వికృతి

-  రమాకాంతరావు చాకలికొండ

 పల్లవి  : వసంతాలు పంచుకుంటూ, విరి వన్నెలు జల్లుకుంటూ

                వచ్చింది తెలుగింటికి వికృతి నామ ఉగాది

అను పల్లవి : మరుమల్లెల గంధముతో, విరివెన్నెల రంగులతో,

                మరల మన తలుపు తట్టి వచ్చె మరో ఉగాది

 

1.             తీగ తీగన పూసిన తెల్లని మరు మల్లెపూల,

                మకరంద  గ్రోలిన - మధుపం ఆహ్వానిస్తే

                కోకిల తియ్యని కంఠం కమ్మని రాగాల తోటి,

                స్వాగతాలు పలుకుచూ బొట్టు పెట్టి పిలిస్తే     ||వసంతాలు||

2.             అత్త, కోడళ్ళు ఒకరై, ముస్తాబై జట్టుగ,

                చిత్తరువుగ వేసిన రంగుల ముగ్గులు మెచ్చి,

                నూతన వస్త్రాలు కట్టి నవ్వు కుంటు ఆడుకునే

                తాత, మనవళ్ళలోన ఆత్మీయత పొంగు జూచి  ||వసంతాలు||

౩.             మామిడి చిరు ముక్కలకు, చెరకు,  వేపూతతో

                అమ్మ కలిపి అందించిన పచ్చడి రుచులు మెచ్చి

                కమ్మనైన గారెలు, పప్పు, కూరలు తోటి,

                సొమ్మసిల్ల తిన్నట్టి పసందైన విందు మెచ్చి  ||వసంతాలు||

4.             తరగని ఆనందం స్థిరంగ ఉండాలని

                పురాణాల శాస్త్రి చెప్పు పంచాంగం వినడానికి

                తిరు వేంకని దీవెనలు పురమునందు పంచుకొంటు

                 హరిదాసులు రూపంలో పలకరించే ఉగాది  ||వసంతాలు||            

                 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం