విశ్వ కుటుంబం

- తమిరిశ జానకి

నిశిరాతిరి నిశ్శబ్దాన
గాఢనిదర పోయేవాడిలొ
తొంగి చూసే మృత్యుకళకి
వాడి మెలకువతోనే అంతం
నిదరపట్టనివ్వని ఉద్వేగపు
పథకాల ప్రణాళికలు
అణువణువును తొలిచేస్తున్నవాడిలొ
మోగుతున్న మృత్యుఘంటికల రవళికి
లేదు అంతం..అది అనంతం..
ఆ మృత్యుకళకి మెలకువ, ప్రాణభిక్ష
మనోల్లాసం..మనోహరం
ఈ మృత్యుఘంటికల రవళికి అవుతుంది
మనోజ్ఞ దృశ్యాల మధురభావాల
ఆలింగనమే అడ్డుగోడ, గాఢనిదరకది తెడ్డు,
సత్యశివసుందరం మౌనభాషణమవ్వాలి
తూరుపు వాకిట చొచ్చుకునివచ్చిన కిరణమల్లే
తెల్లనిమనసుతొ లేచి చల్లని చిరునవ్వుల
పాతిన విత్తనమల్లె పైకి వొచ్చి మొక్కల్లే
పచ్చని బ్రతుకై ఎదగాలని చూడు
మట్టి నుండి వచ్చానని మండిపడదు మొక్క
మట్టికి తన మొదళ్ళనే అంకితమిచ్చేస్తుంది
కొమ్మలతో రెమ్మలతో అర్పిస్తుంది వందనాలు
జన్మనిచ్చిన గడ్డనుండి
పెళ్ళగించుకోకు నిన్ను నువ్వు
దులపరించుకోకు మన్ను
ఉండనీ మొదళ్ళు ఈ మట్టిలో
పెరగనీ కొమ్మలు సువిశాల ప్రపంచానికి
ఒకనీడకింద నలుగురినీ చేరదీయి
విశ్వకుటుంబం మనదని చాటి చెప్పవోయి!

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం