గగనతలము – 7

        పునరావలోకనము

 

            ఇప్పటివరకూ చాలా విషయములను చర్చించుకున్నపటికీ చాలా విషయములయందు అవగాహన పూర్తిగా ఏర్పడకపోవడము లేక నేటి విజ్ఞానముతో పోల్చుకుంటే అవి అసందర్భములుగా తోచడము జరిగే అవకాశమున్నది. అందువలన ఈ మాసములో కొన్ని ముఖ్యవిషయములను ప్రశ్నలు మరియు సమాధానముల రూపములో పునరావృత్తము చేసుకోవడానికి ప్రయత్నిద్దాము.

1.  ఈ సృష్టిని రచించినవారెవరు?

బ్రహ్మ

2. ఇప్పటికి భూమిపుట్టి ఎన్ని సంవత్సరములు అయినది?

1955885110 సౌర సంవత్సరములు

(ఇది the mysterious universe అను గ్రంధ రచయిత మరియు భౌతిక శాస్త్రవేత్త sir james jeans అంచనాకు అతి చేరువలో నున్నది. శ్రీ జీన్స్ ది  ఒక అంచనా. శ్రీ జీన్స్ భూమిపుట్టి సుమారు 200 కోట్ల సంవత్సరములు అయినవని అంచనా వేసి యున్నాడు. కానీ ఇచ్చట ఇచ్చిన సంఖ్య మనవారి ఖగోళాధారిత గణనాపద్ధతి ప్రకారము గ్రహించినది)

3. సృష్టికి పట్టిన కాలము?

17064000 సౌర సంవత్సరములు

4. బ్రహ్మకు ఒకరోజు?

ఒక కల్పము పగలు మరియు ఒక కల్పము రాత్రి

5. కల్పము యొక్క ప్రమాణము?

1000 మహాయుగములు

(అనగ 4320000000 సౌరవర్షములు)

6. భారతీయజ్యోతిషములో అత్యంత పెద్ద కాలవిభాగము?

కల్పము

7. కల్పము యొక్క ముఖ్య లక్షణము?

దీని ప్రారంభముతో సృష్టి ప్రారంభమవుతుంది మరియు దీని అంతముతో భూమి జలప్లవము అవుతుంది.(అనగ నీట మునుగుతుంది)

8. బ్రహ్మకు సంవత్సరము మరియు ఆయువు?

720 కల్పములు బ్రహ్మకు ఒక సంవత్సరము మరియు 100 సంవత్సరములు ఆయన ఆయువు.

9. ఇప్పుడు బ్రహ్మగారి వయస్సు?

50 సంవత్సరములు ముగిసి 51 సంవత్సరములో మొదటిరోజునందలి మొదటి కల్పమునడుస్తున్నది.

10. ప్రస్తుతము ఏ మన్వంతరము నడుస్తున్నది?

కల్పములో ఉండెడి 14 మనువులలో ఇపుడు 7 వ మనవైన వైవస్వతమనువు సమయము(అంతరము) నడుస్తున్నది.

11. కాలమనేది?

అనాది అనగ దీనికి ఆరంభము లేదు. అనంతము అనగ దీనికి అంతము కూడ లేదు.

12. మరి దాని గణన?

అది అనాది మరియు అనంతము కావున దానిని అంచనా మాత్రము వేయగలము.

13. అంచనాకు ఆధారము?

అంతరిక్షము మరియు ఖగోళీయపిండముల గణితీయ స్థితి మరియు భూకేంద్రమున వాని కోణీయగతి.

14. గ్రహముల గతిపై భారతీయజ్యోతిషము ఏమంటోంది?

గ్రహములు భూమిచుట్టూ వృత్తాకార మార్గములో పరిభ్రమిస్తున్నాయి. అన్ని గ్రహముల రైఖికగతి (Linear velocity) సమానమే అయినప్పటికీ వాని వాని కక్ష్యల ప్రమాణము వేరు వేరు కావడంతో వాని కోణీయగతులు(angular velocity)  వేరు వేరుగా ఉంటాయి.

15. గ్రహములు భూమిచుట్టూ తిరగడమేమిటి?

గ్రహములు కొన్ని భూమికి దగ్గరగా మరియు కొన్ని దూరముగా ఉన్నాయి. అవి మనకు కనబడుతున్న స్థానమునకన్నా అవి చాలా దూరములో ఉన్నాయి. అయినా అవి అన్ని మనకు ఒకే చోట మరియు ఒకే దూరములో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. అందువలన భారతీయ జ్యోతిషములో గ్రహముల వాస్తవిక స్థితికన్నా కక్షావృత్తములో వాని స్థానమునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అందువలన భూమినుండి పరిశీలిస్తే ఈ గ్రహస్థానములు భూమిచుట్టూ తిరుగుతున్నాయి. వైదిక సాహిత్యములోను మరియు జ్యోతిషములోను ఇవ్వబడిన వివరముల ఆధారముగా పరిశీలిస్తే సూర్యుడే ఖగోళపిండములకు ఆత్మ మరియు నాభిస్థానీయుడు.

16. కక్షావృత్తమంటే?

భూమిచుట్టూ నిర్ణీత అవధిలో గ్రహములు మరియు నక్షత్రములు భూమిపై వారికి కనిపించు స్థానము. భూమిచుట్టూ నిర్ణీతపరిధిలో ఆ గ్రహాదులు కనిపించే స్థానమునందలి మన ఊహా చిత్రమే ఈ కక్షావృత్తము.

17. గ్రహములు వృత్తాకార కక్ష్యలలో తిరుగుతున్నాయా?

లేదు.

భారతీయ జ్యోతిషములో కూడా ఎక్కడా అలా చెప్పబడలేదు. వృత్తాకార కక్ష్యలలో తిరుగుతున్నాయి అని చెప్పబడినవి గ్రహముల స్థానములు.

18. దీనికి ఏదైనా తార్కాణము?

ఉంది. గ్రహములను స్పష్టపరిచే విధానమును ఫలసంస్కారము అంటారు. ఈ ఫలము రెండురకములు. ఒకటి మందఫలము మరియు మరియొకటి శీఘ్రఫలము. ఈ సంస్కారము (correction) ఉచ్చ (apogee) కారణముగా చేయబడుతుంది. ఉచ్చ అనగా గ్రహప్రతివృత్తములో (అనగ వాస్తవిక గ్రహ కక్ష్యలో ) భూకేంద్రమునకు అత్యంతదూరములో నున్న బిందువు. దానికి ఎదురుగా (అనగ 180 అంశల దూరములో) నీచ ఉంటుంది. నీచస్థానము గ్రహప్రతివృత్తములో భూకేంద్రమునకు అత్యంత సమీపములో ఉన్న స్థానము. గ్రహము వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నదని చెప్పవలెనన్న వృత్త పరిధిలోని అన్ని బిందువులూ భూకేంద్రమునకు సమాన దూరములో ఉండవలెను. కావున గ్రహస్థానములు వృత్తాకార కక్ష్యలో గుర్తింపబడుతున్నాయి కానీ గ్రహములు కాదు.

ఈ విశ్వరచనకు ఆధారము గణితము. దానిపై మొట్టమొదటి వివరణ ఋగ్వేదములో మేథాతిథి ఋషిద్రష్టములగు మంత్రములలో కనబడుతుంది. ఆ తరువాతికాలములో వేది నిర్మాణమునకు శుల్వుడు చెప్పిన నియమములలో రేఖాగణితసంబంధములైన వివరణలు కనబడుతాయి. ఈ ఆధునిక కాలములో 5 వ శతాబ్దమునకు చెందిన ఆర్యభటుడు విశ్వ గణిత చరిత్రలో తనదైన స్థానమును సంపాదించుకున్నారు.

వారి రచనలను నిశితముగా పరిశీలిస్తే భారతీయ జ్యోతిషముపై మనకున్న అపోహలు పూర్తిగా తొలగి పోతాయి. వారు ప్రపంచానికి ఏమి అందించారన్న విషయము కూడ మనకు వాని అధ్యయనము ద్వారా తెలుస్తుంది.

భారతీయజ్యోతిషముపై ఒక స్పష్ట అవగాహన కలిగిననాడు మనము అందలి విషయములను చాలా సులభముగా తెలుసుకోగలుగుతాము. అందువలన వచ్చే నెల మనము ఆర్యభటుడు వ్రాసిన ఆర్యభటీయము గురించి తెలుసుకుందాము

సశేషము.... 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech