కలియుగ అండ - తిరుపతి కొండ

శ్రీనివాసుడు కలియుగ దైవమై ఆంధ్ర దేశమున వెలసి యున్నాడు. తిరుపతి ఏడు కొండలపై నివాసుడైనా విశ్వమందున్న అనేక భక్తులకు కల్పతరువుగా, వరాల వేల్పుగా అందరికి తెలుసు. తల నీలాలనుండి, క్యూలో దర్శనం దాకా ప్రతివారి జీవితంలోనే మరపురాని దృశ్యాలుగా మనసులో చెదరని ముద్రవేస్తాయి. తిరుపతి లడ్డు అన్నపేరు వినగానే ఆ మధురమైన రుచి మనకి జ్ఞాపకం వస్తుంది. తిరుపతి చేరగానే లక్షలాది భక్తుల "గోవిందా! గోవిందా!" అన్న భక్తి చైతన్యపు పిలుపులు మనకి వినిపిస్తుంటాయి. ఆ మంత్రం అప్రయత్నంగా మన నోట కూడా పలకడం ప్రారంభిస్తుంది. తిరుపతి వెళ్ళడం భక్తిలోనే కాదు, సన్స్కృతిలో కూడా భాగం అనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని లీలా విశేషాలు, భక్తులు అద్భుత అనుభవాలు చెప్పాలంటే ఎన్ని గ్రంధాలైనా చాలవు కదా!

తానే తానే ఎందరి గురుడు
సానపట్టిన భోగి, జ్ఞాన యోగి
(అన్నమాచార్య)

అచటి సప్తగిరుల ప్రయాణం, షట్చక్రములు దాటి సహస్రారానికి చేరే జీవుని, జీవనయానం. తలనీలాల సమర్పణ పూర్ణ భక్తికి, శిరోధార్యమైన నిర్మల భక్తికి, నిరాడంబరతకి, బాహ్యదృష్టికి కానిపించని అంతర్ముఖ సాధనా పధం వైపు నిలువు దోపిడిగా వెళ్ళే ఆ చింతనకి సూచనగా అనిపిస్తుంది.

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు (అన్నమాచార్య)

అని కీర్తించబడే ఆ మహా శక్తిరూపుడైన వైకుంఠవాసుని క్షేత్రమహిమకి మూలం ఏమిటి? ప్రపంచంలోనే ఒకానొక అత్యున్నత దివ్యక్షేత్రంగా కోట్లాది మందిని "ఆకర్షించే" ఆ శక్తి ఎక్కడుంది? ఆ స్వామి విగ్రహంలోనా? గోవింద నామంలోనా? ఆ ఏడు కొండల్లోనా? నిత్యకల్యాణ పూజలతో శతాబ్దాలుగా జరుగున్న దివ్యతేజోరాశి చేతనా? ఎక్కడుంది ఆ దివ్య శక్తి? సామాన్యుడి నుంచి ఐశ్వర్యవంతుని దాకా, రారాజులని సైతం, మంత్రులని సైతం తన పాదాల చెంతకి తెప్పించుకుంటున్నాడా వెంకన్న! ఎలా? అన్నది ఒక ప్రశ్న! మనకి తెలియని అతీతశక్తి అక్కడినుండి పనిచేస్తోందా? భగవంతుడు వడ్డీ కట్టడం ఏమిటి? ఆయనకి మనం జుట్టు ఇవ్వడం ఏమిటి? రోజులు ఎదురుచూసి, గంటలకొద్దీ క్యూలో ఉండి కొద్ది క్షణాలు స్వామిని దర్శించి ధ్యనులుగా, ఆజన్మ పునీతులుగా భావించే దివ్యచైతన్యం ఏమిటి? ఆ మూర్తి రహస్యం ఏమిటి? ఇవి శతబ్దాలుగా జరుగుతున్న చర్చలు, మనకి అర్ధంకాని, జవాబు తెలియని ప్రశ్నలు.

స్వామి వారి దివ్య ఆధ్యాత్మికతని గురించి అనేక గ్రంధాలు, కీర్తనలు లభిస్తాయి. ఒక జీవితకాలం అధ్యయనం చేసినా చాలనంత సాహిత్యం లభిస్తోంది మనకి, ప్రపంచంలో అనేక భాషల్లో ! అయినా మనకి ఆ స్వామి తత్వం అర్ధమైందా అనేది ప్రశ్న! ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని దివ్య స్వర్ణ మణిమయ భూషణాలతో అలంకరిస్తారు. ఎవరో పుణ్యాత్ములకే ఆయన అసలు మూలవిరాట్టుని దర్శించే అద్భుత అవకాశం లభిస్తుంది. అందుచేత శ్రీ వెంకటేశ్వరుల చుట్టూ కూడా తిరుపతిలోని ఆయన మూర్తిని గురించి అనేక విశేషాలు, కొన్ని కల్పనలు కనిపిస్తుంటాయి. తిరుపతి స్థలపురాణం, ఆయన కలియుగ ఆవిర్భావం తెలియనిది ఎవరికి!

ముక్తి పీఠా మూల నాయక
శక్తి పీఠ శక్తేశ్వర ప్రభూ
నరజన్మ వ్యర్ధము గానీయకయ్యా
నీనామ రూపాల నా మనసు నిల్పు శ్రీ వేంకటేశా
(శ్రీ సద్గురు పద్యరత్నావళి - లడ్డు స్వామి)

అట్టి పరమ తత్వం దాగున్న ఆ పీఠాన్ని గురించి తెలుసుకోవాలని అందరికి అనిపిస్తుంది. అనేకురు జ్ఞానులు ఆ స్వామిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎన్నో విషయాలు ఇంకా అజ్ఞాతంగానే ఉన్నాయి.

వెంకటాద్రి సమం స్థానం
బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో
నభూతో న భవిష్యతి


అని తిరుమల తిరుపతి దేవస్థానం గ్రంధాలపై కనిపిస్తుంది. అద్భుతమైన విషయంగా తోస్తుంది. మళ్ళీ ఒకసారి శ్రీనివాసుడిని దర్శించాలనిపిస్తుంది.

శ్రీ వారిని గురించిన చక్కని చర్చ "భారత్ లో విగ్రహారాధన ప్రారంభ వికాసాలు" అన్న గ్రంధంలో శ్రీ కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాద రావు గారు చేశారు. ఇందులో కొన్ని చారిత్రాత్మక కోణాలని కూడా చక్కగా పరిశీలించారు. ' వేంకట ' అను శబ్దములో తొలి జన్మ పాపములను భస్మము చేయునది అని అర్ధం ఉన్నది అని చెప్పుకొన్నా అది ఎట్లు వచ్చినదో చెప్పుట చాలా కష్టము అని తెలిపినారు. తొండమాను చక్రవర్తి మొదట తిరుపతి గుడి కట్టించెనని చెప్పబడుచున్నది. గుడి కట్టక ముందు ఆ స్వామి విగ్రహముపై ఒక పాముల పుట్ట ఏర్పడినదని దాని వద్దకు ఒక ఆవు నిత్యం వచ్చి తన పొదుగునుండి పాలను పుట్టలో విడచి పెట్టుచుండెనని, ఆ పుట్ట తవ్వగా స్వామి విగ్రహం బయట పడెననీ చెప్పబడింది. ఆధునిక కాల గణన ప్రకారం శిలప్పదిక్కారమను తమిళవేదము క్రీ.శ.756 ప్రాంతంలో విరచితమైనదని తెలియుచున్నది. నమ్మాళ్వారు తిరువేంగళం కొండను గురించి చాల కీర్తించారు. ఇందులోనే "వేంగళం" అనగా "తొల్లిటి పాపకర్మ ఫలములను భస్మము చేయునది" అని చెప్పినప్పటికి అందుకు తగిన పురాణ ప్రమాణాన్ని వివరించలేదు. శ్రీ ఘన శ్యామల ప్రసాద్ గారు చెప్పిన ప్రకారం ఈ అర్చామూర్తి లో కుడిచేతి ముంజేతి మీద నాగాభరణం, జటపై కిరీటం శివతత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. వక్షస్థలంపై మహాలక్ష్మి ఆకృతి తదితర దేవతలని సూచిస్తున్నాయి. ఇలా ఈ విగ్రహంలో శివ విష్ణు తత్వాలు శోభిల్లుతున్నాయి.

రవికోటీ పరిపాటీ ధరకోటీ రవరాటీ కితవాటీ రసధాటీ ధరమణిగణ కిరణ విసరణ సతత విధుత తిమిరమోహ గర్భగేహః (శ్రీనివాస గద్యం)

 

కొన్ని శతాబ్దాలముందు ఈ మూర్తియొక్క స్వరూప స్వభావాల గూర్చి పెద్ద మీమాంస జరిగిందని పన్నెండవ శతాబ్దానికి చెందిన పూజ్యశ్రీ రామానుజాచార్యుల వారు ఆనాటి తగాదా తీర్చి శ్రీనివాసునిదే ఆ రూపమని ప్రకటించినట్టు చెపుతారు. నిజామేమో శ్రీనివాసునికే తెలియాలి.

విరబోసుకున్న కేశ సంపద, మూడవకన్ను, శక్తి ప్రదర్శనము, శుక్రవార స్నానాభిషేకములు, నిత్య శ్రీసూక్త పారాయణలు, శ్రీ చక్రార్చన, శ్రీ శంకరభగవత్పాదులు ప్రతిష్టించిన శ్రీచక్ర విలాసంతో ఉత్తరభారతం అంతటా దాదాపు "బాలాజీ" (బాల=బాలా త్రిపురసుందరి) యే శ్రీ వేంకటేశ్వరుడని ఇప్పటికి కొంత ప్రచారం సాగుతోంది. ఇలా ఆ మూర్తి రహస్యం ఇంకా రహస్యమయ మయ్యేకొద్దీ కొత్త కోణాలు దర్శనీయమై వారిని సందర్శించే కుతూహలం పెరుగుతూ ఉంటుంది. ప్రాచీన కాలములో పిడుగుపాటు సమయములో నేలకు జారిన శిలలను దేవతాకృతిగా కొలుచు సాంప్రదాయమున్నది. అట్లు శిలాకృతి విశేషముగా వ్యోమమునుండి వెలసిన విష్ణ్వంశ ఇది కావచ్చునని పండితులు కొందరు అభిప్రాయ పడుచున్నారు.

మనకి ఎక్కువ అధారాలు లభించలేదు కాని శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు చెప్పారుట, పూర్వం సుమేరియన్ నాగరికతలో ఎంకీ అనుపేరున ఒక దేవతా మూర్తి ఉండేదని వారు ఎక్కడికి వెళ్ళినా ఆ మూర్తిని తీసుకెళ్ళే వారని అది 8 టన్నుల బంగారు మూర్తిగా ఉండేదిట. సుమేరియన్ లకి, ఆంధ్రులకి ఏదైనా సంబంధం ఉన్నదా అన్న విషయం చరిత్రకారులే చెప్పాలి. ఇంకో కోణం ఏమిటంటే, ఆంధ్రుల సాంఘిక చరిత్ర లో సురవరం ప్రతాప రెడ్డి గారు తిరుపతిలోనిది కుమార స్వామి విగ్రహం అన్నారుట.

ఏది ఏమైనా నాకున్న చిన్నిపాటి (అ) జ్ఞానంతో భావిస్తున్నాను, శ్రీ వెంకటేశ్వరులు ఆంధ్రదేశంలో వెలసిన స్వామి కనుక శ్రీ వారి పేరు కూడా తెలుగుదై ఉండవచ్చు. సన్స్కృత నిఘంటువులలో "వేంకట" నామము మూల శబ్దములు గోచరించ లేదు. కనుక సాహసించి ఇట్లు భావిస్తున్నాను. "వేణువు కటి వరకూ గల సుందర అవతార మూర్తి వేంకటేశ్వరుడు". ఆ చక్కని కేశములు నడుమూ వరకూ గల మూర్తి కి గౌరవప్రదముగా మనము కేశములను అర్పించి ఆ కేశవుని అనుగ్రహముని పొందుచున్నాము. అది ఏ దివ్య రూపమైనను బాలయైనా, శివుడైన, విష్ణువైన శ్రీ వేంకటేశ్వరుడు సర్వేశ్వరుడే!

శ్రీ గురుభ్యో నమః
 

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech