కాసేపు విశ్రమించ కూడదూ ?

- వారణాసి నాగలక్ష్మి

ఎర్రంచు పీతాంబరాలు ధరించి
ఏ పేరంటానికి పోతున్నాయో ఆ నల్ల మబ్బులు!
బంతిపూలు ఆరబోసిన పడమటి వాకిట్లో
ముద్ద మందారమై విచ్చుకున్నాడు సూరీడు !
కవాతు చేస్తున్న విమాన దళమో
చుక్కల్లో శ్రీరామ బాణమో
ఎక్కడికో..ఆ పక్షుల పయనం?
నిలువుగా తపస్సులో మునిగారెందుకో
నిశ్చల గంభీరులు ...తాళ వృక్షాలు   ?
ప్రకృతి కాంత ముచ్చటపడి తెచ్చుకున్న
అద్దాన్ని ..అదే ..ఆ కదలని తటాకాన్ని
ఇపుడే శుభ్రంగా కడిగినట్టున్నాడు  వానదేవుడు !
అలవోకగా కదిలే అదృశ్య సుందరీ మణి
సామజ వర గమన ..అదిగో ..మలయానిల భామిని!
ఈ చల్లని పలకరింపు..ఈ సుతిమెత్తని స్పర్శ ..
ఈ ప్రేమ నిండిన పరిష్వంగం ...ఆమెదే !
తడిసిన నందివర్ధనమై మురిసే మానసం కోసం
మొగ్గై ముడుచుకున్న హృదయ కమల వికాసం కోసం
ఈ సాయంత్రం ఇలాగే ఆగిపోకూడదూ   ?
చిక్కుదారాలై చుట్టుకున్న చిరాకులన్నీ చెదరేదాకా
చిరునవ్వు మరచిన పెదవిపై చిన్నహాసం కదలే దాకా
ఈ సాయంత్రం ఇలాగే ఆగిపో కూడదూ?
యుగాలుగా విరామమెరుగని కాల చక్రం
ఈ ఒక్కపూటా కాసేపు విశ్రమించకూడదూ  ?

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం