4   వ భాగం.                                                                                   

   

ఓం భూర్భువస్వః
తత్సవితుర్వరేణ్యమ్
భర్గోదేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత్!

24 బీజాక్షరాలతో కూర్చబడిన గాయత్రీ మహామంత్రం మహత్తరమైనది. ఒక్కొక్క బీజాక్షరం ఒక్కొక్క ధర్మశాస్త్రం, విశ్వవ్యాప్తమైన విజ్ఞాన సర్వస్వం. బీజాక్షరాలనే అక్షరాలు వేరే ఏవీ ఉండవు. నాలుకతో ఉచ్చరిస్తే మామూలు అక్షరాలు,ప్రజ్ఞతో ఉచ్చ్హరిస్తే అవే బీజాక్షరాలు. సర్వోత్కృష్టమైన ఈ మంత్రోపాసన వల్ల సాధ్యము కానిదేదీ లేదు. శ్రీ గాయత్రీ మహామంత్రాన్ని ఎందరో ఋషులు ఎన్నో విధాలుగా వర్ణించారు. మంత్రార్ఠంతోపాటు వివరణ పద పదానికి తెలుసుకుందాం.

ఓం-ప్రణవ శబ్దవాచ్యుని స్మరణము

ప్రణవ శబ్దవాచ్యుడనగా
1.సకల వేద స్వరూపుడైన నారాయణుడు
2.సర్వోపాధ్యంతర్గత పురుషుడు
3.సర్వమంగళ స్వరూపుడైన పరమశివుడు
4.సర్వవ్యాప్తి,సర్వగతుడైన విష్ణువు
5.గాయత్రీ నామక సవితా దేవతా స్వరూప ఆదిత్య మండలాంతర్గత పరమాత్మ.
తత్సవితు:- తత్+సవితు=సర్వజగత్తును ఉత్పన్నము చేయువాడు, సర్వస్రష్ట, సర్వైశ్వర్య ప్రదాత, సర్వశక్తిమంతుడు(ఆదిత్యుడు)
దేవస్య:- స్వయం ప్రకాశి, సర్వాంతరాత్మ, సర్వస్య సుఖశాంతులనిచ్చువాడు, అందరిచే కోరుకొనబడు పరమాత్మ.
వరేణ్యమ్:-కోరుకొనదగినది, సర్వపూజనీయము, స్మరణీయము, అర్చనీయము, పరమపవిత్రము, సర్వశ్రేష్ఠము అగు
భర్గ:- పాప పంకిలమైన సంసార కూపము నుండి రక్షించు తేజస్సు, అజ్ఞానాంధకారమును తొలగించు తేజస్సు, శుద్ధ సత్వ స్వరూపము.
ధీమహి:- మేము ధ్యానము చేయుచున్నాము
యః:- పరమాత్మ యొక్క తేజస్సు
నః;- మాయొక్క
ధీయః:- బుద్దులను,ప్ర్జజ్ఞలను
ప్రచోదయాత్:-ప్రకాశింప చేయుచున్నదో, ఆ తేజస్సును మేము ధ్యానము చేయుచున్నాము.
"ఓంకార స్వరూపుడు,ఓంకార నామాంకితుడు, సచ్చిదానందుడు, సమస్త జగతికి జీవనాధారుడు. స్వతస్సిద్ధుడు, ప్రాణాధిక ప్రియుడు, కర్మకాండోపదేష్ట, భూలోకాధిపతి, సత్స్వరూపుడై, దుఃఖరహితుడై, చిత్స్వరూపుడై, నిజభక్తుల యొక్క దుఃఖములను తొలగించి, సుఖమును ప్రసాదించు పరమాత్మ యొక్క తేజస్సును ధ్యానించుచున్నాము".
"సర్వజగద్వ్యాపకుడై, జ్ఞానకాండోపదేష్టయై, ఆనంద స్వరూపుడై, స్వర్గాధిపతి యగు పరంబ్రహ్మ తేజస్సును ఉపాసించుచున్నాము"."సంసారమనే పాపకూపం నుండి రక్షించు, పరమ పవిత్రమైన, సర్వోత్తమమైన, శుద్ధ సత్వ తేజస్సును, మాయొక్క బుద్ధులను, ఉత్తమ గుణకర్మ స్వభావములందు ప్రేరేపించుటకై ఉపాసించుచున్నాము".
గాయత్రీ ఉపాసనా పద్ధతులు రెండు విధాలు (1)జపం-మాంత్రాక్షరాలను బిగ్గరగానో, మెల్లగానో, పెదవులు కదుల్చుతూనో లేక మనస్సు నందు తలచుటచే జపం. (2)ధ్యానం-మంత్రార్ధాన్ని ఏకాగ్రచిత్తంతో ధ్యానించటం, ధ్యానం శ్రేష్ఠమైనది.

శ్రీగాయత్రీ శిరో మంత్రం
"ఓమాపో జ్యోతీ రసోమృతం
బ్రహ్మ భూర్భువస్సువరోమ్"

"ఓం ఆపోజ్యోతీ"తో మొదలై, ఓంకారంతో ముగించబడిన ఈ మంత్రం గాయత్రీ శిరోమంత్రం."సమస్తముల నదులయందలి, సముద్రములయందలి జలము, సూర్యచంద్ర నక్షత్రాదుల యందలి తేజస్సు, తీపి, పులుపు మొదలైన షడ్రుచులు, అమృతము, భూ, భువ, సువర్లోకములు,ఓంకార పదవాచ్యుడగు బ్రహ్మమే" అని ఈ మంత్రార్ధము.

ఋగ్వేద, యజుర్వేద, సామవేదాల నుండి భూః భువః స్వః అనే వ్యాహృతి త్రయం ఉత్పన్నమైంది. ఈ త్రయం అత్యంత గూఢమైన రహస్యాలతో పరిపూర్ణమై ఉన్నాయి. ఈ వ్యాహృతి త్రయం అక్షర బ్రహ్మప్రాప్తి ఫలకాలు. అంతేకాదు త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిశక్తులు, త్రిగుణాలు, త్రితత్వాలు, త్రికాలాలు, ఇలా ఎన్నో త్రికములతో, గాయత్రీ మహామంత్రంలోని వ్యాహృతి త్రయానికి గూఢమైన సంబంధం ఉంది.

శ్రీ గాయత్రీ నాలుగవ పాదం-శ్రీ గాయత్రీ మంత్రంలోని నాలుగవ పాదం, విశిష్టమైన శక్తి కలది. బ్రహ్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించి, తురీయ స్ఠితిలో నిలుపుతుంది. మంత్రంలోని మొదటి మూడు పాదాలను ఉపాసించి, సిద్ధిని సాధించిన సాధకుడు నాల్గవ పాదాన్ని జపించి, ఉపాసించి కైవల్యాన్ని కాదు, జీవన్ముక్తిని పొందవచ్చు.
"పరోరజసే సావదోమ్"-పరః +రజసే +సావత్+ఓం

ఈ నాల్గవ పాదం ఆధర్వణ వేదం నుండి గ్రహించబడింది. ఉపనయన సంస్కార సమయంలో, వటువుకు మొదటి మూడు పాదాలు మాత్రమే ఉపదేశించబడతాయి. నాల్గవ పాదం ఉపదేసం పొందాలంటే మరల ఉపనయన సంస్కారం జరగాలి. అప్పుడే మంత్రానుష్ఠానానికి అర్హత లభిస్తుంది. సామాన్యంగా నాల్గవ ఆశ్రమమైన సన్యాసాశ్రమాన్ని స్వీకరించినవారే ఈ పాదోపాసనకు అర్హులు.
మంత్రాక్షరాల మహాతత్వాలు, బీజాక్షరాలను ఆవహించిన అధిష్ఠాన దేవతలు, బీజాక్షరాల మహిమ గురించి విపులంగా తెలుసుకుందాం.

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech