పెంపకం

- కూచిభొట్ల శాంతి

తప్పటడుగుల పసిడివయస్సులో

తడబడకుండా నిలబడేందుకు

నీ బుల్లి బుల్లి వేళ్ళు పట్టుకుని

పదిలంగా, అప్రమత్తంగా..

నీకై నువ్వు

నడయాడే దాకా...ఉన్నాను

 

ఓ, నామాలు దిద్దే వయస్సులో

పిచ్చి పిచ్చి గీతలు...రాతలు కాకుండా

నీ చిట్టి చిట్టి చేతుల్ని పట్టుకుని

పద్ధతిగా, క్రమంలో..

నీకై నువ్వు

రాసే దాకా...ఉన్నాను

 

సమస్తం తర్క, వితర్కమయమైన

తరుణ వయస్సులో

ఆటపాటలతో నిండిన ..నీ చేతుల్ని, చేతల్ని

అతిభద్రంగా ... చదువు దారికి మళ్ళించే వరకు

నీ నీడలా...ఉన్నాను

 

స్నేహ ప్రపంచంలో మునిగిన యుక్త వయస్సులో

తప్పటడుగులు వేసి తడబడ నీయకుండా

అపురూపంగా..నీ చేయి పట్టుకుని

నువ్వే

పదిమందికి అండగా మారేదాకా

కంటికి రెప్పలా నీతోనే..ఉన్నాను

దశాబ్దా లుగా మనుమలందరినీ

రెక్కల మాటున పొదువుకుని

రెప్పల మాటున నిలుపుకుని

అవిశ్రాంతంగా

నీ కైదండలకి అండగా

నీతోనే....ఉన్నాను

 

ఇప్పుడు

పొద్దు వాలిన వయస్సులో

మాట నడక తడబడి, చూపుమసకేసినా

నిర్భీతిగా కాలం వెళ్ళబుచ్చుతూ

నీ ‘చేతిపెంపకం’ ఆసరాతో

ఆనందంగా...ఉన్నాను.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం