మరొక తలుపు

- తమిరిశ జానకి

  ఏవైంది నాయనా అతడికి?ఆతృతగా అడిగింది రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకునే అవ్వ?
ఏం చెప్పమన్నావు? రెండు మూడు రోజులుగా పైసా సంపాదన లేదు మా ఇద్దరికీ.
ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నాం. దాని మూలంగా కడుపులో నెప్పితో బాధపడుతున్నాడు వీడు. స్నేహితుడు గిరి వైపు జాలిగా చూస్తూ చెప్పాడు శివ.

అయ్యో పాపం! ఇలా రండి బాబూ! ఈ ఇడ్లీలు తినండి"
గబగబా ఆకుల్లో ఇడ్లీలు పచ్చడి వేసి అందించింది అవ్వ.
అవ్వా జేబుల్లో డబ్బుల్లేవు. చెప్పాను కదా! చిన్నగా అన్నాడు.
శివ మాటలకి నొచ్చుకుంది అవ్వ.
ముందు ప్రాణం నిలబడటం ముఖ్యం. కాదనకండి, తీసుకోండి - చేతిలో డబ్బులున్నప్పుడు ఇద్దురుగాన్లే!
థంక్యూ అవ్వా! తప్పకుండా డబ్బులిచ్చేస్తాం.
స్నేహితులిద్దరూ తృప్తిగా ఇడ్లీలు తిన్నారు.
అది మొదలు జేబులో డబ్బులేనప్పుడల్లా అవ్వ దగ్గరకొచ్చి కడుపు నిండా తినేసి వెళ్ళడం అలబాటైపోయింది ఇద్దరికీ. డబ్బులిమ్మని అవ్వ కూడా వాళ్ళనెప్పుడూ తనంతట తనుగా అడగదు. వాళ్ళిచ్చినప్పుడే పుచ్చుకుంటుంది.
మాటల్లో ఒకరోజు యథాలాపంగా అడగనే అడిగింది ఓ ప్రశ్న. ఎక్కడ పనిచేస్తారు ఇద్దరూ? ఏం పనిచేస్తారు?
ఇద్దరూ ఒకరి మొహంలోకి ఒకరు చూసుకున్నారు.
మీ వాళ్ళెవరున్నారు బాబూ? ఎక్కడున్నారు? ఆప్యాయంగా అడిగింది మరో ప్రశ్న.
మా వాళ్ళిక్కడికి దూరంలో ఓ పల్లెటూళ్ళో ఉన్నారు. గిరికి తనవాళ్ళంటూ ఎవ్వరూ లేరట. నిర్లిప్తంగా జవాబిచ్చాదు శివ. మౌనంగా చూస్తున్న గిరి మనసులో కృష్ణ శాస్త్రి కవిత ఒకటి మెదిలింది.
కలగి తొట్రిలుచు నాకలి దొందరలసోలు
కరములట్టే చాతునో
నా మండు
కనులనట్టే తెరతునో
అంతలో నింతలో నడుగు జాడయె లేక
వింత కల కరగి చనుచు
నాకు నా
వంత కథయె మిగులును
వనరు చేడ్వగలేను
కనలేని వెలుగు కొరకై
ఎన్నడును
కనరాని దానికొరకై
ఒక క్రొత్త బరువుతో
ఒక క్రొత్త యాసతో
ఒకడనే పడిపోదును
శూన్యమున
ఒకడనే పడిఫొదును
శూన్యమున
ఒకడనే కృశియింతును
చిన్నగా నిట్టూర్చాడు.
పని దొరికిన రోజు దొరుకుతుంది. లేనిరోజు లేదు.. ఏ రోజుకారోజు కష్టపడటమే.. ఎందుకు చదువుకున్నామా అనిపిస్తోంది. ఈ చదువు మాకేమన్నా ఉద్యోగం ఇచ్చిందా ఇంతవరకూ?
శివ మాటల్లో కోపం.. బాధ స్పష్టంగా ధ్వనించాయి.
అవ్వ చూపుల్లో ఆశ్చర్యం తొంగి చూసింది.
విద్యలేనివాడు వింట పశువన్నారు కదా బాబూ! చదువుకున్నందుకు సంతోషపడాల్సింది పోయి బాధ పడుతున్నారు?
మరేం చేయమంటావు? ఏ ఆఫీసు గుమ్మం ఎక్కినా ఖాళీల్లేవు అన్నమాట గానీ, ఉత్తర దక్షిణాల ప్రసక్తిగానీ వొస్తోంది.
అందుకని? చదువెందుకు చదువుకున్నామా అని కోపం తెచ్చుకుంటారా బాబూ? చిన్నపనీ పెద్దపనీ అన్న తేడాలు మనసులో పెట్టుకోకుండా ఉంటే..చదువుతో వొచ్చిన సంస్కారంతో .. మీ జీవనాధారం వెతుక్కోడం..సృష్టించుకోడం మీ చేతుల్లోనే ఉంది బాబూ.
ఇవన్నీ చెప్పడానికి మాటల్లో బాగానే ఉంటాయి. అది సరేగాని నువ్వెందుకు ఈ వయసులో ఇంకా కష్టపడుతున్నావు? నీకెవ్వరూ లేరా? మాట మార్చాడు గిరి.
ఉన్నాడు బాబూ! అమ్మనీ నాన్ననీ చిన్నప్పుడే పోగొట్టుకున్న నా మనవడున్నాడు. వాడి మీదే బాబూ నా ప్రాణాలన్నీ.
మరేడీ? ఎప్పుడూ కనిపించడే?
వస్తాడు బాబూ! డిగ్రీ చదువుతున్నాడు. మా తమ్ముడి గారి ఊళ్ళో వాళ్ళింట్లో ఉండి చదువుకుంటున్నాడు.
నువ్వూ అక్కడే వాళ్ళింట్లో ఉండచ్చుగా?
లేదు నాయనా! దానిక్కొన్ని కారణాలున్నాయి. వాళ్ళ సంసారం వాళ్ళకుంది. ఇల్లూ చిన్నది. మా ఇద్దర్నీ కూడా పోషించే తాహతు వాళ్ళకి లేదు. పోనీ, నేనిక్కడ సంపాదించుకుంటున్నట్టే అక్కడ వాళ్ళింట్లో ఉండి ఏవో ఆ పన్లూ, ఈ పన్లూ చేసుకుంటూ నా సంపాదన నేను సంపాదించుకుందామంటే అది వాళ్ళకిష్టం లేదు. అదేదో చిన్నతనంగా భావిస్తున్నారు.. ఆ పట్నంలో ఇల్లు అద్దెకి తీసుకోవడం నా వల్ల అన్నే పనికాదుగా. పిల్లాడు వృధ్దిలోకి రావాల్సినవాడు. అందుకే వాదిని వాళ్ళింట్లో ఉంచి చదివిస్తున్నాను. వాడి చదువు పూర్తయి ఏదో ఒక పన్లో చేరిపోతే అప్పుడింక నాకీ ఒంటరి బతుకుండదు. నెత్తి మీద పెట్టుకుంటాడు నన్ను. చక్కగా చూసుకుంటాడు.
ఇక్కడికెప్పుడైనా నిన్ను చూసి వెళ్ళడానికి వొస్తుంటాడా? సందేహం వెలిబుచ్చాదు గిరి.
రావద్దని నేనే చెప్పాను బాబూ! వొస్తే కనక,,,నేనిక్కడేదో కష్టపడి పోతున్నానని..నా ఈ ఒంటరిబతుకు చూసి దిగుల్తో చదువు మానేసి తనూ నాతో పాటు ఇక్కడే ఉండిపోతానని అంటాడు. సుతిమెత్తన బాబూ వాది మనసు. అందుకే ఎప్పుడైనా నేనే వెళ్ళి వాడిని చూసి ఒక పూట ఉండి వచ్చేస్తుంటాను. ఇంక డిగ్రీ ఆఖరి సంవత్సరం పరీక్షలు దగ్గిరకొచ్చేశాయి వాడికి.
ఊ అయితే. మనవడి చదువు పూర్తయిపోయివస్తే అవ్వ ఆనంస్స్నికి పట్టపగ్గాలుండవు గిరీ! నవ్వాడు శివ.
ఆ మాటలకి లోతుకుపోయిన అవ్వ కళ్ళలో తళుక్కుమంది కాంతి .. ముడతలు పడిన ఆ పెదవుల మీద చిందులాడింది మల్లెల దరహాసం.
ఆ కాంతినీ
ఆ దరహాసాన్నీ
విస్మయంగా చూసాడు గిరి.
రామలక్ష్మణుల్లా జంటగా తిరిగే మిమ్మల్నిచూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఆ రోజు శివ పుట్టిన రోజని తెల్సి ఇంటిదగ్గర పాయసం చేసి తీసుకొచ్చింది అవ్వ.
ఆప్యాయంగా ఇద్దరిచేతా తినిపించింది.
ఔనౌను. మేము రామలక్ష్మణులమే. వాళ్ళు కష్టాలే పడ్డారు. అడవుల్లో తిరిగి. ఈ జనారణ్యంలో మేం కూడా కష్టాలేపడుతున్నాం.
శివ మాటలకి తల అడ్డంగా ఊగించింది అవ్వ.
కష్టాలు కలకాలం ఉండవంటారుగా? మంచి రోజులు తొందర్లోనే వొస్తాయి. బాధపడకండి. నా మనవడితో పాటూ మీ భవిష్యత్తు కోసం కూడా దేవుడిని రోజూ వేడుకుంటున్నాను.
ఆ దేవుడేం చేస్తాడవ్వా? ఆఖరికి..తన పేరు చెప్పి కొట్లాడుకునే స్థితికి ఈ మనుషులు దిగజారిపోయాక..వీళ్ళని బాగు చెయ్యడం నా వల్లకాదనుకుంటూ తలుపు వేసేసుకున్నాడు.
బాగా చెప్పావు. శివమాటలకి వంతపాడాడు గిరి.
లేదు బాబూ! అలా అనుకోకండి. ఒకవేళ ఆ దేవుడు మీ పట్ల ఒక తలుపు మూయడం జరిగితే.. మరోవైపు తలుపు తప్పక తెరుస్తాడు మీ కోసం..ఇంత ముసల్దానిని నేనే ఆశాజనకంగా ఉంటే చిన్న వాళ్ళు మీరు.. నూరేళ్ళ జీవితం ముందున్న వాళ్ళూ అలా నిరాశగా మాట్లాడకూడదు.
నానా తిప్పలు పడుతున్నాం. బతుకు మీద విరక్తితోనే బతుకుతున్నాం. ఇంకేం మాట్లాడగలం చెప్పు.
వొద్దు నాయనా! మీలాంటి యువకులిలా మాట్లాడితే నాబోటి దాని గుండె కలుక్కుమంటుంది. చూడండు మీరేమీ అనుకోకపోతే ఇవాళ నేనింటికెళ్ళేటప్పుడు నాతో రాగలరా?
ఒకేసారి ఇద్దరూ అడిగారు కుతూహలంతో ఎందుకవ్వా?
నాకథ మీకు చెప్పాలని. అది విన్న తర్వాతైనా..జీవితం పట్ల ఆసక్తి పెంచుకోవాలే తప్ప దాన్ని చంపుకుంటూ పోకూడదని అర్ధం చేసుకుంటారని.
సరే వొస్తాం తప్పకుండా..ఒప్పుకున్నారిద్దరూ.
..
ఇదే నే నుండే గూడు.
పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లున్న ఆ రెండు గదుల పెంకుటింట్లోకి అవ్వ వెనకే అడుగు పెట్టారు స్నేహితులిద్దరూ.
గోడవారగా చప పరిచింది .. కూచోండి.
ఇద్దరికీ మంచినీళ్ళు అందించి ఆ తర్వాత వాళ్ళకెదురుగా చతికిలబడింది.
నాకెన్నో ఏట పెళ్ళయిందో ఊహించగలరా? ఎనిమిదో ఏట? ఏమీ తెలియని వయసులో.. ఈ రోజుల్లో సంగతి వేరులే బాబూ ఎనిమిదో ఏడు దాక అక్కర్లేదు అమాయకత్వం నిండుకోవడానికి..అత్త తాత అని పలకడం వచ్చేసరికే..పెళ్ళి, పరిమిత కుటుంబం గురించి అవగాహన చేసేసుకుంటున్నారు.
ఆ మాటకి నవ్వాగలేదు వింటున్న ఇద్దరికీ.
మానాన్నకి సంపాదన లేదుగానీ సంతానం మెండు. ఒక్కళ్ళూ ప్రయోజకులు కాలేదు. సరే వాళ్ళందరి సంగతీ ఎందుకు గానీ.. నా సంగతి చెప్తాను. పద్నాలుగో ఏట కూతురు పుట్టింది నాకు. . పదిహేనో ఏట భర్త పోగొట్టుకున్నాను. విషజ్వరం అన్నారు. మాటలో సన్నని జీర. గొంతు సవరించుకుంది మెల్లిగా.
పెళ్ళికాక ముందు గానీ, పెళ్ళయ్యాకగానీ ఏ సరదాలూ, ఏ ముచ్చట్లకీ నోచుకోలేదు నేను. అటు అత్తింట్లో ఇటు పుట్టింట్లో పడరాని పాట్లు పడుతూ..మాటలు పడుతూ.. నోరు నొక్కుకుని. చాకిరీకే నా జీవితం అంకితం చేసి నాకూతుర్ని ప్రేమగా బాధ్యతగా పెంచి పెద్దచేసి ఓ ఇంటిదాన్ని చేశాను. పెళ్ళయిన సంతోషం నా కూతురుకి లేకుండా పోయింది. అల్లుడికి అన్ని వ్యసనాలు ఉన్నాయని ఆ తర్వాత తెలిసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకోనా? నా కూతుర్ని నా దగ్గరికి రానిచ్చేవాడు కాడు. మూడు సార్లు కానుపులోనే బిడ్డలు పోయారు దానికి. పెళ్ళయిన పదిహేనేళ్ళకి పుట్టినవాడే ఈ మనవడు. ఎటొచ్చీ అప్పుడు కూడా నా మొహాన సంతోషం రాయలేదా దేవుడు..పుట్టిన పిల్లాదు బాగానే ఉన్నాడు గానీ పురిట్లోనే పోయింది తల్లి. నా కూతురికి నా కళ్ళ ముందే నూకలు చెల్లిపోయాయి భూమ్మీద. నెల్లాళ్ళు కూడా తిరక్కుండానే లారీ యాక్సిడెంట్ లో అల్లుడు కూడా పోయాడు. తాగిన మైకంలో రోడ్డు కడ్డంగా నడిస్తే జరిగేదంతే కదామరి? దాంతో మళ్ళీ నా పని మొదటికే వొచ్చింది. చంటి పిల్లాడి బాధ్యత పూర్తిగా నాదే. చదువు అనేది ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా దాని విలువ దానికుంటుంది. అందుకే వాడిని చదువులో పెట్టాను. కష్టపడటం నాకేమీ కొత్త కాదు. కాళ్ళలో చేతుల్లో శక్తి, ఉన్నంత వరకూ ఆధారపడకుండా బతకడమే మంచిది కదా! దెబ్బ మీద దెబ్బ తగిలి కూడా జీవితమ్మీద నిరాశ పెంచుకోకుండా ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త ఆశతో బతుకుతున్న ఈ ముసలిదాన్ని చూసైనా మిరు భవిష్యత్తు మీద ఆశతో బతకడం నేర్చుకోండి బాబూ.

తన అనుమానం బయటపెట్టకుండా ఉండలేకపోయాడు గిరి. అవ్వా! నీకు సుఖం అన్నదే లేదు కదూ?
సుఖం నాకెందుకు లేదూ? పుట్టింటి వారి మీద గానీ అత్తింటి వారిమీద గానీ కోపం నాకెప్పుడూ... ఇప్పుడీ వయసులో నేనిక్కడ ఒంటరిగా ఉండాల్సొస్తోంది. నా తమ్ముడి కుటుంబం వాళ్ళు నన్ను ఆ ఊళ్ళో ఉండనివ్వట్లేదే అని వాళ్ళ మీదా నాకు కోపం లేదు. అటువంటప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా? మనసు ప్రశాంతంగా ఉండబట్టి నాకెప్పుడూ ఏ రోగాలూ ఏ అనారోగ్యాలూ లేవు. ముందు ముందు రాబోయే రోజుల గురించి తియ్యని కలలు కంటూ కంటి నిండా నిద్రపోతాను. కమ్మటి నిద్ర, ఏ కల్లోలమూ లేని మనసూ ఈ రెండూ నాకున్నాయి. వీటివల్ల నేను పొందుతున్నది అన్నిట్లోకీ మహాభాగ్యమైన ఆరోగ్యం. అటువంటప్పుడు నేననుభవిస్తున్నది సుఖం కాక మరేమిటి చెప్పండి?

జవాబు చెప్పడం కష్టమే అయింది వాళ్ళకి.
బయటికొచ్చేశాక చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడు గిరి. అవ్వ మాటలు వినడానికి బావున్నాయంతే. అలా మనసుకి నచ్చచెప్పుకుని బతకడం కష్టం.
జాలేస్తోంది అవ్వని చూస్తే ఇంత పిచ్చాళ్ళూ కూడా ఉంటారా అని.
ఔను. పూర్తిగా పిచ్చిదే. నేనే కనక అవ్వగా పుట్టి ఉంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే వాడిని.
సరిగ్గా చెప్పావు. నేనైనా అంతే.
ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. హఠాత్తుగా రెండు రాజకీయ పక్షాల మధ్య రగులుకుంది జ్వాల. వ్యక్తిగత పోట్లాటలో ఒకడు మరొకడిని పొడిచి చంపితే దానికి ప్ర్తితిపక్షం అనే కుంచెతో కులం, మతం అనే రంగులు పూసి రాజకీయ హత్యగా చిత్ర రూపణ చేశారు. రాబందుల్లాంటి కొందరు. అంతే..ఇంకేముంది? క్షణాల్లో ఊరంతా గగ్గోలు..ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు కర్రలతో, కత్తులతో నాటు బాంబుల్తో సిద్దం. అసలేం జరగిందో అర్ధంకాని అమాయక జనానిక్కూడా తప్పట్లేదు దెబ్బలూ, గాయాలు. ఏం జరిగిందా అన్న కుతూహలంతో ఇళ్ళలోంచి బయటికొచ్చేసి రొడ్ల పక్కన నిలబడి విడ్డూరం చూస్తున్న కుర్రాళ్ళకి కాళ్ళూ, చేతులూ విరుగుతున్నాయి. ఆ హడావిడిలో ఎవరు ఎన్ని కొడుతున్నారో అసలా కొట్టేవాళ్ళక్కూడా తెలియదేమో!
శివా! ఇటు చూడు.. గిరి పిలుపుకి తల తిప్పి చూశాడు శివ. తెల్లటి ప్యాంటూ తెల్లటి షర్టూ రక్తసిక్తమై ఉన్న ఓ యువకుడు..కళ్ళు మూతలు పడి ఉన్నాయి. స్పృహలో లేడు. కొంచెం పక్కగా పెద్ద ఎయిర్ బ్యాగ్ ఉంది. ఏదో ఊర్నుంచి వొస్తున్నట్టున్నాడు.

అటూ, ఇటూ చూసి తమనెవరూ గమనించట్లేదని నిర్దారించుకుని ఆ యువకుడికి దగ్గరగా నడిచారిద్దరూ. వెంటనే హాస్పటల్ కి తీసికెళ్ళి వైద్యం జరిగేలా చూస్తే తప్పక బతకవచ్చు అతను. కానీ దాన్ని గురించి కాదు వాళ్ళాలోచిస్తున్నది. ఆ యువకుడి జేబులోంచి కనబడుతున్న పర్సు. చేతికి ఉన్న వాచీ ఆకర్షించాయి వాళ్ళని. క్షణాల్లో ఇద్దరూ చెరోకటి తీసుకుని జేబుల్లో వేసేసుకుని అతి మామూలుగా అక్కడినుంచి..ఆ జనసందోహం నుంచి తప్పించుకుని బయటపడ్డారు.
అవ్వ ఇల్లు ఇక్కడికి దగ్గిరేగా. ముందక్కడి కెళ్ళి కాసేపు కూచుని..ఊరు చల్లబడ్డాక బయటకొద్దాం. స్నేహితుడి సలహా నచ్చింది గిరికి.
గబగబా అడుగులు వేస్తూ ఎవరొ తరుముకొస్తున్నట్టే అవ్వ ఇంటికి చేరుకున్నారు. తినడానికేదన్నా పట్టగలవా అవ్వా? బాగా ఆకలేస్తోంది.
తప్పకుండానూ..మా మనవడీ రోజొస్తున్నాడు. వాడికిష్టమని పిండి పులిహార చేశాను. మీరు రావడం మంచిదైంది. రండి కూచోండి.
మంచి ఛాన్సు కొట్టేశాం అన్నమాట మేం. తినడానికి రెడీ అయిపోతూ సరిగ్గా సద్దుకుని కూచున్నాడు శివ.
ఉప్పొంగిపోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
ఉషారుగా పాడుతూ పక్కనే కూచున్నాడు గిరి.
కొండల్లో ఉరికింది.
కోనల్లు నిండింది
ఆకాశగంగతో
హస్తాలు కలిపింది
ఉప్పొంగి పోయింది గోదావరి తాను తెప్పున్న యెగిసింది గోదావరి.
నీకిష్టమైన పిండి పులిహార పేరు చెప్పేసరికి గోదావరిలా ఉప్పొంగిపోతున్నావే, బాపిరాజు నీ కోసమే ఆ గేయం రాసినట్టు, గిరి భుజమ్మీద చిన్నగా చరిచి నవ్వాడు శివ
మరికొంచెం వేసుకోండి..మరికొంచెం తినండి..అంటూ దగ్గర కూచుని ఆప్యాయంగా మళ్ళీ మళ్ళీ వడ్డించింది అవ్వ.
మా మనవడొచ్చే రైలెందుకో ఆలస్యమైనట్టుంది. పైగా ఊళ్ళో హఠాత్తుగా ఊ గొడవలేమిటో ఇందాక పక్కింటావిడ చెప్పింది.
ఔనౌను. గొడవలు జరుగుతున్నాయి. మీ మనవడొచ్చేదాకా ఇక్కడే ఉంటాం. అతన్ని చూశాకే వెళ్తాం.
అలాగే చెయ్యండి. నాకు మా మనవడెంతో మీరూ అంతే.
ఆ మాటన్నావు. అంతేచాలు. కడుపునిండా తిని చేతులు కడుక్కొచ్చి కూచున్నారు. అవ్వా! ఓ అవ్వా! ఆతృత కంగారు జంటగా కలిసి హడావిడి పడ్డాయి ఆ ఇంటి గుమ్మంలో.
పదిమంది జనం.
వాళ్ళ కళ్ళలో నీలి నీడలు.
ఒక్క ఉదుటున అవ్వ వెనుకే గుమ్మంలోకి నడిచారు స్నేహితులిద్దరూ.
వీడు నీ మనవడే కదా అవ్వా? అడుగుతున్నాడొకాయన.
అవ్వ..
శివ..
గిరి...
ముగ్గురి కళ్ళూ గుమ్మం ముందున్న యువకుడి శవమ్మీద..నిశ్చేష్టురాలైన అవ్వ గుండెలు గుభిల్లుమన్న స్నేహితులిద్దరి చేతులూ జేబుల్లో ఉన్న పర్సు, రిస్టువాచీల మీద కెళ్ళాయి.
తప్పు చేసిన భావన వారి కళ్ళలో నీరు నింపింది.
ఆ మధ్యెప్పుడో నేనూరెళ్తున్నప్పుడు మీ మనవడెలా ఉన్నాడో ఓ సారి చూసి రమ్మన్నావు. అప్పుడు చూడడం వల్లే ఇవాళ మీ మనవడిని గుర్తుపట్టాను. ప్చ్..పాపం.
ఊళ్ళో అడుగు పెడుతూనే అమాయకుడైన నీ మనవడు బలైపోయాడు. రెండు పార్టీల వాళ్ళూ కత్తులు, కర్రలు బాంబుల్తో ఓ పెద్ద యుధ్దం చేస్తుంటే.. చెప్పుకుపోతున్నాడా పెద్దమనిషి కండువాతో కళ్ళద్దుకుంటూ. నోట మాట రాని అవ్వ పెనుగాలి తాకిడికి పడిపోయిన లతే అయ్యింది.
చైతన్యం లేక కళ్ళప్పగించిన బొమ్మే అయింది.
ఇది నిజం కాదు..ఇది నిజం కాదు..ఇదో పీడకల.
ఆవిడ పెదవులు చిగురుటాకుల్లా వొణుకుతున్నాయి.
ముందు జరగవలసిన తతంగమంతా ఇరుగు పొరుగు వాళ్లతో పాటూ తాము దగ్గరుండి జరిపించారు. అవ్వకి మనవడిని దూరం చేసిన పాపం తమదేననిపిస్తోంది ఇద్దరికీ.
మానవత్వంతో ఒక మనిషి మరో మనిషి పట్ల చూపించవలసిన కనీస ధర్మం యువకుడిపట్ల తామెందుకు చూపించలేదు? ప్రయత్నం చెయ్యడం తోటి మనిషిగా ధర్మం కాదా? వెంటనే వైద్యం జరిగితే బతికేవాడేమో?
కత్తులూ, కర్రలూ తెచ్చి క్రూరంగా ప్రవర్తించిన ఆ దుండగులకీ, తమకీ తేడా ఏముంది?
పశ్చాత్తాపంతో ఇద్దరి మనసులూ కుమిలిపోతున్నాయి.
పాపం. ఇంక దేనిమీద ఆశతో జీవిస్తుంది? బతకాలన్న ఆసక్తి ఈనాటితో తీరిపోతుందవ్వకి.
జాలిగా అన్నాడు శివ.
ఔను. ఇంకేం చూసుకుని బతుకుతుంది పాపం? ఇది చాలా పెద్ద దెబ్బే. మనకి చాలా పాపం చుట్టుకుంటుంది. ఇంత ఘోరం జరిగిపోడంలో మనకీ భాగం ఉంది.
మరింతగా నొచ్చుకున్నాడు గిరి.
..
అవ్వా ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నా సందేహం ఒకటి తీరుస్తావా?
గిరి మాటలకి సూటిగా అతని కళ్ళలోకి చూసిందవ్వ.
అడుగు బాబూ.. నేనేనీ అనుకోను.
ఒకవేళ దేవుడు ఒక తలుపు మూసేస్తే మరో తలుపు తెరుస్తాడని ఎప్పుడూ అంటుంటావు కదా నువ్వు..
ఇప్పుడేమంటావు? చూశావా? ఆ దేవుడెంత దయలేని వాడో! నీ నమ్మకం తప్పుకాలేదా?
లేదు బాబూ లేదు. ఇప్పుడు కూడా నేనామాటే అంటాను.
ఆశ్చర్యంగా చూశారిద్దరూ.
ఔను బాబూ. నా పట్ల ఒక తలుపు మూసేసి మరో తలుపు తెరిచాడు. మీ ఇద్దర్నీ నాకు చేరువ చెయ్యలేదూ? ఇద్దరి భుజాల మీదా చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. ముదసలి ముందు ఓడిపోయిన యువతకి అప్పుడర్ధమైంది జీవితమంటే నిరాశ కాదనీ,.చీకటిని పారదోలేందుకు చిన్న దీపమైనా వెలిగించుకోవాలని..ఔను..చీకట్లో చిరుదివ్వె వెలిగించుకోవడమే జీవితమనే చక్కగా బోధపడింది.
 
 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech