించేటట్టూలేదు.
చతుర్వేది సీట్లో కూర్చుని అద్దాల కిటికీలోంచి బైటకి..... అంటే... క్రిందికి చూసేడు. కారు దగ్గిరనిల్చున్న కుర్రవాణ్ణి కుష్టువాడు దూరంగా అదిలిస్తున్నాడు. ఆ కుర్రవాడు ఏదో అంటున్నాడు. అంటూ దూరంగా పరుగెడ్తున్నాడు.
చతుర్వేది సంతృప్తిగా గాలి పీల్చుకున్నాడు.
తన కారుకి రక్షణ కలిగించబడ్తూంది.
చతుర్వేది కూర్చొనేది బ్యాంక్ మూడో అంటస్తులో కిటికీ దగ్గిర.
అక్కడ కూర్చుని చూస్తే అతడికి రొడ్డూ, రోడ్డుకవతలవైపున్న తన కారూ స్పష్టంగా కనబడ్తాయి. అతడు కారు అక్కడ పెట్టిన కొత్తలో మాటిమాటికీ దాన్ని చూసుకొనేవాడు. అయితే అతడి సంతృప్తి ఎక్కువసేపు నిలబడలేదు. కారణం రోడ్డునపోయే కుర్రవాళ్ళు ఇటూ అటూ వెళ్ళే కుర్రవాళ్ళూ కారుమీద చేత్త్తో రాస్తూపోవటం అతనికి చికాకు కల్గించేది.
ఇంతకన్నా పెద్ద ప్రమాదం అతడికి మూడురోజుల తరువాత కల్గింది. సాయంత్రం అయ్యేక అతడు వెళ్ళిచూస్తే వెనుక చక్రంలో గాలిలేదు. ఎవడో కొంటెకుర్రాడు చేసిన పని అది.
అతడికేం చెయ్యాలో తోచలేదు, తన కారునెలా రక్షించుకోవాలో అర్ధంకాలేదు. ఈ సమస్య అతని దొక్కడిదే. ఎందుకంటే మిగతా వాళ్లందరి కార్లూ బ్యాంక్ వాళ్ళిచ్చినవే.
ఈ సమయంలో ఆపద్భ్హాంధవుడిలా కనపడ్డాడు ఆ కుష్టువాడు. ’పది పైసలియ్యి దొరా జూసుకుంటా నీ కారు సంగతి’ అన్నాడు. చతుర్వేది అతడివైపు అనుమానంగా చూసేడు. అసలు గాలి విప్పింది వీడేనేమో అని. కానీ అతడి అనుమానం నిరాధారమని ఆ తరువాత తెలిసింది.
వాళ్ళిద్దరూ కాంట్రాక్ట్ లోకి ’ఎంటర్’ అవగానే చతుర్వేది కారుమీద గీతలు పడటం మానేసినయ్. కుష్టువాడు తనపని జాగ్రత్తగా చేసుకుపోవటంతో సంతృప్తి చెందేడు అతడు రోజుకి పదిపైసలు ఖర్చు పెట్టడం అంత కష్టమనిపించలేదు కూడా. కుష్టువాడు కూడా సంతృప్తి చెందినట్టే వున్నాడు. ఇంకేం కావాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
చతుర్వేది కిటికీ అద్దాల్లోంచి బైటకి చూసేడు. మరుక్షణం కుర్చీలో నిటారుగా అయి మరింత ఉత్సుకతతో అటు వైపు చూడసాగేడు.
కుష్టువాడు తోలేసిన కుర్రాడు మరో ఇద్దర్ని తీసుకొచ్చినట్టున్నాడు. కారుని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోన్నారు. వాళ్లందరిమధ్యా తన కారు ఏమవుతుందో అన్నభయంతో వాచ్ మెన్ తో చెప్పటానికి చతుర్వేది కుర్చీలోంచి లేచేడు. కాని అతడు క్రిందికి వెళ్ళే అవసరం లేకపోయింది.
కుష్టువాడు తన వంటిచుట్టూ వున్న దుప్పటిని నేల మీదకు జార్చి, వాళ్లమీదకు వెళ్ళేడు.
అంతే!
ముగ్గురు కుర్రవాళ్ళు క్షణం సేపు అతడి శరీరాన్ని విభ్రాంతితో చూసి బాణంలా అక్కణ్నుంచి పరుగుతీసేరు.
చతుర్వేది కూడా ఒక్కక్షణం కట్రాటే అయ్యేడు. అతడి వెన్నులో వణుకు పుట్టింది. అంతదూరం నుంచి కూడా ఆ బిచ్చగాడి శరీరం అతడికి గగుర్పాటు కలిగించింది.
పచ్చటి ఎండ అతడి శరీరపు శిధిలమయిన భాగాల మీద ఎర్రగా విశ్లేషిస్తూంది.మాంసపు కండరాలు అక్కడక్కడా వ్రేలాడుతున్నాయి. ముక్కువుండాల్సినచోట పెద్దరంధ్రం వుంది. కొబ్బరి పీచులాంటి జుట్టు నెత్తిమీద అక్కడక్కడా అతికించినట్టుంది. కుడిభుజం మీద పెద్దకురుపు. అక్కడ తెల్లటిరంధ్రం ఘనీభవించినట్టుంది.
మూర్తీభవించిన అసహ్యంలా వున్నాడతడు.
అయితే అతడు ఆ కుర్రవాళ్ళని బెదరగొట్టిన విధానం మాత్రం చతుర్వేదికి భలేనవ్వు తెప్పించింది. కేవలం దుప్పటి తొలగించి అతడు నిలబడగానే, పిస్తోలు దెబ్బకి బెదిరిన కాకుల్లా కుర్రవాళ్ళు పరుగెత్తారు. అతడికి బ్రూస్లీ జ్ఞాపకం వచ్చేడు.
అతడు తనలో తను నవ్వుకుంటూ కిటికీ దగ్గర్నుంచీ కదిలి సీటు దగ్గిరకు వస్తూంటే మేనేజర్ దగ్గర్నుంచి పిలుపొచ్చింది. అతడు కొంచెం బెదిరి తొందర తొందరగా వెళ్లేడు.
’బ్యాంక్ ఆఫ్ ఉటోపియా’ రీజనల్ మేనేజర్ సర్దార్ హరిభజన్ సింగ్ రివాల్వింగ్ చైర్ లో తీరిగ్గా కూర్చొనివున్నాడు. చతుర్వేదితో కొంచెం సేపు ఆ విషయాలు ఈ విషయాలూ మాట్లాడి-"ఏమిటీ ఆ ద్వివేది, త్రివేదీలు పనిలో ఏమీ ఇంట్రస్ట్ చూపించటం లేదుట" అన్నాడు.
చతుర్వేదికి ఒక్కక్షణం అర్ధంకాలేదు. అర్థంకాగానే అతడు ఆనందంతో పొంగిపోయేడు. ద్వివేది, త్రివేదీలు అతడి పైనవున్న సీనియర్ ఆఫీసర్ లు. ప్రమోషన్ కి అతడికన్నా పైనవున్న అయిదుగురిలో ఇద్దరు.
చతుర్వేది విజృంభించేడు.
త్రివేది, ద్వివేది-బ్యాంకులో సీనియర్ ఆఫీసర్లయ్యుండీ యూనియన్ పన్లలో ఎలా పాల్గొంటున్నారో చిలవలు పలవలుగా వర్ణించేడు. వాళ్ళకింద పని ఎంత మిగిలిపోయి వుంటుందో వివరించేడు. అలా అయిదు నిముషాలు మాట్లాడి గాలిలో తేలిపోతూ గదిలోంచి బైటకి వచ్చేడు.
అవును మరి రీజనల్ మానేజరంతటివాడు తనని కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని బ్యాంక్ గురించి ’రహస్యంగా’ అడగటం మామూలు విషయమేమీ కాదు.
ఆ ఆనందంలోనే అతడు లంచ్ అవర్ లో బైటకి వెళ్ళినప్పుడు తన కారుని రక్షించటంలో ధీరోదాత్తతని ప్రదర్శించి నందుకు ఆ బిచ్చగాడికి ఓ అయిదురూపాయలు ’బోనస్’ గా ఇచ్చేడు.
అదే ఈ కథని ఓ మలుపు తిప్పింది.
కుమారి ప్రతిమకి అరగంట నుంచీ అనుమానంగా వుంది. పెదాలమీద లిప్ స్టిక్ చెరిగిందేమో అని. చేస్తున్న కూడిక సగంలో వదిలిపెట్టలేక అలాగే కూర్చొని పనిచేస్తూంది. ఆమె ముందున్న నల్లటి బౌండు పుస్తకం, షిఫాను చీరల్లో ఇమిడిపోయిన ఇరవైరెండేళ్ల శరీరంలా వుంది. ఆమె నుదుటిమీద బొట్టుకూడా అరిస్టోక్రాటిక్ గానేవుంది. ఆమె చేతిలో పెన్ను జపాన్ ది. ఆమె నోట్లో భాష బ్రిటన్ ది.
ఇంగ్లీషులో కూడిక పూర్తిచేసి ప్రతిమ వేళ్ళు విరుచుకొంది. తేడా వచ్చిన పదిపైసల పొరపాటు దొరికింది.
ఆమె పుస్తకం మూసి లేవబోతూ వుంటే ఎదుటి డెస్క్ మీద నీడ పడింది. ఆ నీడ నెమ్మదిగా తనవైపు వస్తూవుండటం చూసి ఆమె తలెత్తింది.
అంతే.
ఆమె కెవ్వున పెట్టిన కేకకి బ్యాంక్ సిబ్బంది అంతా పని ఆపి చప్పున తల తిప్పి చూసేరు.
ఆమె ముందు కుష్టువాడు నిలబడి వున్నాడు.
అతడి భుజంమీద నుంచి దుప్పటి క్రిందికి వేలాడుతుంది. కుడిపక్క, రోగం తినేసిన సగం చెవికూడా అలానే వేలాడుతూంది. డెస్క్ మీదున్న గాజు అద్దంలో -భుజం మీదున్న ఎర్రటి రక్తపు మరక ప్రతిబింబిస్త్తూంది. ఎడమవైపు గాజుకన్ను ప్రతిమనే చూస్తుంది. అతడు చెయ్యి చాపేడు. ముందుకు సాచిన చేతిలో-బొటనవేలు పక్కనుంచి కారిన చీముతో తడిసిన అయిదురూపాయల నోటుంది.
ఆ అయిదురూపాయల నోటు ముందుకొస్తూంటే ఆమె మరోసారి "కెవ్వు" న అరిచింది.
చతుర్వేది అంతకు అయిదునిమిషాల క్రితమే వాడ్ని తన కారుపక్కచూసేడు. వాడు అక్కణ్నుంచి లేవటం చూసి ఆశ్చర్యపోయేడు. అతడి యిన్ని సంవత్సరాల అనుభవంలో వాడు ఆ ప్రదేశంలోంచి లేవటం మొదటిసారి చూస్తున్నాడు.
చతుర్వేది చూస్తూ వుండగానే వాడు రోడ్ క్రాస్ చేసేడు. చతుర్వేది కిటికీలోంచి బాగా ముందుకు వంగి అతణ్ణి చూస్తున్న వాడల్లా అమాంతం స్ప్టృహతప్పి మూడో అంతస్తు మీద నుంచి క్రింద పడిపోయేవాడే. ఎలానో నిలదొక్కుకొన్నాడు. అయినా ఉద్వేగం తగ్గలేదు.
అతడు చూసిన దృశ్యం అటువంటిది మరి!.......
పదిహేను వందల కోట్ల డిపాజిట్లతో, ఏడువందల కోట్ల ఋణాల్తో, సంవత్సరానికి నాలుగుకోట్ల లాభాల్తో నడుస్తూన్న ’బ్యాంక్ ఆఫ్ ఉటోపియా’.... ఎయిర్ కండిషన్డ్ బిల్డింగ్ లోకి ఒక కుష్టువాడు ప్రవేశించటమా?
అందరికన్నా ఎక్కువ భయపడింది సెంట్రీ. ప్రతి రోజులాగే అతడు స్టూల్ మీద కూర్చుని జోగుతున్నాడు. లోపలికి వస్తున్న వాడ్ని చూడలేదు. ప్రతిమాదేవి కేకతో నిద్రనుంచి తేరుకుని లోపలికి పరుగెత్తుకొచ్చేడు. కౌంటర్ దగ్గర నిలుచున్న కుష్టువాణ్ణి చూసి క్షణంపాటు నిశ్చేష్టుడైనా, అంతలోనే తేరుకొని చేత్తో తోయబోయి, అంతలోనే వాడు కుష్టువాడని గుర్తుకొచ్చి, చేతిలోని లాఠీతో తోస్తూ "జావ్ జావ్-బాహర్ జావ్" అన్నాడు.
"దందాల్దొరా.... అయిదు రూపాయలు....బ్యాంక్ లో ఎయ్యాల" అన్నాడు వాడు. ఆ సెంట్రీయే బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టరన్నంత నమ్రతతో.
వాడి మాటలు అందరికీ స్పష్టంగా వినిపించాయ్. ఆ హాల్లో వున్నయాభైమందీ ఒకళ్ళ మొహాలొకరు చూసుకున్నారు.
ఈ లోపులో చతుర్వేది అక్కడికి మెట్లు దిగేడు.
క్షణంలో పరిస్థితిని అర్థం చేసుకున్నాడు.
"ఇధర్ నై ఆనా.... జావ్" అని పురుగుని తోసేసినట్టు తోస్తున్నాడు సెంట్రీ. అసలు వాణ్ణి గేటు దగ్గిరే ఆపుచెయ్యలేదన్న విషయాన్ని యెవరైనా గుర్తిస్తారేమో అన్న భయం వాడిది.
"బాంచన్...... యీ అయిదు రూపాలు..."
సెంట్రీ ఏదో అనబోతూ వుంటే చతుర్వేది కల్పించుకొంటూ, "మూడయింది, ఇప్పుడేసుకోరు, రేపొద్దున్నరాపో" అన్నాడు.
కుష్టువాడు చతుర్వేదిని చూసి, ఎడారిలో ఒయాసిస్ చూసినవాడిలా దగ్గరకొచ్చి, ఆనందం నిండిన మొహంతో "దండాల్దొరా" అన్నాడు.
చతుర్వేది చప్పున అడుగు వెనక్కి వేసి "సర్లే... సర్లే... రేపు రా పో" అన్నాడు.
"గట్లంటావు....!సర్లే.. రేపొద్దు గాలే వొస్త" అని వెనుదిరిగేడు. నెమ్మదిగా బైటకి వెళ్లిపోయాడు.
కుమారి ప్రతిమ తేలిగ్గా వూపిరి పీల్చుకుంది. అయిదు నిమిషాల్లో ఎవరి పన్లలో వాళ్ళు మునిగిపోయేరు.
అప్పటివరకూ జరిగిదంతా చూస్తూ నిలబడ్డ ఓ వ్యక్తి కూడా ఇక అక్కడ చేయవలసిందేమీ లేనట్టూ, అక్కడినుంచి కదిలేడు. అతడి చెప్పులు తెగటానికి సిద్ధంగా వున్నాయి. చేతిలో నల్లగౌను చిరగటానికి సిద్ధంగా వుంది.
అతడి పేరు పంతులు.
లాయర్ పంతులు.
"చతుర్వేది చాలా తెలివితక్కువగా ప్రవర్తించేడు" అన్నాడు త్రివేది మేనేజింగ్ డైరెక్టర్ తో."మళ్ళీ రేపు రమ్మన్నాడట ఆ లెప్పర్ ని. ఇది బ్యాంక్ అనుకున్నాడా. పెళ్ళివారిళ్ళు అనుకున్నాడా. భోజనాల తరువాత రమ్మని చెప్పటానికి, రేపొస్తే ఏం చేస్తాడట? అసలు అతడికెందుకట మధ్యలో? ఆ సెంట్రీ వెళ్లగొట్టేవాడుగా, గోటితో పోయే దానికి గొడ్డల్తో చెయ్యటం అంటే ఇదే...."
సర్దార్ హరిభజన్ సింగ్ తెల్లటి గెడ్డం సవరించుకొంటూ అంతా విన్నాడు. తరువాత బెల్ కొట్టి చతుర్వేదిని పిలిపించేడు. చతుర్వేది రాగానే, గదిలో వున్న త్రివేదిని చూసి జరిగినదంతా చెప్పే వుంటాడని గ్రహించేడు.
"ఏమిటి కుష్టువాళ్ళతో అకౌంట్లు ఓపెన్ చేయిస్తున్నావట" అన్నాడు సర్దార్,
"అతడే వచ్చాడు సార్!"
"మరి మన టైమ్ అయిపోయిందిగా ఈరోజు".
"అంటే?" మానేజింగ్ డైరెక్టర్ చప్పున తలెత్తి అడిగేడు, "రేపు వాడి దగ్గర్నుంచి ఆ డిపాజిట్టు తీసుకుందామనేనా?" ఆకాశం కూలినంత ఆశ్చర్యం కనపడింది అతడి కంఠంలో.
"తీసుకోకుండా రిజెక్ట్ చెయ్యగలమా?"
ఈ తిరుగు ప్రశ్నని వూహించలేదు. ఓ క్షణం తెల్లబోయి చూసేడు. అతణ్ని రక్షించవలసిన బాధ్యత తన మీదున్నట్టు త్రివేది అందుకొని అన్నాడు. "ఎందుకు చెయ్యలేం? అసలు వాణ్ని లోపలికి రానిచ్చేదెవరు?" అని లేచి నిలబడ్డారు. "పర్మిట్ మి సర్. ఇంత చిన్న విషయాన్ని గురించి మీరెందుకూ ఆలోచించటం? నేను తేల్చేస్తాను".
మానేజింగ్ డైరెక్టర్ తలూపేడు.
త్రివేది చతుర్వేదివైపు గెలిచినట్టు చూసి బైటకు నడిచేడు. చతుర్వేదిని గెలవటం ఇంత సులభం అని త్రివేది అనుకోలేదు.
........అయితే అది అంత సులభం కాదని మరుసటిరోజు తేలింది.

                                                                                                                                    (..సశేషం)

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech