అంచనా

 

-మాధవ్ దుర్భా

 

గ్రాడ్యుయేట్ స్టడీస్ కి కొత్తగా అమెరికా వచ్చిన రోజులవి. టూ బెడ్ రూం' అపార్ట్ మెంట్ లో నలుగురు రూం మేట్స్ ఉండేవాళ్లం. నేనూ, రవీ, జగన్, శీనూ. అంతా తెలుగు వాళ్లమే. వచ్చీ రాని వంటలూ, వంట లేని రోజుల్లో పిజ్జాలూ, తెల్లారే వరకూ లేబ్‌లోనో ..... ఇంట్లో టీవీ చూసుకుంటూనో గడిపెయ్యడం, హడావుడిగా పొద్దుటే లేచి తినో తినకో ఆలస్యంగా క్లాసు కెళ్లడం, చాలీ చాలని అసిస్టెంట్ షిప్పులూ, పాపం పెరిగినట్టు పెరిగే క్రెడిట్ కార్డు అప్పులూ, వీకెండైతే పార్టీలూ..... టూకీగా చెప్పాలంటే ఇదీ మా జీవితం! ఏ బాదరబందీలూ లేకుండా జరిగిపోయేది. మా నలుగుర్లో ఎవరిదగ్గరా కార్ లేకపోడంతో దగ్గిరగా ఎక్కడికెళ్లాలన్నా కాలినడకన వెళ్లడం, కాస్త దూరం పెరిగితే సైకిళ్ల మీద వెళ్లడం. మా పరిధి అంతే!

 

ఉండేది మహానగరమేమీ కాదు. ఊరంతటికీ ఒక్కటే ఇండియన్ స్టోర్. మన కూరగాయలూ అవీ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేవి కావు. ఆ స్టోర్ నడిపే పాండే దయా, మన ప్రాప్తం అన్నట్టు వాడమ్మితే కొనుక్కోడం......... లేకుంటే బంగాళాదుంపలూ, ఉల్లిపాయలూ ఉండనే ఉన్నాయి. అలాగే మేనేజ్ చేసేస్తూండే వాళ్లం. ఓ రెండు పౌండ్ల బెండకాయలిచ్చి డబ్బులు తీసుకొని కూడా పిల్లనిచ్చినట్టు ఫీలైపోయేవాడు పాండే. ఇలా ఉండగా రవిగాడు రెండు వేల డాలర్లు పెట్టి కార్ కొన్నాడు. కొత్తగా రెక్కలొచ్చిన పక్షుల్లా అయ్యాం ఒక్కసారిగా. మా వీకెండ్ కార్యక్రమాల్లో చుట్టుపక్కల ఊళ్లకీ, బీచ్ లకీ ట్రిప్పులు కూడా చోటు చేసుకున్నాయి. మా చుట్టూ ప్రపంచం ఒక్క సారిగా పదింతలైపోయింది..... గాలూదిన బుడగలా!

 

*           *           *

 

ఓ రోజు ఊళ్లో చాలా కాలంగా ఉంటున్న ఇండియన్స్ ఎవరో పరిచయమై చెప్పారు: ఊరికి పది మైళ్ల దూరంలో ప్రతీ శనివారం ఫార్మర్స్ మార్కెట్ ఉంటుందనీ, అక్కడ మన కూరగాయలు..... బీరకాయలూ, పొట్లకాయలూ, దోసకాయలూ, ములక్కాడలూ, ఇలాంటివి చాలా చవగ్గా దొరుకుతాయనీ. అవన్నీ దొరుకుతాయన్న విషయం కన్నా, ఈ ఫార్మర్స్ మార్కెట్ పేరు చెప్పుకొని పాండే మొహం చూడక్కర్లేదన్న ఆనందం ఇంకా ఎక్కువయ్యింది. ఇంకేం.... ఆ శనివారం పొద్దుటే లేచి ఫార్మర్స్ మార్కెట్ కి బైల్దేరాం. మార్కెట్ చేరుకొని ఒక స్టాల్ నించి ఇంకో స్టాల్ కి నడుస్తున్నాం. ఎంతోమంది చైనీస్, కొరియన్స్, హిస్పేనిక్స్, అమెరికన్సూ, ....... ఒకటేమిటీ, మార్కెట్ మొత్తం ఐక్యరాజ్య సమితిలా ఉంది. కానీ మన ఇండియన్స్ ఎక్కడన్నా ఉన్నారా అని వెతుక్కుంటూ వెళ్తూంటే ఒక స్టాల్ దగ్గర ఠక్కున బ్రేకేసినట్టు ఆగాడు జగన్. టీ షర్టూ, జీన్స్ వేసుకున్నారు గానీ, నుదుటిన విభూతి, ముఖాన చక్కటి వర్ఛస్సూ, డెబ్బై ఏళ్లుంటాయేమో, ఆయన్ని చూస్తే మన తెలుగు వాళ్లని చెప్పకుండానే తెలిసిపోతోంది. గోను సంచీలు కింద పరచుకొని, వాటి మీద రకరకాల కూరలు పెట్టుకొని నేల మీదే కూర్చొని ఉన్నారాయన. మమ్మల్ని చూసి, తెలుగులో మాట్లాడుకోవడం గమనించారేమో "కూరలు కావాలా బాబూ!" అని పలకరించారు. శీనూ అడిగాడు "బీరకాయలెంత?" అని. "ఒక పౌండూ డాలరున్నర" చెప్పారాయన. నిజం చెప్పాలంటే పాండే షాపులో కన్నా చాలా చవకే! నేనేమో కొద్దిగా అతి తెలివితేటలు చూపిస్తూ "అదేమిటీ? అందరూ డాలరుకే ఇస్తున్నారుగా?"  అన్నా. దానికి ఆయన "మాకు ఎరువుకీ, విత్తనాలకే బోలెడౌతోందండీ. ఇంక మాకు మిగిలేదేముంది. సరే కొత్తగా వచ్చినట్లున్నారు. అందులోనూ తెలుగు వాళ్లు. సర్లేండి. ఒక క్వార్టర్ తగ్గిస్తాను. అంత కంటే కుదరదు. ఎన్ని పౌండ్లు కావాలి?" అడిగారాయన నిక్కచ్చిగా! మనసులో క్వార్టర్ తగ్గిందని విజయగర్వంగా ఉన్నా, పైకి మాత్రం కొంచెం నిట్టూరుస్తూ "రెండు పౌండ్లివ్వండి" అన్నా. ఆయన సరిగ్గా తూకమేసి జాగ్రత్తగా ఒకటి ఎక్కువా, తక్కువా కాకుండా సరిగ్గా రెండు పౌండ్లూ ఒక ప్లాస్టిక్ సంచీలో వేసి మాకందించారు. ఎందుకో ఆయన్ని చూస్తే నాకు జాలేసింది. ఈ వయసులో ఆయన ఇంత కష్టపడి దేశం కాని దేశంలో కూరలు కాయించి తెప్పించి అమ్ముతూంటే ఆయన దగ్గర గీసి గీసి బేరాలాడినందుకు కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించింది. ఆయనకి డబ్బులిస్తూ "మీరు ఫుల్ టైం' వ్యవసాయం చేస్తారా?" అని అడిగా. ఆయన దానికి "లేదు బాబూ! అయాం' ఎ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ. దిసీజ్ మై సెకండ్ జాబ్" అన్నారు. ఒక్కసారిగా అందరం అవాక్కయ్యాం. కొద్దిగా మొహమాటంగా "మీ పేరు?" అంటే ఆయన "డాక్టర్ మూర్తి" అన్నారు. వెంఠనే ఆయన ఇచ్చిన చిల్లర తీసుకొని చల్లగా జారుకున్నాం.

 

బైటకొచ్చాక వెనక్కి డ్రైవ్ చేస్తూ దారంతా ఇదే విషయం చర్చించుకుంటున్నాం. మేమంతా ఏకీభవించిన విషయం ఒక్కటే. ఎంత డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉన్నా.... ప్రొఫెసర్‌గా బోల్డు డబ్బులు సంపాదించుకుంటూ ఇంకా ఏమిటీ కక్కూర్తి? క్వార్టర్ కోసం గీసి గీసి బేరాలాడిన ఆయనంటే ఎందుకో మంచి అభిప్రాయం కలగలేదు మాకెవ్వరికీ! వెనక్కొచ్చాక మిగతా ఇండియన్ స్టూడెంట్స్ ని వాకబు చేస్తే తెలిసిందేమిటంటే, ఆయన 1960 లోనే ఈ దేశానికొచ్చేసారనీ, పీహెచ్‌డీ అవ్వగానే మా యూనివర్సిటీలో చేరి అప్పట్నుంచీ ఇక్కడే చేస్తున్నారని. పిల్లలు కూడా లేరట! మరెవరికోసమో ఆ కూడబెట్టడం. ఆయన గురించి తెలిసిన స్టూడెంట్లంటా ఒకటే చెప్పారు. ఆయన సబ్జెక్ట్ లో చాలా దిట్ట అని, ఆయన రిసెర్చ్ కి చాలా మంచి రెప్యుటేషన్ ఉందనీను. కానీ ఆయన శంకరాభరణం సినిమా లో శంకర శాస్త్రి గారిలా పరమ కోపిష్ఠీ, ఛాందసుడు అని కూడా చెప్పుకుంటారు. ఆయన పిల్లికి కూడా బిచ్చం పెట్టని పరమ లోభి అనీ అంటారు. మాకు ఫార్మర్స్ మార్కెట్ లో ఐన అనుభవం దానికో ఉదాహరణగా అనుకున్నాం. అటు పాండే, ఇటు డాక్టర్ మూర్తి! దొందూ దొందే అనిపించింది.

 

అప్పట్నించీ ఎప్పుడు ఫార్మర్స్ మార్కెట్ కి వెళ్లినా డాక్టర్ మూర్తి కొట్టు దాటుకుంటూ వెళ్లిపోయేవాళ్లం. ఆయన మమ్మల్ని చూసీ చూడనట్లు ఉండేవాళ్లు. కానీ క్రమం తప్పకుండా, ఎండైనా, వానైనా ఆయన ప్రతీ శనివారం అక్కడే కనిపించేవాడు. ఔను మరి డబ్బులు మూట కట్టుకొని పోయేప్పుడు తీసుకుపోడానికేమో!

  

*           *           *

 

మనకి కష్టం వచ్చినప్పుడే ఎదుటివారిలో మంచితనం బయటపడుతుందనే మాట మా విషయంలో అక్షరాలా నిజం చేసిన సంఘటన ఒకటి...... జరిగి పదహారేళ్లైనా ఇంకా నిన్నో, మొన్నో జరిగినట్టుంది. బహుశా తెల్లారుఝాము మూడైందనుకుంటా. ఎవరో తలుపు కొడుతూంటే తీశాం. ఎదురుకుండా పోలీసులు..... "రవి రూం మేట్స్. మీరేనా?" అని అడిగారు. రవి రాత్రి లేబ్ నించి కార్లో వస్తూంటే యాక్సిడెంట్ అయ్యిందనీ, వాడ్ని ఐ.సీ.యూ. లో ఉంచారనీ చెప్పి వెళ్లిపోయారు. హడావుడిగా హాస్పిటల్ చేరుకున్నాం. వాడికి చాలా రక్తం పోయిందనీ, బలమైన గాయాలు తగలడంతో కొన్ని ఫ్రాక్చర్లు కూడా అయ్యాయనీ, అదౄష్టం కొద్దీ ప్రాణ భయమేం లేదనీ, కానీ కొంత కాలం హాస్పిటల్ లోనే ఉండాలనీ చెప్పారు డాక్టర్. అలా ఇంచుమించు మూడు వారాలు హాస్పిటల్ లోనే ఉన్నాక డిశ్చార్జ్ అయ్యి బైటకొచ్చాడు రవి. మొత్తం బిల్లు సుమారు అరవై వేల డాలర్లయ్యింది. స్థానిక ఇండియన్ కల్చరల్ అసోసీషన్ సహాయంతో ఊళ్లోనూ, చుట్టు పక్కలా ఉన్న ఇండియన్స్ ఒక నలభై వేలు సర్దారు. వాళ్లు ఎవరెవరు ఎంత సహాయం చేశారో మాకు ఒక లిస్టు కూడా ఇచ్చారు. ఆ లిస్టు చూస్తున్న నేను ఒక పేరు దగ్గరకొచ్చి ఆగాను. ఐదువందల డాలర్లు.....! ఇతనొక్క డాలరు కూడా ఇస్తాడని నేను ఊహించలేదు. మళ్లీ చూశాను. సందేహం లేదు....... పాండే! డబ్బుల్లేని ఇండియన్ స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ చార్జీలు వేసి డబ్బులు దోచేస్తాడనే పేరు గానీ ఇలా అవసరానికి వెనుకాడకుండా సహాయం చేసే స్వభావం ఉందనుకోలేదు. అలాగే లిస్టు మొత్తం చూశాను. యూనివర్సిటీలో 12 మంది తెలుగు ప్రొఫెసర్లు. అందులో 11 మంది పేర్లు లిస్టులో ఉన్నాయి. ఒకటి మిస్సింగ్. ప్రొఫెసర్ మూర్తి. నేను ఆయన పైసా కూడా ఇస్తారని ఆశించలేదు. అనుకున్నట్టే అయ్యింది. ఇంక ఇరవై వేలు బాకీ హాస్పిటల్ కి!

 

ఇక హాస్పిటల్ నించి రోజూ ఆ ఇరవై వేల గురించి ఉత్తరాలు రావడం మొదలయ్యాయి. ఇలా కొన్నాళ్లు గడిచాక ఎవరో సలహా ఇచ్చారు. హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి స్టూడెంట్స్ గా ఉన్న మా పరిస్థితి వివరిస్తే ఆ చార్జీలు మాఫీ చేసే అవకాశం ఉందని. మాట్లాడదామని హాస్పిటల్ కి వెళ్లాం. అక్కడ కౌంటర్లో ఆవిడ మా వివరాలు తీసుకొని ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్లింది. మా గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి. ఆవిడ వెనక్కొచ్చే వరకూ కాలం స్థంభించిపోయినట్లనిపించింది. వస్తూనే "ఏదో పొరపాటు జరిగింది. మీ బిల్లు పూర్తిగా చెల్లించేశారు. మీకు ఆ ఉత్తరాలు రాకూడదు" అంటూ క్షమాపణలు చెప్పుకుంది ఆవిడ. మాకేం అర్థం కాలేదు. "అదెలా సాధ్యం! మేము నలభై వేలే చెల్లించాం. మరొక్కసారి చూసి చెప్పండి" అన్నాం. ఆవిడ మళ్లీ లోపలికెళ్లి కాసేపట్లో బైటకొచ్చి ఆ ఇరవై వేలూ ఎవరో ఒకాయన చెల్లించారని చెప్పింది. ఆయన ఎవరూ అని మేమడిగితే, "సారీ! ఆయన వివరాలు ఎవరికీ తెలియజేయ కూడదని ఆయన రిక్వష్టు చేశారు. మీకు చెప్పడం కుదరదు" అందావిడ. ఎంత ప్రయత్నించిన ఆయనెవరన్నదని మాకు తెలీలేదు. కానీ ఆయన పుణ్యమా అని మా కష్టాలు గట్టెక్కాయి. 

*           *           *

 

ఆ సంఘటన జరిగి పదహారేళ్లౌతోంది. మేమంతా గ్రేడ్యుయేట్ అయ్యి, ఆ ఊరొదిలేసి ఎవరి దారిన వాళ్లు ఉద్యోగాల్లో చేరి, పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ ఐపోయాం. అప్పట్లో చేతి నిండా సమయమున్నా ఖర్చు పెట్టడానికి డబ్బుండేది కాదు. ఇప్పుడు డబ్బుకి సమస్య లేకపోయినా, రోజుకి ఇరవై నాలుగ్గంటలు సరిపోవనిపిస్తుంది. కానీ ఇప్పటికీ వీలున్నప్పుడల్లా రూం మేట్స్ ని కలుస్తూనే ఉన్నాను. మేము కలిసినప్పుడల్లా యునివర్సిటీ కబుర్లు గుర్తు చేసుకునే వాళ్లం. ప్రొఫెసర్ మూర్తి టాపిక్ కూడా వచ్చేది. ఆయన బతికున్నారో, లేదో, .... పోయుంటే.... ఏ లోకంలో ఉన్నా ఆ డబ్బులన్నీ మూట కట్టుకు వెళ్లారో, లేదో, ఇలాగే జరిగేవి ఆయన గురించి సంభాషణలు.

 

ఒక ఆదివారం పొద్దుటే తీరిగ్గా బ్రేక్ ఫాస్ట్ చేసి ముందు రోజు ఇండియన్ రెస్టారెంట్ లో పికప్ చేసుకొన్న ఫ్రీ ఇండియన్ లోకల్ న్యూస్ పేపర్ తీసి పేజీలు తిరగేస్తున్నాను. అందులో ఆరో పేజీలో ఒక పక్క ఎదో పరిచయమున్న వ్యక్తి ఫోటో... కళ్లద్దాలు సరిచేసుకొని చూశాను. సందేహం లేదు. డాక్టర్ మూర్తి ఫోటో అది! ఆదుర్దాగా ఏం వ్రాశారా అని చూశాను. ఆయన గత సంవత్సరమే పోయారనీ, పోయే ముందు ఆయన యావదాస్తీ ఒక ఛారిటబుల్ ట్రస్ట్ లో పెట్టి అది ఇండియన్ కల్చరల్ స్టడీస్ కోసం మా ఊళ్లో ఉన్న యూనివర్సిటీలోని ఏషియన్  స్టడీస్ డిపార్ట్‌మెంట్ కి రెండు మిలియన్లు గ్రాంట్ ఇచ్చినట్లు వ్రాసి ఉంది. ఆయన ఔదార్యానికి నాకు ఆశ్చర్యమేసింది..... నాకు తెలిసిన ప్రొఫెసర్ మూర్తి ఈయనేనా అని! రెట్టింపైన ఆసక్తితో ఆ ఆర్టికల్ చదవడం కంటిన్యూ చేశాను. అందులో ఆఖరి పేరా చదివాక నమ్మలేక మళ్లీ మళ్లీ చదివాను. ఆయనకి బాగా సన్నిహితుడైన మరొకరు ఆయన గురించి వ్రాస్తూ, ఆయన చాలా నిరాడంబరమైన జీవితం గడిపారనీ, ఎంతో ఉన్నత స్వభావులనీ, కానీ పేరుప్రఖ్యాతుల గురించి ఏనాడూ పాకులాడలేదని చెబుతూ ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఆయనకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టమనీ, ఇంట్లో పెద్ద గ్రీన్ హౌస్ వేసి రకరకాల కాయగూరలు కాయించి వాటిని ప్రతీ శనివారం క్రమం తప్పకుండా లోకల్ ఫార్మర్స్ మార్కెట్ లో అమ్మేవారనీ, అవి అమ్మగా వచ్చిన డబ్బులు మాత్రం పూర్తిగా ఇక్కడ చదువుకోడానికి వచ్చిన మాన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం లాంటివి జరిగితే వారికయ్యే వైద్య నిమిత్తమైన ఖర్చులకి వినియోగించేవారనీ, హాస్పిటల్ బిల్లు కట్టడానికి ఇబ్బంది పడే చాలామంది విద్యార్థులకి గుప్తంగా సహాయం చేశారనీ చెప్పారు. అప్పుడర్థమయ్యింది. రవిగాడికా రోజు హాస్పిటల్ ఖర్చులు ఎవరు కట్టారో, ఆయన్ని ఎంత తక్కువగా అంచనా వేశామో! క్వార్టర్ కోసం ఆయనతో గీసి గీసి బేరమాడిన ఆ సంఘటన గుర్తొచ్చి నా కళ్లు చెమర్చాయి. బాక్ గ్రౌండ్ లో "పైన కఠినమనిపించును.... లోన వెన్న కనిపించును....." అని అమరశిల్పి జక్కనలో పాట సన్నగా వినిపిస్తోంది. అది రాళ్ల గురించి వ్రాశారా లేక.... ప్రొఫెసర్ మూర్తి గురించి వ్రాశారా..... అనుకుంటూ వెంటనే మా పాత రూం మేట్స్ తో మాట్లాడ్డానికి ఒక చేత్తో ఫోనందుకొన్నా, మరో చేత్తో ప్రొఫెసర్ మూర్తీ మెమోరియల్ ట్రస్ట్ కి చెక్ వ్రాస్తూ.

 

(కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా వ్రాసిన కథ)

 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech