సమస్యాపూరణం:

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు ఏప్రిల్ 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము

 

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

 

ఈ  మాసం సమస్యలు

ఆ.వె.|| వేళకానివేళ వేంకటేశ!

 

కం:|| ఉపయోగపడని వరములు ఉచ్చై తోచెన్!

 

క్రితమాసం సమస్యలు

ఆ.వె.|| మనిషి చచ్చె కాని మదము మిగిలె

సీ.|| బజ్జీలు చేగోడి కజ్జికాయలు కూడ, సజ్జనులకు ముందు నుజ్జు కావ!

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

 

మొదటి పూరణ -  వేదుల బాలకృష్ణమూర్తి, శ్రీకాకుళం

సీ.||     బొబ్బట్లు పులిహోర బూంది లడ్డులుకూడ -- బందరు లడ్డుతో విందు కావ!

బూరెలు అప్పాలు గారె అరిశెకూడ -- పిన్నపెద్దలకెల్ల ప్రీతికావ!

బజ్జీలు చేగోడి కజ్జికాయలు కూడ -- సజ్జనులకుముందు నుజ్జు కావ!

ఆవడ, సేమ్యా, ఉగాది పచ్చడి కూడ -- షడ్రసోపేత భోజనము కావ!

తె.గీ.|| చక్రపొంగలియును పాయసంబుకూడ

నవరసాత్మకంబగు భోజనము కావ!

తెలుగు ప్రజలును బంధుమిత్రులును కూడ

ఆరగించ ఉగాది పండుగలుకావ!

 

ఆ.వె.|| వయసు గడచి పోయె, బంధువర్గము లేరు

సిరియు సంపదలును తరిగె; వేష

భాషలందు అహము వదలడు పూర్వపు

మనిషి చచ్చెకాని మదము మిగిలె

 

గమనిక: ఇచ్చిన సమస్యలో సీసపద్య పాదాంతములందు "కూడ", "కావ" అనుపదములు ఉన్నవి; సీస పద్యములోని అన్ని పాదములకు చివర ఈ పదములు వచ్చినట్లు పూరించినాను.

 

రెండవ పూరణ - యం.వి.సి.రావు, బెంగుళూరు,

సీ.|| కొబ్బరి పచ్చళ్ళు గోంగూర మాగాయ -- అల్లపు పచ్చడి ఆవకాయ

పులిహోర దప్పళం పునుగులు గారెలు--పూర్ణాలు మరియును పూతరేకు

గసగసాల్ సేమ్యాలు కలబోసి వండిన --పరిమళించెడి రవ్వ పాయసాలు బజ్జీలు చేగొడి కజ్జికాయలు కూడ--సజ్జనులకు ముందు నుజ్జు కావ [కాగ]

తె.గీ.|| వండి వడ్డించిరంతట  వధువు వారు

ఎల్ల జనులును సంతుష్టి చెంది కూడ

సరిగ పిలవగ లేదంచు సాకు జూపి

అగుడు సేయుచు అలిగెను అత్తగారు  

ఆ.వె.|| మగువనపహసించి మదమత్సరంబున

                       రణమునందు గూలె రాజరాజు

స్వార్థ పరత కతన సకల జనుల నోట

మనిషి చచ్చె కాని మదము మిగిలె

                     

మూడవ పూరణ -    టి.వెంకటప్పయ్య, సికిందరాబాద్

తే!గీ!!     ఘోష యాత్ర నందు ఘోరావమానమై
తపము జేసి పొందె తాను వరము
కుంతి సుతులనెల్ల కుహకంబు జేసెగా!
మనిషి చచ్చె కాని మదము మిగిలె!

                                                (కుహకము అనగా మోసము అని అర్ధము)

 

నాల్గవ పూరణ -    రావు తల్లాప్రగడ , శాన్ హోసే, కాలిఫోర్నియా

సీ.|| అందాల చుట్టిన ఆరగింపులు కాని--అందాల రాశైన అతివ కాని,

ఆనంద కేళిలోనలరెడి బాల్యంబు -- ఉడుకురక్తపు ధాటి ఉబుసు పోవ?

బజ్జీలు చేగోడి కజ్జికాయలు కూడ -- సజ్జనులకుముందు నుజ్జు కావ?

అందము క్షణికము అదికాదు శాశ్వతం -- రహిపుట్టగాపోవు రామచంద్ర!

తే.గీ.||  రూపుమాయక పోదేది రూపమైన!

రుచులు శుచులైన చివరికి రోచ్చె యగును!

శాశ్వతంబేదియూ కాదు విశ్వమందు !

రాలుగాయతనము నీది రామచంద్ర!

 

 ఆ.వె.|| పూవు తెంపినాను పోదు వాసనసలు!

అడుసు తొక్క పోదు కడిగినాను!

చావు  జీవికేను  చండాన్కి కాదయా

మనిషి చచ్చుకాని మదము మిగిలు!

 

ఐదవ పూరణ- పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫోర్నియా  

సీ// ఆరోగ్యమును పెంచి హాయిని గొల్పగా --పెద్దగాను బరువు పెరగ కుండ

నూనె వేపుళ్ళకు నోనోలు చెప్పుచూ--  సాత్వికముగ తిను సజ్జనుండు

వేపిన టిఫెనులు వేడిగా ఉన్ననూ --ఘుమఘుమా వాసన గుప్పు మన్న

బజ్జిలు చేగోడి కజ్జికాయలు కూడ -- సజ్జనులకు ముందు నుజ్జు కావ 

.వె//పెద్ద రౌడి యతడు; పిల్లవయసునందె

తల్లి తండ్రి పోవ తనకు మమత

పంచు వారు మరుగవ యతనిలో మంచి

మనిషి చచ్చె కాని మదము మిగిలె! 

కం:||  జడ లాగిన ప్రతివాడూ

చెడువాడే యని చులకన చేయకు మదిలో

ముడులేయబోవు సరసుడు

జడలాగిన తప్పులేదు జవ్వని వినవే (గత మాసపు సమస్యకి)

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech