జయదేవ బృందావనం(అష్ట పది -3)
- డా.తాడేపల్లి పతంజలి

 

చందన చర్చిత నీల కళేబర

                                                                                (చిత్రకారుడు శ్రీ బాపుకు ధన్యవాదములతో)

 

చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ

కేళిచలన్మణి కుండల మండిత  గండ యుగ స్మిత శాలీ

హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి  కేళిపరే                  1

విలాసిని=ఓ శృంగార భావాలుకల రాధా!; చందన =శ్రీ గంధం;  చర్చిత=పూసిన ;నీల=నల్లనైన ;కళేబర=శరీరంలో ;పీత=పచ్చనైన ;వసన=వస్త్రము కలిగినవాడు;వనమాలీ=వనమాల కలిగినవాడు ;కేళి =ఆటలచేత ;చలత్=కదలుచున్న ;మణికుండల =రత్న కుండలములచేత ;మండిత=అలంకరించిన ;గండ యుగ         =రెండు చెక్కిళ్ళ మీద ;స్మిత శాలీ=చిరునవ్వు చేత ఒప్పుచున్నవాడు ;హరిః= శ్రీ  కృష్ణుడు ;ఇహ=ఈ వసంత ఋతువులో ; కేళి పరే=ఆటలలో గొప్పతనము కలిగిన ;ముగ్ధవధూనికరే= అందమైన స్త్రీల సమూహములో ; విలసతి =విహరిస్తున్నాడు  ;

ఓ శృంగార భావాలుకల రాధా! గంధం  పూసిన  నల్లనైన శరీరం  మీద  పచ్చని వస్త్రం ధరించినవాడు ,  పాదాలవరకు వేలాడే వనమాల ధరించినవాడు అయిన శ్రీ  కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు. ఆయనగారు ఆటలు ఆడటం వల్ల చెవులకు పెట్టుకొన్న రత్న కుండలాలు కదులుతున్నాయి . చెక్కిళ్ళమీద ఇంకా ఏమీ ఆభరణాలు అక్కర్లేదు. ఆయన చిరునవ్వులే ఆభరణాలు .

పీన పయోధర భార భరేణ  హరిం పరిరభ్య సరాగం

గోపవధూరనుగాయతి  కాచిదుదంచిత పంచమరాగం

హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి  కేళిపరే                                    2

కాచిత్   = ఒక;గోపవధూః= గోపిక;ఉదంచిత=ప్రకాశించే;హరిం=శ్రీకృష్ణుని; పీన              =బలిసిన;పయోధరభార భరేణ= స్తనములు ఉప్పొంగిన బరువుచేత; సరాగం=ప్రేమతో; పరిరభ్య=కౌగిలించుకొని; పంచమరాగం= పంచమస్వరం ; అనుగాయతి= అతనితో కలిసి పాడుతోంది;

  ఒక గోపికకి కృష్ణుని చూడటంతోనే తమకం వచ్చింది. ఆయన మీద ప్రేమతో స్తనాలు ఉప్పొంగాయి. బరువెక్కాయి. తట్టుకోలేక ఆయనని  అదిమి కౌగిలించుకొంది.శరీరం ఈ పని చేస్తుంటే ఆమె గొంతు   ఆయన వేణునాదంతో కలిసి పంచమస్వరాన్ని పాడుతోంది.; శ్రీ  కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు

కాపి విలాస విలోల  విలోచన  ఖేలనజనితమనోజం

ధ్యాయతి  ముగ్ధవధూరధికం మధుసూదనవదనసరోజం

హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి  కేళిపరే                          3

కాపి =మరొక;ముగ్ధ వధూః=గోపిక; విలాస=లీలచేత;విలోల= చలించే;విలోచన =కళ్ళయొక్క; ఖేలన=ఆటలతో పుట్టిన; మనోజం=మన్మథుని వికారము కలిగిన; మధుసూదన=కృష్ణుడి;  

వదనసరోజం=ముఖమనే పద్మాన్ని;అధికం =ఎక్కువగా; ధ్యాయతి =స్మరిస్తోంది;

 ఒక గోపిక కృష్ణున్ని చూస్తూ కళ్ళు అందంగా తిప్పింది.ఆమె మనస్సులో ఉన్న మన్మథుడు శృంగార చేష్టలు చేయించాడు .కృష్ణున్ని అదేపనిగా చూస్తూ ,అతని ముఖ పద్మాన్ని గోపిక  స్మరిస్తోంది; శ్రీ  కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు

 కాపి కపోల తలే మిళితా లపితుం  కిమపి శ్రుతిమూలే

చారు చుచుంబ నితంబినీ  దయితం పులకైరనుకూలే

హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి  కేళిపరే               4

కాపి నితంబినీ=ఇంకొక గొల్లభామ; శ్రుతిమూలే=చెవులమూల;కిమపి=ఏదో; ఆలపితుం =ఒక మాటని పలకటం కోసం;పులకైః=పులకలతో;అనుకూలే=అనుకూలమైన ;కపోల తలే=చెక్కిళ్ళతో;మిళితా=లీనమై ;చారు = అందంగా; దయితం=  ప్రియుణ్ణి; చుచుంబ=ముద్దు పెట్టుకొంది;

ఒక గోపిక ఏదో రహస్యం చెబుదామని కృష్ణుడి దగ్గరకి చేరింది. ఆయన చెక్కిలి  దగ్గరగా ఉండేసరికి   పులకరింత వచ్చి చెబుదామనుకొన్న మాటల విషయం మరిచిపోయి  చెక్కిలిమీద  పెదవితో అందంగా ముద్దుపెట్టుకొంటోంది. శ్రీ  కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు

కేలికళా కుతుకేన చ కాచిదముం యమునాజల కూలే

మంజుల వంజుల కుంజ గతం విచకర్ష  కరేణ  దుకూలే

హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి  కేళిపరే                      5

కాచిత్=ఒకానొక స్త్రీ;కేళికళా=మన్మథుని ఆటలల్లో లభించే ;కుతుకేన=ఆనందం కోరుకుంటూ ;యమునాజల కూలే=యమునా నది తీరంలో;మంజుల =అందమైన;వంజుల =వకుళమనే పేరుగల చెట్టు యొక్క;కుంజ=పొదను;గతం =ఆశ్రయించిన;అముం= ఈ కృష్ణమూర్తిని;కరేణ= చేతిలో;దుకూలే =పట్టువలువతో;విచకర్ష =లాగింది;

అయ్యవారితో కలిసి ఒక అమ్మడు యమునలో జలక్రీడ చేద్దామని మన్మథ క్రీడాసక్తితో వచ్చింది. కృష్ణయ్య ఆమెను బులిపించటానికి నదీతీరంలో ఉన్న వకుళ వృక్షం చాటున కనీకనబడకుండా దాక్కున్నాడు. అది గమనించిన అమ్మడు -ఆయన కట్టిన బట్టలని గట్టిగా పట్టుకొని లాగుతోంది. శ్రీ  కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు

కరతల తాళ తరల వలయావళి కలిత కలస్వనవంశే

రాస రసే సహ నృత్య పరా హరిణా  యువతిం  ప్రశశంసే 

హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి  కేళిపరే         6

కరతల=చేతియొక్క;తాళ=తాళములతో;తరళ=ఆటునిటు కదులుతున్న;వలయ=గాజుల (కంకణములు)యొక్క;ఆవళి=వరుసలచేత;కలిత=ఎక్కువ చేయబడిన;కలస్వన=తీయని శబ్దములుకల;వంశే=పిల్లనగ్రోవులు కల;రాస రసే=రాసక్రీడలలోని మధుర రసములలో;నృత్యపరా =నాట్యము చేయుటలో ఇష్టం  కలిగిన;కాచిత్= ఒకానొక;యువతీ= గోపిక;శ్రీ హరిణా= శ్రీ కృష్ణుని చేత ;ప్రశశంసే= పొగడబడెను

ఒక సుందరి వేణుగానం చేస్తున్న కృష్ణుడి దగ్గరకి చేరింది. అతని వేణుగానాన్ని అనుకరిస్తూ తన చేతి గాజులు మోగేటట్టు నాట్యం చేస్తోంది. చప్పట్లు చరుస్తూ తాళం వేస్తుంటే , ధ్వని వేణు గానంలో కలిసిపోయింది. ఆమె  అద్భుత ప్రతిభను చూసి కృష్ణుడు మెచ్చుకొన్నాడు. శ్రీ  కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు  

శ్లిష్యతి  కామపి చుంబతి కామపి కామపి రమయతి  రామాం  

పశ్యతి సస్మిత చారుతరామపరామనుగచ్చతి వామాం

హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే             7

హరిః= శ్రీ కృష్ణుడు ;కామపి= ఒక స్త్రీని;శ్లిష్యతి=కౌగిలించుకొనుచున్నాడు;కామపి= ఒక స్త్రీని;చుంబతి=ముద్దుపెట్టుకొనుచున్నాడు;కామపిరామాం= ఇంకొక  స్త్రీని; రమయతి=రమించుచున్నాడు;పరాం                =ఇంకొక స్త్రీని;సస్మిత=చిరునవ్వుతో;చారు=అందంగా; పశ్యతి=  చూస్తున్నాడు;వామాం అపరాం= ఇంకొక అందగత్తెను;అనుగచ్చతి = వెంబడిస్తున్నాడు;

                కృష్ణుడు ఒక గోపికను కౌగిలించుకొంటున్నాడు. ఇంకొకామె చెక్కిలిపై ముద్దు పెట్టుకొనుచున్నాడు.మరొక గోపికతో క్రీడిస్తున్నాడు. వేరొక గోపిక పై చిరునవ్వు  ఆనే అమృతం కలిసిన అందమైన చూపులను ప్రసరిస్తున్నాడు. ఇంకొక గోపిక తనని ఆట పట్టిస్తుంటే ఆమెను తరుముతూ వెంటపడుతున్నాడు. శ్రీ  కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు

శ్రీజయదేవ భణితమిదమద్భుత కేశవ కేళి రహస్యం

బృందావన విపినే లలితం వితనోతు శుభాని యశస్యం

హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి  కేళిపరే            8              

బృందావన విపినే=బృందావనమను అడవి యందు;  చరిత=ఆచరించిన;యశస్యం=కీర్తిని చ్చే;అద్భుతం=ఆశ్చర్యంగొలిపే;కేశవకేళి రహస్యం=శ్రీ కృష్ణుని క్రీడా రహస్యాలు కలిగిన; శ్రీ జయదేవ భణితం=శ్రీ జయదేవకవిచెప్పిన; ఇదం ప్రబంధం=ఈ ప్రబంధము;శుభాని=శుభములను;వితనోతు=  విస్తరింపజేయుగాక!                                                  

బృందావనంలో శ్రీకృష్ణుడు  చేస్తున్న అద్భుత క్రీడల రహస్యాలను తెలిపే ఈ జయదేవుని ప్రబంధం చదివిన వారికి శుభం కలుగుగాక! శ్రీ  కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు

విశేషాలు

Ø  ఈ పాటను రామక్రియా రాగంలో పాడుతుంటారు.రామ ఆంటే స్త్రీ .ఆమెను ప్రసన్నం చేసుకునే క్రియలో భాగంగా ఈ రాగం సందర్భోచితం .

Ø  విలసతి అంటే ప్రకాశించేవాడు అని అర్థం.కాని ఒక్కడ సందర్భానుసారంగా విహరిస్తున్నాడు ఆని అర్థం గ్రహించాలి.

Ø  కూర్చున్నప్పుడు ,నిలబడినప్పుడు ,కదిలేటప్పుడు స్తనాలలో కదిలే గగుర్పాటు,  కళ్ళలో కదిలే మెరుపు విలాసమంటారని భరతుడి నాట్య శాస్త్రం!( 1వ చరణం)

Ø  పాదాలదాక వేలాడే పుష్ప మాల కలవాడు వనమాలి

Ø  ముగ్థ అంటే ఒక శృంగార నాయిక.అప్పుడే ఉదయిస్తున్న యౌవనం కలది,    సంభోగ కాంక్షను జయించిన సిగ్గుకలది ముగ్థ.(ప్రతాపరుద్రీయం)

Ø  పంచమ రాగాన్ని హాస్య శృంగార రసాలలో ఉపయోగిస్తారు. అందుకే కృష్ణ శృంగారంలో మైమరచిన గోపిక పంచమ స్వరాన్ని పాడుతోందని కవి భావన.  సరిగమపదనిస్వరాలలో అయిదవది పంచమస్వరం.నాభి,ఉరస్సు,హృదయం,కంఠం,శిరస్సు అనే అయిదు స్థానాలలో పుట్టింది కనుక దీనిని పంచమమంటారని ఒక అర్థం. .కోయిలలచేత విస్తరింపజేయబడేది కనుక పంచమమని ఇంకో అర్థం. !( 2వ చరణం)

Ø  ఈ ముగ్థలు తక్కువవారు కారు. కేళిపరే (ఆటలలో గొప్పతనం కలవారు)ఆంటున్నాడు జయదేవుడు.ఒక్కో చరణంలో ఒక్కో ఆట ఆడారు.స్వామిని ఆటాడించారు.

Ø  మొదటి చరణంలో వాళ్ళు ఆడిన అటతో స్వామికి చిరునవ్వు కలిగింది. రత్నకుండలాలు కదిలాయి.    ఆదేమి ఆటో........ కళ్ళు మూసుకొని కృష్ణభగవానుని తలుచుకొంటే జవాబు లభిస్తుంది.

Ø   రెండో చరణంలో ఆట -స్వామికి దగ్గరగా చేరి  గొంతులో గొంతు కలపటం

Ø  మూడో చరణంలో ఆట -కళ్లు తిప్పటం.   . స్వామి కూడా ఆ ఆటాడుతూ నృత్యం చేస్తున్నాడు.  కళ్ళు తిప్పటం అనే చర్య అద్భుతమైన  వర్ణన. లక్ష పదాలు చెప్పలేని అర్థాన్ని విలాసంగా తిప్పుతున్న కళ్లు చెబుతాయి రసాన్ని ఊహించుకొన్నవారికి ఊహించుకొన్నంత జయదేవ !

Ø  నాలుగవ చరణంలో  ఆట- పెదవులు తాము మాట్లాడకుండా ,మన్మథుడిని ఇద్దరి మధ్య మాట్లాడించే ఆట.

Ø  అయిదవ చరణంలో దాగుడు మూతలాట.    దాగిన రహస్యాలపై పరిశోధన చేసే ఆట.

Ø    ఆరవ చరణంలోని ఆట  అనుకరణ (మిమిక్రీ)ఆట.   మిగతా ఆటలలో 'కిట్టమూర్తి' ప్రకాశించాడు. విహరించాడు  ఎక్కడా ఎవరిని పొగడలేదు. ఈ అనుకరణ ఆట ఆడే ముగ్థను మాత్రం పొగిడాడు.అంత గొప్పగా ఆడింది ఈ ముగ్థ.

Ø  ఇక ఏడవ చరణంలోని ఆటలు -మన్మథుడి జయపతాకల రెపరెపలు .ఆరు చరణాల దాక,అయ్యవారిని ముగ్థలు ఆడించారు. ఏడవ చరణంలో ఆటలునేర్పిన ముగ్థలనే గురువులకు కిట్టయ్య ఆనే శిష్యుడు  'కలిపికొట్టు కావేటి రంగ ' లా  తాను నేర్చిన అన్ని ఆటల ప్రదర్శన చేసి గురు ఋణం తీర్చుకొన్నాడు.  

Ø  అద్భుత క్రీడల రహస్యాలు తెలిపిన జయదేవ కవికి ఈ జాతి ఎప్పుడూ ఋణపడే ఉంటుంది 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం