నారాయణక్షేత్రం బదరీ

 

 - విద్వాన్ తిరుమల పెద్దింటి నరసింహాచార్యులు

 

 

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మూలభూతాలు వేదాలు.అవి నాలుగు. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య దశలు నాలుగు. వర్ణాలు నాలుగు.ఆశ్రమ ధర్మాలు నాలుగు. అట్లే భారతదేశంలోని నాలుగు దిక్కులలో ఉన్న పీఠాలు పరమ పవిత్రమైనవి తప్పక దర్శింపతగినవి. అవి తూర్పున ‘పూరీ జగన్నాథము’, దక్షిణమున ‘రామేశ్వరము’, పడమర దిశలో ‘ద్వారక’, ఉత్తరమున ‘బదరీక్షేత్రము’. వీనిలో అర్జున, చిత్రరథుల చరిత్రలతో కూడినది పూరీజగన్నాథము, శ్రీరామ ప్రతిష్టితము రామేశ్వరము,శ్రీకృష్ణ నివాసము ద్వారక. ఈ మూడు భగవంతుని లీలా విభూతులను తెల్పునవి. నరనారాయణుల దివ్య మహిమను తెల్పునది బదరీ క్షేత్రము. దీనినే బదరీనాథ్ అని వ్యవహరిస్త్రారు.

ఈ క్షేత్రము హిమాలయ పర్వత పంక్తుల మధ్య విరాజిల్లుతూ, అలకనంద, భాగీరథ నామాంతరములు గల గంగా నదీ తరంగాలలో ఓలలాడుతూ, నరనారాయణుల పద స్ప్రర్శచే అతి పవిత్రమైన క్షేత్రము బదరీనాథ్ క్షేత్రము. వరాహ, నారద, స్కాంద, పురాణములలో ఈ క్షేత్ర మహాత్య్మము చక్కగా వివరించబడినది.

శ్రీమన్నారయణుడు, నర నారాయణ రూపములను ధరించి బదరీ వనమందు తపమాచరించినట్లు చెప్పబడింది. ‘బదరీ’ అనగా రేగు పండు. ఇది లక్ష్మీ దేవికి నివాసము.ఈ బదరీ చెట్టు నీడలోనే నరనారాయణులు తపమాచరించుటచే ఈ ప్రదేశమునకు ‘బదరీ’ క్షేత్రమని పేరు. దీనికే ముక్తి ప్రద, యోగసిధ్ది, విశాలయను నామాంతరములు కలవు. పురాణములందు నరనారాయణులను గూర్చి ఈ విధంగా చెప్పబడినది.

బ్రహ్మదేవునికి అయోనిజలైన పదిమంది పుత్రులు కలిగిరి. వారు, మరీచి, అత్రి, అంగిరసుడు,పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, దక్షుడు, భరధ్వాజుడు మరియు నారదుడు. వీరిలో దక్షుడు మనువు కుమార్తె అయిన ప్రసూతిని వివాహమాడెను. వీరికి పదునారుమంది కుమార్తెలు కలిగిరి. వారిలో పదమూడవ కుమార్తెయగు ‘మూర్తికి’ నరనారాయణులు పుట్టిరి. వీరు తల్లిని శ్రద్ధగా పూజించెడివారు. అందులకు ఆమె సంతసించి ఏదైనా వరము కోరుకోమని చెప్పెను. అందులకు వారు తపస్సు చేసికొనుటకు అనుజ్ఞనిమ్మని వేడుకొనిరి. ఇష్టము లేకున్నా తపమాచరించుటకు తల్లి అనుజ్ఞ ఇచ్చెను. అపుడు నరనారాయణుద్దరూ తొలుత నైమిశారణ్యమున తపమాచరించిరి. అచట విఘ్లములు కలుగుటచే బదరీ వనమునకు వెళ్ళి తపమాచరించిరి.వారి తపమునకు భయపడి ఇంద్రుడు తపోభంగం చేయుటకై అప్సరోగణమును పంపెను. వారి చేష్టలకు, నరనారాయణులు భంగపడక, వారినవమానించుటకై, నారాయణుడు తన తొడనుంచి ఒక స్త్రీని సృష్టించెను. ‘ఊరువు’ నుంచి పుట్టుట వలన ఆమె ‘ఊర్వశి’ గా ప్రసిద్ధినొందెను. ఆమె దివ్య సౌందర్యమును చూసి అప్సరోగణము భంగపడి దేవదేవుని సేవ చేయు భాగ్యము కలిగించమని కోరిరి. ద్వాపర యుగమందు వారి కోరిక తీర్తునని నారాయణుడు తెల్పెను. ఆ అప్సరోగణమే ద్వాపరమున గోపికలుగా జన్మించి శ్రీకృష్ణుని సేవించుకొనిరి. నరనారాయణులే శ్రీకృష్ణార్జునులుగా అవతరించిరి.

నరనారాయణులు బదరీ వనమున అర్చామూర్తులుగా అవతరించుటచే ఆ ప్రదేశము‘బదరీనాథ్’ అను పేరుతో దివ్యక్షేత్రముగా విరాజిల్లుతున్నది. ఇచట వెలసిన నరనారాయణులను తొలుత నారదుడు పూజించుటచే ఈ ప్రదేశమునకు ‘నారదక్షేత్రము’ అని కూడా పేరు.

ప్రయాగలో ఉన్న రఘునాథస్వామి దేవాలయంలోని ‘శిలాశాసనం’లో ఈ దేవాలయం 15వ శతాబ్దిలో వరదరాజాచార్యుల వారు, గద్వాల రాజుచే నిర్మింప చేసినట్లు తెలియుచున్నది. రామానుజ మతానుయాయులను వైష్ణవ భక్తులచే నియ్యది విష్ణు క్షేత్రముగా విరాజిల్లుచున్నది. బదరీనాథ్ లోని జీయర్ స్వామివారి అష్టాక్షరి క్షేత్రము సుప్రసిద్ధము. ఇచట శివునిచే ఖండించబడిన బ్రహ్మ శిరస్సు పడిన ప్రదేశమునకు ‘బ్రహ్మకపాలము’ అని పేరు. భాగీరథిలో స్నానమాచరించి, పితృదేవతల కిచట పిండ ప్రదానం చేయునాచారము లోకప్రసిద్ధము.

బదరీనారాయణ పూజా విధానములో గొప్ప విశేశము కలదు. ఆరు మాసముల దేవతలు, ఆరు మాసములు మానవులు పూజింతురు. దేవాలయంలో ‘జ్యోతి’ సంవత్సరమంతా వెలుగుతూ ఉంటుంది. ఇదొక ప్రత్యేకత. నరనారాయణుల విగ్రహం అత్యంత ఆకర్షణీయం. శక్తివంతము. నారాయణుడు,శంఖ, చక్ర, గదా పద్మములతో తపోనిష్టా గరిష్టుడిగా పద్మాసనస్థుడై శ్యామవర్ణంతో దర్శనమిచ్చును. ఆ విగ్రహమునకు ఒక పక్క నారదుడు, మరోప్రక్క శ్రీదేవి, భూదేవి, ముఖము వద్ద లీలావతి, తొడపై ఊర్వశి విగ్రహములు కలవు. అదే విగ్రహంపై (ఏకశిలా విగ్రహం) ధనుర్భాణములను ధరించి ఎడమకాలి బొటనవ్రేలిపై నిలబడి ప్రపంచ కళ్యాణార్ధం తపమాచరించు నరుని విగ్రహం కూడా కలదు. పరివార దేవతలుగా, కుబేర విగ్రహము, ఉద్దవ విగ్రహము, గరుడ విగ్ర్హము, చరణ పాదుకలు, సుదర్శన చక్రము దర్శనమిచ్చును.స్కంధ పురాణములో బదరీక్షేత్ర మహాత్య్మము ఈ విధంగా చెప్పబడింది.ఎవరు బదరీ యాత్ర చేసి, నరనారాయణులను దర్శించుకొని నిత్యం మనస్సులో స్మరించుకొంటారో వారికి కోటి యజ్ఞములు చేసిన ఫలితం. సమస్త భూమిని దానం చేసిన ఫలితము లభించును. కావున జీవితంలో ఒక్కసారైనా బదరీ క్షేత్రమును దర్శించి మానవులు తరింతురు కాక.

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech