మా నాన్నకు జేజేలు 

   
నాన్నది "ధర్మ వచనం - ధార్మిక జీవితం"

- ఉషశ్రీ గారి కుమార్తెలు డా|| గాయత్రి , డా|| జయంతి

                                                   శీర్షికానిర్వహణ, ఇంటర్వ్యూ : సి. కృష్ణ

 

                     ఘంటసాల మధుర గానం, ఉషశ్రీ గంభీర ప్రవచనాలు తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయి.  ఆకాశవాణిలోధర్మసందేహాలు, రామాయణ, భారత, భాగవత ఉపన్యాసాలు, ప్రత్యేకించి సుందరకాండ, తిరుమల తిరుపతి, భధ్రాచల ఉత్సవాల ప్రత్యక్ష్యవ్యాఖ్యానం.. ఇవన్నీ ఆయన్ని చిరస్మరణీయుడుని చేసాయి. "ఉషశ్రీ".. ఈ మాట వినగానే ఆయన  గొంతు గుర్తుకొస్తుంది దాంతోబాటు మనస్సులో ఆధ్యాత్మిక దివ్యపరిమళాలు విరబూస్తాయి.

     తెలుగు జాతిపై ఆయన వేసిన ఆర్షధర్మ, సంస్కృతీ- సంప్రదాయ, సంస్కారాల ముద్ర తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. అనితరసాధ్యమైన ఆయన కధాకధన శైలికి గాంభీర్యమైన గొంతు వన్నెలద్దింది. ఉషశ్రీ గారి ధర్మసందేహాల కార్యక్రమం రేడియోలో వస్తూంటే పండిత పామరులనే బేధాల్లేకుండా రేడియోకి అతుక్కునిపోయేవారు. రిక్షాలు నడిపేవారు ఏ బడ్డీ కొట్టువద్దైనా చేరి ఆయన కార్యక్రమం సాంతం వినేదాక బేరాలు సైతం వదిలేశేవారు. రోడ్లపై జనసంచారం ఉండేది కాదు. ఇప్పటి ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మాచ్ కి మించిన ప్రజాదరణ పొందిన కార్యక్రమం అది. మొదట శనివారం నాడు పది నిమిషాల కార్యక్రమంగా మొదలై తరువాత శ్రోతల కోరికపై అరగంట, ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు (ప్రైమ్ టైమ్) కి మార్చకతప్పలేదు. పురాణ విషయాలే కాక రాజకీయాలు, క్రీడలు వంటి అనేక అంశాలలో శ్రోతలు పంపిన ధర్మసందేహాలకు ఉషశ్రీకే చెల్లిన ప్రత్యేకశైలిలో వ్యంగ్యోత్తులు, చురకలు జతపరుస్తూ విస్పష్టమైన సమాధానమిచ్చేవారు. వేరే రేడియో కేంద్రంలో వచ్చే "సంక్షిప్త శబ్ద చిత్రం" అనే సినీ కార్యక్రమాన్ని వదిలేసి మరీ ఉషశ్రీగారి కార్యక్రమం వినేవారు శ్రోతలు. అప్పట్లో ధర్మసందేహాల కార్యక్రమానికి "వ్యాసపీఠం" అని పేరు మార్చారు. అందులో ఉషశ్రీ ధారావాహికంగా భారత, రామాయణ, భాగవతం చెప్పారు. దీనివల్ల వారికి, విజయవాడ రేడియో కేంద్రానికి విశేషప్రఖ్యాతులు లభించాయి. ఎంతోమంది శ్రోతలు రేడియో ముందు దీపం పెట్టి కార్యక్రమం అవ్వగానే కొబ్బరికాయ కొట్టేవారు. వారిలోఉషశ్రీ తల్లిగారు కూడా ఒకరు. రేడియో ఒక పవిత్ర వస్తువయిపోయింది. రామాయణ, భారత, భాగవత, భారతాది గ్రంధాలు, వ్యాఖ్యానాలు ఇప్పటికీ లక్షలాది కాపీలు అమ్ముడవుతూనే ఉన్నాయి. వీటిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించినవెన్నో కూడా. రేడియోలో ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహించారాయన. భక్తిరంజనిలో భగవద్గీత, కథామందారం పేరిట ప్రముఖుల కథలు, నవలా శ్రవంతి పేరిట మంచి నవలలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, భువనవిజయాలు, అహూతుల సమక్షంలో ఏర్పాటు చేసిన సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు ... ఇలా ఎన్నెన్నో.... ఆయన చేసిన ఆధ్యాత్మిక, సాహితీ తపోఫలాలు తెలుగుజాతిని పరిపుష్టం చేస్తూనే ఉంటాయి. ధార్మిక, సంప్రదాయ, నైతిక విలువల మార్గదర్శి, తెలుగు సంస్కృతికి బలమైన పునాది - ఉషశ్రీ...

ఉషశ్రీ గారి కుమార్తెలు డా.గాయత్రి, డా. జయంతి సుజనరంజని పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న
" మా నాన్నకు జేజేలు"..

 
 

                 

సహధర్మచారిణి సత్యవతితో ఉషశ్రీ

నాన్న అసలు పేరు "పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు". 1973 రేడియోలో ఉషశ్రీగా పేరొందకముందు కవిత్వం, గేయాలు, యక్షగానాలు, ఎన్నో కధలు, నవలికలు రాసారు. ఎమెస్కో వారు కూడా ఎన్నో ప్రచురించారు. నాన్న రేడియోలో వార్తలు కూడా చెప్పేవారు. రేడియో నాటకాలు రాసేవారు. రేడియో నాటకాల్లో పాల్గొనేవారు. చక్కటి కథకులు కూడా ఆయన. "భారతి"లో కూడా నాన్నగారి కధలు వచ్చాయి. నాన్నగారి ఆధ్యాత్మిక రచనలెన్నింటినో తిరుమల తిరుపతి వారు ప్రచురించారు. ముప్పై అయిదేళ్ళక్రితం నుండి నేటివరకూ అవి విశేష ఆదరణ పొందుతూ పదే పదే పునర్ముద్రితమవుతున్నాయి. పలు ముద్రణా సంస్థలు కూడా లక్షలాది పుస్తకాలను మళ్ళీ మళ్ళీ ముద్రిస్తున్నారు. అందరి ఇళ్ళళ్ళో రామాయణ, భారతాలుండాలనేవారు నాన్న. పండితులెలాగో చదువుతారు.కానీ ప్రతీ ఒక్కరూ వాటిని చదవాలి. అవి అందరికీ చేరాలని ఆయన తపన.

నాన్నగారు 1928 లో కాకరపర్రు గ్రామంలో జన్మించారు. ఎందరో పండితులకు పుట్టినిల్లు ఆ ఊరు. మా తాతగారు పురాణపండ రామ్మూర్తిగారు ఆయుర్వేద వైద్యులు. ఆయన వైద్యం ఉచితంగానే చేసేవారు. తొమ్మిదిమంది పిల్లల్లాయనకు. నాన్నే పెద్ద, నాన్నకు నలుగురు తమ్ముళ్ళు, నలుగురు చెళ్ళెళ్ళు. పెద్ద కుటుంబంతో సహజంగానే ఖర్చులెక్కువగా ఉండేది. చేసేది ఉచితవైద్యం కావడంతో కొన్నాళ్ళకు ఉన్న పొలాలు అమ్మక తప్పింది కాదు. తర్వాత తాతగారు ఆలమూరు గ్రామంలో ఇల్లు కొని అక్కడ స్థిరపడ్డారు. ముందునుంచి తాతగారు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉండేవారు. ఆయన ఉపన్యాసాలకు ఊళ్ళు వెళ్ళేవారు. నాన్నకు అమ్మంటే ఎంతో ప్రేమ. ఇంటి పని, వంట పనిలో సాయం చేసేవారు. వంటంటే ఆడపిల్లలే చెయ్యాలని ఉండేది కాదు. మా తాతగారు కూడా ఆవకాయ పచ్చడి పెట్టడం ఇలాంటివి చేసేవారు. నాన్న అల్లరి చేసేవారు కాదు. ఇంట్లోనే ఉండేవారు ఎక్కువ. చదువుకని అమ్మని వదిలేసి పొరుగూరెళ్ళడం కూడా నాన్నకిష్టం ఉండేది కాదు. మగపిల్లాడై ఇంత నిదానం.. రేపెలా బతుకుతాడో అని భయపడేవారు. కానీ ఆ పిల్లాడే తన పాండిత్యం, వాక్ ప్రతిభలతో కోట్లాదిమందిని ఉర్రూతలూగిస్తాడని, చరిత్రలో నిలిచిపోయే గొప్పవాడవుతాడని అప్పుడెవరూ ఊహించలేదు. మా నాన్నమ్మ గారే నాన్నకు రామాయణ, భారత, భాగవతాలు నేర్పేవారు. అమ్మ వొడిలో భాగవత పద్యాలు నేర్చుకున్నానని, అమ్మే నా తొలి గురువని నాన్న చెప్పేవారు. మళ్ళీ మా అమ్మకి నాన్నే పురాణాలు, కావ్యాలు నేర్పారు.

మేం నలుగురు ఆడపిల్లలం. అబ్బాయిలు లేరన్న బాధ అసలు ఉండేది కాదు. ఎవరైనా ఒకటే ఆయన దృష్టిలో. హాస్యానికో నిజానికో తెలియదు కానీ అబ్బాయిలు లేకపోవడమే నయమనేవారు. చిన్న పిల్లలైన మాకు కూడా నాన్న రామాయణం, భారతం, భాగవత పద్యాలు, శతకాలు, విశ్వనాధవారి కావ్యాలు, కరుణశ్రీగారి పద్యాలు నేర్పారు. .శ్రీ పాద వారి చిన్న కధలు చెప్పేవారు. ఉత్తమమైన పద్యాలు, శ్లోకాలు ఎంచి మరీ నేర్పేవారు. పద్యాలు చదువుతుంటే ఆసక్తి యేర్పడుతుంది కాబట్టి తర్వాతెలాగూ అర్ధాలు తెలుసుకుంటామని ముందు వాటిని కంఠతాపట్టించేవారు. వల్లెవేయడం ద్వారా ధారణాశక్తి, పద సంపదా పెరుగుతాయనేవారు. ఇన్ని నేర్పించినా ఇంటికెవరైనా వస్తే అది చెప్పండి, ఇది చెప్పండంటూ మమ్మల్ని అనేవారు కాదు. ప్రతిభ అనేది గొప్పతనం ప్రకటించుకోడానికి కాదనుకునేవారు. అసలు తనకు తానే అత్యంత నిరాడంబరంగా ఉండేవారు. ప్రచార, ఆర్భాటాలకు వెళ్ళేవారు కాదు.

మా జీవితంలో ఆయన ఎవర్నీ కొట్టడం కానీ తిట్టడం కానీ మేం చూడలేదు. మమ్మల్ని కూడా గట్టిగా చదువుకోమని వత్తిడి చేసేవారు కాదు. కానీ మా బాధ్యత మేం తెలుసుకునేలా చర్యలు చేపట్టేవారు. అల్లరి చేసినా కొట్టేవారు కాదు. అడిగే వాళ్ళం కూడా "నాన్నా మమ్మల్ని చదువుకోమని చెప్పవేం" అంటూ. నాన్ననేవారు "చదువుకోమని ఒకరు చెపితే రాదమ్మా, ఎవరికి చదువుకోవాలన్న ఆసక్తి, పట్టుదల ఉంటే వాళ్ళకే చదువు వస్తుందనేవారు". చదువనేది ఒకళ్ళు చెపితే రాదని ఆయన నమ్మకం కూడా. ఎవర్నీ కూడ నువ్విది చదువు అది చదువు అని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు కాదు. తనది సాహిత్యం కదా అని మమ్మల్ని సాహిత్యం చదువుకోమనలేదు. మా ఆసక్తికి ప్రాధాన్యం ఇచ్చేవారు. మేం కోరిన చదువు చదివించారు. ఆయనకి నచ్చని పని చేస్తే మాతో మాట్లాడటం మానేసేవారు. మాకది కొట్టడం, తిట్టడం కన్నా అతి పెద్ద శిక్షగా ఉందేది. ఎప్పుడయినా మేం బైటకెళ్ళి ఆలస్యం చేస్తే కంగారుపడిపోయేవారు. రోడ్డుమీద అలా పచార్లు చేసేవారు. అమ్మతో వచ్చేస్తార్లే అనేవారు కానీ తనకి ఆందోళన ఉండేది. మమ్మల్ని సందు చివర చూసాక హమ్మయ్యా అనుకుంటూ లోపలికి వెళ్లేవారు. ఏమనేవారు కాదు. కానీ మాతో కొన్నాళ్ళు మాట్లాడటం మానేసేవారు. కేకలెయ్యడం, తిట్టడంతో కాక తన మౌనంతోనే మాకు క్రమశిక్షణ నేర్పేవారు. అదీ మా నాన్నంటే.

మమ్మల్ని అబ్బాయిల్లానే పెంచుతున్నా అనేవారు. మాకు ఇంట్లో కరెంటు వైరింగు గురుంచి అవగాహన కల్పించారు. ఫ్యాన్ బిగించడం నేర్పించేవారు. మాఇంట్లో ఫ్యాన్ బిగించాలంటే మా అక్క చెళ్ళెళ్ళు సాయం పట్టి చేసేసేవాళ్ళం. బల్బులు మార్చడం, ఫ్యూజ్ పోతే వెయ్యడం ఇవన్నీ మాకు వచ్చు. మేమే చేసేవాళ్ళం. మీరు అమ్మాయిలు కాబట్టి ఇలా ఉండండి అనేవారు కాదు. ఆడపిల్లలు అన్న వివక్ష చూపేవారు కాదు. తక్కువగా యేనాడూ చూడలేదు మమ్మల్ని. అలా మాకు జీవితంలో ధైర్య, సాహసాలు, ఆత్మవిశ్వాసం అలవడ్డాయి. మాది సంప్రదాయ కుటుంబం కాబట్టి ఒకళ్ళు చెప్పక్కర్లేకుండానే పద్దతులు పాటిస్తూ క్రమశిక్షణతో ఉండేవాళ్ళం.

మాకు చిన్నతనంలోనే సాహిత్యంతో పరిచయం అవ్వడం నాన్న స్నేహితులవల్లే. వారంతా మహాపండితులు. ఎంతో విద్వత్తు ఉన్నవాళ్ళు. మాఇంట్లో జరిగే సాహితీ చర్చలవల్ల మాకెన్నో విషయాలు తెలిసేవి. కృష్ణశాస్త్రిగారు మా ఇంటికికొచ్చారు. భోజనం చేసాక "అమ్మా నీ చేతి వంట ఎంతో బాగుందమ్మా" అంటూ కాగితం మీద రాసి చూపడం మాకింకా గుర్తే. అప్పటికే కృష్ణశాస్త్రిగారి గొంతు మూగపోయింది. పాలగుమ్మి పద్మరాజు గారు, విశ్వనాధం గారు, గొల్లపూడి మారుతీ రావు గారు(నాన్న ఈయన ఒరే ఒరే అనుకునేంత సన్నిహితులు), మిరియాల రామకృష్ణగారు, సోమసుందరం గారు, శశాంక గారు (ఓలేటి పార్వతీశం తండ్రిగారు), బాలాంత్రపు రజనీకాంతరావు గారు (అప్పట్లో ఆలమూరులో మా ఇల్లు ఒకప్పుడు రజనీకాంతరావుగారి శ్రీమతి వాళ్ళది. దాంతో నాన్నగారెప్పుడూ ఆమెని మా ఇంటి ఆడపడుచనేవారు) ఇలా ఎందరో పెద్దవారు వచ్చేవారు. అంతా సాహిత్యంలో మహామహులే. శశాంక గారు మాకు ఆంగ్లపదాలు నేర్పేవారు. విశ్వనాధ సత్యనారాయణ గారు పెద్దవారు కాబట్టి మేమే వారింటికెళ్ళేవాళ్ళం. నాన్నకు ఆయనంటే విపరీతమైన అభిమానం, గౌరవం. ఆయనకు రావల్సినంత గౌరవం రాలేదని బాధపడుతూ ఉండేవారు. ఆయన ఉండగానే ఆయన మీద ఒక "విశ్వశ్రీ" అని ఒక ప్రత్యేక సంచిక లాంటిది వేశారు. ఆయన మీద వ్యాసాలు రాయించి సంకలనపరిచారు. శ్రీ శ్రీ గారు, నాన్న మిత్రులు. తరువాత శ్రీ శ్రీ గారి మీద కూడా అలాంటి సంచిక వేద్దామని ప్రయత్నం చేసారు కానీ అప్పట్లో నాన్న ఆర్ధిక పరిస్థితి అందుకు సహకరించలేదు. గోపీచంద్ నాన్నకధలపుస్తకానికి ముందుమాట రాసారు. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారి పదవీ విరమణతో ఆయన స్థానంలో విజయవాడ ఆకాశవాణిలో నాన్న నియమించారు. అంతవరకూ నాన్న హైదరాబాదు ఆలిండియా కేంద్రంలో పనిచేసారు. బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఆ కాలంలో స్టేషన్ డైరెక్టరుగా ఉండేవారు. ఇంకా ఎందరో పెద్దలు నాన్నకు హితులు, మిత్రులు, సన్నిహితులే. ఫలానా వాళ్ళు నాకు తెలుసని నాన్న గొప్పలు చెప్పేవారు కాదు. మాకు తెలిసి మేం ఇంట్లో విన్నవి సాహితీ విషయాలే.


షష్టిపూర్తి సందర్భంలో..


వేసవి సెలవుల్లో మాకు రామాయణం తెలుగులో భాగాలుగా ఒక్కొక్కరికీ ఇచ్చి చదివించేవారు. చదవండి బాగుంటందని చెప్పేవారు. పఠనం మీద ఆసక్తి కలిపించేవారు. మాకు తెలిసున్న గొప్ప పుస్తకాలన్నీ నాన్న పరిచయం చేసినవే. నాన్నప్పుడు మా చేత తన లైబ్రరీలో పుస్తకాలు సర్దించేవారు. ఇప్పుడు తెలుస్తోంది. సర్దేటప్పుడు ఆ పుస్తకాల పేర్లు, రచయితల పేర్లు మేం చదువుతామని, అలా కూడా వాటిమీద మాకు ఆసక్తి కలుగుతుందని అలా చేసేవారు. అది కూడా మాకు డైరెక్టుగా చెప్పేవారు కాదు. ఆయన నెలకోసారి పుస్తకాలు సర్దడానికి తీసేవారు. అయ్యో నాన్న కష్టపడుతున్నారని మేం సాయానికి వెళ్ళేవాళ్ళం. అమ్మకు సాయం చెయ్యమని కూడా నాన్న చెప్పేవారు కాదు. తనే వెళ్ళి కూరలు తరుగుతుంటే మేం పరుగెత్తి వెళ్ళి అందిపుచ్చుకునేవాళ్ళం. అలా మాకు బాధ్యతలు సున్నితంగా నేర్పించారు. మాకు అలవాటయిపోయింది.
బయట అన్ని ఉపన్యాసాలు, అన్ని సన్మానాలు, జనం కాళ్ళమీద పడి నమస్కారాలు, దండలు, శాలువాలు అప్పుడప్పుడు మేం చూసేవాళ్ళం. ఆశ్చర్యం వేసేది. కానీ ఇంటికొచ్చాక అవేమీ నాన్న మనసులో ఉండేవి కావు. చాలా సింప్లిసిటీ. అతి మామూలుగానే ఉందేవారు. అందరి నాన్నగార్ల లానే ఉండేవారు. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ ఆప్యాయంగా ఉండేవారు. నాన్నగారంటే హడిలిపోయే పరిస్థితి ఉండేది కాదు. మా చేత సేవలు చేయించుకునేవారు కాదు. ఆయన పనులు ఆయనే చేసుకునేవారు. మా స్నేహితుల ఇళ్ళల్లో వాళ్ళ నాన్న వస్తే గడగడలాడిపోవటం, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు పట్టుకుని నుంచోడం అంతా చూస్తే ఆశ్చర్యంగా ఉండేది మాకు. తన ఆరోగ్యం బాలేనప్పుడు కూడా ఒకరిపై ఆధారపడటం ఆయనకిష్టం ఉండేది కాదు. మేం చెపితే చేయనివాళ్ళం అని కాదు. తన పనికి ఒకరికి చెప్పేవారు కాదు. పనమ్మాయి రాకపోతే మేం చూడకముందే తన కంచం తానే కడిగేసుకునేవాళ్ళు. మేం అన్నం తినేటప్పుడు కంచం చుట్టూ మెతుకులు పడకుండా ఎవరు తింటారో వాళ్ళే బెస్ట్ అని పోటీ పెట్టేవారు. అలాంటివే ఎన్నో. ఒక పాజిటివ్ ధృక్ఫధంతో మా అంతట మాకు తెలిసొచ్చేలా నేర్పేవారు. ఆయా మంచి అలవాట్లు మాకు అలవడి పొమ్మన్నా పోయేవి కానంతగా మాలో ఉండిపోయేవి. అవే మా పిల్లలకి మేం నేర్పుతున్నాము. తన దుస్తులు తానే ఆరేసుకునేవారు. బయట ఆయనకు ఎంత పేరున్నా ఇంట్లో మాత్రం అతి నిరాడంబరత్వం ఆయనది. మీటింగులకు వెళ్ళేటప్పుడు మంచి బట్టలేసుకోమని పోరుపెట్టేవాళ్ళం. చక్కగా విస్త్రీ చేసిన శుభ్రమైన ఖద్దరు బట్టలు వేసుకునేవారు తప్ప ఖరీదైన బట్టలు, ఆభరణాలు ఇలాంటివి ఆయనకి అలవాటు లేదు. మాకూ అదే అలవడింది. పెళిళ్ళ ముందు వరకూ కూడా బంగారు నగలపై మాకు ఆసక్తి లేదు. మా అమ్మకి కూడా అంతే. ఎవరైనా బిరుదులిస్తామంటే వద్దనేవారు. అదేంటి నాన్నా అంటే "అమ్మా, వాల్మీకి, వ్యాసులవారికి ఏం బిరుదులున్నాయానేవారు". ఆయనకసలు తాను గొప్పవాడినని కానీ, అహంకారంఅన్నది కానీ ఉండేది కాదు.

మేమేదైనా ఎంట్రన్స్ పరీక్షలు రాస్తామంటే చెప్పేవారు. ఒక వేళ సీటు రాకపోయినా పట్టించుకోకుండా, ఫీల్ కాకుండా ఉంటామంటేనే రాయమనేవాళ్ళు. ఇప్పుడు రాంకుల కోసం వత్తిడి చేస్తున్న తల్లితండ్రుల్ని చూస్తే మాకు అదే గుర్తుకొస్తుంది. మాకు అలాంటి పాజిటివ్ ఆటిట్యూడ్ అలవాటు చేసారు.
                  

 అమ్మానాన్నలతో మాఇంట్లో

మేం చిన్నప్పుడే "బాల సంస్కార్" అనే కేంద్రం యేర్పరిచాము. అందులో కులం, వృత్తి, ఆర్ధిక పరిస్థితులకతీతంగా పిల్లలందర్నీ పోగు చేసి వాళ్ళకు మంచి విషయాలు, భగవద్గీత, పద్యాలు, ధ్యానం నీతి కధలు చెప్పేవాళ్ళం. సత్యసాయి బాలవికాస్ లాంటిదన్నమాట. వివేకానంద గాధలు, మన సంస్కృతి ఇవన్నీ చెప్పేవాళ్ళం. మా కేంద్రం వార్షికోత్సవాలకు రోటరీ క్లబ్ హాలుని ఆయనే మాట్లాడిపెట్టారు. మంచిపనులకు ఆయన ప్రోత్సాహం అలా ఉండేది మాకు. ఒకసారి మా సోదరి గాయత్రి కధ రాసి నాన్నకు చూపించడానికి భయపడింది. నాన్న ఆ కధని చూసారు. నచ్చినట్లుంది. రేడియోలో చదివించారు ఆ కధని. మా పని యేది నచ్చినా పొగిడి అహంకారం పెంచేవారు కాదు. కానీ మమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించేవారు. మా కాలేజీ మేగజైన్లకి వ్యాసాలు రాస్తే మా నాన్న చేత రాయించుకునేవాళ్ళమనుకునేవారు. కానీ మేమే రాసుకునేవాళ్ళం. మంచిపనులకు నాన్న ప్రోత్సాహం ఎప్పుడూ ఉండేది.

 అమ్మని సన్మానిస్తూ నాన్న

మా నాన్నగారెక్కడికెళ్ళినా అదే రోజునే ఇంటికొచ్చేసేలా ప్లాన్ చేసుకునేవారు. ఎక్కడా ఉండేవాళ్ళు కాదు. ఒకవేళ రెండు మూడు రోజులు ఎక్కడైనా ఉండాల్సి వస్తే నాన్న స్నేహితులు చెప్పేవారు. మీ నాన్న ఇక్కడున్నా ఇంటి మీదే ధ్యాస, మిమ్మల్నే తల్చుకునేవారు అని.

                                                                      సన్మానమందుకుంటూ
తనడైరీలో రాసుకునేవారు "పైన నడిపించేదుకు ఒకడున్నాడు. అంతా ఆయన చేసేదే. మనం ఏదో సాధించామని విర్రవీగకూడదు" ఆయనెప్పుడూ అదే పాటించారు. ఇప్పుడు మేమూ అలానే. మా నాన్న ప్రభావం ఎన్నో విషయాల్లో మామీద అలా ఉంటుంది. తరచూ అనేక సందర్భాల్లో ఆయన ప్రభావం మామీద ఇలా పడిందన్నమాట అని అనుకుంటూ ఉంటాము.

భారతీయ కుటుంబ వ్యవస్థ అంటే ఆయనకెంతో ఇష్టం, గౌరవం. ఆయన కధల్లో కట్టుబాటుకు ప్రాధాన్యత ఉండేది. విచ్చలవిడితనం అసలిష్టం ఉండేది కాదు. పరిధి దాటి వ్యవహరించకూడదనేవారు. వివాహ వ్యవస్థ మీద అపార నమ్మకం, గౌరవం నాన్నకి. పెళ్ళిలో తంతుల కన్నా ఒకరికొకరు చేసుకునే ప్రమాణాలు ఎంతో ముఖ్యం అనేవారు. వాటి మంత్రార్ధం చెప్పేవారు. మాలో రెండవ సోదరి వివాహంలో అన్ని మంత్రాలకి అర్ధం వివరించారు.

ఇలా ఒక ఆదర్శ తండ్రిగా నాన్న ఉండేవారు. ఆయనలో మరిన్ని సుగుణాలు ఉన్నాయి. దైవభక్తి, దేవుడిమీద అచంచల విశ్వాసం, జాలి, దయ, కరుణ, సున్నితత్వం, సేవా దృక్పథం, ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం ఆయన స్వభావం. ఆయన తనకు మాత్రమే తెల్సి ఇంకెవ్వరికీ చెప్పకుండా చేసిన సాయాలు, దానాలెన్నో. మానవ విలువలు, సంబంధాలకు విలువనిచ్చేవారు. మా నాన్న చెప్పేవారు మనిషిని నమ్మాలి అని. ఎవరికైనా అప్పిస్తే నోటు రాయించుకునేవారు కాదు. ఇస్తాడా ఇస్తాడు. ఇవ్వకపోతే పోనీ,.. తింటాడు యేం అనేవారు. ఇది మాటలుగా కాక ప్రాక్టికల్గా అలానే చేసేవాళ్ళు. నాన్న స్వర్గస్తులైన తర్వాత కొందరు ఇదిగో మీ నాన్న మాకిచ్చిన డబ్బు అని తెచ్చిస్తే అప్పుడు తెలిసింది మాకు. ఓహో మా నాన్న ఫలానా వాళ్ళకు డబ్బులిచ్చారన్నమాట అని.

నాన్న మాటమీద నిలబడే వారు. మాటకి విలువిచ్చేవారు. కేసెట్ల కంపెనీలతో ఒప్పందాలు, సంతకాలు అవసరం లేదనేవారు. ఎవరో ఒకాయన మోసం చేస్తే, పోన్లే తిన్నాడన్నారే తప్ప ఎవరికీ చెడుగా చెప్పలేదు. ఎవరికైనా డబ్బిస్తే తిరిగి వచ్చిందా మనది, లేదా వాళ్ళది అనుకునేవారు తప్ప నా డబ్బు నాకిమ్మని గొడవ చేసేవారు కాదు. ఇవ్వలేదు అని ఎవరితో చెప్పేవారు కూడా కాదు. డబ్బు ఆయనమీద ప్రభావం చూపలేదు. డబ్బన్నది ఎవరో ఒకరి అవసరాలు తీర్చడానికే అన్న ధృక్పథం తప్ప దానిమీద మమకారం పెంచుకోలేదు.

ఎదుటి మనిషికి సహాయం చేసే గుణం నాన్నకు చిన్నప్పుడినుండే ఉంది. తనకని తెచ్చుకున్న ఫీజు స్నేహితుడికి లేకపోతే కట్తేసారు. బయట ఎవరికి ఏ సహాయం చేసారో మాకెవ్వరికీ చెప్పేవారు కాదు. విజయవాడలో ఉన్నప్పుడు నాన్న సంపాదన నెలకి సరిగ్గా సరిపోయేది. ఆ పరిస్థుతుల్లోనూ పిల్లలెక్కువున్న ఒకాయనకి సహాయం చేసేవారు. వాళ్ళ పిల్లల ఫీజులకోసం నాన్న సర్దుబాటు చేసేవారు. అప్పటికే నాన్నదగ్గర చాలాసార్లు డబ్బులు తీసుకోడంతో నగ ఒకటి తెచ్చి "అయ్యా ఎంతకాలం మీ దగ్గర ఊరికే తీసుకుంటాను, ఈ నగ ఉంచుకుని డబ్బివ్వండి" అన్నారు. అప్పుడు నాన్న అన్నారు" నా పిల్లలకు ఇచ్చినట్లే నీ పిల్లలకు ఇచ్చాను. ఇలా నగలు పట్టుకొచ్చేలా అయితే రావద్దు. నేనేమీ తాకట్టు వ్యాపారిని కాదు" అని డబ్బులిచ్చి పంపారు. .

ఒకసారి నాన్నగారి స్నేహితుడికి కూతురు పెళ్ళికి డబ్బిచ్చారు. ఆయన మళ్ళీ ఇవ్వకపోతేనో అన్న మాట వస్తే ఏముంది?. నా మరో కూతురు పెళ్ళి చేసాననుకుంటా అన్నారు. అదీ ఉషశ్రీ గారంటే.

ఇలా ఎన్నో ఎన్నెన్నో.....


             ఉషశ్రీ గారి సన్మానసభలో ప్రసంగిస్తున్న మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు

మనవరాలితో ఉషశ్రీ

మేము ఉషశ్రీ మిషన్ అనే సంస్థను స్థాపించాము. కార్యక్రమాలు చేస్తున్నాము. ఉషశ్రీ డాట్ ఆర్గ్ పేరిట నాన్నగారి వెబ్సైటు నిర్వహిస్తున్నాము. అందులో ఆయన ఉపన్యాసాలు ఉంచాము. ఆయన పుస్తకాలను అచ్చు వేయిస్తున్నాము. మా చేతనైనంతమేరకు నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము.

ఉషశ్రీ గారి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు

ఆయన తన ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో ఏం బోధించారో ప్రజలకి ఏ మంచి చెప్పారో తన జీవితంలో కూడా అదే పాటించారు. సంస్కృతీ సంప్రదాయాలను ఆచరిస్తూ, ఆచరింపచేస్తూ, నిరాడంబర జీవితం గడుపుతూ, మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా జీవితం గడిపిన మా నాన్న ధన్యజీవి. విలువల్ని ప్రవచించారు. జీవితంలో విలువల్ని పాటించారు. దైవ భక్తితో పాటు ఆధ్యాత్మికత లక్ష్యం మానవత, మానవ విలువలని పెంపొందించడానికే అన్న అక్షరసత్యానికి యథార్ధరూపం - నాన్న జీవితం. బోధించిన ధర్మాన్ని ఆచరించిన మహా మనీషి మా నాన్న ఉషశ్రీ గారు.

డా|| గాయత్రి:

డాక్టర్ గాయత్రీదేవి గారికి ఆయుర్వేదంలో రెండు దశాబ్దాల అనుభవం, పత్రికలు, రేడియో, టీవీ మాధ్యమాల ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి ఉషశ్రీ అసంపూర్ణ గ్రంథం “రామాయణంలో హనుమంతుడు” పూర్తి చేశారు. “Why of Herbs'', ``An Institute of Ayurveda'', ``పుట్టబోయే బుజ్జాయి కోసం” రచనలకి జాతీయ బహుమతులు పొందారు. 2007 లో భరతముని ఆర్ట్స్ అకాడమీ వారి “ఆదర్శ వనితా పురస్కారం” అందుకున్నారు.

 

డా|| వైజయంతి:

డాక్టర్ వైజయంతి ప్రస్తుతం పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. వీరు ప్రముఖ దినపత్రిక సాక్షిలో పనిచేస్తున్నారు. తన తండ్రి ఉషశ్రీ గారి రచనల మీద పి.హెచ్.డి చేశారు.

 
   
 
   
 

గమనిక - ఈ శీర్షికలో పాఠకులందరూ పాల్గొనాలని మా ఆకాంక్ష . ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ప్రభావం ఎంతో వుంటుంది . అలా ప్రభావితులమైన మనమందరం ఆ మధుర క్షణాలనూ , ఆ తీపి అనుభూతులనూ , ఆ మహనీయుడందించిన బోధనలనూ , విశ్లేషణా పరిజ్ఞానాన్నీ అందరితో పంచుకోవడం మీ తండ్రికి మీరిచ్చే గౌరవ సూచకమేకాదు , అవి మిగతావారికి కూడా ఒక సందేశాన్నిచ్చి వారిని కూడా ప్రభావితం చేస్తాయి . ఆ నాడు నెహ్రూ తన కుమార్తెకు వ్రాసిన లేఖలు అమితభారతానికీ ఒక స్పూర్తినందిన్నాయి అంటే ఏమీ ఆశ్చర్యపడాలసిన విషయం కానేకాదు. మీరుకూడా మీ తండ్రిగారిదగ్గిర నేర్చుకున్న విషయాలను , పంచుకున్న ఆ ఆత్మీయతనూ అందరితో పంచుకోండి , సుజనరంజని ద్వారా వారికి నివాళులర్పించండి.

మీ రచనలను sujanaranjani@siliconandhra.org కు పంపండి . మీకు రచనలు చేయటం అంత అలవాటు లేకపోయినా భయపడకండి . ఈ శీర్షికలో వృత్తాంశం ముఖ్యము . మీరు వ్రాసి పంపితే మా సంపాదక వర్గము మీ రచనకు
సహకరిస్తుంది.   
        

                                                                                                        - సంపాదకవర్గం

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech