ఆ... క్షణం..

 

- చెడుదీపు సంతోష్ కృష్ణ

  Love is divine feeling
But when u lost love u r lost
love is the strongest intangible thing
A weapon that makes u strong
and
can hurt more than a bullet


నిరుపమ్ పెదాలపై చిరునవ్వు విరిసింది. .. చేతిలో ఉన్న సెల్ ఫోన్ డిస్ ప్లేపై కనిపిస్తున్న అక్షరాలను అపురూపంగా చూసుకున్నాడు...అందులోని భావం కన్నా.. ఆ ఎస్.ఎం.ఎస్ కింద అందంగా కనిపిస్తున్న పేరు అతన్ని మరింత ఆనందానికి గురిచేస్తుంది.

ప్రియ..!
పేరులోనే ప్రియాన్ని దాచిపెట్టుకున్న తన అందాల ముద్దుల సుందరి. కష్టం, నష్టం, బాధ, సంతోషం..ఏదైతేనేం..తనలోకి ప్రవేశించగానే మొదటగా గుర్తుకు వచ్చేది ప్రియనే.

ఆమె అంటే నిరుపమ్ కి ప్రాణం. ఆమెని అతను ప్రేమిస్తున్నాడు అనేకంటే..ఆమె పేరుని శ్వాసిస్తున్నాడని అనాలి. ప్రియ అనే రెండక్షరాల చుట్టూ నిరుపమ్ నిరుపమానంగా తిరుగుతూనే ఉన్నాడు. ..కోరుకున్న ప్రియురాలు చెంతకి చేరితే అంతకన్నా ఆనందం ఏముంటుంది?

ఏమిట్రా..ప్రపంచాన్నిమరిచిపోయావు? అక్కడికి వచ్చాడు కిరణ్.
అతన్ని చూసి చిన్నగా నవ్వి..మళ్ళీ సెల్ ఫోన్ వైపు మురిపెంగా చూస్తున్నాడు.
ప్రియ ఫోన్ చేసింది కదూ?
కాదు..!
కాదా..? నీ మొహం ఇలా వెలిగిపోతుంటే ఖచ్చితంగా ప్రియతో మాట్లాడి ఉండాలే..అనుమానంగా అన్నాడు.
కిరణ్ మొబైల్ చూపించాడు.
మొబైల్ లో కనిపించిన మెసేజ్ చదివి చిన్నగా నవ్వాడు కిరణ్.
ఊ చాలా బాగుంది.
ప్రేమలోని అర్ధాన్ని ఎంతందంగా చెప్పింది..తన్మయత్వంతో అన్నాడు నిరుపమ్.
ప్రేమ గురించి ఏం చెప్పినా అందంగానే ఉంటుంది కానీ .. ఇలా రోడ్ దగ్గర నిలబడ్డావేంటీ? పద సీట్లో కూర్చుందాం!
కాసేపాగరా! ఇలా కదులుతున్న ట్రైన్ లోనుండి వెనక్కి పరుగులు తీస్తున్న ఆ పరిసరాలను చూస్తూ నా ప్రియ గురించి ఆలోచిస్తూంటే ..ఓహ్..వాటే బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్.
నీ ఎక్స్ పీరియన్స్ లో మునిగితేలుతూ కాస్త ముందుకు తూలావంటే..నాకు ఎక్స్ పీరియన్స్ వస్తుంది.
ఎక్స్ పీరియన్స్ కోసం ఇలా డోర్ దగ్గర నిలబడకూడదని!
కిరణ్ వైపు సీరియస్ గా చూశాడు.
ప్రేమని ఆస్వాదించడం కూడా తెలీని అమాయకులతో ఏం మాట్లాడతాం. ?
ఏంటీ? నాకు ప్రేమ గురించి తెలియదా? అంతేబాబూ..అలాగే ఉంటుంది. నీ ప్రేమ కోసం నేను ఎన్ని త్యాగాలు చేసానో అప్పుడే మరిచిపోయావా?
ఏంటీ..నువ్వు త్యాగాలు చేశావా? ఆశ్చర్యాంగా అన్నాడు.
అలా అనేసావేంట్రా..? నీ ప్రేమకోసం. .నీ ప్రేయసి గురించి సమాచారాని కనుక్కోవడం కోసం..నీకు ఫ్రెండై పుట్టిన పాపానికి ఎన్ని అగచాట్లు పడ్డానో ..ఆ సమయంలో నా విలువైన సమయాన్ని ఎంత త్యాగం చేసానో? ఉక్రోషంగా అన్నాడు కిరణ్.
ఓహ్...అయాం సారీరా! నువ్వెక్కడ ఈ విషయాలన్నీ మర్చిపోతావేమోనని చిన్న టెస్ట్ చేశానంతే. మా పెళ్ళయ్యాక.."
నా ఫోటోని ఫ్రేం కట్టించి గోడకి తగలేస్తానంటావ్?
అంతే కదా మరి
నిరుపమ్ వైపు కోపంగా చూడాలనుకుని, సీరియస్ గా ఉండడానికి ట్రై చేయాలనుకుని..ఆ పని చేయలేక ఫక్కున నవ్వాడు కిరణ్. నిరుపమ్ హాయిగా నవ్వాడు.
వారిద్దరి మధ్యనున్నది కూడా ప్రేమే! ఫ్రెండ్ షిప్ కాదు.
అవును! అసలు ప్రేమ లేనిది ఎక్కడ?
ఏ వ్యక్తికైనా ముందు ప్రేమ పుడుతుంది. ఆ తర్వాతే ఏదైనా పుడుతుంది.
ప్రేమకున్న పవరే అది.

ప్రేమించిన వ్యక్తి కోసం ..ప్రేమించిన పదవి కోసం..ప్రేమించిన వస్తువు కోసం..ప్రేమించిన వారికోసం,..ఏ వ్యక్తయినా సరే ..ఏం చేయడానికైనా సిద్ధపడతాడు.
ఆ ప్రేమని పొందడానికి, ఆ ప్రేమని అందుకోవడానికి చివరికి తన ప్రాణాలని కూడా లెక్కచేయడు..
ఎస్. దటీజ్ లవ్.!
హు. నీతో మాట్లాడటం నావల్లకాదు గానీ..పద సీట్లో కుర్చుందాం! మళ్ళీ అన్నాడు కిరణ్.
ఆ మాట మాత్రం అనకురా..నా ప్రియ దగ్గరికి నన్ను చేరవేయడానికి ఈ రైలు ఎంత వేగంగా పరుగులు తీస్తుందో చూడు. నా మనసు కూడా ఈ రైలు వేగంతో పోటీ పడుతోంది. నా ప్రియ దగ్గరికి నన్ను చేరవేయడానికి..
నీ ప్రేమ పొందడం ప్రియ చేసుకున్న అదృష్టం.
కాదు..ప్రియ నాకు దక్కడం నా అదృష్టం.
ఏది ఏమయినా! మీరిద్దరూ ఒక్కటవ్వడం నా అదృష్టం.
నిరుపమ్ కిరణ్ వైపు చూసి నవ్వాడు. ఓ రెండు క్షణాలు కిరణ్ వైపే చూశాడు.
మా ప్రేమ కోసం నువ్వెన్ని రిస్క్ లు తీసుకున్నావో..వేరేవారెవరూ చేయలేని సాహసాలు చేశావు.అసలునా కోసం.... ఆ తర్వాత మాట్లాడలేకపోయాడు.
కిరణ్ భుజాలపై చేయివేసి చిన్నగా తట్టాడు.
మాటల్లో చెప్పలేని అనేకమైన భావాలని స్ప్రర్శ చెబుతుంది. ఆ స్ప్రర్శలో కిరణ్ పై నిరుపమ్ కి ఉన్న అభిమానం తెలుస్తోంది. నిరుపమ్ అభిమానానికి కిరణ్ కదిలిపోయాడు.
ఒరేయ్! నీ కోసం కావాలంటే నా ప్రాణాన్నైనా ఇస్త్రాన్రా! క్షణం సేపే ఉద్వేగానికి లోనయ్యాడు కిరణ్.
నిరుపమ్ కిరణ్ వైపే చూస్తూ..
నేను కూడా! అన్నాడు.
నువ్వు కూడా ఇస్తే ప్రియేం కాను. సీరియస్ గా అన్నాడు.
ఎస్. అవున్రోయ్..! అయితే క్యాన్సిల్..
మళ్ళీ ఇద్దరూ నవ్వుకున్నారు.
ప్రియ ఆలోచనలతో నిరుపమ్..ప్రియని,,నిరుపమ్ ని కలవడానికి తాను చేసిన రిస్క్ ని గుర్తు చేసుకుంటూ కిరణ్..ఎవరి ఆలోచనలో వారున్నారు.
వారితో సంబంధం లేదన్నట్లు వేగంగా గమ్యం వైపు దూసుకుపోతోంది ట్రైన్.

షిట్! బ్లడీ టైమ్..ఇంకా అవ్వట్లేదు.
రేయ్..టైంని తిట్టమాకు! నీటైం మారిపోద్ది.
నా టెన్షన్ నీకేం తెలుసురా. అసలు ప్రేమ గురించి
నాకు తెలియదురా బాబూ..నీ ప్రేమ గురించి నాకు తెలియదు! కనీసం అనుపమ్ మొహం కూడా చూడలేదు కిరణ్. టీవీలో వస్తున్న ఇంట్రస్ట్ ప్రోగ్రాం చూస్తూ అనేశాడు.
ఒరేయ్! ఇంతకీ టైం కరెక్టేనా!
ఏ టైము.
జోకులెయ్యకు. ప్రియ వాళ్ళంతా సరిగ్గా ఎప్పుడొస్తానన్నారో కనుక్కున్నావా?
ఒరేయ్! ఈ మాట ఇప్పటికి వందసార్లనుంటావ్? సరిగ్గా రాత్రి తొమ్మిదిన్నరకి డిన్నర్ అరేంజ్ చేసారని చెప్పారని నీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను.! నువ్వనవసరంగా టెన్షన్ పడిపోయి..నన్ననవసరంగా ఇరిటేట్ చెయ్యకు!
నా టెన్షన్ నీకేం తెలుసురా! ఎప్పుడెప్పుడు నా ప్రియని చూడాలని నా మనసు ఉరుకులు పరుగులు పెడుతోంది. ఈ నిమిషంలో ఆమె ముందు వాలిపోవాలని..ఆమె అందమయిన ముఖారవిందాన్ని చూస్తూ గడిపేయాలని..

అంత కోరికగా ఉంటే..నీ ఫోన్ లో ప్రియ ఫోటో ఉందిగా చూస్తూ కూర్చో!
కెమేరాలో ఉన్న ఫోటోలు, వీడియోలో ఉన్న బొమ్మలు చూడడం కాదు. ప్రత్యక్షంగా చూడాలని..ఆమెతో మాట్లాడాలని..
అనుకుంటే..ఫోన్ చేసి మాట్లాడు.
నీ యబ్బ! అలా చేయాలనుకుంటే ట్రైన్ లో ఎక్కిన మరిక్షణమే...ఫోన్ చేసేవాణ్ణి. ఈ హోటల్ దిగిన మరుక్షణమే. ఫోన్ కపిపేవాడిని...నా ప్రియ దగ్గరనుండి మెసేజ్ వచ్చిన మరుక్షణమే కాల్ చేసేవాడిని...కానీ...అలా చేస్తే థ్రిల్లుండదు. నేను ప్రియ గురించి ఆలోచించిన ప్రతీ క్షణం గురించి నా ప్రియని కలిసాక ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాలి...నా ఈ ఎడబాటుని విని...ఆమె కళ్ళలో నాపై కనిపించే ప్రేమని చూస్తూ..!
అర్ధమయ్యింది! అలా చేయాలంటే ఇంకో గంట వరకూ ఆగాల్సిందే.
ఇంకో గంటా!
అంటూ నువ్వలాగే కూర్చోకుండా రెడీ అవ్వు..! మనల్ని పికప్ చేసుకోవడం కోసం కారు కూడా అరేంజ్ చేశారు ప్రియ ఫాదర్!
ఎంత చల్లటి మాట చెప్పావురా! క్షణంలో రెడీ అవుతాను.! ఛెంగున లేచాడు నిరుపమ్.
అతనివైపే మురిపంగా చూశాడు కిరణ్.
క్షణం..క్షణం..మెల్లిగా దొర్లిపోతూంది... ఆ హోటల్ విండోలో నుండి పెద్ద పెద్ద భవనాలు లైట్ల కాంతిలో అందంగా కనిపిస్తున్నాయి.
సరిగ్గా అయిదు నిమిషాల్లో రెడీ అయ్యాడు నిరుపమ్. ఫుల్ సూటులో ఉన్న నిరుపమ్ ని చూస్తుంటే కిరణ్ కి ఎంతో ముచ్చటేసింది.
ఖరీదైన హోటల్..ఖరీదైన వాతావరణం. రాత్రి తొమ్మిదిగంటలు అవుతున్నా.. విద్దుద్దీపకాంతులతో పట్టపగలుగా కనిపిస్తోంది.
ఆ హోటల్ పార్టికోలోకి రయ్యిన దూసుకువచ్చింది కారు..కారు ఆగడం మరుక్షణం గార్డు వచ్చి వినయంగా డోరు తెరిచాడు. కారులోనుండి కిరణ్, నిరుపమ్ దిగాడు.
ఖరీదైన ఆ ప్రదేశం నిరుపమ్ కళ్ళకి కనిపించడం లేదు. అతని కళ్ళు ప్రియకోసం వెతుకుతున్నాయి.
వెల్ కమ్ బాబూ!..వెల్ కమ్..ప్రియ ఫాదర్ నిరుపమ్ దగ్గరికి వచ్చాడు. అతని వెనకాలే అతని కుటుంబ సభ్యులు ఉన్నారు. కానీ ప్రియ కనిపించలేదు.
వారిని విష్ చేసారు నిరుపమ్, కిరణ్.
ప్రియని చూడాలన్న కోరిక క్షణం, క్షణం అధికమయిపోతుంది నిరుపమ్ లో.
రండిబాబూ! అమ్మాయి లోపల నీకోసం వెయిట్ చేస్తోంది..ఆ మాటలు నిరుపమ్ లోఅమృతాన్ని నింపాయి.
అందరూ హోటల్ లోపలికి నడిచారు.
రాజభవనంలా ఎంతో ఠీవిగా కనిపిస్తున్న ఆ హోటల్లో ప్రతీ ఒక్క వస్తువూ అత్యంత ఖరీదైనవి..
ఎంతో అందంగా..ఎంతో అపురూపంగా ఉన్న ఆ వస్తువులని కిరణ్ నోరు తెరిచి చూస్తూండిపోయాదు.
నిరుపమ్ కళ్ళు మాత్రం ప్రియకోసం వెతుకుతున్నాయి.
విశాలంగా కనిపిస్తున్న ఆ హాలు మధ్యలో డైనింగ్ టేబుల్..చుట్టూ కుర్చీలు...వీరి డిన్నర్ అక్కడే అని అర్ధమయిపోయింది నిరుపమ్ కి అందరూ ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నారు.
కిరణ్ నిరుపమ్ మొహంలో కనిపిస్తున్న అసహనాన్ని గమనించి చిన్నగా నవ్వుకున్నాడు. అతన్ని ఇంకా టెన్షన్ పెట్టకుండా దూరంగా మెట్లు దిగుతూ కనిపించించి ప్రియ.
ఆమెని చూసిన నిరుపమ్ కి ఒక్క క్షణం గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుందేమో అనిపించింది..!
దేవలోకం నుండి దేవకన్య ఇలాగే దిగివస్తుందేమో! సినిమాలలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ఇంతందంగా కనిపించదేమో! నిరుపమ్ ఆమె వైపు ఎంతో అపురూపంగా చూస్తున్నాడు.
నీకోసం ఏదో గిఫ్ట్ తీసుకువచ్చిందంట..అది తేవడానికి రూంకెళ్ళి వస్తోంది బాబూ! కూతురు వైపు మురిపెంగా చూస్తూ అన్నాడు ప్రియ ఫాదర్.
నిరుపమ్ కి అతని మాటలు వినిపించడం లేదు. ఆమె వైపు నుండి చూపు కదల్చడం లేదు. ఏమాత్రం కదిలినా ఆ అపురూపమైన దృశ్యం మిస్సయిపోతుందేమోనని కనురెప్ప వేయకుండా ఆమె వైపు చుస్తున్నాడు.
తన ప్రేయసి, తన కలలరాణి..కదిలే కుందనపు బొమ్మలా...అలా కదిలివస్తూంటే..ఆమె ప్రతి కదలికా అతనిలో అద్భుతమైన అనుభూతిని నింపుతోంది...అమె మొహంలోనూ ఏదో ఆతృత. ఆ ఆతృత ఎందుకో అతనికి అర్ధమయింది.
అవును!
అన్ను చూడాలనే ఆ ఆతృత.
ఆ అలోచన రాగానే ప్రియపై మరింత ఆరాధన కలిగింది.!
ఈ రెండు రోజులు ప్రతి క్షణం. ఆమె ఆలోచనలతో తాను గడిపినట్టు..ప్రియ కూడా గడిపింది... తను ఆమెని చూడాలని ఎంత ఆరాటపడ్డానో..ప్రియ కూడా నన్ను చూడాలని అంతే ఆరాటపడింది.
తన మనసులోని భావాలని ప్రియకి చెప్పాలని తాను ఎంతగా తొందరపడుతున్నాడో..ప్రియ కూడా అంతే తొందరపడుతోంది!
ఊహల పల్లకిలో ఊరేగుతూ..ప్రియ గురించి తాను కన్న బంగారు కలలు...
తన గురించి కూడా ప్రియ కన్నది..
తమ శరీరాలు వేరయినా..
తమ ఆలోచనలు ఒక్కటే!
అవును!!
తమ ఆలోచనలు ఒక్కటే! అందుకే ప్రియని చూడడానికి తాను అనుభవించిన టెన్షన్, తనని చూడడానికి ప్రియలో కూడా కనిపిస్తుంది. అదే ప్రేమంటే..!
సరిగా అప్పుడు ప్రియ అతన్ని చూసింది.
వారిద్దరి చూపులు కలుసుకున్నాయి.
ఏమని వర్ణిస్తాం.! ఒక ప్రేయసి..ఒక ప్రియుడు..ఎడబాటుని జయించి, ఎదురెదురుగా నిలుచుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ..ప్రపంచంతో సంబంధం లేకుండా,,వారికి మాత్రమే సొంతమయిన ప్రపంచంలో విహరిస్తుంటే..
చుట్టూ ఉన్న వాళ్ళంతా ప్రేక్షకులే అయ్యారు. ప్రియ నిరుపమ్ నే చూస్తోంది. నిరుపమ్ పొందిన అనుభూతే ప్రియలో..! అతన్ని చూస్తూనే..మెల్లిగా అడుగులో అడుగేస్తుంది.
ఆ అపూర్వ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు కిరణ్ తో సహా ప్రియ కుటుంబ సభ్యులు కూడా!
వారిని డిస్టర్బ్ చేయలేదు. ప్రేమికుల గురించి తెలిసినవారిలా.
ప్రియ నిరుపమ్ ఎదురుగా వచ్చి నిలబడింది. ఎప్పటినుండో ఏకమయిన వారి చూపుల్లో ఎన్ని భావాలో..ఎడబాటుని ఎదలోతుల్లోనుండి పూర్తిగా చెరిచివేయడానికి చూపులతోనే సిద్ధమవుతున్నారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమంతా వారి కళ్ళలో కనిపిస్తుంది.
ఈ ఆనంద క్షణాలు..ఈ అద్భుత దృశ్యాలు.. ఇలాగే ఉండిపోతే ఎంత బావుండును..!
ఈ క్షణం కాలం స్థంభించిపోతే ఎంత బావుండును!.. ఈ నిమిషం తమకి శాశ్వతం అయితే ఎంత బావుండును.
ఎన్నో కోట్ల జంటల్లా ఆ క్షణంలోవారు అనుకున్నారు. ఎవ్వరికీ ఇవ్వని అవకాశం వారికి ఇస్తున్నట్లుగా తథాస్తు దేవతలు విన్నారేమో!
అదే క్షణంలో..
నిరుపమ్ తల వెనుక భాగం నుండి దూసుకువచ్చిన బుల్లెట్ ఆమె నుదుటిని చీలుస్తూ వెళ్ళిపోయింది.
ఆ తర్వాత ఎన్ని బుల్లెట్లు వారి శరీరాలని తూట్లు చేసాయో తెలియదు.
క్షణాల్లో దృశ్యం మారిపోయింది...ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఆ పరిసరాలు భయంకరంగా మారిపోయాయి..ఆహాకారలతో ఆ ప్రదేశం దద్దరిల్లింది...ప్రాణాలు దక్కించుకోవడానికి అందరూ అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు.
వారు మాత్రం ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలాగే చూసుకుంటున్నారు...! ప్రాణాలతో ఉన్నారేమో అన్న అనుమానం పోవడానికి అలాగే చూసుకుంటా...ఇద్దరూ ఒకేసారిగా నేలకొరిగారు.

(నవంబర్ 26 తాజ్ హోటల్ లో ఉగ్రవాదుల దాడిలో అసువుల బాసిన వారందరికీ ఈ కథ అంకితం)

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech