నేనెరిగిన బి. ఎన్. రెడ్డి జాతీయ అవార్డ్ గ్రహీత కె. బి. తిలక్

 

- వనం జ్వాలానరసింహా రావు

నేషనల్ ఇన్‍ఫర్‍మేషన్ సర్వీసెస్, హైదరాబాద్

 

 

(అంగరంగ వైభోగంగా జరుపుకునే "నంది" బహుమతుల ప్రదానోత్సవంలో, ఉగాది పర్వదినాన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రధమంగా ఏర్పాటుచేసిన "బి. ఎన్. రెడ్డి జాతీయ అవార్డ్" ను, ప్రముఖ సినీ దర్శక నిర్మాత-మానవతావాది-సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళం విప్పే 84సంవత్సరాల "అనుపమ చలన చిత్ర వ్యవస్థాపకుడు" శ్రీ కె. బి. తిలక్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రోశయ్య గారి చేతులమీదుగా అందచేసింది. ఆయన జ్ఞాపకాలను పుస్తకరూపంలో తెచ్చిన రచయితగా ఈ వ్యాసం సుజనరంజని పాఠకులకు ప్రత్యేకం)


 

తెల్లటి ఖద్దరు దుస్తులు మాత్రమే వేసుకునే ఆయన్ను చూసి కాంగ్రెస్ పార్టీ వాడనుకుంటారు. స్వాతంత్ర్యోద్యమ రోజుల్లో ఆయన పాత్ర తెలిసినవారు మాత్రం ఆయన్ను కమ్యూనిస్ట్ అంటారు. అబ్బే...ఇవన్నీ కాదు..ఆయన ఒక సినిమా మనిషేనంటారు మరికొందరు. నిజానికి ఇవన్నీ ఆయనకు వర్తిస్తాయి. సీదా-సాదాగా తిరుగుతూ, అందరినీ పలకరిస్తూ, చిన్నల్లో - చిన్నగా, పెద్దల్లో-పెద్దగా అందరితో కలుపుగోలుగా తిరిగే ఆ మంచి మనిషే "కొర్లిపర బాలగంగాధర తిలక్" - కె. బి. తిలక్. ఆయనో మానవతావాది. ఎక్కడ సాంఘిక దురాచారాలున్నాయో... అక్కడ వాటికి వ్యతిరేకంగా, ఏ మాత్రం ప్రచారం లేకుండా, పోరాడేవారిలో ఆయన ముందుంటారు. సినీ కార్మికుల బాధామయ గాధలకు ఆయన స్పందించి చేసిన అవిశ్రాంత కృషే అందుకు ఒక చక్కటి ఉదాహరణ. ఆరు దశాబ్దాలకు పైగా తెలుగు-హిందీ వెండి తెరతో సంబంధమున్న తిలక్ గారిని, కనీసం, ఎనభై నాలుగేళ్ల వయసు వచ్చిన తర్వాతైనా ప్రభుత్వం గుర్తించ గలగడం అదృష్టమే !

పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరులో 1926లో జన్మించిన తిలక్ పిన్న వయస్సులోనే చదువుకు స్వస్తిచెప్పి1939లోనే స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొని, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో రాజమడ్రి జైలుకెళ్లారు. స్వతంత్ర భారతావనిలో, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, కేవలం అలాంటి ఇతివృత్తాలే కథా వస్తువుగా అనేక చిత్రాలను నిర్మించారు-దర్శకత్వం వహించారు. ముద్దుబిడ్డ, ఎం.ఎల్., ఉయ్యాల జంపాల, భూమికోసం, కొల్లేటి కాపురం, ఛోటిబహు, కంగన్ లాంటి చిత్రాల రూపకర్త ఆయన. సుమారు పాతిక సంవత్సరాల క్రితం, గవర్నర్ కుముద్ బెన్ జోషి ఆధ్యక్ష్యతనున్న "చేతన" స్వచ్చంద సంస్థకు నేను ప్రాజెక్ట్ ఆఫీసర్‍గా పనిచేస్తున్న రోజుల్లో తొలిసారి తిలక్ గారితో పరిచయమయింది. సినిమాలంతగా చూసే అలవాటులేని నాకు ఆయన్ను గురించి అప్పుడు తెలవకపోయినా, అతి కొద్ది రోజుల్లోనే ఆయనలోని అరుదైన వ్యక్తిత్వం, పట్టుదల, ఏకాగ్రత అర్థం కాసాగాయి. ఇందిరాగాంధి హత్యా మరణం తర్వాత, ఆయన రూపొందించి, హైదరాబాద్ తో సహా పలు నగరాల్లో ప్రదర్శించబడిన "భారతరత్న ఇందిరమ్మ" రూప వాణి కార్యక్రమంలో ఆయన చేసిన "మేథా పరమైన కృషి” ని ప్రత్యక్షంగా గమనించిన నాకు ఆయనొక అసామాన్యుడనిపించింది. క్రమేపీ ఆయనతో సాన్నిహిత్య సంబంధం ఏర్పడడంతో, చాలామందికి సుపరిచితుడైన ఆయన్ను గురించి తెలిసిన వారికి-తెలియని వారికి, మరింత తెలియచేయాలన్న కోరిక కలిగింది. ఒకరోజు మార్నింగ్ వాక్‍లో మా ఇంటికి వచ్చిన తిలక్ గారిని ఒప్పించి, ఆయన స్వయంగా వెల్లడించిన ఆయన జ్ఞాపకాలను వారం-వారం "ప్రజాతంత్ర" పాఠకులకు సుమారు పది నెలల పాటు అందించాను. 2006లో, తిలక్ గారి "అనుపమ" సంస్థ ఏభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో, విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన తిలక్ జ్ఞాపకాలను, "అనుపమ గీతాల తిలక్" పేరుతో హాసం ప్రచురణలు పుస్తక రూపంలో తీసుకొచ్చారు. తిలక్ గారికి అవార్డ్ వచ్చిన సందర్భంగా ఆయన్ను గురించి కొద్ది విషయాలను పాఠకులతో పంచుకోదలిచాను.

రాజమండ్రి జైలునుండి విడుదలైన తిలక్ "ఉషా మెహతా" స్వతంత్ర రేడియో ఉద్యమంలో పాల్గొని, అతివాద భావాల ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితుడై నారు. తన జీవిత గమనానికి తానే బాధ్యుడని అప్పటికీ-ఇప్పటికీ నమ్మే తిలక్, తన పూర్వీకుల ఆస్తితో తనకు సంబంధం లేదని స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టిచ్చి, మేనమామ ఎల్.వీ. ప్రసాద్ గారి వద్దకు, మేనత్త వెంట బొంబాయికి చేరుకున్నారు. వెళ్లేటప్పుడు, కమ్యూనిస్ట్ యోధుడు చండ్ర రాజేశ్వరరావు నుంచి శ్రీపాద అమృత డాంగేకు తనను పరిచయం చేస్తూ రాసిన వుత్తరం పట్టుకెళ్లారు ముందు చూపుగా. సినీ పరిశ్రమలో అడుగిడేందుకు ప్రయత్నం చేస్తూనే, "పీపుల్ థియేటర్" ప్రముఖులైన బాలరాజ్ సహానీ, రొమేష్ థాపర్ లతో సాన్నిహిత్యం చేసుకున్నారు తిలక్. ఒపేరా హౌజ్ సినిమా టాకీసులో ప్రజానాట్యమండలి సమావేశాలకు హాజరయ్యేవారు. అలా తన స్వాతంత్ర్య సమరాభిలాషను కొనసాగించా రక్కడ. నేపధ్య గాయకుడు "డబ్ల్యు. ఎం. ఖాన్" తో, సింధీ కమెడియన్ "గోపి" తో పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయాలే ఆయన్ను సినీరంగంలోకి తెచ్చాయి. తన కాళ్లమీద తాను నిలబడేందుకు ఎల్వీ. ప్రసాద్ గారి "బాతు గుడ్ల" ను కూడా అమ్మారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రచురణ "పీపుల్స్ వార్" పత్రికకు పేపర్ బోయ్ గా పనిచేశారు. కె.ఎల్.ఎన్. ప్రసాద్ గారి సోదరుడి సినీ పంపిణీ సంస్థలో సేల్స్ బోయ్ గా కూడా పనిచేశారు. నర్సాపూర్ లేస్ ను అమ్ముకుంటూ కొంత సంపాదించుకునేవారు. ఇవన్నీ కలిపి ఆయన జీవించడానికి పనికొస్తే, వుండడానికి మేనమామ ఇల్లుండేది. ఒకరిపై ఆధారపడడం ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకం.  

ఎల్వీ. ప్రసాద్ గారు మద్రాసుకు వెళ్లడంతో తిలక్ కూడా అక్కడకు మకాం మార్చారు. ఎల్వీ సన్నిహితుడైన సినీ ఎడిటర్ ఎం. వీ. రాజన్ తో పరిచయం చేసుకున్నారు. ఎడిటింగ్ లైన్ లో ప్రావీణ్యం పొంద సాగారు. కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధించడంతో, దాని ప్రభావం ప్రజానాట్యమండలి కార్యకలాపాలపై పడి, దానికి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు మద్రాసు చేరుకున్నారప్పట్లో. వారిలో "భవిష్యత్ సినీరంగ దిగ్గజాలు" అందరూ వున్నారు. కె. ఎస్. ప్రకాశరావు, తిలక్ గార్ల ద్వారా ఎల్వీ. ప్రసాద్ గారు వారందరికీ మద్రాసులో ఆధారం కలిపించారు. అప్పట్లో కొంతకాలం ఎల్వీ గారు కూడా ప్రజానాట్యమండలి అధ్యక్షుడిగా వున్నారు. ఎడిటింగ్ లైన్లో ప్రవేశించిన తిలక్, రాజన్ కాంబినేషన్ తో , "శ్రీమతి", "అంతామనవాళ్ళే", "రోజులు మారాయి", "మంత్రదండం" , "సువర్ణమాల", "రాధిక", "ధర్మాంగద", "జ్యోతి" లాంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. "శ్రీమతి" చిత్రానికి నూతన ఆర్టిస్టులను ఎంపికచేసే ప్రక్రియలో భాగంగా, రాజన్-తిలక్ లతో డైరెక్టర్ ఎల్వీ. ప్రసాద్ మూవీ టెస్ట్, స్టిల్ల్ టెస్ట్, మేకప్ టెస్ట్ చేయించిన వారిలో, దశాబ్దాలపాటు సినీరంగాన్ని, దశాబ్దంపైగా రాజకీయ రంగాన్ని శాసించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు ఒకరు.

తిలక్ గారి సినీ జీవితంలో మైలురాయి నవయుగ బ్యానర్ కింద నిర్మించిన "జ్యోతి" చిత్రం. ప్రజానాట్యమండలికి చెందిన పలువురు కళాకారులతో సహా ఈ చిత్రంలో జి. వరలక్ష్మి కూడా నటించారు. సినీ దర్శకుడుగా వున్న శ్రీధర్ కు, నిర్మాతకు అభిప్రాయ భేదాలొచ్చాయి. దర్శకత్వం భాధ్యత తిలక్ మీద పడింది. ఎడిటర్ గా తనకున్న అనుభవాన్ని మేళవించి, దర్శకత్వానికి వన్నె తెచ్చారాయన ఆ చిత్రంలో. నిరక్షరాస్యతను సామాజిక సమస్యగా వర్ణిస్తూ కొండేపూడి పాటకు అభినయించిన నాటి బాలనటి జోగమాంబగారు, నేటి మేటి నటి, ఎమ్మెల్యే జయసుధగారి తల్లి-నిడదవోలు వెంకటరావు గారి కూతురు. పెండ్యాల ఆ సినిమాకు సంగీత దర్శకుడు. ఆ సినిమాతో తిలక్ దర్శకుడిగా స్థిరపడిపోయారు. శకుంతల గారిని "ఆదర్శ వివాహం" చేసుకుని మద్రాసులో కాపురం పెట్టారు. ఇటీవలే ఆమె మరణించారు. బహుశా తిలక్ గారిని సరిగ్గా అర్థం చేసుకున్నది ఆయన శ్రీమతి ఒక్కరేనేమో ! తిలక్ గారికి పిల్లలు లేరు. లోకేశ్ ను పెంచుకున్నారు. కాలిఫోర్నియాలో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు లోకేశ్.

అనుపమ ఫిలిమ్స్ స్థాపించి, శరత్ నవల ఆధారంగా ఆరుద్ర రూపొందించిన స్క్రిప్ట్ తో, స్వీయ దర్శకత్వంలో, తన తొలి ప్రయత్నంగా 55సంవత్సరాల క్రితం, " ముద్దుబిడ్డ" సినిమా తీశారు తిలక్. సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నవలా రచయిత గోపీచంద్, ఆకాశవాణిలో పనిచేస్తున్న కొంగర జగ్గయ్యను తిలక్ కు పరిచయం చేశారు. జగ్గయ్యతో పాటు ఆ సినిమాలో ప్రధాన భూమికకు "గర్వం"-"స్వాభిమానం" సమపాళ్లలో నటించగల జమునను ఎంపికచేశారు తిలక్. ఆ పాత్ర కావాలని ఆశపడ్డ జి. వరలక్ష్మిని (రిలీజ్ చేయని మొదటి ఎనిమిది రీళ్లలో నటించిన) జమున వదిన పాత్రకు ఎంపికచేశారు. జమున కళాకారిణిగా స్థిరపడి పోయేందుకు ముద్దుబిడ్డ సినిమా కారణమనాలి. తాపీ ధర్మారావు, ఆరుద్ర గార్ల "కలెక్టివ్ స్పిరిట్" తో సినిమా డైలాగులు రూపుదిద్దుకున్నాయని చెప్పారు తిలక్. ఆరుద్ర పాటలకు పెండ్యాల దర్శకత్వం వహించారు. ముద్దుబిడ్డలో తిలక్ పరిచయం చేసిన నూతన డాన్సర్ జ్యోతి ఇప్పటి పాపుల హీరో సాయికుమార్ కు, అయ్యప్ప శర్మకు తల్లి గారు. "బాంబే మీనాక్షి" ని కూడా డాన్సర్ గా పరిచయం చేశారు. ఈ సినిమాతో ప్రారంభమైన తిలక్, ఆరుద్ర, పెండ్యాల కాంబినేషన్ "అనుపమ" కు హాల్ మార్క్ అయింది.

ఆరుద్ర, తాపీ ధర్మారావు, తిలక్ లు భూసంస్కరణలు-దున్నేవాడికే భూమి లాంటి నినాదాలకు ఆకర్షితులై-ప్రభావితులైన వారిలో వున్నారు. ముద్దుబిడ్డ తర్వాత తిలక్ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న సమస్యాత్మక చిత్రం "ఎమ్మెల్యే". అనేక నూతన ప్రయోగాలకు ఉదాహరణగా చెప్పుకోవాల్సిన సినిమా ఇది. "బ్యాక్ సీట్ డ్రైవింగ్, బంతి వడ్డన రాజకీయాలు" ఎమ్మెల్యే సినిమా కథాంశం. జమీందారులు, భూస్వాములు, ధనికులు స్వయంగా చట్టసభలకు పోటీ చేయకుండా, ప్రజల నాడికి అనుగుణంగా వుండేవారిని తమ పలుకుబడితో గెలిపించి, తమ పనులను వారిద్వారా చక్కబెట్టుకునే దోపిడీ విధానాన్ని ఎద్దేవా చేసే సినిమా ఇది. సినిమా చిత్రీకరణ చాలావరకు ఔట్ డోర్‌లోనే జరిగింది. తిలక్ ఈ సినిమాలో రమణమూర్తిని నటుడిగా పరిచయం చేశారు. నేపధ్య గాయనిగా "జానకి" ని కూడా పరిచయం చేసిన ఘనత తిలక్ గారిదే. ఘంటసాల-జానకి జంటగా పాడిన "నీ యాశ అడియాస... చేజారే మణిపూస... లంబాడోళ్ల రాందాసా" విననివారు లేరు. ఆంధ్ర ప్రదేశ్ లో భూసంస్కరణల చట్టం తేవాలన్న ఆలోచన ప్రభుత్వానికి రావడానికి స్ఫూర్తి ఎమ్మెల్యే సినిమానే అనాలి. సెప్టెంబర్ 19, 1957న ఎమ్మెల్యే సినిమా రిలీజ్ అయిన తర్వాత 1958లో లాండ్ సీలింగ్ చట్టం నామమాత్రంగా రూపొందించినప్పటికీ, వాస్తవానికి 1961లో మాత్రమే చట్టంగా వచ్చింది. హైదరాబాద్ మెహందీలో నివసిస్తున్న "చోటీ ఖుర్షీద్" అనే అందమైన అమ్మాయితో సినిమాలో కవ్వాలీ నాట్యం చేయించారు. మనమంతా ఇప్పడు రుచిగా తింటున్న "ఎమ్మెల్యే పెసరట్టు" తిలక్ సృష్టే!

ఎమ్మెల్యే తర్వాత కుటుంబ పరమైన మరో సమస్యాత్మక చిత్రం "అత్తా ఒకింటి కోడలే" తీశారు. ఆ చిత్రానికి, ఆరుద్ర "ద్విపద" రచనకు బాపు వేసిన "బొమ్మల కథ" తో వెలువడిన ప్రచార కార్టూన్లు మరో నూతన ఒరవడి. ఎప్పుడు-ఏ సినిమాకు-ఎవరూ చేయని తరహాలో "అత్తా ఒకింటి కోడలే" చిత్రానికి పబ్లిసిటీ చేయాలని భావించారు తిలక్. ఆంధ్ర పత్రికలో పనిచేస్తున్న రమణ గారు, ఆరుద్ర రాసిన ద్విపదకు బొమ్మలు వేసేందుకు, అప్పట్లో "వాటర్ థాంప్సన్" కంపెనీలో పనిచేస్తున్న మితృడు బాపు గారిని ఒప్పించారు. అందరు కలిసి సినిమా వీక్షించారు. చూస్తూనే బాపు ఓ కాగితం మీద బొమ్మలు గీసి చూపించారు. అందరికీ నచ్చాయి. వెంటనే "అనుపమ చిత్రం అత్తా ఒకింటి కోడలే బొమ్మల కథ" రూపుదిద్దుకుంది. వారం వారం ఆరుద్ర సామెతలు రాయడం, బాపు ఇల్లస్ట్రేషన్ వేయడం, ఆంధ్ర పత్రికలో ప్రింట్ కావడం జరిగేది. ఆర్టిస్ట్-రచయితలుగా ఖ్యాతి తెచ్చుకున్న బాపు-రమణలు సినీ పరిశ్రమకు పరిచయమయింది "అత్తా ఒకింటి కోడలే బొమ్మల కథ" ద్వారానే అంటారు తిలక్. స్టూవర్ట్ పురం సెటిల్మెంట్ థీమ్ తో చిట్టి తమ్ముడు సినిమా తీశారు. అందులో ఒకనాటి మేటి నటి "విజయ లలిత" బాల నటిగా సినీరంగానికి పరిచయం చేశారు. జయలలిత తల్లిగారు సంధ్య చిట్టి తమ్ముడి సినిమాలో రమణారెడ్డి భార్యగా నటించింది. ఆ సినిమాలో సుశీల పాడిన "ఏస్కో నా రాజ ఏస్కో... అకేస్కో, వక్కేస్కో.. అ పైన చూస్కో" బహుళ ప్రచారం పొందింది. సామాజిక స్పృహకు ఉదాహరణగా తీసిన మరో చిత్రం "ఈడూ జోడూ". తెలుగు చలనచిత్ర రంగానికి తను తీసిన ప్రతి సినిమాలో ఒకరకమైన కొత్తదనాన్ని అందించిన తిలక్ అన్ని సినిమాలలాగానే, ఈడూజోడూ కూడా ఆర్థికంగా విజయం సాధించ లేకపోయినా అందరి మన్ననలు-ప్రశంసలు పొందింది.

మృదుమధురమైన పాటల ఆసరాతో, ఆబాలగోపాలం మన్ననలందుకున్న అపురూప చిత్రం తిలక్ గారి "ఉయ్యాల జంపాల". "ఓ పోయే పోయే చినదానా...", "ఉంగరాల జుట్టు వాడు...", కొండగాలి తిరిగిందీ-గుండె వూసులాడిందీ...", "అందాల రాముడు ఇందివర శ్యాముడు.." అప్పటికీ-ఇప్పటికీ-ఎప్పటికీ మరిచిపోలేని "అనుపమ మధుర గీతాలు". అప్పటికే సినీరంగాన్ని వదిలి రాజకీయాల్లో చురుగ్గా వున్న కోన ప్రభాకర రావుతో తిలక్ ఇందులో మళ్లీ వేషం వేయించారు. అట్లతద్దినాడు "ఇస్తినమ్మా వాయినం-పుచ్చుకుంటినమ్మా వాయినం" అనే డైలాగులతో వాయినాలిచ్చే సన్నివేశం వుందిందులో. పెద్దాపురం మేజువాణి తరహా ప్రక్రియైన మరాఠీ "తమాషాల" పై తిలక్ గారికి కలిగిన ఆసక్తి పర్యవసానమే "పంతాలు పట్టింపులు" సినిమా. మరాఠీ మేటి నటిగా పేరు తెచ్చుకున్న లీలా గాంధీ ఇందులో నటించింది. సినిమాలో పాటలన్నీ ప్రశ్న-జవాబులో, అర్థవంతంగా-భావగర్భితంగా-తమాషాగా-పొడుపుకథల్లా వుంటాయి. శ్రీ శ్రీ - కొసరాజు పాటలకు సంగీత దర్శకత్వం వహించిన పెండ్యాల కు ఇది మ్యూజికల్ హిట్ పిక్చర్. ఆయనకు అఖిలభారత స్థాయిలో అవార్డ్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. తిలక్ "ముద్దుబిడ్డ" హిందీ వర్షన్ "ఛోటీబహు" రాజేషఖన్నా-షర్మిలాటాగూర్ కాంబినేషన్ లో తీసారు. తెలుగులో లాగానే కొన్ని కారణాలవల్ల హిందీలోనూ రీ షూటింగ్ తప్పలేదు తిలక్ గారికి. "ఛోటీబహు" లో ముద్దుబిడ్డ పాత్రను పోషించిన బేబీ సారిక’ కమల్‌హాసన్ ను వివాహం చేసుకుంది. "ఛోటీబహు" తిలక్ కు హిందీలో ఒక బ్రేక్. తర్వాత ఈడూజోడూ హిందీ వర్షన్ "కంగన్" ను మాలా సిన్హా, సంజీవకుమార్, అశోక కుమార్, మహమూద్ లతో తీసారు. రెండు హిందీ సినిమాలు విజయవంతంగా తీసిన తిలక్ కు హిందీ సినిమాలకు దర్శకత్వం వహించమని ఎన్నో ఆఫర్స్ వచ్చినా, ఒప్పుకోకుండా బాంబేకు గుడ్ బై చెప్పి హైదరాబాద్ చేరుకున్నారు.

తిలక్ గారి తమ్ముడు రామ నరసింహారావుకు సామాజికన్యాయం సాధించాలన్న పట్టుదల వుండేది. ఆ క్రమంలోనే నక్సలైట్ ఉద్యమానికి ఆది పురుషుడైన చారు మజుందార్ తో పరిచయం చేసుకున్నాడు. హఠాత్తుగా జనజీవన స్రవంతినుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆయన ఎన్‌కౌంటర్లో చనిపోయిన సంగతి తెలుసుకున్నారు తిలక్. తమ్ముడు చనిపోయిన తర్వాత వామపక్షాలన్నీ ఐకమత్యం కావాలన్న థీమ్ తో తీశారు "భూమికోసం" సినిమాను 1974లో తీశారు తిలక్. తమ్ముడికే అంకితం చేశారు దాన్ని. "భూమికోసం, భుక్తికోసం సాగే రైతుల పోరాటం, అనంత జీవిత సంగ్రామం" అని నమ్మిన తిలక్, ఆ సుదీర్ఘ పోరాటానికి "ఆరంభమే కాని అంతం వుండదు" అని తెలియచేసే విధంగా తీసిన విప్లవాత్మక-సామాజిక దృక్ఫద చిత్రమే "భూమికోసం". ఇందులో ఆయన వామపక్ష ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సినిమా టైటిల్స్ చూపిస్తూ, కన్నెగంటి హనుమంతు, గన్నమ్మ, మునగాల రైతుల చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ గొప్ప వ్యాఖ్యానం పెట్టారు. శ్రీ శ్రీ రచించిన అపురూప విప్లవ గేయం నేపధ్యంలో కనిపిస్తాయి టైటిల్స్ ఆసాంతం. మేటి నటీమణి, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలు జయప్రదను "కాబోయే కథానాయిక - కుమారి జయప్రద" గా భూమికోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు తిలక్. "చెల్లి చంద్రమ్మ" పాత్ర పోషించారు జయప్రద. సినిమాలో ఆమె పాడిన పాటను ప్రముఖ నక్సలైట్ నాయకుడు సత్యమూర్తి రచించారు. తెలుగులో మొట్ట మొదటిసారి ప్రఖ్యాత హిందీ నటుడు అశోక్ కుమార్ భూమికోసం లో పాత్రను పోషించారు. సినిమాలో శ్రీ శ్రీ రాసిన "తూర్పు దిక్కున వీచే గాలి" అనే పాటను గురించి సినిమా చూసిన రష్యన్ బృందం ప్రస్తావిస్తూ, అది చైనాను దృష్టిలో పెట్టుకుని రాశారా అని అడిగారు తిలక్ ను. చిత్రం ఆరంభంలోనే "దున్నేవాడిదే భూమి హక్కు" అన్న నినాదాలు వినిపిస్తాయి.

కొల్లేటి ప్రాంతంలోని పరిస్థితులను గమనించిన తిలక్, పలువురి అభిమానాన్ని చూరగొన్న "కొల్లేటి కాపురం" సినిమా తీశారు. బాహ్య ప్రపంచంలోని "జమీందారీ" వ్యవస్థ లాంటి కొల్లేటి ప్రాంత "ఇంజన్ దార్" వ్యవస్థ దోపిడీ విధానాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. సినిమా తీసే ప్రయత్నంలో "కొల్లేటి పడవల" లో తిరిగి స్క్రిప్ట్ తయారు చేశారు తిలక్. ఈ సినిమాలో సుగుంబాబు’ ను గేయరచయితగా పరిచయం చేశారు. ఆయన్ను తిలక్ కు పరిచయం చేసింది శ్రీ శ్రీ. కొత్తదనానికి కొల్లేటి కాపురం సినిమా ఒక మచ్చుతునక. ప్రముఖ గజల్ సింగర్ పూర్ణచంద్ర రావు గారిని నేపధ్య గాయకుడిగా పరిచయం చేశారిందులో. సినిమాలోని ప్రతి పాట, మాట ఆ ప్రాంతానికి-సంస్కృతికి-జీవన విధానానికి సంబంధించినవే. అనుపమ చలనచిత్ర బ్యానర్ కింద కాకుండా నిర్మించిన "ధర్మ వడ్డీ" సినిమాకు కూడా తిలక్ దర్శకత్వం వహించారు.

 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech