21.అలమేలుమంగ

 

అలమేలుమంగ నీ వభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా
గరుడాచలాధీశు ఘనవక్షమున నుండి
పరమానంద సంభరితవై
నెరతనములు చూపి నిరంతరము నాథుని
హరుషించగజేసితి గదమ్మా
శశికిరణములకు చలువల చూపులు
విశదముగా మీద వెదచల్లుచు
రసికత పెంపున కరగించి యెప్పుడు నీ
వశము చేసుకొంటి వల్లభునోయమ్మా
రట్టడి శ్రీ వేంకట రాయనికి నీవు
పట్టపు రాణివై పరగుచు
వట్టి మాకు లిగిరించు వలపుమాటల విభు
జట్టిగొని వురమున సతమైతివమ్మా


లోకమాత అలమేల్మంగమ్మ శ్రీ వేంకటేశ్వరుని ఆనపాయిని(ఎల్లప్పుడూ విడిచి పెట్టకుండా ఉండేది) అమ్మవారి అతిశయ సౌందర్యం స్వామివారికి ఇంపులు గొల్పునది.స్వామివారి వక్షస్థలమున నివసిస్తూ స్వామిని నిరతమూ ఆనంద సంభరితుణ్ణి చేస్తుంది అమ్మ! చల్లని వెన్నెల చూపులు స్వామివారిపై దిగబోసి స్వామిని రసికుణ్ణి చేస్తుంది అమ్మ! జగజ్జ్జేత అయిన శ్రీ వేంకటేశ్వరస్వామికి అలమేల్మంగ పట్టపుదేవేరియై ప్రేమ పలుకులతో స్వామిని పరవశుణ్ణి చేస్తుంది అంటూ ఆచార్యులవారు అలమేల్మంగ జగదేక సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. అన్నట్లు ఈ పాటలోని నాయిక స్వాధీనపతిక!
చవులిచ్చు=ఇష్టము కలిగించు; నెరతనము=మర్యాద/పెత్తనము;జట్టిగొని=వశపరచుకొని,స్వాధీనం చేసుకుని; హరుషించగ=సంతోషము కలుగునట్లు; శశికిరణములు = చంద్ర కిరణములు; విశదము = స్పష్టముగా, మరొక అర్థంలో తెల్లగా(కాంతివంతముగా); వల్లభుడు = ప్రియుడు; అభినవరూపము = వినూత్నమైన సౌందర్య స్వరూపము; రట్టడి = గ్రామాధికారి అని సామాన్యార్ధం (తిరుమల వేంకటేశ్వరుని గొల్లపల్లె దేవుడని వ్యవహరించినట్లు శాననాలలో కలదు.); వట్టిమాకులిగిరించుట = మోడుబారిన చెట్లు చిగురించుట

 

 

22.అలరచంచలమైన

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసె నె వుయ్యాల

పలుమారు నుచ్చ్వాస పవనమందుండ నీ
భావంబు దెలిపె నీ వుయ్యాల


ఉదయాస్త శైలంబు లొనర కంభములైన
వుడుమండలము మోచె వుయ్యాల
అదన ఆకాశపదము అడ్డదూలంబైన
అఖిలంబు నిండె నీ వుయ్యాల
పదిలముగ వేదములు బంగారు చేరులై
పట్టవెరపై తోచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల
వర్ణింప నరుదాయ వుయ్యాల
 

కమలకును భూసతికి కదలుకదలుకు మిమ్ము
గౌగిలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావభావ విలాస
మందంద చూపె నీ వుయ్యాల
కమలాసనాదులకు కన్నులకు పండుగై
గణుతింప నరుదాయ వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు
కడువేడుకై వుండె నుయ్యాల

ప్రతి జీవిలో ఆత్మరూపంలో నిబిడీకృతమైన చైతన్యశక్తి భగవంతుడే! చంచల స్వభావులైన ఈ జీవాత్మల ఉఛ్చ్వాస నిశ్వాసాలలో పరమాత్మ ఊయలలూగుతున్నాడు. (ప్రాణచైతన్య శక్తి ఉఛ్చ్వాస నిశ్వాసాల రూపంలో ఉంటుంది. అదే భగవంతుడు ఈ ఉఛ్చ్వాస, నిశ్వాసాలు ఆగిపోతే ఆ దేహంలో ప్రాణం ఉండదు. అంటే ఆ జీవి మరణించినట్లు లెక్క!)
విశ్వాధినేత అయిన స్వామివారి ఊయలకు ఉదయాస్త శైలములు స్థంభాలు! ఆకాశమార్గము అడ్డదూలం! వేదాలు బంగారు గొలుసులు! ధర్మదేవత పీఠం! మేఘాలు ఊయలను ఊపే త్రాళ్ళు! ఈ విశాల విశ్వమంతా పరచుకున్న స్వామివారి ఊయల వేడుక వర్ణనాతీతం! ఆ వేంకటశైలపతికే కమనీయ వేడుకైన ఆ ’ఊంజల్ సేవ’ ను అన్నమయ్య కీర్తనలో కన్నులారా చూసి తరించవలసిందే!

ఉడుమండలము = ఆకాశము; అఖిలము = సమస్తము; కమలాసనాదులు = బ్రహ్మాదులు.

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech