ఏరీ! వారేరీ! కనరారే! - భండారు శ్రీనివాసరావు
 

ఆ దృశ్యం చాలా అపురూపం. చూడ ముచ్చటగా వుంది. సెల్ ఫోన్లో ఫోటో తీసి
శాశ్వితంగా భద్రపరచుకోవాలని కూడా సభ్యత కాదని తమాయించుకున్నవారు
ఎంతోమంది.
అందులోకనబడుతున్నవారందరూ పెద్ద వాళ్లే! ఆరేడుపదుల వయస్సు పైబడ్డ వాళ్లే!
చేతికర్ర ఊతంతో కొందరు-
భార్య భుజం ఆసరాతో మరి కొందరు-
మొగుడిచేయి పట్టుకుని ఇంకొందరు-
రంగుల మాయా బజార్ ఆడుతున్న అదునాతన థియేటర్ కాంప్లెక్స్ లో
నెమ్మదిగా పైపైకి పాకుతున్న ఎస్కలేటర్ పై నిలుచుని వెడుతున్నదృశ్యం
'
జగన్మోహనంగా' గోచరించింది.
జీవన పధంలో మూడు వంతులకు పైగా నడిచివచ్చిన ఆ ముదివగ్గులందరూ - గతంలోని
మధురిమను మరోసారి మనసారా నెమరు వేసుకోవాలని వచ్చిన వారిలా కానవచ్చారు.
వీళ్ళల్లో కొందరయినా- .
బళ్ళు కట్టుకుని పోరుగునవున్న బస్తీకి పోయి - మూడు నాలుగు ఇంటర్వెల్స్
తో టూరింగ్ టాకీస్ లో ఆ సినిమా చూసివుంటారు.
లేదా సినిమా చూడమని అమ్మా నాన్నా ఇచ్చిన అర్ధ రూపాయిలో ఒక బేడానో,
పావులానో పెట్టి ముంతకింద పప్పుకొనుక్కొని, గోలీ సోడా తాగి నేల
టిక్కెట్టుతో సరిపెట్టుకున్న వాళ్ళుంటారు.
బెజవాడ దుర్గా కళా మందిరంలో మేడ మీద గోడను ఆనుకుని నిర్మించిన పరిమిత
సీట్ల చిన్న బాల్కానీలో దర్జాగా కూర్చుని చూసినవాళ్ళు వుండివుంటారు.
మొదటిసారి వచ్చినప్పుడు, రావడం ఆలస్యమై చిన్న శశిరేఖమ్మ పాట
చూడలేకపోయినవాళ్ళు - మరునాడు ముందుగా వచ్చేసి ఆట మొదటినుంచీ చూసినవాళ్ళు
వుండేవుంటారు.
సినిమాలు ఇలా కూడా తీస్తారా అని బోలెడు బోలెడు ఆశ్చర్య పోతూ మళ్ళీ మళ్ళీ
చూసినవాళ్ళు తప్పకుండా వుంటారు.
అందుకే ఈ రోజున ఆ సినిమా మళ్ళీ చూస్తూ ఆ నాటి సంగతులను గుర్తుకు
తెచ్చుకునే వుంటారు.
పెద్ద తెరపై, స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టం తో, సినిమాస్కోప్ లో 'విజయా
వారి' హనుమ కేతనం హోరున ఎగురుతుంటే కళ్ళార్పకుండా ఒక పక్క చూస్తూనే మరో
పక్క తమ మనోఫలకాలపై పాత జ్ఞాపకాలను 'రీవైండ్' చేసుకునే వుంటారు.
అందుకే అంత నిశ్శబ్దంగా వున్న హాలులో అన్ని గుసగుసలు.
అన్ని ధ్వనులు చెలరేగుతున్న థియేటర్ లో ముందుకు ముందే వినబడుతున్న డైలాగులు.
నటులు నోరు తెరవకముందే వాళ్ళు ఏమంటారో ముందే ప్రేక్షకులు అనేస్తారు.
చిన్న చిన్న సంభాషణలలో యెంత పెద్ద అర్ధం దాగునివుందో పక్కవారికి
చెప్పేస్తుంటారు.
పాటలు వస్తూనే గొంతు కలిపి పాడుతుంటారు.
జరగబోయేది చెప్పేస్తుంటారు.
వినే వాళ్లకి కూడా అంతా తెలిసే వింటుంటారు.
ఆహా ఓహో అని ముక్తాయింపు ఇస్తుంటారు.
హోల్ మొత్తం హాలంతా ఇదే తంతు.
ఎవరూ విసుక్కునే వాళ్ళుండరు.
ఎందుకంటె అందరిదీ ఇదే వరస.
వున్నట్టుండి, కనీకనబడకుండా, లైట్ లు వెలిగాయి. అప్పుడే ఇంటర్వెల్లా! అని
చూస్తే- ఆ వేళ కాని వేళలో , సంధ్యాసమయంలో 'వర్కింగ్ డే' రోజునవేసిన ఆ
ఆటకు హాలు మూడువంతులు నిండి పోయివుంది. కానీ ఆ సంతోషం వెంటనే ఆవిరి అయిపొయింది.
ఈ సినిమా తప్పకుండా చూడాల్సిన చిన్నారులేరీ! ఏరీ! వారేరీ! కనబడరేమీ!
బహుశా పరీక్షల రోజులేమో!
సినిమాకు తీసుకురావాల్సిన తలిదండ్రులకు తీరుబడి దొరకలేదేమో.
మరో రోజు చూపిస్తారేమో.
ఎక్కడో చిన్న ఆశ.
'
వుయ్ డోంట్ లైక్ టెల్గూ మూవీస్ ఎటాల్!' అంటున్న ఈనాటి తెలుగు
యువతరానికి- 'మనమూ గొప్ప చిత్రాలు తీయగలం - కాదు, కాదు ఎప్పుడో
చిన్నప్పుడే తీసేసాం' అని చాటి చెప్పుకోవడానికైనా - ఈ సినిమా చూపిస్తే
యెంత బాగుంటుందో కదా!.

 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech