'గండరగండడు రామలింగడి ' తో ముఖాముఖి
- తాటిపాముల మృత్యుంజయుడు

 


శ్లో: శీలం శౌర్య మనాలస్యం, పాండిత్యం మిత్రసంగ్రహః
అచోరహరణీయాని, పంచైతా వ్యక్షయో నిధిః'

శీలము, శౌర్యము, చురుకుతనము, పాండిత్యము, స్నేహశీలత - ఈ ఐదున్నూ దొంగలపాలుగాని అక్షయనిధులు.


'సససా రీరిరి గాగ ', 'మా, నీ దాగనిదా' అను మత్తేభ, శార్దూల పద్యలను సప్తస్వరాలను మాత్రమే ఉపయోగిస్తూ

అర్థవంతంగా చెప్పి తన ఆరాధ్యదైవాన్ని శ్లాఘించి మెప్పు మొందడం ఒక్క 'రామలింగయ్య 'కు మాత్రమే వెన్నతో పెట్టిన

విద్య. తెలుగుభాషా పదాలతో విన్యాసం చేస్తూ పద్యాలు చదువుతుంటే గంటానాదమో, మృదంగ నినాదమో వినిపించినట్టు

అనుభూతి కలిగించడం 'రామలింగేశ్వర్రావు ' ముద్ర. అచ్చంగా హిందీ, ఇంగ్లీషు, తమిళ పదాలను ఉపయోగిస్తూ మధురమైన

తెలుగు పద్యాలను రాయడం 'జొన్నవిత్తుల ' సొత్తు. సినీరంగంలో సాహిత్యం, అష్టకాలు, స్త్రోత్రాలు, శతకాలు, పేరడీలు

మొదలైన ప్రక్రియల్లో నూతన ప్రయోగాలు చేయడం 'రామలింగయ్య ', ఉరఫ్ 'రామలింగేశ్వర్రావు ', ఉరఫ్ 'జొన్నవిత్తుల ',

వెరసి ప్రముఖ కవి 'జొన్నవిత్తుల రామలింగేశ్వర్రావు ' కు మాత్రమే సాధ్యం.

సిలికానాంధ్ర శ్రీ వికృతినామ సంవత్సర ఉగాది ఉత్సవానికి విచ్చేసి తమ చంత్కార సాహిత్యంతో ప్రేక్షకులను

పరవవశం చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వర్రావుతో ముఖాముఖి:
ప్రశ్న: నమస్కారం జొన్నవిత్తుల గారు! మొదటగా మీ బాల్యం గురించి వివరిస్తారా?

జవాబు: జొన్నవిత్తుల సుబ్బారావు, లక్ష్మీనర్సమ్మ గారలు నా తల్లిదండ్రులు. నేను విజయవాడ కృష్ణలంకలో

పుట్టిపెరిగాను. అప్పుడు మా ఇంటికి దక్షిణంలో ఎన్నెన్నో పూలతోటలు, జామమామిడి మొదలుగాగల పండ్లతోటలు ఉండెవి.

వాటిని దాటేసి ఇంకొద్ది దూరం వెడితే కృష్ణానది అగుపించేది. ఉత్తరదిశలో బీసెంట్ రోడ్డు, గవర్నర్ పేట మొదలుగాగల

విజయవాడ పట్టణవాతావరణం కనిపించేది. తోటల్లోని నడుంలోతు పచ్చగడ్డిలో దాగుడుమూతలు, దొంగాపోలీస్ ఆటలు

ఆడేవాళ్లం. ఇలా ప్రకృతిపట్టణ వాతావరణం కలగలిపి దొరకడం ఏ కొద్దిమందికే లభిస్తుంది. అది నా అదృష్టంగా

భావిస్తాను. ఆ నేపథ్యం నా కవితాస్ఫూర్తికి బాగా ఉపయోగించిందని నేను అనుకొంటున్నాను.

ప్ర: మీ చదువు గురించి చెబుతారా?

జ: మా స్కూలు వాతావరణం గురుకులాశ్రమంలా ఉండేది. మా స్కూలు 'అమరజీవి పొట్టి శ్రీరాములు హైస్కూల్ ' కు గవర్నమెంట్

స్థలం కేటాయించి, భవనం కట్టే వరకు మా తరగతులు అన్నీ చింత, జామ, సపోట, కుంకుడు చెట్లకింద సాగాయి. ఒక్క

పదవతరగతి మాత్రం రేకులషెడ్డులో సాగేది. ఆ పక్కనే నూటాయాభై గజాల దూరంలో కృష్ణానదీ తీరం అగుపించేది.

నేను విజయవాడ ఓరియంటల్ కాలేజీలో ఉభయ భాషాప్రవీణ చదివాను. నా గురువుగారు వేటిచర్ల గోపాలకృష్ణమూర్తి గారు.

సంస్కృత వ్యాకరణాన్ని గోరుముద్దలు తినిపించినంత సులభంగా చేప్పేవారు. ఇంకో గురువుగారు పొదిల లక్ష్మీనారాయణ

శాస్త్రిగారు పరమ నిష్టాగరిష్ఠుడు. అతను ఇంటినుండి మంచినీళ్లు తెచ్చుకొనేవాడు. భాషాప్రవీణ తదుపరి బీ.ఏ. చదివి

ఎం.ఏ. తెలుగు పూర్తి చేసాను.


ప్ర: మీ సాహితీప్రస్థానం ఎప్పుడు, ఎలా మొదలయ్యింది? మీ మొదటి రచనలు ఏవో తెల్పుతారా?

జ: కుర్రతనంలో సరదాగా, తమాషాగా రాసిన పద్యాలు, పేరడీల గురించి ఇప్పుడు చెప్పుకున్నా ఏమీ ప్రయోజనముందదు. కాని

నేను మొదటి పద్యరచన చేసింది మాత్రం మా అమ్మ పుట్టిల్లు శ్రీకాకుళంలో. అప్పుడు నా వయస్సు తొమ్మిదేళ్లు. చరిత్ర

చెబుతున్నట్టు శ్రీకృష్ణచేవరాయలు శ్రీకాకుళంలో స్వామిని దర్శించుకొని గోపురం కట్టించాడు. ఆయనకు రాత్రి స్వామి కలలో

దర్శనమిచ్చి తనకో కావ్యం రాసిమ్మని కోరాడు. ఆ ఆలయంలోనే శ్రీకారం చుట్టి పూర్తి చేసిన మహాకావ్యం 'ఆముక్తమాల్యద '

అని మనందరికి తెలుసు. అలాంటి పుణ్యక్షేత్రంలో నేను మొదటి పద్యం రాయడం నా పుణ్యంగా భావిస్తాను.


ప్ర: ఇప్పటి వరకు మీరు చేసిన రచనల్లో 'తప్పక చదవాలి ' అనే కొన్ని ముఖ్యమైన వాటిని తెల్పుతారా?

నేను రాసిన 'తెలుగు వేదం ', 'శ్రీరామలింగేశ్వర శతకము ' తెలుగువారందరు తప్ప చదవాలని నా ఆబిలాష.


ప్ర: ఆ రెండు పుస్తకాల్లోని కొన్ని ముఖ్యాంశాలని వివరిస్తారా?

జ: వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుభాషా సాహిత్యంలో ఎందరో కవులు విలక్షణమైన సాహిత్యాన్ని అందించారు.

వారంతా మహాభావుకులు. భాషాసంపన్నులు. శబ్దం యొక్క స్వరూపం తెలిసినవారు. వాళ్లు అన్ని రకాల ప్రక్రియలు చేసారు.

కాని వారు చేయని ఒక విలక్షణ ప్రక్రియ ఒకటి మాత్రం నాకు సిద్ధించింది. తెలుగుజాతి ఔన్నాత్యాన్ని, తెలుగుసాహిత్య

మహోన్నతాన్ని చాటిచెపుతూ చెసిన రచన 'తెలుగు వేదం'. అమెరికాకి అణుశక్తి ఉన్నట్టు, అర్జునుని అమ్ములపొదిలో

పాశుపశాస్త్రం, రామబాణం, పాంచజన్యం, విష్ణుచక్రమున్నట్లు మన తెలుగుభాషలో ఎన్నో శక్తులున్నాయి. అది చదివిన

వారికి ఎంతగానో శక్తి వస్తుండనడం అతిశయోక్తి కాదు.

అలాగే ద్రుతశార్దూలం, బిందిశార్దూలం, ఆంగ్లశార్దూలం, హిందీమత్తేభం, తమిళమత్తేభం వంటి ప్రయోగాలు చేసిన

'శ్రీరామలింగేశ్వర శతకం ' అందరూ తప్పక చదవాలి.


ప్ర: ఈ రెండు రచనలు చేయడానికి మీరు స్ఫూర్తి ఎలా పొందారు?

మా అమ్మగారికి పుత్రసంతానం కావాలనే కోరిక ప్రగాఢంగా ఉండేది. ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు కుమారుణ్ణి

కలిగించమని తెనాలి దగ్గరలోని చిలుమూరు రామలింగేశ్వరస్వామి దేవాలయంలో నలభై రోజులు ప్రతిరోజు 108

ప్రదక్షిణాల్ని చేసేది. కృష్ణనదిలో వరదలొచ్చి గుడిప్రాంగణంలోకి నీరు వచ్చిన చీలమండ లోతు నీళ్లలో నదుశ్తూ,

పల్లేరుకాయలు గుచ్చుకొంటున్నా లెక్కచేయక ఎంతో దీక్షగా ప్రదక్షిణాలు చేసిందట. ఆ తర్వాత నేను పుట్టాను. నేను

పేరడీలు, పాటలు రాయటం మొదలెట్టిన సమయంలో 'ఆ రామలింగేశ్వరస్వామికి మొక్కుకుంటే పుట్టావురా. ఆయన మీదేవన్నా

నాలుగు పద్యాలు రాయి రా' అంది. అలా మొదలయ్యింది నా శతక రచన.


నేను తెలుగుభాషా అధికారసంఘం సభ్యునిగా ఉన్నప్పుడు రాష్ట్రమంతా అన్ని జిల్లాలు తిరిగాను. అప్పుడూ మన భాష

తీరుతెన్నులను ప్రభుత్వ కార్యాలయాల్లో, స్కూళ్లలో, జనజీవితంలో ఎలా వుందని క్షుణ్ణంగా పరికించాను. ప్రభుత్వం

సరియైన విధానం అవలబించక పోవడంవల్ల తెలుగుభాష సరిగా అమలుకాలేదని గ్రహించాను. ఇంగ్లీషు భాష

ఉపయోగించటంవల్ల కూడా మనకు భాషకు నష్టం జరుతున్నదని నాకు చాలా బాధ కలిగింది. మన తెలుగుభాష

గొప్పతనాన్ని చాటిచెప్పే బాధ్యత నామీదుందని అనుకొన్నాను. ఆ తపనతొ ఒక తెలుగుకవిగా కొత్త ప్రక్రియలతో,

ప్రయోగాలతో 'తెలుగు వేదం ' రాసాను.ప్ర: మీరు దండకాలు, అష్టకాలు, శతకాల్లాంటి ఎన్నో రచనలు చేసారు. మీకు ఏ ప్రక్రియలో రచన చేయడమటే ఇష్టం?

జ: మీకు ఏ కన్నంటే, ఏ చెవంటే ఇష్టం అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేము. అలాగే పళ్లలో చివరి దంతము మనకు

అసలు కనిపించదు. అలాగని ఆ పన్నంటే ఇష్టం లేదని అనగలమా? అలాగే నా పరిస్థితి కూడా అంతే. నాకు అన్ని ప్రక్రియలు

ఇష్టమే.ప్ర: ప్రతి మనిషికి తను చేసే పనిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇంకొకరి ప్రభవం ఉంటుంది. Role Modelలా

అనుకోవచ్చు. అలాగా మీ సాహిత్యంపై ఎవరి ప్రభావమైన ఉందా?

జ: మొదటగా పూర్వకవులందరికి నా నమస్కారం. వాళ్లంతా చాలా గొప్పవాళ్లు. అయితే సాహిత్యంలో విశ్వనాథ

సత్యనారాయణగారంటే నాకు దేవుడితో సమానం. ఆయన సాహిత్యం చాలా గంభీరంగా, శక్తివంతా చేపేవారు. అలాగే

మంగళంపల్లి బాలమురలీకృష్ణగారి సంగీతం నాకు దైవ స్వరూపం. ఆయన పరిచయ భాగ్యం కలగడం వల్ల, సంగీతం

వినడం వల్ల నాకు చాలా మెళకువలు తెలిసాయి. కాని నా రచనల్లో ఎవరి ముద్ర కనిపించ కూడదని, నేను విలక్షణంగా

ఉండాలని రచనలు చేసేవాణ్ణి. నాదైన శైలి, భావుకత, కొత్తదనం ఉండాలనే కోరిక నా రచనల్లో ప్రస్ఫుటమవుతుంది.


ప్ర: సాహిత్య రచనలో మీ బలాలు, బలహీనతలు (Strenghts and Weaknesses) ఏవైనా చెప్పటానికి ఉన్నాయా?

నా కవిత్వ విషయంలో అంతా బలమే. బలహీనతల్లేవు. కాని వ్యక్తిగతమగా నా బలం ముక్కుసూటితనం. అయితే కొన్ని

సందర్భాల్లో అదే నా బలహీనత కూడా అవుతుంది.


ప్ర: మీకు సినీరంగప్రవేశం ఎలా జరిగింది? ఇప్పటి వరకు ఎలా సాగింది?

జ: సినీరంగ వాతావరణం చాలా విచిత్రమైంది. నేను ఆ రంగంలో చాలా జాగ్రత్తగానే ఇమడగలిగాను. కాని

ప్రతిఒక్కదానికి కాలం కలిసిరావాలంటారు కదా. మార్కెటింగ్ అనే విషయంలో నాకు పెద్దగా అవగాహన లేకపోవటంవల్ల

కొద్దిగా ఇబ్బంది పడ్డాను. నా మొదటి సినిమా 'పెళ్లాం పిచ్చోడు ' కు అవార్డ్స్ వచ్చినా సరిగ్గా ఆడకపోవటానికి కారణం

ప్రొడ్యూసర్ ఆ సినిమాని సరిగ్గా మార్కెటింగ్ చేసుకోకపోవటమే. నా దగ్గరున్న కళ క్రియేటివిటి. దానికి ఆసరగా మిగతా టీం

సరిగ్గా తోడవలేదు కాబట్టి సినీరంగంలో నేను సరిగ్గా రాణించలేకపోయాను.


ప్ర: 'భారత్ బంద్ ' సినిమాకి మీరు మాటలు, పాటలు రాసారు కదా. శతకాలు, అష్టకాలు మొదలైన సాహిత్య రచనలు చేసే

మీరు, రివొల్యూషనరీ పోకడలున్న 'భారత్ బంద్ ' లాంటి సినిమాకు ఎలా పనిచేయగలిగారు?

జ: దేశభక్తి, దైవభక్తి నాకు రెండు కళ్లలాంటివి. నా తెలుగుభాష ఎంత గొప్పదని నేను చాటుతానో, నా దేశభక్తిని

గూడా అంత గొప్పగానే చాటుతాను. భారతీయ గొప్పతనాన్ని చాటడం నాకెంతో ఇష్టం. నాకు మన రాష్ట్ర రాజకీయాలతో నాకు

కొద్దో గొప్పో ప్రతిచయముంది. నేను జన్మభూమి కార్యక్రమానికి పాటలు రాసాను. అధికారభాషాసంఘం సభ్యునిగా, సెన్సార్

బోర్డు సభ్యునిగా పనిచేసాను కూడ. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానికి కూడా పనిచేసాను.


ప్ర: తెలుగుకు ప్రాచీనభాషా హోదా లభించింది కదా. మరి ఇప్పుడు మీ దృష్టిలో ప్రభుత్వం, సాహితీవేత్తలు ఏం చెయ్యటానికి

పూనుకోవాలి?

జ: ప్రప్రథమంగా అందరూ చేయవలసింది తెలుగు మాట్లాడాలి, రాయాలి, చదవాలి. ప్రాచీన గ్రంథాలను పునరుద్ధించినా,

మన సాహిత్యాన్ని ఇతర బాషల్లోకి అనువదించినా, ఇంకా ఎన్నో పరిశోధనలు గావించిన, మనం ఆ కృషి ఫలితాన్ని

మాట్లాడం, రాయడం, చదవడంలో చూపెట్టక పోతే ఏం లాభముంటుంది. మనం ఈ పనులను చేస్తూ, మన పిల్లల్ని కుడా తెలుగు

భాష నేర్చుకోటానికి ప్రోత్సహించాలి.


ప్ర: ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు తను చేస్తున్న పనిని ఇతరులు సరిగా అర్థం చేసుకొవడం లేదు అని అనిపించడం

సహజం. అలాంటి సందర్భాలు మాతో పంచుకోడానికి ఏవైనా ఉన్నాయా?

జ: తన రంగంలో అభివృద్ధి చెందుతున్న ప్రతీ మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే పరిస్థితి ఇదే. ముఖ్యంగా

నిక్కచ్చిగా, నిష్కర్షగా మాట్లాడే నాలాంటి వ్యక్తికి తప్పక ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు.

ఏమి పట్టించుకోకుందా ముందుకు సాగడమే నా ధ్యేయం.


ప్ర: మీరు చేపట్టబోయే 'తెలుగుపద్యవాద్య కచేరీ' గురించి వివరిస్తారా?

జ: మొదటగా ఇరవై పద్యాలను ఎన్నుకొని పేరొందిన కళాకారులచే సంగీతం కట్టించి పాడాలని నేను ప్రయత్నం

చేస్తున్నాను. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వం చేయవలసిన పనిని నేను నెత్తికి ఎత్తుకొన్నాను.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి మొదలైన మేధావుల సమయాన్ని చేకూర్చుకోవడం అంత సులభమేమి

కాడు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క సంగీత వాద్యాన్ని (మృదంగం, వయోలిన్, గిటార్, ఫ్లూటు, మోర్సింగ్ మొదలైనవి) చేర్చడం ఈ

ప్రాజెక్ట్ ముఖ్యోద్ధేశం. ఈ పనికి సహాయం చెయ్యటానికి విజయ నిర్మాణ సంస్థ అధినేత శ్రి విజయకుమార్ గారు ముందుకు

వచ్చారు. త్వరలో సీ.డీ. మరియు డీ.వీ.డి. రికార్డింగ్ మొదలవుతుంది.


ప్ర: చివరగా... సిలికానాంధ్ర గురించి మీరు అభిప్రాయం చెప్పండి.

జ: ఒక పద్యరూపంలో క్లుప్తంగా చెబుతాను.

మ|| తెలుగున్ నేర్పుచు బాలబాలికలకున్ తేజంబు పెంపొందగా
విలువల్ చాటుచు సంప్రదాయ కవితా పీఠంబుగా నిల్చుచున్
పలురీతుల్ మనజాతి సంస్కృతికులన్ పట్టంబు కట్టంగ, యీ
సిలికానాంధ్రను చూచి నేర్చుకొనుడీ శీఘ్రంబె సర్వాంధ్రులున్
 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech