వికృతి కి ఆహ్వానము

- నవీన చంద్ర

                       

 

వీనుల విందుగా

కన్నుల కందుగా

గాయపడిన ఎదకు మందుగా 

పాడె పిట్టలు  శృతి తప్పక

పూచె మా చెట్టు లేత ఆకులను

వీచె ఈ మలయానిలము   

మధురమీ ధ్వనులు

అందమీ చివుళ్ళు

ఆహ్లాదకరమీ గాలి 

కట్టవే చెల్లెలా 

తలుపుకు మామిడి తోరణాలు

వేయవే ప్రియా

ముంగిట ముందు  ముగ్గులు 

మంచు కరిగి పోయి

 చిట్టి సెల ఏరులు

రోడ్డ్ల  నల్ల దనాన్ని

పారుతున్న

వెల్లడి చేస్తున్నాయి  

 సృష్టికి నూత్న ఆరంభం 

ఈ కిటికీ ముందు ఇలానే  

నిలుచుండి పోనా?

ప్రేక్షకునిగా    

ఇంకొక వారములో

పగలూ ,రేయీ 

సమానమౌతాయి 

ఋషులు కనిపెట్టిన

ఈ పండుగ

మనకు శిరోధార్యం   

వికృతి లో చూడవోయి

అందాలు.

విరోధి లో రేగిన

విరోధాలు

సమసి  పోతాయా?

విరోధిలో

లేచిన గోడలు

కూలి పోతాయా?

విరోధిలో

విరిగిన మనసులు

కలిసి పోతాయా మళ్ళీ?

 ఏమో?

 మధుర అమృత

భాండం లో 

చిలక రించారు 

విష బిందువులను

కావలసిన వాళ్ళు  

ఇచ్చీ పుచ్చుకోడాలలో

అందెవేసి

మనస్సులను మార్కెటులో

మసిచేసి

అనుభూతులపై

లాభనష్టాలను బేరీజు వేసే 

ఈ పెట్టుబడి దారుల తో

వేగడం   ఎలాగో

వికృతీ!

  పరస్పర పారితోషికత్వము

మతలబీతనము

మాసిపోతుందా 

ఈ వికృతిలో

ఏమో ?

 స్మృతుల సుడిగుండాలలో

మునిగిపోతున్న నాకు

వేయవా ఒక త్రాడు?

నన్ను దరి చేర్చవా ?

ఓ వికృతీ! 

హే వికృతీ !

అతుకుతావా

తిరిగితెస్తావా

మళ్ళీ కూడబెడ్తావా   

విరిగిపోయిన మనస్సులను

చెరిగిపోయిన సాన్నిహిత్యాన్ని  

తరిగిపోయిన స్నేహధనాన్ని 

ఎలా సరిపెట్టుతావో

 నీ ఒడిలో

ఇలాగే నిద్రపోనా?

కలిగించవా ఉపశమనం!

 విరోధి అలజడి 

తగ్గిస్తావా?

కపటాన్ని

అభిమాన రాహిత్యాన్ని

ఎదుర్కోవడం

నేర్పవా?

 వికృతీ!  

ఈ పిట్టలే మనకన్నా ప్రీతికరం

ఈరాళ్ళే మనకన్నా మేలు!

ఈచెట్లే మనకన్నా మెరుగు!

ఈభావాలే మనకన్నా సులభాలు! 

ఈ పిట్టలతో

ఈ రాళ్ళతో

ఈ చెట్లతో 

ఈ భావాలతో

సరి పెట్టుకోమ్మంటావా?

వికృతీ! 

మనుషులకు దూరంగా !

ఇదే నా నీ పాఠం


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం