నాటకాలరాయుళ్లు

 

 

 నటుడు ముదిరితే రాజకీయ నాయకుడవుతాడు. మరి రాజకీయ నాయకుడు ముదిరితే...? మహానటుడవుతాడు! కొమ్ములు తిరిగిన మహా నటులకే దిమ్మతిరిగేంత అద్భుతంగా రాజకీయ రంగస్థలం మీద నటిస్తాడు. ఇందులో డౌటుంటే మెగాస్టారు చిరుగారిని అడగండి. సినిమాల్లో నటించడం కన్నా మేకప్ లేకుండా రాజకీయాల్లో నటించడమే కష్టమని సినిమా అన్నయ్య’ ఈ మధ్యే సిగ్గుపడకుండా ఒప్పుకుని చేతులెత్తేశాడు! అతడొక్కడేకాదు... తెలుగు రాజకీయ రంగస్థలంలో తెలివిమీరిన మన నాటకాల రాయుళ్ళ ముందు బాలీవుడ్, హాలీవుడ్ యాక్షన్ కింగులు కూడా బలాదూరు!
* * *
సినిమాల్లో, నాటకాల్లో ఏ నటుడైనా స్క్రిప్టునుబట్టే డైలాగులు పొల్లుపోకుండా చెబుతాడు. రాజకీయ నటులు ఇష్టానుసారం ఎలా పడితే అలా స్క్రిప్టును మార్చేస్తుంటారు. వారి నోట ఏ సమయాన ఏ డైలాగు వస్తుందో వారిని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. సాయంత్రం సరే’ అంటారు. తెల్లవారేసరికి నాలుకమడతవేసి ససేమిరా’ అంటారు. తెలంగాణ వేర్పాటు అయినా, హైదరాబాద్ ఫ్రీ జోన్ విషయమైనా అఖిలపక్ష పేరంటం పెట్టగానే అన్ని పార్టీలవారూ పోతారు. తీర్మానం తెండి, మద్దతు ఇస్తాం అని ధారాళంగా వరాలిస్తారు. తీరా తెల్లారాక తీర్మానం పెట్టేసరికి వారిలోనే కొందరు ప్లేటుమార్చి అడ్డం తిరుగుతారు. అదేమిటంటే అప్పటి మూడ్’ వేరు; ఇప్పటి మూడ్’ వేరు అని గాలి ముద్దుకృష్ణుళ్లు రాగాలు తీస్తారు. సినిమా కవి అన్నట్టు ఆడవారి మాటలకు’లాగే రాజకీయ నాటకాలు ఆడువారి మాటలకూ అర్థాలు వేరు.
రాజకీయ పార్టీల్లో అసమ్మతులు, తిరుగుబాట్లు మొదటినుంచీ ఉన్నవే. పార్టీ తరఫున ఒక నిర్ణయం చేశాక పార్టీలో కొందరు దానికి కట్టుబడక ఎదురు తిరిగితే అధినాయకులు ఆగ్రహించి, చిందులు తొక్కటం రాజకీయాల్లో రివాజే. కాని సమ్మతికీ, అసమ్మతికీ కూడా అధినేతలే సూత్రధారులై, తిరుగుబాట్లను సైతం తెరవెనుకనుంచి తెలివిగా నడిపించటం మనకాలపు రాజకీయ దర్శకుల సూపర్ స్పెషాలిటీ! శైవుల దగ్గర వీరభద్రయ్య; వైష్ణవుల చెంత రామభద్రయ్య; అదీ ఇదీ కాని చోట ఉత్త భద్రయ్య - అన్నట్టు ఒకే పార్టీవారు తెలంగాణలోనేమో వీర వేర్పాటువాదులు; సీమాంధ్ర దగ్గరికి వచ్చేసరికి వీర సమైక్యవాదులు. వారినీ వీరినీ నడిపించేదేమో అవకాశవాదమే వేదమైన రెండుకళ్ల’, రెండు నాలికల నాయకాగ్రేసరులు. కారణాలు, ప్రేరేపణలు ఏమైతేనేమి ఒక నిర్ణయానికి ఎదురుతిరిగిన ఒక పార్టీవారైనా నికరంగా అదే మాటమీద ఉంటారా - అంటే అదీ లేదు. ఎదురు తిరిగినట్టే తిరిగి, వ్యతిరేకించినట్టే కనిపించి, అంతలోనే తోకముడిచి, లోపాయికారీగా అడ్జస్టయి పోతుంటారు. కొద్ది సేపటికిందిదాకా కాంగ్రెస్, టి.డి.పి., తక్కుంగల పార్టీల్లో అనేకులు కాదు - కూడదు అని రంకెలు వేసిన సభలోనే హైదరాబాద్‌ను కొన్ని కొలువులకైనా ఫ్రీజోను కానివ్వవద్దు అనే తీర్మానం పెట్టీపెట్టగానే రెండు నిమిషాల్లో చిత్రంగా పాసైపోతుంది!
* * *
పోనీ - ఈ వరసను చూసి సీమాంధ్రుల కళ్లనీళ్లు తుడవటానికి కొంతమంది వ్యతిరేకత నటించినా, పాపం అన్ని పార్టీల్లో అందరూ తెలంగాణ వారి మేలే కోరుతున్నారు... అందుకే ఆయా కొలువులకు బయటివారు పోటీరాకుండా దడికట్టించమని కేంద్ర సర్కారును కోరుతూ తీర్మానం చేశారు... అని సంతోషపడదామా? అబ్బే! ఎలాగూ కేంద్ర సర్కారు ఆ పనిచేయదని తెలిసే... అసెంబ్లీ తీర్మానంవల్ల పూచికపుల్లపాటి ప్రయోజనం ఉండదని ఎరిగే అన్ని పార్టీల యాక్టర్లూ కలిసి తీర్మానం అంకాన్ని అలా రక్తికట్టించారు! తెలంగాణకు గుత్తేదార్లు అయిన కేసీఆర్ల చేతికి ఫ్రీజోను ఆయుధం దొరకకుండా చేయడానికే కాబోలు అందరూ కూడబలుక్కుని సర్కారీ పౌరోహిత్యంలో ఆ తతంగం నడిపించారు. వారు ఎందుకు చేస్తేనేమి... అది తెరాస లాంటి తెలంగాణ చాంపియన్లు కోరిందే కనుక... దానివల్ల తెలంగాణ వాసులకు బ్రహ్మాండమైన మేలు జరుగుతుంది లెమ్మని ఆశించవచ్చా?
ఇంతా చేస్తే ఈ నిబంధన వర్తించేది ముష్టి మూడువేల పోలీసు పోస్టులకు రాష్టప్రతి ఉత్తర్వులో ఇప్పుడున్న ప్రకారం, సుప్రీంకోర్టు సైతం ధ్రువీకరించిన ప్రకారం రాష్ట్ర రాజధాని నగరంలో పోలీసు ఉద్యోగాలకు మిగతా ప్రాంతాల వారితోబాటు తెలంగాణలోని అన్ని జిల్లాల వారూ పోటీపడగలరు. ఒక్క చిరురాజ్యం’ మినహా అన్ని పార్టీలూ తలా ఒక చెయ్యివేసి ఆమోదింపజేసిన అసెంబ్లీ తీర్మానమే అమలయ్యే పక్షంలో ఐదో జోన్ కిందికి వచ్చే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల వారికి ఇప్పుడున్న అవకాశం పోతుంది. జంటనగరాల్లో కొనే్నళ్ల స్థిరనివాసం కారణంగా ఆరోజోను స్థానికులు’ అయిన సీమాంధ్రులకేమో (అనర్హత పరిధి పెరగటంవల్ల) ఉద్యోగావకాశాలు పెరుగుతాయి! అంటే - తెలంగాణ వారికేదో మహోపకారం చేస్తున్న బిల్డప్ ఇచ్చి అన్ని పార్టీలూ కట్టుకున్న పుణ్యంవల్ల తెలంగాణలో దాదాపు సగం జిల్లాలకు నష్టం! రాజధానిలోని ఇరవై లక్షల సీమాంధ్రులకు లాభం!! జై తెలంగాణ! జై సీమాంధ్ర!!

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech